OTT Movie : దయ్యాలు ఉన్నాయో లేవో తెలియదు గాని, చీకట్లో మాత్రం వీటికి అందరూ భయపడుతుంటారు. రియల్ గా చూసినా, చూడకపోయినా సినిమాలలో మాత్రం వీటిని ఒక రేంజ్ లో చూపిస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ, పురాతన కథల ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో ఒక దేవతకి, రాక్షసుల్లాంటి కొడుకులు పుడతారు. వాళ్లు ఈ భూమి మీద అరాచకాలు సృష్టిస్తారు. అప్పుడు వాళ్లను శపించి ఆ దేవత పరలోకానికి వెళుతుంది. అయితే ఆ రాక్షసులు మాత్రం భూమి మీదే ఉంటారు. ఆ తర్వాతే అసలు స్టోరీ మొదలవుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
ఈ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు కుమారి (Kumari). 2022 లో వచ్చిన ఈ మలయాళ మూవీ కి నిర్మల్ సహదేవ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి , షైన్ టామ్ చాకో, సురభి లక్ష్మి ప్రధాన పాత్రలలో కనిపిస్తారు. ఈ సినిమా కేరళలోని పురాణాలు, సంప్రదాయాల నేపథ్యంలో రూపొందించబడింది. ఇది ఒక గొప్ప విజువల్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఈ మూవీ ఒక అమ్మమ్మ తన మనవడికి ఒక పురాణ కథను చెప్పడంతో ప్రారంభమవుతుంది. ఈ కథలో ఒక దేవత భూమి అందానికి ఆకర్షితురాలై, ఒక మానవుడిని వివాహం చేసుకుంటుంది. వారికి చత్తన్, గరి దేవన్ అనే ఇద్దరు సంతానం కలుగుతారు. వీరు దేవతలు, మానవుల రూపంలో కనిపించక, అసాధారణ శక్తులతో ఉంటారు. వీళ్ళుభూమి మీద జీవాలను బాధపెడుతుంటారు. అందుకు తల్లి వాళ్ళను శపించి తన లోకానికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్టోరీ ఆధునిక కాలంలో కుమారి అనే యువతి చుట్టూ తిరుగుతుంది. కుమారికి తల్లిదండ్రులు లేకపోవడంతో, ఆమె మామల చేత పెంచబడుతుంది. ఆమెను ధ్రువన్ అనే మానసిక సమస్యతో బాధపడే వ్యక్తితో వివాహం చేస్తారు. అతను శపించబడిన కుటుంబానికి చెందినవాడు. ఈ కుటుంబం చత్తన్ శాపం కారణంగా అనేక తరాలుగా బాధపడుతోంది. ధ్రువన్ కుటుంబం గతంలో తమను రక్షించుకోవడానికి గరి దేవన్ సహాయం కోరింది. దానికి వీళ్ళు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
కుమారి ఆ కుటుంబంలోకి వచ్చిన తర్వాత, ఆమెను అడవిలోకి ఆకర్షించే ఒక మాయాజాల శక్తి గురించి తెలుస్తుంది. ఆమె సోదరి హెచ్చరిస్తూ అడవిలోకి వెళ్లకూడదని, చత్తన్ శాపం గురించి వివరిస్తుంది. కుమారి ధ్రువన్ పట్ల సానుభూతి చూపడం ప్రారంభిస్తుంది, అతను తన బాల్యంలో అనుభవించిన ఒక సంఘటన వల్ల మానసికంగా కుంగిపోయాడని తెలుసుకుంటుంది. ఆమె అతనిపై శ్రద్ధ చూపడంతో వారి బంధం బలపడుతుంది. కుమారి గర్భవతి అని తెలిసినప్పుడు, కుటుంబంలోని చీకటి రహస్యం బయటపడుతుంది. గతంలో, ధ్రువన్ పూర్వీకుడైన తుప్పన్, గరి దేవన్ రక్షణ కోసం తన సొంత కుమారుడిని బలి ఇచ్చాడు. ఈ బలి సంప్రదాయం పన్నెండు తరాల వరకు కొనసాగుతుంది. ఇప్పుడు ధ్రువన్ పన్నెండవ తరం ప్రభువుగా తన బిడ్డను బలి ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఈ విషయం తెలిసిన కుమారి భయపడుతుంది. తన బిడ్డను కాపాడుకోవడానికి అడవిలోని ముత్తమ్మ అనే స్త్రీని కలుస్తుంది. ఆమె చత్తన్ సహాయంతో రక్షణ ఇస్తానని చెప్పుతుంది.
చివరిగా, ధ్రువన్ గరి దేవన్ శక్తిని పొందడానికి తన బిడ్డను బలి ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు, కానీ కుమారి చత్తన్ సహాయంతో అతన్ని ఎదిరిస్తుంది. చివరికి కుమారి తనబిడ్డను బ్రతికించుకోగళదా అనే విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని చూడండి.