Judge Yashwant Varma Corruption| జస్టిస్ యశ్వంత్ వర్మ… ఈపేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భారీ అవినీతి ఆరోపణల మధ్య యశ్వంత్ వర్మ పేరు మార్మోగుతోంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న యశ్వంత్ వర్మ ఇంట్లో ఇటీవల అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అక్కడ పెద్ద ఎత్తున నగదు కట్టలు కనిపించాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నగదు విలువ కోట్ల రూపాయలు ఉంటుందని అంచనాలు వ్యక్తం అయ్యాయి.
అయితే ఈ కేసులో ప్రముఖలు రోజుకో వాంగ్మూలం ఇస్తున్నారు. ఒక వైపు, జడ్డి గారి ఇంట్లో నగదు దొరకలేదని ఢిల్లీ అగ్నిమాపక దళ ప్రముఖులు చెప్పగా.. మరుసటి రోజే తాను అలా అనలేదని ఆయన మాట మర్చారు. ఈ వార్తలు గత రెండు రోజులుగా చర్చనీయాంశంగా మారాయి.
అయితే ఈ కేసులో తాజాగా సుప్రీం కోర్టు ఆయన ఇంట్లో లభించిన నోట్ల కట్టలు, ఇతర ఆస్తి పత్రాల ఫొటోలు, వీడియోలను బహిర్గతం చేసింది. పైగా ఈ కేసులో సమగ్ర దర్యాప్తు చేసేందుకు ఇక ముగ్గురు న్యాయమూర్తుల త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఇన్ హౌస్ విచారణ చేపట్టనుంది.
Also Read: జాక్ పాట్ కొట్టిన స్టేట్ – లెక్కలేనంత బంగారం గనులు గుర్తింపు
న్యాయవ్యవస్థలో ఉన్న ఒక న్యాయమూర్తిపై ఆరోపణలు వచ్చినప్పుడు, దాన్ని స్పష్టం చేసుకోవడం ఆ న్యాయమూర్తి బాధ్యత కూడా. ఇప్పటివరకూ జస్టిస్ యశ్వంత్ వర్మ ఈ సంఘటనలపై స్పందిస్తూ.. తనకు ఆ నగదుకు ఏ సంబంధం లేదని.. ఆ నగదు లభించిన గది తన ఇంట్లోని అవుట్ హౌస్ అని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు నిజమేనా లేక దీని వెనుక ఏదైనా ‘కథ’ నడుపుతున్నారా అనే అనుమానాలు ప్రజల్లో రేకెత్తిస్తున్నాయి.
2018లోనే వర్మపై సీబీఐ ఎఫ్ఐఆర్!
తాజాగా జరిగిన సంఘటన ఒకటైతే, 2018లో జస్టిస్ యశ్వంత్ వర్మపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సింబోలి షుగర్ మిల్స్ కుంభకోణానికి సంబంధించి యశ్వంత్ వర్మపై కేసు దాఖలు చేయబడింది. ఆ సమయంలో యశ్వంత్ వర్మ సింబోలి షుగర్ మిల్స్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆ సమయంలో యశ్వంత్ వర్మ ఇంట్లో లెక్కల్లో చూపని భారీ నగదు దొరికిందని సీబీఐ ఆరోపించింది. దీనితో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
2012లో సింబోలి షుగర్ మిల్స్ మోసం
2012 సంవత్సరంలో జనవరి నుంచి మార్చి వరకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ)కి సింబోలి షుగర్ మిల్స్ వందల కోట్ల రూపాయల టోకరా వేసింది. ఈ ఘటన అప్పటికే సంచలనం సృష్టించింది. సుమారు రూ. 148.59 కోట్లను అక్రమ మార్గంలో సింబోలి షుగర్ మిల్స్ ఖాతాలోకి మళ్లించారు. 5 వేల మంది రైతుల పేర్లతో తప్పుడు పత్రాలు సృష్టించి, విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి బ్యాంక్ రుణాలు తీసుకున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించారు.
2015లో బయటపడిన అసలు విషయం
సింబోలి షుగర్ మిల్స్ మోసం చేసిన విషయం 2015లో ఓబీసీ బ్యాంకు అధికారులకు తెలిసింది. ఆ షుగర్ మిల్స్ యజమాన్యం నకిలీ పత్రాలతో తమ వద్ద రుణం తీసుకున్నట్లుగా బ్యాంకు డిక్లేర్ చేసింది. ఈ రుణం మొత్తం రూ. 97.85 కోట్లు కాగా, అవుట్‌స్టాండింగ్ అమౌంట్ రూ. 109 కోట్లుగా బ్యాంకు పేర్కొంది. దీనిపై కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గుర్పాల్ సింగ్ పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. గుర్పాల్ సింగ్ అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అల్లుడు. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేపట్టింది. అయితే ఈ కేసులో పురోగతి కనిపించకపోవడంతో విచారణ కుంటుపడింది.
అలహాబాద్ హైకోర్టు జోక్యంతో 2023లో మళ్లీ దర్యాప్తు
ఈ భారీ అవినీతిని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న అలహాబాద్ హైకోర్టు, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. న్యాయవ్యవస్థను కలుషితం చేసిన ఈ తరహా అవినీతిపై దర్యాప్తు సమగ్రంగా జరగాలని హైకోర్టు పేర్కొంది. ఈ కేసులో ఏడు బ్యాంకులు సుమారు రూ. 900 కోట్ల రుణాలు.. సింబోలి షుగర్ మిల్స్‌కు మంజూరు చేసినట్లు హైకోర్టు గుర్తించింది. దీని ప్రకారం 2024 ఫిబ్రవరిలో సీబీఐ మళ్లీ దర్యాప్తును ప్రారంభించింది. ఈ కేసుకు సంబంధించిన కంపెనీ డైరెక్టర్లు, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయబడ్డాయి.
అయితే ప్రస్తుతం జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీ మొత్తంలో నగదు లభించడంతో ఆయనపై ఇన్ హౌస్ కమిటీ విచారణ చేయాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా అదేశాలు జారీ చేశారు.