Anna Rambabu vs Nagarjuna Reddy: ఇప్పటికి ఉన్న సమస్యలు చాలవనుకుంటే.. కొత్త తలనొప్పి. ఆ నియోజవకర్గంలో.. ఇంచార్జి మార్పు అలజడి మొదలైంది. కొత్త నేత వద్దు- పాత నేతే ముద్దు అంటూ కార్యకర్తలు పట్టుబట్టడం.. చర్చనీయాంశంగా మారింది. ఏంటా నియోజకవర్గం గొడవ? ఇప్పుడు చూద్దాం..
గిద్దలూరులో గత అసెంబ్లీ ఎన్నికల్లో కుండమార్పిడి
అందుకే గిద్దలూరులో ఇంత గొడవ జరుగుతున్నా వైసీపీ పెద్దల మౌనం? ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కేంద్రంగా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కుండమార్పిడి రాజకీయాలు చేసింది వైసీపీ అధిష్టానం. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును మార్కా పురం అభ్యర్ధిగా ప్రకటించింది. అక్కడితో ఆగక మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డిని.. గిద్దలూరు కేండేట్ గా ప్రకటించింది. ఆయా అభ్యర్ధులకు ఇష్టమున్నా లేకున్నా తాంబూలాలిచ్చేశాం తన్నుకు ఛావండంటూ వదిలేసింది. దీంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు ఆయా వర్గాల వారు. చేసేది లేక.. ఆ ఎన్నికల్లో అలా పోటీ చేశారు కూడా.
గిద్దలూరు, మార్కాపురంలో వర్కవుట్ కాని ఫార్ములా
జగన్ అప్లై చేసిన ఈ కుండమార్పిడి ఫార్ములా.. ఇటు గిద్దలూరు, అటు మార్కాపురం రెండు సెగ్మెంట్లలో వర్కవుట్ కాలేదు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఘోర పరాజయం పాలైంది వైసీపీ. ఓటమి తర్వాత అన్నా రాంబాబు, నాగార్జున రెడ్డి.. తాము పోటీ చేసిన నియోజకవర్గాలకు పూర్తిగా దూరమయ్యారు. ఈ క్రమంలో ఎన్నికల ముగిసి.. 9 నెలలు దాటుతున్నా.. కార్యకర్తల మంచి చెడ్డ.. పట్టించుకునే నాథులే లేకుండా పోయారని సమాచారం. ఈ మధ్య గిద్దలూరు ఆత్మీయ సమావేశంలో కార్యకర్తలు ఇదే విషయంపై భగ్గుమన్నారు కూడా. అంతే కాదు ప్రస్తుత గిద్దలూరు ఇంచార్జిగా ఉన్న నాగార్జున రెడ్డి మాకు వద్దే వద్దంటూ.. నినాదాలు హోరెత్తించారట.
స్థానిక నేతలకు ఆ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్
గిద్దలూరు వైసీపీ ఇంచార్జిగా తిరిగి మాజీ ఎమ్మెల్యే రాంబాబుకే ఇవ్వాలనీ డిమాండ్ చేశారట. లేకుంటే స్థానిక నేతలకు ఈ బాధ్యత అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాయట స్థానిక ఫ్యాను పార్టీ వర్గాలు. నియోజకవర్గంలో లేని, ఉండటానికే ఇష్టపడని.. నేతకు ఈ పోస్టు అప్పగించడంలో అర్ధమే లేదని వాపోవడమూ కనిపిస్తోందట. జగన్ అసంబద్ధ నిర్ణయాలతో పార్టీ అడ్రెస్ గల్లంతయ్యే ప్రమాదమూ లేక పోలేదన్న హెచ్చరికలూ అందుతున్నాయట. ఈ దిశగా కొందరు ఓపెన్ గానే మాట్లాడుతున్నట్టు సమాచారం.
ఇటీవల నాగార్జున రెడ్డి సమావేశానికి ఆహ్వానం పొందని కొందరు
ఇదిలా ఉంటే నాగార్జున రెడ్డి నిర్వహించిన ఒక సమావేశానికి కొందరు వైసీపీ లీడర్లు హాజరు కాలేదట. నాగార్జున రెడ్డి సైతం వీరిని కావాలనే ఆహ్వానించలేదట. గత ఎన్నికల్లో వైసీపీలోనే ఉంటూ.. టీడీపీ అభ్యర్ధి అశోక్ రెడ్డికి వీరు సపోర్ట్ చేశారనీ. అందుకే వీరిని పిలవలేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయట. ఎవరికైతే ఆహ్వానాలు అందలేదో.. వారు అధిష్టానానికి ఈ విషయమై ఫిర్యాదు కూడా చేశారట. నాగార్జున రెడ్డి ఒంటెత్తు పోకడల వల్లే వైసీపీ 600 ఓట్ల తేడాతో ఓడిపోవల్సి వచ్చిందని.. తమ కంప్లయింట్ లో వీరు ప్రముఖంగా ప్రస్తావించారట. అందుకే ఆయన్ను తిరిగి మార్కాపురానికి పంపించేయాలని వీరు రాసిన లేఖలు ప్రెజంట్ హాట్ టాపిగ్గా మారాయట.
ఈ గ్రూపు గొడవలేంటని తలబాదుకుంటోన్న ఫ్యాను పార్టీ పెద్దలు
అసలే అధికారం లేక ఆపసోపాలు పడుతుంటే.. ఈ గ్రూపు గొడవలేంటని వైసీపీ పెద్దలు తలలు బాదుకుంటున్నారట. ఇటు అన్నా రాంబాబుకు గిద్దలూరులో 15 ఏళ్ల అనుబంధముంది. ఇక గిద్దలూరు నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగానూ గెలిచారు. కాబట్టి.. స్థానిక వైసీపీలోని ఒక వర్గం.. మళ్లీ ఆయనే రావాలని కోరుకుంటున్నారట. తనకు రాజకీయ భవిష్యత్తునిచ్చిన గిద్దలూరులో.. రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని.. రాంబాబు కూడా అనుకుంటున్నట్టు ఆయన అనుచర వర్గాల సమాచారం. రాంబాబు అయితేనే ఇటు ఆర్ధికంగా అటు రాజకీయంగానూ బలమైన నేత గా నిలబడగలరనీ. తమకు అండగానూ ఉండగలరనీ.. వీరు భావించడం వల్లే.. అధిష్టానానికి ఈ దిశగా లేఖలు రాస్తున్నారట.
స్థానిక రెడ్డి నేతలకే బాధ్యతలు అప్పగించాలంటోన్న మరికొందరు
గిద్దలూరు వైసీపీలోని మరో వర్గం మాత్రం.. స్థానిక రెడ్డి నేతలకే ఇంచార్జి బాధ్యతలు అప్పగించాలని కోరుతోందట. ఈ రేసులో.. ఎన్నారై నేత ఐవీ రెడ్డి, కడప వంశీధరరెడ్డి, పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నారట. ప్రస్తుతానికి వస్తే.. గిద్దలూరు ఇంచార్జీగా ఉన్న నాగార్జున రెడ్డి ఎవరూ చెప్పకుండానే.. మార్కాపురానికి పరమితమయ్యారట. దీంతో తాము అతీ గతీ లేని అనాథలమయ్యామనీ వాపోతున్నారట ఫ్యాను పార్టీ కార్యకర్తలు. ఐవీ రెడ్డి అయితే గతంలో గిద్దలూరు వైసీపీ బాధ్యతలు చూశారు. దానికి తోడు ఎన్నారై కూడా కావడం.. గిద్దలూరు లోకల్ పర్సన్ అవడంతో.. ఈయనే బెస్ట్ అంటూ.. ఓ వర్గం ఇప్పటికే అధిష్టానానికి సూచిస్తోందట. ఐవీ రెడ్డి సైతం.. పార్టీ అగ్రనాయకత్వం ఇంచార్జి బాధ్యతలు తనకే ఇస్తారని చెప్పుకుంటున్నారట.
ఒక్క ఒంగోలు తప్ప అన్నింటా అభ్యర్ధులను మార్చిన వైసీపీ
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక్క ఒంగోలు కు తప్ప.. మిగిలిన 11 సెగ్మెంట్లలోనూ అభ్యర్ధుల మార్పు చేర్పులు జరిగాయి. ప్రస్తుతం గొడవ గొడవగా ఉన్న గిద్దలూరు నియోజకవర్గాన్ని టచ్ చేస్తే మిగిలిన అన్నిటిలోనూ డిమాండ్లు వెల్లువెత్తుతాయి. దీంతో మొత్తం తారుమారు చేయాల్సి వస్తుందని భయపడుతున్నారట.. వైసీపీ పెద్దలు. అసలే వలసల కారణంగా.. లీడర్లు కరవైన ఈ సిట్యువేషన్లో.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మార్చడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారట అధిష్టానం పెద్దలు. అందుకే గిద్దలూరులో ఇంత పెద్ద గొడవ జరుగుతున్నా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారట. దీంతో గిద్దలూరు వైసీపీ కేడర్ కి ఏం చేయాలో పాలు పోవడం లేదని సమాచారం.