All Target 2029 Elections: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా.. పాలన ఇంకా పూర్తిస్థాయిలో గాడిలో పడలేదు. ఇంకా ఏడాది కూడా పూర్తి కాకుండానే రాష్ట్రంలో రాజకీయం వేడెక్కి పోతుంది. మంచి మెజార్టీతో అధికారంలోకి వచ్చి అయిదేళ్లకే ఘోరంగా దెబ్బ తిన్న వైసీపీ తిరిగి పూర్వవైభవం కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టింది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని టీడీపీ, పార్టీ బలోపేతానికి జనసేన అప్పుడే యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశాయి. ప్రజల్లోకి వెళ్లడానికి ఏ పార్టీకి ఆ పార్టీ ముఖ్య నేతలు రెడీ అవుతుండటంతో అప్పుడే రాజకీయం రోడ్డెక్కుతుండటం ఆసక్తి రేపుతోంది.
ఏపీలో రాజకీయం రంజుగా సాగుతోంది. ఎన్నికలు ముగిసి ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు. గత ఏడాది జూన్ 12న చంద్రబాబునాయుడు టీమ్ ప్రమాణస్వీకారం చేసి పాలనా పగ్గాలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదో నెల నడుస్తున్నప్పటికీ ఇంకా పాలన పూర్తి స్థాయిలో గాడిలో పడలేదు. గత ఐదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగింది. కూటమి ప్రభుత్వానికి కేంద్రం నిధులు ఇస్తున్నా వాటిని సంక్షేమ పథకాలకు మళ్లించే పరిస్థితి లేదు. అందుకే తల్లికి వందనం, రైతు భరోసా ఇవ్వలేకపోతున్నామని.. త్వరలోనే అన్నీ సెట్ చేసి.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా చెపుతున్నారంటే… గత ప్రభుత్వ పాలన ఎంత అస్తవ్యస్థంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారాన్ని నిలబెట్టుకోవాలని టీడీపీ, తమ బలాన్ని వీలైనంత వరకు పెంచుకోవాలని జనసేన పార్టీలు ప్రణాళికలు సిద్దం చేసుకుంటుండగా.. ఇప్పటి నుంచే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచేలా.. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను వీలైనంత వరకు ప్రజా క్షేత్రంలో ఎండగట్టేందుకు వైసీపీ కూడా అదే స్థాయిలో నడుం బిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏపీ రాజకీయం ఓ రకంగా చెప్పాలంటే ఇప్పటి నుంచే రోడ్డెక్కుతున్న పరిస్థితి.
ఆ క్రమంలో టీడీపీ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ఏపీలో రాజకీయం రాజుకుంటుంది అనడానికి టీడీపీ పొలిట్ బ్యూరోలో తీసుకున్న కొన్ని నిర్ణయాలే నిదర్శనం. 2024 ఎన్నికల్లో అద్భుత విజయం సాధించింది. ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు. అప్పుడే టీడీపీ పొలిట్ బ్యూరోలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఏడాది మహానాడును కడపలో నిర్వహించాలని టీడీపీ పొలిట్ బ్యూరోలో నిర్ణయించారు. మహానాడు అంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖ, రాజమండ్రి అదీ లేదంటే తిరుపతి ఇంతకు మించి వేరే ప్రాంతాల గురించి.. వేరే ప్లేసుల గురించి తెలుగు తమ్ముళ్లకు అస్సలు ఆలోచనే రాదు.
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాదులో మహానాడు నిర్వహణ ఓసారి మాత్రమే జరిగింది. అయితే క్రమంగా మహానాడు నిర్వహణ విషయంలో టీడీపీ ఆలోచనా విధానం నెమ్మదిగా మారుతోంది. ప్రతిపక్షంలో ఉండగా.. ఒంగోలులో మహానాడు నిర్వహించింది. అప్పటి నుంచి పార్టీకి ఊపు వచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో జరుగుతున్న మహానాడును కడపలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ సొంత జిల్లాలో మహానాడు నిర్వహించాలనే ఆలోచన రాజకీయంగా చాలా కీలకమైన.. సంచలనాత్మక నిర్ణయమనే చెప్పాలి.
మరోవైపు గత ప్రభుత్వ తప్పిదాలపై.. తప్పులు చేసిన వారిపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేకంగా ఓ ట్రిబ్యూనల్ వేయాలని టీడీపీ పొలిటి బ్యూరోలో నిర్ణయం తీసుకున్నారు. అది కూడా అదే స్థాయిలో కాకను పుట్టించే అంశమనే చెప్పాలి. పెద్ద పెద్ద నేతలే కాకుండా.. జిల్లా స్థాయిలో.. మండల స్థాయిలో కూడా కొందరు వైసీపీ నేతలు గత ప్రభుత్వంలో చెలరేగిపోయారనే ఆరోపణలున్నాయి. చంద్రబాబు దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు వైసీపీ హయాంలో అందర్నీ వేధించారు. అలాంటి వారి భరతం పట్టేందుకే ఈ ట్రిబ్యునల్ అనే చర్చ జరుగుతోంది.
ఇక జనసేన కూడా అదే తరహాలో జనంలోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తోంది. జనంలోకి జనసేన అంటూ ఏకంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నియోజకవర్గం పుంగనూరు నుంచే సమర శంఖం పూరించింది. ఈ సమావేశం ఏర్పాటు చేయడానికంటే ముందు అటవీ భూములను కబ్జా చేశారంటూ పెద్దిరెడ్డి మీద విచారణకు ఆదేశించారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాతే జనంలోకి జనసేన కార్యక్రమాన్ని తలపెట్టింది జనసేన. ఈ పరిణామలను బేరీజు వేసుకుంటే జనసేన కూడా వ్యూహాత్మకంగా పార్టీని బలోపేతం చేసుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నట్లే కనిపిస్తుంది ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు నేతృత్వంలో జనంలోకి జనసేన కార్యక్రమం మొదలు పెట్టారు.
గోదావరి జిల్లాల్లో పవర్ ఫుల్ గా.. కోస్తాలోని మిగిలిన జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మాదిరిగా.. రాయలసీమలో జిల్లాల్లో నామ మాత్రంగానే ప్రభావం చూపే జనసేన.. పక్కా ప్రణాళికతో జనంలోకి వెళ్తోన్నట్టు కన్పిస్తోంది. రాయలసీమలో కూడా బలోపేతం అయ్యే రీతిలో జనసేన పావులు కదపడాన్ని.. అందునా.. వైసీపీ పెద్ద తలకాయ పెద్దిరెడ్డిని టార్గెట్ చేసుకుని పుంగనూరులో భారీ బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించడాన్ని చూస్తే.. జనసేన అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి.
Also Read: ఉన్నది కాస్త ఊడింది.. ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వమంగళం పాడిన బాపు..!
ఇక మరో ప్రధాన పార్టీ వైసీపీ. ప్రస్తుతం 11 సీట్లు మాత్రమే ఉన్నా.. గడచిన ఎన్నికల్లో 40 శాతం ఓట్ షేరింగ్ వచ్చిందనేది వైసీపీ ధీమా. ఆ పార్టీ నుంచి కీలక నేతలు వలస పోతున్నా .. ప్రజల్లోకి వెళ్లేందుకు తమదైన స్టైల్లో ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. అందులో భాగంగా రైతు పోరు, విద్యుత్తు పోరు అంటూ ఇప్పటికే కార్యక్రమాలు నిర్వహించింది. అయితే వాటికి ఆశించిన స్పందన రాకపోవడంతో ఫీజు పోరు పేరుతో భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించడానికి ప్లాన్ చేస్తుంది. అయితే దానికి ముహూర్తమే కుదరడం లేదు. ఫిబ్రవరి ఐదో తేదీన ఫీజు పోరు నిర్వహించాలని భావించింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అంటూ దాన్ని వచ్చే నెలకు వాయిదా వేసుకుంది.
వాస్తవానికి గత ప్రభుత్వంలో పెండింగులో పెట్టిన ఫీజు రీ-ఇంబర్సుమెంట్ బకాయిలను ఇప్పటికే కూటమి ప్రభుత్వం చెల్లించేసింది. కానీ అదే అంశాన్ని పట్టుకుని ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. దీనికి కారణాలు లేకపోలేదనేది వైసీపీ వాదన. గతంతో పోల్చుకుంటే నారా లోకేష్‌కు యువత, విద్యార్థుల్లో క్రేజ్ పెరిగింది. పైగా లోకేష్ విద్యా శాఖను తీసుకోవడం ద్వారా.. యువతను.. కొత్త ఓటర్లను ఆకట్టుకునేలా వ్యవహరిస్తున్నారు. సహజంగా యువత తమ వైపు ఉంటారనేది వైసీపీ భావన. కానీ గత ఎన్నికల్లో తమను వీడి లోకేష్, పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపిన యువత, విద్యార్థులను తిరిగి తమ వైపు ఆకర్షించడానికి.. విద్యార్థి.. యూత్ రిలేటెడ్ కార్యక్రమాలు, ఆందోళనలు చేపట్టాలనేది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తుంది.
ఈ క్రమంలో వైసీపీ కూడా నెమ్మదిగా స్పీడ్ పెంచడంతో పాటు.. త్వరలోనే జగన్ కూడా జిల్లాల్లో పర్యటిస్తానంటున్నారు. వారంలో రెండు రోజులు ఆయా జిల్లాల్లోనే నిద్ర అంటున్నారు. ఇలా మూడు ప్రధాన పార్టీల్లోనూ రాజకీయ వేడి పెరిగింది. ఏడాది కూడా పూర్తి కాకముందే పార్టీలు ఈ విధంగా జనంలోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకోవడం అరుదుగానే జరుగుతుందని అంటున్నారు. అధికారంలోకి వచ్చామని.. రిలాక్స్ కాకుండా.. కూటమి పార్టీలు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయడం.. అలాగే అధికారం కొల్పోయిన వైసీపీ కూడా జనంలోకి వెళ్లేందుకు ప్రణాళికలు రచించుకోవడం చూస్తుంటే.. టార్గెట్ 2029 అన్నట్టుగా ఇప్పటి నుంచే ఏపీలోని ప్రధాన పార్టీలు స్కెచ్ లు సిద్దం చేసేసుకున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది.