BigTV English

CBN Progress Report: 6 నెలల్లో ఏపీ ప్రభుత్వం సాధించిందేంటీ.. నెక్ట్స్ టార్గెట్స్ ఇవే..!

CBN Progress Report: 6 నెలల్లో ఏపీ ప్రభుత్వం సాధించిందేంటీ.. నెక్ట్స్ టార్గెట్స్ ఇవే..!

CBN Progress Report: సమీక్షలు నిర్వహించడం, అధికారులను పరుగులు పెట్టించడం ఇదే ఏపీ సీఎం చంద్రబాబు పరిపాలన స్టైల్. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తి కావడంతో ఈ వారం కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. శాఖల వారీగా సాధించిన ప్రగతి వివరించారు. భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించారు. టార్గెట్ రీచ్ అయ్యే వరకు నో కాంప్రమైజ్ అని అధికారులకు, మంత్రులకు క్లియర్ గా చెప్పేశారు. అసలు 6 నెలల్లో ఏపీ ప్రభుత్వం సాధించిందేంటీ? ఆ తర్వాత టార్గెట్స్ ఏంటీ ఓ సారి చూద్దాం.


(08-12-2024 ఆదివారం) ( వర్షాలపై ఆదేశాలు )

ఏపీలోని వర్ష సూచనతో సీఎం చంద్రబాబు ఆదివారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు సూచించారు. కోసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలని తెలిపారు. కల్లాల్లోని పంట ఉత్పత్తులు తడవకుండా రైతులకు టార్పాలిన్లు అందజేయాలని అన్నారు. వరి కోతల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకునేలా వ్యవసాయశాఖ ద్వారా అన్నదాతలకు అవగాహన కల్పించాలని చెప్పారు.


(09-12-2024 సోమవారం) ( కేబినెట్‌లోకి నాగబాబు )

సోమవారం కేబినెట్ విషయంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి మేరకు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం నిర్ణయించారు. అయితే.. ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకుని ఆ తర్వాత ఎమ్మెల్సీని చేస్తారా? ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత క్యాబినెట్‌లోకి తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఒక స్థానం ఖాళీగా ఉంది. దాన్ని నాగబాబుతో భర్తీ చేయనున్నారు.

(10-12-2024 మంగళవారం) ( సీఆర్డీఏ సమావేశం )

మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ 42వ సమావేశం జరిగింది. రాజధాని అమరావతిలో మరో 8వేల 821 కోట్ల రూపాయల పనులకు సీఆర్డీయే అథారిటీ ఆమోదం తెలిపింది. మొత్తం 20 పనులకు చేపట్టాని నిర్ణయించారు. ఈ నెల రెండో తేదీన జరిగిన 41వ సమావేశంలో 11వేల 467 కోట్ల రూపాయల పనులకు ఆమోదం లభించింది. దీంతో మొత్తం 20వేల 288 కోట్ల రూపాయల పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ నెలాఖరుకల్లా టెండర్లు పిలివడానికి ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. అయితే.. మంగళవారం ఆమోదం పొందిన పనులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది.

(10-12-2024 మంగళవారం) ( రియల్‌ టైం గవర్నెన్స్‌‌పై చర్చ)

మంగళవారం రియల్‌ టైం గవర్నెన్స్‌ పై సీఎంఓ సహా పలు ప్రభుత్వ శాఖల అధికారులతో సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో జనన, మరణ ధ్రువపత్రాలు పొందేందుకు తలెత్తుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారంగా కొత్త వెబ్‌ పోర్టల్‌ను వచ్చే ఏడాది జనవరి 1న ప్రారంభిస్తామని చెప్పారు. దీని నిర్వహణలో పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖల సమన్వయంతో పని చేయాలని సూచించారు.

సమర్థ పాలన అందించేలా అన్ని ప్రభుత్వ శాఖలు సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని చెప్పారు. అంతిమంగా వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. వాట్సప్‌ వేదికగా ప్రజలు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొందేలా వ్యవస్థను రూపొందించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు ఏఐ, డీప్‌టెక్‌ టెక్నాలజీ వాడాలని చెప్పారు.
రానున్న రోజుల్లో పంటలో తెగుళ్లు గుర్తించడానికి డ్రోన్లు వినియోగించాలని తెలిపారు. డ్రోన్ల ద్వారా ప్రమాద స్థలాలను గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు సీఎం.

(11-12-2024 బుధవారం) ( ఏపీలో గూగుల్ పెట్టుబడులు )

ఏపీలో టెక్నాలజీ ఎకో సిస్టమ్‌ ఏర్పాటుకు గూగుల్‌ సంస్థ ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. చంద్రబాబు సమక్షంలో అధికారులు, గూగుల్‌ ప్రతినిధులు దీనిపై సంతకాలు చేశారు. గూగుల్‌ రాకతో రాష్ట్రంలో పటిష్ఠమైన టెక్నాలజీ ఎకోసిస్టం కల్పించడం సాధ్యమవుతుందన్నారు సీఎం. ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, గూగుల్‌.. ఇలా వరుసగా దిగ్గజ ఐటీ కంపెనీలు విశాఖను ఎంచుకుంటున్నాయి. గూగుల్‌తో ఒప్పందం వల్ల విశాఖలో ఏఐ డేటా క్లౌడ్‌ సెంటర్‌ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో అనుకూలతలు పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గూగుల్‌ వచ్చాక ప్రపంచంలోని పెద్దపెద్ద సంస్థలు కూడా వస్తాయని అన్నారాయన.

(11-12-2024 బుధవారం) ( కలెక్టర్లకు సూచనలు )

ఆరు నెలల పాలనపై బుధవారం, గురువారం ఏపీ ప్రభుత్వం కలెక్టర్ల సదస్సు నిర్వహించింది. పాలనలో వేగం పెంచాలని.. మానవతా దృక్పథంతో ప్రజల సమస్యలు పరిష్కరించాలని బుధవారం జిల్లా కలెక్టర్లకు సీఎం ఈ సదస్సులు సూచించారు. నాయకులైనా, అధికారులైన పెత్తందారులు కాదనే విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు సీఎం. మనం ఇక్కడ ఉండటానికి ప్రజలే కారణమన్నారాయన. హార్డ్ వర్క్ కాకుండా, స్మార్ట్‌ వర్క్ చేసి మంచి ఫలితాలు సాధించాలని చెప్పారు.

ఇప్పటికే 20కి పైగా పాలసీలు తెచ్చామని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాలతో పోటీపడుతూ పెట్టుబడులు తీసుకొస్తున్నామన్నారు. వాటి అమలుపై కలెక్టర్లు శ్రద్ధపెట్టాలని చెప్పారు. కలెక్టర్ల పని తీరుపై కూడా రిపోర్టులు తీసుకుంటామన్నారు సీఎం. ఈ సమావేశంలో మంత్రి లోకేష్ పై చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు చంద్రబాబు. అమెరికాకు పోయి గూగుల్‌ ఆఫీస్‌లో కూర్చోవాల్సిన అవసరం లోకేశ్‌కు లేదన్నారు. ఆ సంస్థకు పలు రాష్ట్రాల్లో ఎన్నో అవకాశాలున్నాయని చెప్పారు. కానీ మంత్రి వెళ్లి గూగుల్ ప్రతినిధులను కలవడం వల్లే కంపెనీ విశాఖకు వచ్చిందని అన్నారు.

అమరావతి పోలవరంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారాయన. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి, పోలవరం పూర్తి చేస్తామన్నారు. అమరావతిని గాడిలో పెట్టామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తిచేయడానికి టార్గెట్ పెట్టుకున్నామని చెప్పారు. ఇక ఆ తర్వాత పింఛన్ల గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 64 లక్షల మందికి ఇంటికి వెళ్లి పింఛన్‌ ఇస్తున్నామని చెప్పారు. ఏడాదికి 33వేల కోట్ల రూపాయలు పింఛన్లకే ఇస్తాన్నామని గుర్తు చేశారు. 16వేల 347 టీచర్ల పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని తెలిపారు.

ఎక్కువ ఫిర్యాదులు రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, పురపాలక శాఖల నుంచే వస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. 90 శాతం సమస్యలు ఈ నాలుగు శాఖల్లోనే ఉన్నాయన్నారాయన. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించకుండా ఒక అధికారి నుంచి మరో అధికారికి పంపిస్తున్నారని సీఎం ఆరోపణ. ఇది సరైన పద్దతి కాదని వార్నింగ్ ఇచ్చారు. 60 శాతం ఫిర్యాదులు భూ వివాదాలకు సంబంధించినవేనని అన్నారు. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.

(11-12-2024 బుధవారం) (వాట్సప్ సేవలపై చర్చ)

దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వం పౌరసేవలు అందించేందుకు వాట్సప్‌ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ప్రభుత్వం అధికారిక వాట్సప్‌ నంబర్‌ను త్వరలో ప్రకటించనుంది. ఆ ఎకౌంట్‌కు వెరిఫైడ్‌ ట్యాగ్‌ ఉంటుంది. ఈ నంబరు వన్‌స్టాప్‌ సెంటర్‌లా పనిచేస్తుంది. తొలిదశలో ఇందులో 153 రకాల సేవలు అందించనున్నారు. భవిష్యత్తులో వీటిని మరింత విస్తృతం చేయనున్నారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా దీనిపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు.

(11-12-2024 బుధవారం) ( బియ్యం అక్రమ రవాణా కట్టడిపై చర్చ)

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడానికి పీడీ యాక్ట్‌ కేసులు వర్తింపజేయాలని కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం ఆదేశించారు. ఐదేళ్లుగా రేషన్‌ బియ్యం స్మగ్లింగ్‌ జరుగుతోందన్నారాయన. ఒక పోర్టులో కుదరకపోతే మరో పోర్టుకు వెళ్లి లంచాలిచ్చి వ్యవస్థను అవినీతిమయంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలు పట్టించుకోకపోవడంతో స్మగ్లింగ్‌ పెరిగిపోయి, బలమైన మాఫియాలా తయారయిందని సీఎం విమర్శించారు. రేషన్‌ మాఫియాను కూకటివేళ్లతో పెకలించాలని తేల్చి చెప్పారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కఠినంగా వ్యవహరించాలన్నారు. మరోసారి బియ్యం అక్రమ రవాణా అనే మాట వినిపించకూడదని స్పష్టం చేశారు.

(11-12-2024 బుధవారం) ( టెక్స్‌టైల్స్ పాలసీ విధివిధానాలు)

రాష్ట్రంలో వస్త్రరంగాన్ని కొత్త పుంతలు తొక్కించేలా కీలక పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ రంగంలో నెలకొల్పే పరిశ్రమలకు భారీ రాయితీలను ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో 10వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలని ప్రభుత్వ టార్గెట్. ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి కల్పించాలని భావిస్తోంది. పాలసీ విధివిధానాలు ఖరారు చేస్తూ బుధవారం ఉత్తర్వులను జారీచేసింది. 2024-29 మధ్య రాష్ట్రం నుంచి వస్త్ర ఎగుమతుల్ని 1 బిలియన్‌ డాలర్లకు పెంచడమే లక్ష్యంగా ఈ పాలసీని తయారుచేసింది. టెక్స్‌టైల్స్ పరిశ్రమలను ఎంఎస్‌ఎంఈ, సబ్‌-లార్జ్, లార్జ్, మెగా అనే నాలుగు కేటగిరీలుగా విభజించి ప్రోత్సాహకాలను ప్రకటించింది.

(11-12-2024 బుధవారం) ( మారిటైం పాలసీ విధివిధానాలు )

మారిటైం పాలసీకి సంబంధించిన విధివిధానాలు కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. తీరప్రాంత అభివృద్ధికి అనుసంధానంగా ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని ప్రకటించింది. సముద్ర ఎగుమతుల్లో రాష్ట్రాన్ని బలోపేతం చేసేందుకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉందని తెలిపింది. దీనికి మారిటైం పాలసీ దోహదం చేస్తుందని ప్రభుత్వం అభిప్రాయపడింది. పాలసీ విధివిధానాలు.. వాటి అమలుకు నిర్దేశించిన మార్గదర్శకాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోర్టుల నిర్వహణ, మారిటైం కార్యకలాపాలకు సంబంధించి సింగిల్‌ విండో విధానంలో అనుమతులు ఇస్తామని తెలిపింది.

(11-12-2024 బుధవారం) ( రాజధానిపై ప్రభుత్వం క్లారిటీ )

అమరావతే ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అని కూటమి ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ అంశాన్ని కూలంకషంగా పరిశీలించి దాన్నే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని దృఢ నిశ్చయానికి వచ్చామని న్యాయస్థానం ముందు గట్టిగా వివరించింది. మాస్టర్‌ప్లాన్, రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు నెరవేర్చాల్సిన హామీని అనుసరించి అమరావతిని అభివృద్ధి చేస్తామని తెలిపింది. రాజధాని విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతోపాటు, సుప్రీంకోర్టు జారీ చేసే ఆదేశాలకు కట్టుబడి ఉంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

విజన్ 2020 అని 1998లో చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు ఓ డాక్యూమెంట్ ను రిలీజ్ చేశారు. అయితే.. కాగితాలపై ఇలాంటి లెక్కలు ఎన్నైనా చెప్పొచ్చని చాలా మంది విమర్శలు చేశారు. కానీ.. ఈ రోజు హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగిందంటే దానికి కారణం చంద్రబాబు విజన్ 2020. ఇప్పుడు స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ ను రిలీజ్ చేశారు. తాను చెప్పినట్టు మంత్రులు, అధికారులు పని చేస్తే టార్గెట్ రీచ్ అవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలు 2047లో ఏముంది? దాని టార్గెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం

(12-12-2024 గురువారం) ( రెండో రోజు కలెక్టర్ల సదస్సు )

పని చేస్తేనే ప్రోత్సహం ఉంటుందని.. లేదంటే పక్కనే పెట్టేస్తానని రెండో రోజు కలెక్టర్ల సదస్సులో అధికారులకు, మంత్రులకు సీఎం చంద్రబాబు చెప్పేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాలని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలను భాగస్వాముల్ని చేయాలని కలెక్టర్లకు సూచించారు. అలా అని వారు చెప్పిన పనులన్నీ చేయాలని కాదని కూడా తేల్చేశారు. ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతికి, నిర్లక్ష్యానికి, ఉదాసీనతకు చోటు ఇవ్వొద్దని అన్నారు.

(12-12-2024 గురువారం) ( 3 ప్రధాన ఉపాధి కల్పన కేంద్రాలు )

రాష్ట్రంలో మూడు ప్రధాన ఉపాధి కల్పన కేంద్రాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు సీఎం. అమరావతి, విశాఖ, తిరుపతిపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో రాజధాని కీలకపాత్ర పోషించనుందని ధీమా వ్యక్తం చేశారు. అమరావతిని విద్య, మేధో విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. దేశంలో టాప్‌-10 యూనివర్సిటీలు, పాఠశాలలు, ఆస్పత్రులు అమరావతిలో ఏర్పాటయ్యేలా కృషి చేస్తున్నామని తెలిపారు. రాజధానిలోనే 2050 నాటికి 15 లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయని సీఎం అంచనా వేస్తున్నారు.

(12-12-2024 గురువారం) ( సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక చట్టం)

కలెక్టర్ల సదస్సులో గురువారం శాంతిభద్రతలపై ప్రత్యేకంగా సమీక్ష జరిగింది. అసభ్య పోస్టులతో సోషల్‌ మీడియాలో చెలరేగిపోతున్న వారిపై కఠిన చర్యల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అధ్యయనానికి నారా లోకేశ్, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్‌ సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనుంది. పోలీసులు అసమర్థులైతే… నేరగాళ్లది పైచేయి అవుతుందని చంద్రబాబు అభిప్రాయం. ఇప్పుడు నేరగాళ్లు రాజకీయ ముసుగు తొడుక్కుంటున్నారని ఆయన ప్రధాన విమర్శ. శాంతిభద్రతల్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

(12-12-2024 గురువారం) ( దొంగ పింఛన్లపై కొరడా )

కలెక్టర్ల సదస్సులో పింఛన్లపై సుదీర్ఘ చర్చ జరిగింది. గత ప్రభుత్వలో అనర్హులకు భారీగా పింఛన్ల మంజూరు చేసినట్టు సీఎం దృష్టికి వచ్చింది. దీంతో మూడు నెలల్లో పింఛన్లు తనిఖీ చేసి, అనర్హులను పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించారు. అదే సమయంలో అర్హులందరికీ పింఛన్లు అందాల్సిందేనని చెప్పారు. అనాథ చిన్నారులకు ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద పింఛన్‌ వర్తింపజేయాలని, ఇందుకు మార్గదర్శకాలను రూపొందించాలని కూడా సూచించారు.

(12-12-2024 గురువారం) (ఇళ్ల నిర్మాణ పథకంలో అదనపు సాయం )

పేదల ఇళ్ల నిర్మాణాల విషయంలో సీఎం కీలక ప్రకటన చేశారు. దళితులు, గిరిజనులు, చేనేతలకు అదనపు సాయం ప్రకటించారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ఎస్సీలకు 50 వేలు, ఎస్టీలకు 75 వేలు, చేనేతలకు 50 వేలు అదనపు సాయం అందిస్తామని తెలిపారు. స్థలాలు లేని పేదలకు ఇంటి నిర్మాణానికిగాను గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల భూమిని మంజూరు చేస్తామన్నారు. 2029 నాటికి రాష్ట్రంలో అర్హులందరికీ ఇళ్లు నిర్మిస్తాన్నారు సీఎం. రాష్ట్రంలో అసంపూర్తి ఉన్న రాజీవ్‌ స్వగృహ నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

(13-12-2024 శుక్రవారం) ( విజన్ 2047 డాక్యుమెంట్ )

రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర-2047 దార్శనిక పత్రాన్ని శుక్రవారం విడుదల చేసింది. ఇందులో మహిళల సాధికారత, శ్రేయస్సు, భద్రతకు పెద్దపీట వేసింది. వృద్ధుల ఆరోగ్య పరిరక్షణకు భరోసా ఇచ్చింది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై దృష్టి పెట్టింది. సీఎం చంద్రబాబు అనుభవం, విజన్ ఇందులో కనిప్తోంది. 1998లోనే విజన్‌-2020 దార్శనిక పత్రాన్ని చంద్రబాబు రూపొందించారు. అప్పట్లో చంద్రబాబు నిర్ణయాలపై జోకులు వేసుకున్న వారు కూడా ఉన్నారు. సొంత క్యాబినెట్ మంత్రులే పెదవి విరిచారు. అయితే.. 1998 విజన్ డాక్యుమెంట్ లో ఏముందో 2020 నాటికి హైదరాబాద్ అలాగే తయారైంది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో కూడా సన్‌రైజ్‌ ఏపీ విజన్‌-2029 పేరుతో ఓ విజన్ డాక్యూమెంట్ రిలీజ్ చేశారు. కానీ.. మధ్యలో వైసీపీ ప్రభుత్వం రావడంతో రాష్ట్రానికి ఒక దశ, దిశ లేకుండా అయిపోంది. దీంతో ఇప్పుడు విజన్ 2047ను రిలీజ్ చేశారు.

దీని ప్రకారం 2047 నాటికి రాష్ట్రాన్ని పేదరికరహితంగా చేయడమే చంద్రబాబు లక్ష్యం. ఐకమత్యంతో, దృఢ సంకల్పంతో ఈ విజన్ 2047 కోసం కృషి చేస్తామని అధికారులు, మంత్రులతో ప్రతిజ్ఞ చేయించారు. స్వర్ణాంధ్ర సాధనకు పది సూత్రాలు ప్రకటించారు. పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టాలని ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించింది. తిరుపతిని ఆసియాలో అతిపెద్ద ఆధ్యాత్మిక హబ్‌గా తీర్చిదిద్దాలని సంకల్పించింది.

(13-12-2024 శుక్రవారం) ( పవన్‌పై ప్రశంసలు)

ఇచ్ఛాపురం నుంచి మంత్రాలయం వరకు అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. డాక్యుమెంట్‌ రూపకల్పనలో భాగంగా 17 లక్షల మంది ఆన్‌లైన్‌లో సలహాలు, సూచనలు తెలియజేశారని అన్నారు. కోటి 18 లక్షల కుటుంబాల నుంచి అభిప్రాయాలను తీసుకున్నామని తెలిపారు. ఈ సభలో పవన్ కల్యాణ్‌పై చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. పవన్‌ కల్యాణ్‌ లాంటి మిత్రులు ఉంటే ఏదైనా సాధించొచ్చని చెప్పారు.

(13-12-2024 శుక్రవారం) ( టార్గెట్ ఫిక్స్ )

వ్యవసాయ, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ టాప్ సిక్స్ లో ఉంది. 2029 నాటికి టాప్ 5 కి, 2047 నాటికి 3కి రావాలని టార్గెట్. ఎగుమతుల్లో ప్రస్తుతం 5.5% మాత్రమే ఉన్న ఏపీ వాటాను 2047 నాటికి 50% కంటే ఎక్కువగా చేర్చాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి డెయిరీ ఉత్పత్తుల ఎగుమతులు 1% లోపు మాత్రమే ఉన్నాయి. దాన్ని 2047 నాటికి 10శాతానికి పెంచుకోవాలని ప్రభుత్వం టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. కోడిగుడ్ల, మాంసం ఉత్పత్తులను కూడా భారీగా పెంచాలని డిసైడ్ అయ్యారు. వ్యవసాయంలో సాంకేతికత వాడకం పెంచాలని చంద్రబాబు అధికారులకు చెప్పారు. రైతు రాజు కావాలంటే టెక్నాలజీ వాడకమే మార్గమన్నారాయన. 2029 నాటికి రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచాలని అన్నారు. వాతావరణ మార్పులను తట్టుకునేలా సహజ వ్యవసాయ విధానాలను అలవాటు చేసుకోవాలని సీఎం తెలిపారు.

(14-12-2024 శనివారం) ( ఎన్నికలపై సీఎం క్లారిటీ )

దేశంలో జమిలి అమల్లోకి వచ్చినా.. రాష్ట్రంలో 2029లోనే ఎన్నికలు జరుగుతాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక దేశం-ఒకే ఎన్నిక విధానానికి తాము మద్దతు ప్రకటించినట్లు క్లారిటీ ఇచ్చారు. జమిలి వస్తుందని.. త్వరలోనే ఏపీలోఎన్నికలు జరుగుతాయని వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. జమిలిపై అవగాహన లేని వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలతో పబ్బం గడుపుకుంటుందని అన్నారు.

(14-12-2024 శనివారం) ( ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి )

విజయవాడ శివారులోని పోరంకిలో నందమూరి తారక రామారావు సినీ వజ్రోత్సవాన్ని శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న సాధించడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయనకు భారతరత్న వస్తే అది దేశానికి, తెలుగు జాతి మొత్తానికీ గౌరవమన్నారు సీఎం. ఆయనకు భారతరత్న సాధించే వరకూ పోరాటం చేస్తామని చెప్పారు. దేశం గర్వించే విధంగా తెలుగుజాతి ఎదగడమే ఎన్టీఆర్‌కు మనమిచ్చే ఘనమైన నివాళి అన్నారు సీఎం.

(14-12-2024 శనివారం) ( నేతలకు సూచనలు )

శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. సభ్యత్వ నమోదు సహా పలు అంశాలపై సమీక్షించారు. పదవులొచ్చిన వాళ్లు ప్రజల్ని, పార్టీని నిర్లక్ష్యం చేస్తే ఊరుకోనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ వల్లే పదవులు వచ్చాయన్న విషయాన్ని గ్రహించాలని చెప్పారు. ఎమ్మెల్యేలు సామాన్యుల్ని కలిసి వారి కష్టసుఖాల్ని తెలుసుకోవాలని చెప్పారు. మిత్రపక్షాలతోనూ సమన్వయంతో వ్యవహరించాలని అన్నారు. అలా కాదని తల ఎగరేస్తే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారని హెచ్చరించారు. ఎవరిని, ఎప్పుడు, ఎక్కడ పెట్టాలో తనకు తెలుసన్నారు సీఎం.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×