CBN Progress Report: 2014-19 మధ్య అమరావతికి ఓ రూపం రాలేదు. అదే టీడీపీకి 2019 ఎన్నికల్లో ఓ రకంగా మైనస్ అయింది. అంతేకాకుండా 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ రాజధాని తరలింపునకు ప్రయత్నాలు కూడా చేసింది. ఇప్పుడు కూడా రాజధాని నిర్మాణం జరగపోతే ఏపీ భవిష్యత్ పై అనుమానాలు తలెత్తుతాయని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఈసారి అమరావతి నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ వారం సీఆర్డీఏ భేటీ జరిగింది. ఈ సమావేశంలో మరిన్ని రాజధాని పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
(23-12-2024 సోమవారం) ( రాజధానిలో పనులకు గ్రీన్ సిగ్నల్ )
సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ 44వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అమరావతిలోని మరో 2వేల 723 కోట్ల రూపాయల పనులకు విలువైన పనులకు సీఆర్‌డీఏ ఆమోదం తెలిపింది. రాజధాని రైతులకు స్థలాలు కేటాయించిన జోన్-7, జోన్-10లలోని ఎల్‌పీఎస్ లేఅవుట్‌లలో మౌలిక వసతుల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ లభించింది. జోన్-7లో 12 వందల 35 కోట్లు, జోన్-10లో 14 వందల 87 కోట్లతో పనులు జరగనున్నాయి. దీంతో ఇప్పటి వరకు 47వేల 288 కోట్ల పనులకు అథారిటీ ఆమోదం లభించింది.
ఈ సమావేశంలో చంద్రబాబు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఎక్కువ వంపులు లేకుండా ఎలైన్‌మెంట్ ఉండాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులకు సూచించారు. ఓఆర్‌ఆర్‌తో ఏడు జాతీయ రహదారుల్ని కనెక్ట్ చేయాలని చెప్పారాయన. అప్పటికే ప్రతిపాదించిన మ్యాప్‌ను అధికారులు సీఎంకు చూపించారు. ఆయన అందులో కొన్ని మార్పులు సూచించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 189 కి.మీ.ల పొడవున ఓఆర్‌ఆర్‌ను నిర్మించనున్నారు. ఎన్‌హెచ్-16, 65, 544డి, 30, 163ఇజి, 163జిను ఓఆర్‌ఆర్‌తో కలపనున్నారు.
(23-12-2024 సోమవారం) ( మున్సిపాలిటీలకు మంచి రోజులు )
మున్సిపాలిటీల్లో కూరుకుపోయిన సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సమస్యలకు చెక్ పెడుతూ శాశ్వత పరిష్కారం చూపించింది. ఏ మున్సిపాలిటీ నిధులను ఆ ప్రాంతంలోనే అభివృద్ధి పనులకు వినియోగించుకునేలా కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు ఆర్థికశాఖకు ఈ విషయంపై ఆదేశాలిచ్చారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. గత ప్రభుత్వం నిర్వాకం కారణంగా మున్సిపాలిటీల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి.
మున్సిపాలిటీల పీడీ ఖాతాల్లోని నిధులను గత ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించింది. ఏకంగా 3వేల 200 కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయి. దీంతో పెండింగ్ బిల్లులు భారీగా పేరుకుపోయాయి. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీల్లో నిధులపై ప్రభుత్వ నియంత్రణ ఇక ఉండదు. సీఎఫ్‌ఎంఎస్ పోర్టల్‌లో బిల్లులు అప్‌లోడ్ చేయడం, వాటి కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. వివిధ పద్దుల కింద వచ్చే ఆదాయాన్ని అదే ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు వినియోగించుకోవచ్చు.
(23-12-2024 సోమవారం) ( బీసీ రక్షణ చట్టంపై కసరత్తు )
సోమవారం సీఎం చంద్రబాబు బీసీ సంక్షేమశాఖపై సమీక్ష నిర్వహించారు. బీసీ రక్షణ చట్టంపై చర్చించారు. ఈ చట్టంపై ఏర్పాటైన మంత్రుల కమిటీ చంద్రబాబుకు కీలక అంశాలను వివరించింది. మరింత కసరత్తు చేసి సాంకేతిక, న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఈ చట్టాన్ని తీసుకురావాలని సీఎం ఆదేశించారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం ఉన్న రిజర్వేషన్లు ఇవ్వాలని సీఎం ఆలోచన. గతంలో కూడా 34 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అయితే.. వైసీపీ ప్రభుత్వం 24 శాతానికి తగ్గించింది. దీంతో 16,500 మంది బీసీలు పదవులకు దూరమయ్యారని సీఎం ఆరోపణ. కాబట్టి 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించి ఆ రిజర్వేషన్ల రక్షణకు బలమైన చట్టాన్ని తీసుకొస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. దీనిపై మంత్రుల కమిటీ వేశారు. ఆ కమిటీ ఈ చట్టంపై కసర్తతు చేస్తోంది.
(23-12-2024 సోమవారం) ( దివ్యాంగుల పింఛన్లపై దిశానిర్దేశం)
దివ్యాంగుల పింఛన్లపైనా చంద్రబాబు సోమవారం సమీక్షించారు. ఈ కేటగిరీలో భారీగా అనర్హులు పింఛన్లు పొందుతున్నారని మొదటి నుంచి సీఎం ప్రధాన ఆరోపణ. అనర్హులను గుర్తించాలని అధికారులకు సీఎం గతంలో ఆదేశించారు. ఈ సమావేశం దీనిపై చర్చ జరిగింది. అనర్హులను గుర్తించడానికి మరో 9 నెలలు పుడుతుందన్న అధికారుల సమాధానంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు దాటినా అనర్హులను గుర్తించకపోవడం ఏంటని ప్రశ్నించారు. అర్హులెవరూ సంక్షేమ పథకాలకు దూరం కాకూడదని.. అదే సమయంలో అనర్హులు ఈ జాబితాలో ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. అనర్హులను గుర్తించే విషయాన్ని కొందరు పింఛన్ల తొలగింపు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. దీనికి ధీటుగా సమాధానం చెప్పాలని అధికారులకు ఆదేశించారు సీఎం.
(23-12-2024 సోమవారం) ( టిడ్కో ఇళ్ల నిర్మాణానికి డెడ్ లైన్ )
సోమవారం టిడ్కో ఇళ్ల నిర్మాణంపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. 2014- 19 మధ్య కాలంలో చేపట్టిన టిడ్కో ఇళ్లను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. లక్షా 18 వేల ఇళ్లను వచ్చే ఏడాది జూన్ 12 నాటికి పూర్తి చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పడి జూన్ 12 నాటికి ఏడాది పూర్తి అవుతుంది. దీంతో చంద్రబాబు అధికారులకు ఈ టార్గెట్ విధించారు.
(23-12-2024 సోమవారం) ( క్రిస్టియన్స్‌కు సీఎం భరోసా)
విజయవాడలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో సోమవారం సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రైస్తవుల సంక్షేమానికి, భద్రతకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చర్చిపై దాడి జరిగితే తానే స్వయంగా వెళ్లి పరిశీలించానని గుర్తు చేశారు. చర్చిల నిర్మాణానికి ఆర్థిక సాయం చేశామని అన్నారు. గుంటూరులో క్రిస్టియన్ భవన్‌కు రెండెకరాలు కేటాయించి, నిర్మాణానికి 10 కోట్లు ఖర్చు చేశామన్నారు.
క్రైస్తవ సంస్థలు ప్రారంభించిన ఎయిడెడ్ సంస్థల్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. వైసీపీ అవకతవకలు తవ్వినకొద్దీ బయటపడుతున్నాయని మండిపడ్డారు. అన్నింటినీ అధిగమించి రాష్ట్రానికి పూర్వ వైభవం తెస్తామని తెలిపారు. పాస్టర్లకు గౌరవవేతనాలు విడుదల చేశామని గుర్తు చేశారు. క్రిస్టియన్ మిషనరీల కోసం ప్రాపర్టీ డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయడాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు చంద్రబాబు.
(24-12-2024 మంగళవారం) (వర్క్‌స్పేస్‌ల అభివృద్ధిపై)
రాష్ట్రంలో కో-వర్కింగ్ స్పేస్, నైబర్‌హుడ్ వర్కింగ్ స్పేస్‌ల అభివృద్ధిపై మంగళవారం సీఎం సమీక్షించారు. గ్రామాలు.. చిన్న పట్టణాల్లో ఉన్న నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వారి కోసం పని ప్రదేశాలు సృష్టించాలని చెప్పారు. వర్క్ ఫ్రం హోం విధానంతో మానవ వనరుల సమర్థ వినియోగం జరుగుతుందని చంద్రబాబు ఆలోచన. చదువుకున్న మహిళలు హౌస్ వైఫ్‌లుగా మిగిలిపోకుండా వారికి వర్క్ ఫ్రం హోం రూపంలో ఉపాధి కల్పించాలని అన్నారు.
2025 డిసెంబరు నాటికి కో వర్కింగ్ స్పేస్ ద్వారా లక్షా 50 వేల సీట్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు సీఎం టార్గెట్ పెట్టారు. రాష్ట్రంలో ఐదుచోట్ల రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ల ఏర్పాటుకు భవనాలను గుర్తించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లోని పరిశ్రమలు, విద్యా సంస్థలను ఈ హబ్‌లకు అనుసంధానం చేయాలని సూచించారు.
(24-12-2024 మంగళవారం) (మిషన్ కర్మయోగిపై సమీక్ష)
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఉద్యోగుల్లో నైపుణ్యాలు పెంచేందుకు నిర్దేశించిన ఏపీ మిషన్ కర్మయోగి కార్యక్రమంపై సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ శిక్షణ కోసం కెపాసిటీ బిల్డింగ్ కమిషన్‌తో రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరులో ఒప్పందం చేసుకుంది. కెపాసిటీ బిల్డింగ్ పాలసీపై అధికారులతో సీఎం చర్చించారు. ఆధునిక సాంకేతికతతో నడిచే కంపెనీల అవసరాలకు తగ్గట్టు యువత నైపుణ్యాలు పెంచుకోవడం అత్యవసరమని చంద్రబాబు ఆలోచన. దీని కోసం కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ సిఫారసు చేసిన శిక్షణ పాలసీని ఆమోదిస్తున్నట్టు ప్రకటించారు.
(25-12-2024 బుధవారం) (ప్రధాని, కేంద్రమంత్రులతో భేటీ)
ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లారు. అక్కడ అటల్ బిహారీ వాజ్‌పేయీ శతజయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు కేంద్రమంత్రులను కలిశారు. మొదట మాజీ అటల్ బిహారీ వాజ్‌పేయీ శతజయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వాజ్‌పేయీకి నివాళి ఆర్పించి ఆయన హయంలో తీసుకున్న నిర్ణయాలను గుర్తు చేశారు సీఎం. ఆ తర్వాత ఎన్డీఏ పక్షసమావేశానికి హాజరైయ్యారు. ఈ రెండు ముగిసిన తర్వాత వరుసగా ప్రధాని, కేంద్రమంత్రులతో అయ్యారు.
ప్రధాని నరేంద్రమోదీతో సుమారు గంట సమయం భేటీ అయ్యారు. ప్రధానికి స్వర్ణాంధ్ర విజన్ – 2047 డాక్యెమెంట్‌ను అందించి దాని సాకారానికి కేంద్రం తరఫున అన్నిరకాలుగా సాయం అందించాలని కోరారు. ఇక వచ్చేనెలలో ప్రధాని చేతుల మీదుగా రాష్ట్రంలో కొన్ని భారీ ప్రాజెక్టుల ఆవిష్కరణ జరగనుంది. దీని గురించి కూడా చర్చించారు. పోలవరం, అమరావతిపై చర్చ జరిగింది.
వైసీపీ ప్రభుత్వం 94 కేంద్రప్రభుత్వ పథకాలను డైవర్ట్ చేయడం వలన వాటి అమలును నిలిచిపోయిందని సీఎం ఆరోపణ. దీని వలన రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు. ఆ 94 పథకాల్లో 74 పథకాలను మళ్లీ ప్రారంభించామని చెప్పారాయన. ఆ పథకాలకు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న నిధులు వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. కోరారు. అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిత్తల్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు కానుంది. దీనికి ముడిఖనిజం సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు.. ఆర్సెలార్ మిత్తల్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటునకు అన్ని శాఖల నుంచి రావాల్సిన అనుమతులు త్వరగా వచ్చేలా చూడాలన్నారు.
ప్రధాని మోడీని కలిసిన తర్వాత చంద్రబాబు హోంమంత్రి అమిత్‌షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌లతో కూడా భేటీ అయ్యారు. ఒక్కొకరితో 45 నిమిషాలకు పైగా చర్చించారు. వచ్చే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా కేటాయింపు చేయాలని నిర్మలా సీతారామన్ ను కోరారు. ఎన్డీయే నేతల భేటీ ముగిసిన తర్వాత కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామితో సమావేశం అయ్యారు. ఈ భేటీలో విశాఖ ఉక్కు గురించి చర్చించారు.
ఆ తర్వాత ఢిల్లీలో సీఎం చంద్రబాబు అధికార నివాసానికి రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్ వెళ్లారు. ఆయనతో గంటపాటు మాట్లాడారు. వీరిద్దరి మధ్య విశాఖ రైల్వేజోన్ అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. వాల్తేరు డివిజన్ తో కూడిన రైల్వే జోన్ శంకుస్థాపన జరగాలని చంద్రబాబు కోరారు. దీంతో పాటు రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల నిర్మాణ పనులను వేగం చేయాలని అన్నారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా చంద్రబాబుకు సానుకూలంగా స్పందించారు.
(27-12-2024 శుక్రవారం) (మన్మోహన్ సింగ్‌కు నివాళి )
శుక్రవారం మరోసారి సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతి చెందడంతో సెడన్ గా వెళ్లాల్సి వచ్చింది. నేరుగా మన్మోహన్ సింగ్ ఇంటికి వెళ్లి ఆయన నివాళి అర్పించారు. ఆ తర్వాత మాజీ ప్రధాని సేవలను గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలే భారత్ ఉన్నత స్థాయిలో నిలబెట్టాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని భావోద్వేగానికి గురైయ్యారు. ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు విదేశీ మారకద్రవ్య నిల్వలే లేని పరిస్థితుల్లో సంస్కరణలు తీసుకొచ్చి దేశం దశ, దిశ మార్చారని చంద్రబాబు ప్రశంసించారు. భారత్ గ్రేట్ నేషన్‌గా అవతరించడానికి మన్మోహన్ రూట్ క్లియర్ చేశారని సీఎం అభిప్రాయం. ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు, విద్యాహక్కు లాంటి గొప్ప చట్టాలు తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు.
(28-12-2024 శనివారం) (నదుల అనుసంధానానికి అడుగులు)
నదుల అనుసంధానంతో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి పేదరికాన్ని తగ్గించవచ్చని సీఎం చంద్రబాబు తరచూ చెబుతూ ఉంటారు. నదుల అనుసంధానికి సహకరించాలని ఇప్పటికే కేంద్రాన్ని పలుసార్లు కోరారు. అంతర్రాష్ట్ర నదుల అనుసంధాన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం జాతీయ జల అభివృద్ధి సంస్థకూ లేఖ రాసింది. గోదావరి, వంశధార నదులను అనుసంధానం చేస్తే రాయలసీమకు, ఉత్తరాంధ్రకు, మధ్యాంధ్రలో అన్ని ప్రాంతాలకు నీటిని వినియోగించవచ్చని సీఎం ఆలోచన. గోదావరి వరద జలాలను ఇప్పుడు బనకచర్ల రెగ్యులేటర్‌కు తరలించపోతే భవిష్యత్ లో అసలు సాధ్యం కాదని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే దాదాపు 80 వేల కోట్ల రూపాలయలు అవసరం. ఈ నిధులను ప్రైవేటుగా సమీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
(28-12-2024 శనివారం) (వైద్య ఆరోగ్యశాఖపై సమీక్షా)
శనివారం చంద్రబాబు వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై సమీక్షా నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రాన్ని రెండు యూనిట్లుగా విభజించి ఆరోగ్యబీమాను అమలుచేసే విధానానికి ఆమోదం తెలిపారు. ఇలా విభజిస్తే కంపెనీల మధ్య పోటీ పెరిగి, ప్రీమియం తగ్గే అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఆలోచిస్తోంది. రాష్ట్రంలో 108, 104 సర్వీసులను ఒకే సర్వీస్ ప్రొవైడర్‌తో అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. 190 కొత్త 108 వాహనాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఆసుపత్రుల్లో చనిపోయిన వారి మృతదేహాలు తరలించేందుకు కొత్తగా 58 మహాప్రస్థానం వాహనాల కొనుగోలుకు కూడా సీఎం ఓకే చెప్పారు. 108 సిబ్బంది, డ్రైవర్ 12 గంటల పాటు డ్యూటీలో ఉంటారు. వీరికి గతంలో టీడీపీ ప్రభుత్వం జీతంతో పాటు 4వేల రూపాయలు ఇచ్చేది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 2 వేలకు తగ్గించింది. ఇప్పుడు మళ్లీ 4 వేలకు పెంచాలని నిర్ణయించారు.