Protocol Dispute: ఆ జిల్లాలో ఎంపీ, కలెక్టర్ మధ్య పొసగడం లేదనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఎంపీగా ఉన్న తనకు.. కలెక్టర్ సహకరించటం లేదని.. ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ ఆరోపించటం సంచలనంగా మారింది. అధికార పార్టీలో నేతకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇతరుల సంగతేంటని ప్రతిపక్షాలు చురకలు వేస్తున్నాయి. ఈ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టేందుకు పార్టీ అధిష్టానం రంగంలోకి దిగిందట.
సహజంగా ప్రోటోకాల్ వివాదం ప్రతిపక్షనేతలకు ఉంటుంది. ప్రతిపక్ష పార్టీ సభ్యులే ప్రోటోకాల్ వివాదాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్తారు. అందుకు భిన్నంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధి.. తన విషయంలో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ మాట్లాడడం సంచలనంగా మారింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి సభలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. కలెక్టర్‌పై నేరుగా విమర్శలు చేయడంతో అధికార పార్టీలో కొత్త చర్చకి దారి తీసింది.
పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టుంది. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటింది. BRS కంచుకోటలను బద్దలు కొట్టింది. ఐతే.. కొన్నిరోజులుగా ఈ జిల్లా వార్తల్లోకి ఎక్కింది. ప్రోటోకాల్ పాటించడం లేదంటూ.. అధికార పార్టీ ఎంపీ వంశీకృష్ణ .. మూడు నెలల నుంచి ఎక్కడ సమావేశం జరిగినా.. అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇటీవల పెద్దపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవ సభ నిర్వహించింది.
సభలో ముఖ్యమంత్రి ఎదుటనే తన ప్రోటోకాల్ అంశంపై ఎంపీ వంశీకృష్ణ ప్రస్తావించారు. ఊహించని పరిణామంతో కొంతమంది నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పెద్దపల్లిలో ఎంపీ వంశీకృష్ణ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ప్రోటోకాల్ వివాదమే కాకుండా.. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పైనా విమర్శలు చేశారు. తన తాత వెంకటస్వామి వర్థంతి వేడుకలను.. అధికారికంగా ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. కలెక్టర్ తీరును ఎంపీ వంశీకృష్ణ తప్పుపట్టారు.
Also Read: రాష్ట్రానికి వెల్లువెత్తుతున్న పెట్టుబడులు.. దేశంలోనే టాప్.. 6 నెలల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
తాను కలెక్టర్‌తో కలసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నా.. ఆయన కలిసి రావడం లేదన్నారు ఎంపీ. వెంకటస్వామి వర్ధంతి కార్యక్రమం నిర్వహించకపోవడం.. దళిత జాతినే అవమాన పరిచినట్లుగా ఎంపీ అన్నారు. జిల్లాలో ప్రోటోకాల్ పాటించడం లేదని.. అధికారంగా నిర్వహించే కార్యక్రమాలకు కూడా తనని పిలవడం లేదంటూ అగ్రహం వ్యక్తం చేశారు. దీనంతటికీ కారణం కలెక్టర్ అంటూ పరోక్షంగా విమర్శలు చేశారు వంశీకృష్ణ. మరోవైపు.. ఎంపీ కామెంట్స్‌పై కలెక్టర్ శ్రీహర్ష మౌనంగా ఉన్నారు. అయితే ఇదే అదునుగా భావించిన ప్రతిపక్షాలు.. అధికార పార్టీలో సమన్వయ లోపం స్పష్టంగా కనబడుతుందని విమర్శలు గుప్పిస్తున్నాయి. వారి మధ్యే సమన్వయం లేకపోతే.. అభివృద్ధి ఎలా చేస్తారంటూ చురకలు వేస్తున్నాయి.
ప్రోటోకాల్ అంశాన్ని ప్రివిలేజ్ మోషన్ ద్వారా లోకసభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. మరోవైపు.. కాంగ్రెస్ అధిష్టానం కూడా వంశీకృష్ణ కామెంట్స్ పైనా ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఎంపీ ఆరోపణల అంశం.. సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ జరగటంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సమస్యలుంటే చర్చించుకోవాలని తప్ప.. ఇలా బహిరంగంగా ప్రెస్‌మీట్ పెట్టడం సరికాదనే భావనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్‌కు తెరదించేలా కొందరు నేతలు రంగంలోకి దిగినట్లు సమాచారం.