CM Revanth Govt: త్వరలో బాల భరోసా పథకంతో అన్నిరకాల సర్జరీలు చేయించడం, సర్కారీ బడుల్లో ప్రీ ప్రైమరీ షురూ చేయించడం, స్కూళ్లల్లో ఇకపై కచ్చితంగా యోగా నిర్వహించడం, ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక సరఫరాపై గైడ్ లైన్స్, వరద ముంపు సమస్యల పరిష్కారం హైడ్రాకు అప్పగించడం ఈ వారం ప్రజాప్రభుత్వంలో కీలక నిర్ణయాలు. వాటికి సంబంధించి ఫుల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం.
08-06-2025 ఆదివారం ( సామాజిక సమీకరణాలతో కూర్పు )
సామాజిక సమీకరణాలతో మంత్రివర్గాన్ని విస్తరించారు. మరో ముగ్గురికి క్యాబినెట్ లో చోటు కల్పించారు. దీంతో క్యాబినెట్‌లో మంత్రుల సంఖ్య 15కు చేరుకుంది. ఇంకో మూడు మంత్రి పదవులను భర్తీ చేయాల్సి ఉంది. ఈనెల 8న రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కొత్తగా నియమితులైన ముగ్గురు మంత్రులతో రాజ్‌భవన్‌లో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. కొత్తగా వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
09-06-2025 సోమవారం ( త్వరలో బాల భరోసా పథకం )
ఇప్పటికే బాలికల కోసం ఇందిరమ్మ అమృతం పథకం తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలో బాలభరోసా పథకం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఐదేళ్లలోపు పిల్లలకు అవసరమైన అన్ని రకాల సర్జరీలు ఈ పథకం కింద చేయిస్తామన్నారు మంత్రి సీతక్క. సోమవారం ఆమె కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మహిళా సంఘాల సోలార్ ప్లాంట్లను అక్టోబర్ 2న ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా వెయ్యి అంగన్వాడీ భవనాలు నిర్మిస్తామన్నారు. ప్రైవేట్ ప్లేస్కూళ్లకు దీటుగా అంగన్వాడీలను తీర్చిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
10-06-2025 మంగళవారం ( స్కూళ్లల్లో ఇకపై యోగా )
ప్రభుత్వం విద్యా రంగంలో చేపట్టిన చర్యలు పరిపాలనాపరమైన సామర్థ్యాన్ని సూచిస్తున్నాయి. అందుకే 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ స్పెషల్ గా ఉంది. మొత్తం 230 పనిదినాలు ఖరారు చేశారు. ఈసారి స్కూళ్లల్లో ప్రతి రోజు కనీసం 90% విద్యార్థుల హాజరు ఉండాల్సిందేనని ఆదేశించారు. 2026 మార్చిలో పదో తరగతి ఎగ్జామ్స్ ఉంటాయన్నారు. 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు సిలబస్‌ను 2026 ఫిబ్రవరి 28 లోగా పూర్తి చేయాలి ఆదేశించారు. ఇక ఈసారి ప్రభుత్వ విద్యాసంస్థల్లో స్పెషల్ ఏంటంటే.. యోగా తప్పనిసరి చేశారు. రోజూ 5 నిమిషాల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ధాన్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ చర్యలు విద్యార్థులలో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంతో పాటు విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతాయన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన.
10-06-2025 మంగళవారం ( ఇసుక సరఫరాపై ప్రత్యేక గైడ్ లైన్స్ )
ఇందిరమ్మ ఇళ్ల రెండో దశ లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ఫైనల్ స్టేజ్ కు చేరడంతో ప్రభుత్వం ఇసుకపై దృష్టి పెట్టింది. ఇటీవల సీఎం రేవంత్ నిర్వహించిన సమీక్షలో ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత రాకుండా చూడాలని, అక్రమ సరఫరా జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తొలి రెండు విడతలు కలిపి 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమని అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ మేరకు ప్రత్యేక గైడ్ లైన్స్ రూపొందించారు. ఒక లబ్దిదారుడికి 25 క్యూబిక్ మీటర్ల ఇసుకను నాలుగు విడతల్లో సరఫరా చేస్తారు. గ్రామ కార్యదర్శి జారీ చేసే ధ్రువపత్రాన్ని తీసుకెళ్లి తహసీల్దార్ ఆఫీస్ లో ఇస్తే.. ఏ వాగు నుంచి ఇసుకను తరలించాలో సూచించి, టోకెన్లను అందిస్తారు. వాటి ఆధారంగా లబ్ధిదారుడే ఇసుకను తరలించుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం రెండో విడతలో 2.28 లక్షల మంది జాబితాను సిద్ధం చేసింది. రెండో విడత పనులు ప్రారంభమైతే గ్రేటర్ హైదరాబాద్ మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా 44 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం ఉంటుంది. ఇసుక అందుబాటులో లేని జిల్లాలకు పక్క జిల్లాల నుంచి సప్లై చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
10-06-2025 మంగళవారం ( వరద ముంపు సమస్యల పరిష్కారం హైడ్రాకే )
హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణ కోసం సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా చేతికి తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక బాధ్యతల్ని అప్పగించింది. వర్షాకాలంలో నగరంలో వరద ముంపు సమస్యల్ని పరిష్కరించాలని ఆదేశించింది. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ జీహెచ్‌ఎంసీ నుంచి హైడ్రాకు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ ఒక గొడుగు కిందకు రావడం వల్ల పని ఈజీ అవుతుంది. దీంతో మ్యాటర్ ను హైడ్రా టేకప్ చేసింది. వర్షాకాలంలో మాత్రమే హైడ్రా బాధ్యత అని, వర్షాకాలంలో చేయాల్సినవి హైడ్రా చేస్తుందని, వర్షాకాలం ముందు చేయాల్సినవి జీహెచ్‌ఎంసీ చేస్తుందన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. నాలాల్లో వరద నీరు సాఫీగా వెళ్లేలా చేస్తామన్నారు. హైడ్రా దగ్గర 30 టీమ్స్, జీహెచ్‌ఎంసీ దగ్గర 150 టీమ్స్, ట్రాఫిక్ 20 టీమ్స్ ఉన్నాయి. అన్ని టీములతో పని చేయిస్తామన్నారు.
11-06-2025 బుధవారం ( సర్కారీ బడుల్లో ప్రీ ప్రైమరీ షురూ )
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రైవేట్ స్కూళ్లకే పరిమితమైన ప్రీ ప్రైమరీ క్లాసెస్ ను సర్కారు బడుల్లో ప్రవేశపెట్టాని నిర్ణయించింది. ఇందుకోసం జూన్ 11న ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర శిక్షణలో భాగంగా రాష్ట్రంలోని 210 ప్రభుత్వ స్కూళ్లలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ క్లాసెస్ ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీల్లో విద్యార్థులను చేర్చుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటి వరకు ప్రభుత్వ స్కూళ్లల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ లేకపోవడంతో పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపాల్సిన పరిస్థితి ఉండేది. పైగా ప్రైవేట్ లో ప్రీప్రైమరీకి కూడా భారీగానే ఫీజులు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో పేద, మధ్యతరగతి వారికి రిలీఫ్ దొరికినట్లైంది.
12-06-2025 గురువారం ( తెలంగాణపై నీతి ఆయోగ్ ప్రశంసలు )
సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నట్లుగా ట్రిపుల్ ఆర్, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీతో రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయన్నది నీతి ఆయోగ్. అంతేకాదు సీఎం ఆశిస్తున్న ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం చేరుకోవడానికి మరెంతో దూరం లేదన్నది. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందుతున్న తీరు, సీఎం రేవంత్ ప్రణాళికలను నీతి ఆయోగ్ ప్రశంసించింది. వచ్చే పదేళ్లలో తెలంగాణ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడం సాధ్యమేనని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ప్రకారం మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా రూపొందే దిశగా వేగంగా పయనిస్తోందన్నది నీతి ఆయోగ్. రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ, భారీ పెట్టుబడుల ఆకర్షణ వంటి ప్రాజెక్టులు ఈ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించనున్నాయని తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల నీతి ఆయోగ్ కు 2047 తెలంగాణ రైజింగ్ విజన్ రోడ్‌మ్యాప్‌ను సమర్పించారు. దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన నీతి ఆయోగ్, తెలంగాణ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉందన్నది. ఇది ప్రజాప్రభుత్వానికి మేజర్ బూస్టప్. దేశ జీడీపీలో దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల వాటానే ఏకంగా 30% ఉంది. ఇందులో తెలంగాణ 5 శాతం కంట్రిబ్యూట్ చేస్తోంది. నైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఒక ఆదర్శవంతమైన నమూనా అని నీతి ఆయోగ్ ప్రశంసించింది.
12-06-2025 గురువారం ( స్థానిక వ్యాపారాలకు మార్కెట్ అవకాశాలు )
ప్రతి రంగంలో స్కిల్స్ పెంచి ప్రొడక్టివిటీ పెంచేలా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ క్రమంలో విద్యార్థులకే కాదు.. చిన్న మధ్యతరహా వ్యాపారులకు మేలు చేసేలా ఈనెల 12న ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ-కామర్స్ ద్వారా స్థానిక వ్యాపారాలకు మార్కెట్ అవకాశాలను ఈజీ చేయడానికి అవసరమైన స్కిల్స్ కల్పించే లక్ష్యంగా వర్క్‌షాప్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఫ్లిప్‌కార్ట్, మీసేవ ప్రతినిధులు, వ్యాపారులు పాల్గొన్నారు. డిజిటల్ అవకాశాలు పెంపొందించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా, తెలంగాణ ప్రభుత్వం మీసేవ ఆఫర్లలో ఈ-కామర్స్ సౌకర్యాన్ని చేర్చాలని భావిస్తోంది. ఈ వర్క్‌షాప్‌లో 800 మందికి పైగా మీసేవ ప్రతినిధులు, MSME యజమానులు, ఇండస్ట్రీ ఎక్స్ పర్ట్స్ పాల్గొన్నారు. చిరు వ్యాపారులు, చేతివృత్తులవారు ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ ప్లేస్‌ను వాడుకునేలా చేయడంపై ఫోకస్ పెట్టారు.
13-06-2025 శుక్రవారం ( సర్కారీ బడుల్లో క్వాలిటీ పెంచేలా )
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేలా సీఎం రేవంత్ రెడ్డి మరింత ఫోకస్ పెంచారు. ఈనెల 13న విద్యాశాఖపై రివ్యూ చేశారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడానికి అవసరమైన మౌలిక వసతులు, టీచర్లకు శిక్షణ, ఇతర సదుపాయాల కల్పనకు ఎంత ఖర్చైనా వెనుకాడేది లేదన్నారు. స్కూళ్లు రీఓపెన్ అయిన సందర్భంగా తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో విద్యా శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. విద్యా ప్రమాణాలు పెంపు లక్ష్యంతో రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 స్కూళ్లు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ బడుల్లో చేరిన ప్రతి విద్యార్థికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందేలా వ్యవస్థను తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థులకు భాషా పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాల పెంపునకు వీలుగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలన్నారు. హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కల్పిస్తే భవిష్యత్‌లో వారు తమకు ఇష్టమైన రంగంలో రాణించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. నాణ్యమైన భోజనం, యూనిఫాంలు, బుక్స్ అందిస్తుండడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నారని, డే స్కాలర్స్‌కూ వారున్న స్కూళ్లల్లోనే అవన్నీ అందించే విషయంపై స్టడీ చేయాలని సూచించారు.
13-06-2025 శుక్రవారం ( టీచర్ల సర్దుబాటు కోసం )
కొన్ని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు ఎక్కువగా ఉంటే టీచర్ల సంఖ్య తక్కువుంటుంది. ఇంకొన్ని చోట్ల టీచర్లు ఎక్కువుంటారు. పిల్లలు తక్కువ. సో ఇలాంటి అశాస్త్రీయ విధానాలకు చెక్ పెడుతూ ప్రభుత్వం టీచర్ల సర్దుబాటు ప్రక్రియను కొత్తగా తెరపైకి తెచ్చింది. ఈ ట్రాన్స్ ఫర్లు జూన్ 13 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ, ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడితో ఈ గడువును జులై 15 దాకా పొడిగించింది. ఈ నిర్ణయంతో టీచర్ల సర్దుబాటు ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి అదనపు సమయం కల్పించింది ప్రభుత్వం. అటు జూన్ 6న ప్రారంభమైన బడిబాట కార్యక్రమం జూన్ 19 వరకు కొనసాగుతుంది.
13-06-2025 శుక్రవారం ( స్థానిక ఎన్నికలపై ముందడుగు )
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. లోకల్ బాడీ ఎన్నికలపై మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చారు. అతి త్వరలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని మహబూబాబాద్ పర్యటనలో సీతక్క చెప్పారు. రెండు మూడు రోజుల్లో రైతులకు రైతు భరోసా డబ్బులు అందిస్తామన్నారు. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలకు అంతా రెడీ చేస్తున్నారు అధికారులు. నోటిఫికేషన్ వచ్చిన నెలరోజుల లోపే ఎన్నికలను పూర్తి చేసేలా ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు గతేడాది ఫిబ్రవరిలోనే ముగియగా దాదాపు ఏడాదిన్నరగా ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు 1,600 కోట్లకు పైగా నిలిచిపోయాయి. పాలకవర్గాలు ఎన్నికైతేనే ఈ నిధులు వస్తాయి. అందుకే ఎలక్షన్లు పెట్టేందుకు సిద్దమవుతోంది.
13-06-2025 శుక్రవారం ( డీఏ రిలీజ్ .. ఉద్యోగులు ఖుష్ )
తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఉద్యోగుల డీఏ 3.64 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన డీఏ 2023 జనవరి 1 నుంచి అమలు కానుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే.. ఉద్యోగుల క్షేమం కోసం డీఏ పెంపు అమలు చేస్తూ ఈనెల 13న జీవో జారీ చేసింది. రెండు డీఏలు ఇవ్వాలని జూన్ 5న కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2023 జనవరి 1 నుంచి బకాయి ఉన్న డీఏల్లో ఒకదాన్ని వెంటనే అమలు చేసి.. మరో డీఏను వచ్చే ఏప్రిల్ లో ప్రకటించాలని నిర్ణయించారు. మార్కెట్ కమిటీలు, ఎయిడెడ్ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, స్థానిక సంస్థల ఉద్యోగులకూ పెంపు వర్తిసుంది. ప్రతినెల జీతాలు, గత అప్పులకు అసలు, వడ్డీలు 22 వేల కోట్లు అవసరమవుతున్నాయని.. కానీ 18వేల కోట్ల నుంచి 18,500 కోట్ల ఆదాయం మాత్రమే వస్తున్నందున ప్రతి నెలా 4వేల కోట్ల లోటు ఉంటోందని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పరిస్థితిని అర్థం చేసుకొని ఉద్యోగులు సహకరించాలని ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తిచేశారు.
14-06-2025 శనివారం ( సంబురంగా గద్దర్ అవార్డులు )
తెలంగాణ రాష్ట్రంలో సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రతిష్టాత్మక తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. హైదరాబాద్ హైటెక్స్ లో ఈ ఫంక్షన్ నిర్వహించింది ప్రభుత్వం. తెలంగాణ కళారంగంలో వేగుచుక్కలాంటివారైన గద్దర్ పేరిట వివిధ విభాగాల్లో సినిమా కళాకారులకు అవార్డులు అందించటం గర్వకారణమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2014 నుంచి 2024 వరకు తెలంగాణ ఏర్పడిన పదేళ్ల కాలానికి గానూ ఉత్తమ సినిమాలకు అవార్డులు అందించటం, చలనచిత్ర వైతాళికుల పేరుతో ప్రత్యేక పురస్కారాలను ప్రకటించటం సంతోషకరమన్నారు. అవార్డుల ఎంపికలో జ్యూరీ సభ్యుల కృషిని సీఎం అభినందించారు. అవార్డులు అందుకున్న నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత, సాహిత్యకారులు, సాంకేతిక నిపుణులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. అటు గద్దర్ ఫౌండేషన్‌కు 3 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గద్దర్ ఆలోచనలపై కార్యక్రమాల కోసం ఈ నిధులు కేటాయిస్తారు.
Story By Vidya Sagar, Bigtv Live