BigTV English

CM Revanth Reddy: మోడీ సర్కారుపై పోరు.. సౌత్ స్టేట్స్‌కు సీఎం పిలుపు

CM Revanth Reddy: మోడీ సర్కారుపై పోరు.. సౌత్ స్టేట్స్‌కు సీఎం పిలుపు

CM Revanth Reddy: దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. అంతర్జాతీయంగా భారత పరపతి పెరుగుతున్నప్పటికీ.. స్వదేశంలోనే వివక్ష రాజ్యమేలుతోంది. ‘సొమ్మొకడిది సోకకడిది’ అన్నట్లు.. దక్షిణాది రాష్ట్రాల నుండి అధికంగా లాభాలు పొందుతున్న కేంద్ర ప్రభుత్వం.. కేటాయింపుల్లో మాత్రం ఈ రాష్ట్రాలకు మొండి చేయి చూపిస్తోంది. అంతేకాదు, దేశం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఎంతో త్యాగం చేసిన దక్షిణ భారతదేశంలో ఇప్పుడు జనాభా క్షీణిస్తోంది. ఇది, రాజకీయ ప్రాతినిధ్యంలోనూ దక్షిణాదికి నష్టం తెచ్చేలా ఉంది. ఇక, ‘వన్ నేషన్ వన్ రూలింగ్’ అనే ధోరణిలో బిజెపి వ్యవహరించడం. భవిష్యత్తులో మరిన్ని సమస్యలకు కారణం కానుంది. మరి, ఇప్పుడేం చేయాలి..? తెలంగాణ సీఎం రేవంత్ చెబుతున్న పరిష్కారం ఏంటీ..?


రాజ్యాంగ హక్కులు కాపాడుకోడానికి దక్షిణాది ఐక్యం కావాలి

సౌత్ ఇండియా దాని ఉనికిని కోల్పోతుందా..? కేంద్రంలో ఉన్న పాలకులు దక్షిణాది రాష్ట్రాలను చిన్న చూపు చూస్తున్నారా..? దేశం ఒక్కటే అయినా వివక్ష మాత్రం దక్షిణాదికే ఎందుకు..? ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ ముసుగులో.. ‘వన్ లీడర్, వన్ పార్టీ’ ప్లాన్ నడుస్తోందా? ఉత్తరాది రాష్ట్రాలను కైవసం చేసుకుంటున్న బిజెపి.. దక్షిణాదిని టార్గెట్ చేస్తోందా..? దేశంలో దక్షిణాది ప్రజలకు ప్రాధాన్యత తగ్గిపోతోందా..? పరిస్థితులు చూస్తుంటే.. అవునన్నట్లే కనిపిస్తోంది. అందుకే, తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. దక్షిణాది రాష్ట్రాలు తమ రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడానికి ఐక్యంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.


మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్-2025

సమాఖ్య నిర్మాణాన్ని బలహీనపరిచే విధానాలను, ముఖ్యంగా “ఒకే నాయకుడు, ఒకే పార్టీ” వ్యవస్థను ప్రోత్సహించే విధానాలను ప్రతిఘటించాల్సిన ప్రాముఖ్యతను సీఎం రేవంత్ నొక్కి చెప్పారు. తిరువనంతపురంలో జరిగిన ‘మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్-2025’లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాల పాటు కుటుంబ నియంత్రణ విధానాలు పాటించి, మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే స్థితిలో దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయనీ… ఈ రాష్ట్రాలు ప్రగతిశీల విధానాలను అవలంభిస్తున్నా.. ఎందుకు శిక్షకు గురౌతున్నారంటూ? సీఎం రేవంత్ ప్రశ్నించారు.

కుటుంబ నియంత్రణ, సంక్షేమ కార్యక్రమాలను…

కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండీ దక్షిణాదిపై వివక్ష నానాటికీ పెరుగుతూ వస్తుందనేది నిపుణులు కూడా అంటున్న మాట. ఈ క్రమంలోనే, రాజ్యంగ బద్దంగా దక్షిణాది రాష్ట్రాలకు రావాల్సిన హక్కులు సాధించుకోడానికి పోరాడాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. జనాభా ఆధారంగా పార్లమెంటరీ సీట్ల పునర్విభజన గురించి కూడా రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ నియంత్రణ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు ప్రతికూల స్థితిలో ఉన్నాయి. అలాంటిది, జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేప‌ట్టి ద‌క్షిణాదిని శిక్షించడానికి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందన్నది రేవంత్ వ్యాఖ్యల్లో తెలుస్తోంది.

దక్షిణాది రాష్ట్రాల మధ్య స్వయంప్రతిపత్తి, సహకారం అవసరం

తెలంగాణ లాంటి ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాలకు.. ముఖ్యంగా, దక్షిణాది రాష్ట్రాలకు.. బిజెపి పాలనలో లేని రాష్ట్రాలకు.. కేంద్ర బిజెపి ప్రభుత్వం మద్దతు ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి అడుగుతున్న పశ్న. తెలంగాణ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధించడం కారణంగా.. మొత్తం దేశానికి ప్రయోజనం చేకూరుతుందనే వాదన మధ్య.. ఈ ప్రయత్నంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవడం కుట్రలో భాగంగానే చూడాల్సి వస్తుంది. ఇలా, కేంద్ర విధానాలకు సంబంధించి దక్షిణాదిలో పెరుగుతున్న ఆందోళనలపై ఇటీవల కాలంలో దక్షిణాది రాష్ట్రాలు చర్చిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు, రేవంత్ వ్యాఖ్యల తర్వాత.. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి.. వాటి మధ్య ఎక్కువ స్వయంప్రతిపత్తి, సహకారం ఉండాలనే పిలుపు వస్తోంది.

బీహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ సీట్లతోనే…

నిజానికి, జనాభా ప్రకారం పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలు తగ్గుతాయి. దీని వల్ల, బీహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో గెలిచే సీట్లతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దక్షిణాది రాష్ట్రాలపై ఆధారపడాల్సిన అవసరమే పార్టీలకు ఉండదు. అందుకే, జనాభా లెక్కల ప్రకారం కాకుండా.. ప్రతి రాష్ట్రానికీ 50% సీట్లు పెంచాలని సీఎం రేవంత్ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్, డైరెక్ట్‌గా ప్రధాని మోడీతోనే డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు ఎప్పటి నుండో నివేదికలు వెలువడుతున్నాయి.

కొత్త జన గణన తర్వాత జరగాల్సిన డీలిమిటేషన్ ప్రక్రియ

దీనితో, దక్షిణాది రాష్ట్రాల్లో నియోజవర్గాలు తగ్గుతాయనే ఆందోళన పెరిగింది. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా, దక్షిణాదితో పోలిస్తే ఎక్కువ లోక్‌సభ స్థానాలు, ఎక్కువ జనాభా ఉన్న ఉత్తర భారత రాష్ట్రాలకు వెళతాయి. అది ఉత్తరాదికి రాజకీయ ప్రయోజనాన్ని ఇస్తుంది. ఇక, కొత్త జన గణన తర్వాత జరగాల్సిన డీలిమిటేషన్ ప్రక్రియ, లోక్‌సభ నియోజకవర్గాలు తక్కువగా ఉండటం వల్ల జాతీయ నిర్ణయాధికారంలో దక్షిణాది రాష్ట్రాల ప్రభావం తగ్గిపోతుందనే భయం బలంగా ఉంది. అందుకే, దక్షిణాది రాష్ట్రాల సీఎంలైన ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్ ఇటీవల కాలంలో పిల్లల్ని ఎక్కువగా కనాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఇద్దరు సీఎంలు చేసిన విజ్ఞప్తులకు కర్ణాటక, తెలంగాణ, కేరళల నుండి కూడా మద్దతు లభించింది.

2050 నాటికి, ప్రతి ఐదుగురిలో ఒకరు 60 ఏళ్లు పైబడిన వారే

దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే పార్లమెంటులో… కేంద్ర నిధుల పంపిణీలో జనాభా సంఖ్యల ఆధారంగా ఇచ్చే పక్షపాత ధోరణిని విమర్శిస్తున్నాయి. అందుకే, జనాభాను పెంచే లక్ష్యంతో దక్షిణాది రాష్ట్రాలు సమర్థవంతంగా పనిచేయడానికి చర్యలు కూడా తీసుకుంటున్నాయి. భారతదేశంలో వృద్ధాప్య జనాభా పెరగరడం, సంతానోత్పత్తి రేటు తగ్గిపోవడాన్ని ఇటీవలి డేటా స్పష్టం చేస్తోంది. దీని ప్రకారం, 2050 నాటికి, ప్రతి ఐదుగురిలో ఒకరు 60 ఏళ్లు పైబడి ఉంటారని తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో అయితే ఇది మరింత ఎక్కువగా జరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

సంతానోత్పత్తి రేటు 1.8 కంటే తక్కువగా ఉంటే…

సంవత్సరాలుగా, దక్షిణాది రాష్ట్రాలు వారి మొత్తం సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గిపోతున్నట్లు గమనించాయి. ఇది సాధారణ స్థాయి కంటే మరింత దిగువకు పడిపోవడంతో ఆందోళనలు పెరుగుతున్నాయి. NFHS-5 ప్రకారం సంతానోత్పత్తి జాతీయ సగటు రేటు 2.0 కాగా, తెలంగాణలో అది 1.8 గా ఉంది. అదే ఆంధ్రప్రదేశ్‌లో అది 1.7గా ఉంది. ఇక, దక్షిణాది రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు 1.6 వద్ద జాతీయ సగటు 2 కంటే కొంచెం తక్కువగా ఉంది. సంతానోత్పత్తి రేటు 1.8 కంటే తక్కువగా ఉంటే సంబంధిత దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద ప్రభావం చూపుతుందని ముంబయ్‌లోని ఇంటర్నేషనల్‌ ఇన్‌‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాపులేషన్‌ సైన్సెస్‌ కూడా చెబుతోంది.

ఆర్థికంగా బలమైన దక్షిణాదికి అధికార వికేంద్రీకరణలో తక్కువ వాటా

15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన స్థాయిలతో పోల్చితే గత కొన్నేళ్లుగా రాష్ట్రాలకు ఇచ్చిన డెవల్యూషన్ చాలా తక్కువగా ఉందని దక్షిణాది రాష్ట్రాలు ఎప్పుడూ ఫిర్యాదు చేస్తూనే ఉన్నాయి. అలాగే, తక్కువ జనాభా, ఆర్థికంగా బలమైన దక్షిణాది రాష్ట్రాలకు అధికార వికేంద్రీకరణలో కూడా వాటా తక్కువగా ఉంది. అయితే, ఈ కొలమానాల్లో బలహీనంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలు కేంద్ర పన్నుల్లో ఎక్కువ వాటాను పొందుతాయి. నిజానికి, దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న19.6% జనాభా నుండి దేశానికి 30% కంటే ఎక్కువ GDPతో గణనీయమైన సహకారం అందిస్తున్నారు.

30% కంటే ఎక్కువ GDPతో గణనీయమైన సహకారం

అయినా, దక్షిణాది రాష్ట్రాలు 11వ ఆర్థిక సంఘం కింద 21% వాటా కేటాయిస్తే.. అది, 15వ ఆర్థిక సంఘం కింద కేవలం 15.8%కి పన్ను పంపిణీలో తమ వాటాను తగ్గించాయి. ఇది, 2011 జనాభా లెక్కల ఆధారంగా జరగడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు సెంట్రల్ పూల్‌లో తమ ఆదాయ వాటాను కోల్పోయాయి. కాబట్టి, లోక్‌సభ స్థానాల విభజనపై ఉన్న సందేహాలను కేంద్రం పరిష్కరించాలనే డిమాండ్లు వస్తున్నాయి.

పని చేసే వయస్సున్న జనాభా తగ్గిపోవడం వల్ల…

వాస్తవానికి, సంవత్సరాలుగా, దక్షిణ భారత రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నాయి. జనన నియంత్రణ చర్యల నుండి మహిళలకు విద్య అందించడం వరకు, జనాభా స్థిరీకరణలో దక్షిణ భారత రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. పని చేసే వయస్సున్న జనాభా తగ్గిపోవడం వల్ల… ఆర్థిక వ్యవస్థలో సహకరించే వారి సంఖ్య తగ్గిపోతుంది. పెన్షనర్లు, ఆరోగ్య భద్రత అవసరమయ్యే వృద్ధుల నిష్పత్తి పెరుగుతూ… యువత తగ్గిపోతే ఇది కుటుంబాలపై, ప్రభుత్వాలపై ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుంది.

యువత తగ్గిపోతే ఇది కుటుంబాలపై, ప్రభుత్వాలపై ఆర్థిక ఒత్తిడి

నిజానికి, ఉత్తర భారత రాష్ట్రాలు తమ జనాభాను నియంత్రించడానికి ఏమీ చేయట్లేదన్నది నివేదికలు చెబుతున్న మాట. కానీ, కుటుంబ నియంత్రణ చర్యలను అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలకు ఇప్పుడు సమస్యలు వస్తున్నాయి. ఇక, మోడీ ప్రభుత్వం చెబుతున్నట్లు నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికనే జరిగితే… దక్షిణాది రాష్ట్రాలు అటు ఆర్థికంగానూ.. ఇటు రాజకీయంగానూ.. తీవ్రమైన నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే, కేరళ, తమిళనాడు, కర్నాటక, ఏపీ, తెలంగాణతో పాటు.. పుదుచ్ఛెరీ ప్రజలు కూడా ఏకం కావాలనే పిలుపునిచ్చారు సీఎం రేవంత్.

ఆర్థిక నిధుల పంపిణీలోనూ దక్షిణాదికి అన్యాయం

కేరళలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా సంచలనాత్మక చర్చను లేవనెత్తింది. దక్షిణాది ఐక్యత ఎంత ముఖ్యమో వివరిస్తూ, రేవంత్ చేసిన వ్యాఖ్యలు, ఈ రాష్ట్రాలు కలిసికట్టుగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయి. దక్షిణాది ఏకం అయినప్పుడే హక్కులను మరింత సాధించగలవని గుర్తించే విధంగా నేతల్లో బలమైన ముద్ర వేస్తున్నాయి. ఎందుకంటే, ఆర్థిక నిధుల పంపిణీ విషయంలోనూ మోడీ ప్రభుత్వం దక్షిణాదికి విపరీతంగా అన్యాయం చేస్తోంది.

దక్షిణాది నుండీ పన్నుల రూపంలో భారీగా కేంద్రం వసూలు

ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయిస్తూ.. దక్షిణాది రాష్ట్రాలకు తగిన న్యాయం చేయట్లేదు. పన్నుల విభజనే చూస్తే… దక్షిణాది రాష్ట్రాలు దేశ ఆర్థిక వృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ, వాటికి తగిన విధంగా నిధులు తిరిగి రానివ్వడం లేదు. ఒకరకంగా చూస్తే.. దక్షిణాది నుండీ భారీగా పన్నుల రూపంలో వసూలు చేస్తున్న కేంద్రం.. బిజెపి, దాని మిత్ర పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు దోచి పెడుతోంది. దీనికి సంబంధించి, నిపుణులు చెబుతున్న లెక్కలు చూస్తే, దక్షిణాది ఎంత నష్టపోతుందో.. మోడీ ప్రభుత్వం ఎంత మోసం చేస్తుందో అర్థమవుతుంది.

యూపీ, ఎంపీ, బీహార్‌లకు రూ.62,024 కోట్లు కేటాయింపు

ఈ ఏడాది జనవరి నెలలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాలను పంపిణీ చేసింది. దీని ప్రకారం… దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం దారుణంగా మోసం చేసింది. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అందించిన వివరాల ప్రకారం.. ఉత్తరాదిలో బిజెపి పాలిత రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, బీహార్‌ల మొత్తం కంటే ఐదు తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన మొత్తం సగం కంటే తక్కువగా ఉంది.

ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటకలకు కలిపి రూ.27,336 కోట్లు

ఉత్తరాదిలో ఉన్న ఈ మూడు రాష్ట్రాలకు కేటాయించింది రూ.62 వేల 24 కోట్లు కాగా.. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటకలకు కలపి రూ.27 వేల 336 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే, ఒక్క ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన దాని కంటే.. దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాలకు ఇచ్చింది తక్కువగానే ఉంది. ఇక, కేంద్రానికి ఈ రాష్ట్రాల నుండి వంద రూపాయలు వెళ్తుంటే.. కేంద్రం తిరిగి ఈ రాష్ట్రాలకు ఎంత ఇస్తుందో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.

ఏపీ నుండి కేంద్రానికి రూ.100 వెళ్తుంటే.. వెనక్కి వస్తుంది రూ.46

ఆంధ్రప్రదేశ్ సంగతే చూసుకుంటే.. ఏపీ నుండి కేంద్రానికి రూ.100 వెళ్తుంటే.. వెనక్కి వస్తుంది కేవలం రూ.46 రూపాయలు మాత్రమే. ఇక, తెలంగాణ వంద రూపాయలిస్తే.. కేంద్రం రూ.49 వెనక్కిస్తోంది. ఇక, కర్నాటకకి రూ.13, తమిళనాడుకి రూ.29, కేరళకు రూ.63 రూపాయలు అందుతున్నాయి. అదే, బిజెపి పాలిత ఉత్తరాది రాష్ట్రాలను చూద్దాం. మధ్యప్రదేశ్ నుండి కేంద్రానికి రూ.100 వెళ్తుంటే… తిరిగి కేంద్రం మధ్యప్రదేశ్‌కి రూ.279 రూపాయలు వెనక్కి ఇస్తుంది.

ఉత్తర్‌ప్రదేశ్‌కి వంద రూపాయలకి రూ.333 రిటర్న్

ఉత్తర్‌ప్రదేశ్‌కి అయితే వంద రూపాయలకి రూ.333 రూపాయలు వెనక్కిస్తుంది. ఇక, మోడీ ప్రభుత్వాన్ని నిలబెట్టిన జేడీయు పాలించే బీహార్‌కి అయితే ఏకంగా రూ.100 రూపాయలకి.. రూ.9 వందల ఇరవై రెండున్నర రూపాయలు వెనక్కి ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇలా ఎలా జరుగుతుందని ప్రశ్నించే వారు లేకపోవడం వల్లనే మోడీ ప్రభుత్వం ఇలా మోసం చేస్తుందని దక్షిణాది మేథావులు కూడా విమర్శిస్తున్నారు. దక్షిణాదిని అణగదొక్కడం కోసమే జనాభా ప్రాతిపదికన కేటాయింపులు చేస్తున్నామంటూ కల్లబొల్లి మాటలు చెబుతోంది కేంద్రం.

బడ్జెట్‌లో బీహార్‌కి వరాలజల్లు కురిపించిన కేంద్రం

ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో కూడా దక్షిణాదికి అందినది చాలా తక్కువే. కేంద్రంలో మోడీ ప్రధాని కావడానికి ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీయే మిత్రపక్షాలు సహకారం ఉంది కాబట్టి, ఆ రాష్ట్రానికి ఎంతో కొంత లాభం చేకూరింది. అయితే, దక్షిణాదిలో మిగిలిన రాష్ట్రాలకు మాత్రం మొండి చెయ్యి చూపించింది మోడీ నాయకత్వం. త్వరలో ఎన్నికలకు వెళ్లబోయ బీహార్‌కి అయితే వరాలజల్లు కురిపించింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కేరళ డిమాండ్లలో రుణ పరిమితి పెంచడం తప్ప మరే డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.

దక్షిణాది రాష్ట్రాలకు తూతూ మంత్రంగా కేటాయింపు

ఇక, తమిళనాడు, కర్నాటక, తెలంగాణలకు ఇచ్చింది శూన్యమే అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వానికి లాభం చేకూరే విధంగా ఎంగిలి చేతిని విసిరినట్లు దక్షిణాది రాష్ట్రాలకు మోడీ ప్రభుత్వం తూతూ మంత్రంగా కేటాయింపులు చేస్తోంది. ఈ విధానం గత దశాబ్ధ కాలంగా ఇలాగే నడుస్తుంది. అందుకే, కేంద్రం చేస్తున్న మోసాన్ని అడ్డుకోవాలన్నా.. దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న ప్రాబల్యం, ప్రజాస్వామిక హక్కులను కాపాడుకోవాలన్నా… ముందున్న దారి, దక్షిణాది ఐక్యత మాత్రమే అన్నది అంతా చెబుతున్న మాట.

అధికార వికేంద్రీకరణ జరిగితేనే ప్రజాస్వామ్యానికి విలువ

సీఎం రేవంత్ రెడ్డి..ఫెడరల్ సిస్టమ్ పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన తర్వాత… కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాలరాయడం, రాష్ట్ర పాలనా వ్యవస్థపై నియంత్రణ పెంచడం అన్యాయమనే అభిప్రాయం దక్షిణాది రాష్ట్రాల నాయకుల్ని కూడా ఆలోచింపజేస్తోంది. అధికార వికేంద్రీకరణ జరిగినప్పుడే.. ప్రజాస్వామ్య విలువలు కాపాడబడతాయనీ.. ప్రతి రాష్ట్రం తన అభివృద్ధిని స్వయంగా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందనే చర్చ జరుగుతోంది. అందుకే, దక్షిణాది రాష్ట్రాలకు తగిన స్వయంప్రతిపత్తి రావాలంటే వాటి మధ్య సమన్వయం అవసరమని చెప్పారు సీఎం రేవంత్.

వాటి మధ్య సమన్వయం అవసరమన్న సీఎం రేవంత్

దక్షిణాది ఐక్యత వల్ల ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా, ఆర్థిక సమగ్రత ఏర్పడుతుంది. దక్షిణాది రాష్ట్రాలు కలిసికట్టుగా ఉంటే, రాష్ట్ర జిడిపి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, రాజకీయ స్వయంప్రతిపత్తి కలుగుతుంది. కేంద్రంపై ఆధారపడకుండా, రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకునే అవకాశం లభిస్తుంది. దీనితో పాటు, బహుళ అభివృద్ధి సాధ్యం అవుతుంది. విద్య, ఆరోగ్యం, పరిశ్రమల్లో అభివృద్ధి కోసం దక్షిణాది రాష్ట్రాలు కలిసికట్టుగా పని చేసే అవకాశం ఉంటుంది.

రాష్ట్రాల సమాఖ్యే భారతదేశానికి మూలం

దక్షిణాది రాష్ట్రాల్లో ఐక్యత రాకపోతే… రాష్ట్రాలను తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు మోడీ సర్కారు చేస్తున్న ప్లాన్ సక్సెస్ అవుతుదనండంలో సందేహం లేదు. నిజానికి, రాష్ట్రాల సమాఖ్యే భారతదేశానికి మూలం. దీని ప్రకారం, రాష్ట్రాల ప్రాథమిక హక్కులను మోడీ విస్మరించలేరు. కానీ, రాష్ట్రాలను స్థానిక సంస్థలుగా మార్చి, తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని మోడి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందనేది సీఎం రేవంత్ చెబుతున్న మాట. ప్రస్తుతం, విద్యారంగంలో వస్తున్న మార్పులే దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. భవిష్యత్‌లో రాష్ట్ర వర్సిటీల ఉపకులపతులను సైతం కేంద్రమే నిర్ణయించేలా నిబంధనలను మారుస్తున్నారు. అలాగే, నదుల అనుసంధానం విషయంలోనూ రాష్ట్రాల అధికారాలను లాక్కొంటున్నారు.

“వన్ నేషన్ వన్ ఎలక్షన్” అనే మోడీ డ్రామా

కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలను రాజ్యాంగం స్పష్టంగా పేర్కొన్నా.. మోడీ ప్రభుత్వం మాత్రం అన్నీ తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే “వన్ నేషన్ వన్ ఎలక్షన్” అనే డ్రామా తెరమీదకు తెస్తున్నారు. అయితే, దీన్ని ఎన్డీయే అధికారంలో ఉన్న ఏపీ మినహా దక్షిణాది రాష్ర్ట్రాలన్నీ ఇప్పటికే ఖండించాయి. నిజానికి, జాతీయ, రాష్ట్ర స్థాయి ఎన్నికలు వేర్వేరు. తప్పనిసరైతే ‘ఒకే రాష్ట్రం.. ఒకే ఎన్నిక’ నినాదంతో ముందుకెళ్లచ్చు. గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జిల్లా పరిషత్‌, మునిసిపాలిటీ, సహకార ఎన్నికలను నిర్వహించొచ్చు. ఇదే అభిప్రాయాన్ని సీఎం రేవంత్ కేరళా వేదికగా వెల్లడించారు. ప్రజలు, రాజకీయపార్టీలు దీన్ని అర్థం చేసుకోవడం లేదని, మేధావులు దీనిపై ఆలోచన చేయాలని కూడా ఆయన కోరారు.

దక్షిణాదికి అన్యాయంపై రాహుల్ గాంధీ కీలక నిర్ణయం

మోడీ మూడో టర్మ్‌లోనే జమిలి ఎన్నికలను కంప్లీట్ చేయడానికి ఇప్పటికే రంగం సిద్ధమయ్యింది. ఇప్పటికే, దీనికి కేంద్ర కేబినేట్ ఆమోదం కూడా లభించింది. ఇది అమలైతే… అనుమానిస్తున్నట్లే దక్షిణాది రాష్ట్రాలు కష్టాలపాలవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని అడ్డుకోవడం కోసం విపక్ష పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో.. దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయం పైన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సౌత్ స్టేట్స్‌ను ఒక తాటిపైకి తీసుకురాడానికి ఆయా రాష్ట్రాల ఎంపీలతో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే కార్యచరణ

ఈ టీమ్‌తో కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే కార్యచరణను సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం, దక్షిణాదిలోని కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా.. కేరళ, తమిళనాడులో అధికార పార్టీలు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు. ఇక, ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఈ నేపధ్యంలో.. సాధ్యమైనంత వరకూ ఒక్కో రాష్ట్రం నుండి ఒకరు లేదా ఇద్దరు ఎంపీలను ఎంపిక చేసి, వారిని ఈ ప్రత్యేక కమిటీలో చేర్చుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇక, దక్షిణాది అంతా ఐక్యంగా కేంద్రంపై పోరాడితే తప్ప ఈ ఐదు రాష్ట్రాలు సుభిక్షంగా మనగలుగుతాయి. లేదంటే, కష్టాలు, కడగండ్లు తప్పని పరిస్థితి వస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×