రైతుల కోసం వెచ్చించింది రూ.54,280 కోట్లు
ఇవేవో బడ్జెట్ లెక్కలు అనుకునేరు. కాదు.. అక్షరాలా ఈ ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. సాక్షాత్తూ రైతుల కోసం వెచ్చించిన నిధుల లెక్క ఇది. మొత్తం 54 వేల 280 కోట్ల రూపాయలు. అవును రుణమాఫీ కాని వారు, ఈ సీజన్ రైతు భరోసా తప్ప మిగితావన్నీ సాఫీగా సాగుతున్నాయి. 22 లక్షల రైతు కుటుంబాలకు ఇప్పటికే 2 లక్షల రూపాయల దాకా రుణమాఫీ జరిగిపోయింది. మాఫీ కాని వారికి ఈనెల 30న సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు అందించబోతున్నారు. అదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో రైతుబంధును కొండలు, గుట్టలు, రాళ్లు రప్పలున్న భూములు, లే అవుట్లకు కూడా ఇచ్చారు. సో ఆ తప్పులు జరగకుండా, పంటలు పండించే వారికే, ఆ భూములకే రైతు భరోసా ఇచ్చేలా ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. ఆ రిపోర్ట్ రాగానే రైతు భరోసా నిధులు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
27 రోజుల్లోనే రూ. 17,869 కోట్లు రుణమాఫీ
అసలైన రైతు పండగ ఈ ఏడాది కాలంలోనే వచ్చిందన్నది రైతులు చెబుతున్న మాట. ఎందుకంటే 27 రోజుల్లోనే 17,869 కోట్ల రూపాయలను 22 లక్షల రైతు కుటుంబాల ఖాతాల్లో వేయడం అంటే మాటలు కాదు. గత కేసీఆర్ ప్రభుత్వం ఏళ్లకేళ్లు దీన్ని ప్రహసనంగా మార్చేసింది. అయితే రైతులు నష్టపోవద్దన్న ఉద్దేశంతో రేవంత్ ప్రభుత్వం రుణమాఫీని ప్రాధాన్య అంశంగా తీసుకుని మాఫీ చేసింది. టెక్నికల్ కారణాలతో మాఫీ కాని వారికి కూడా చేయబోతున్నారు.
గత ప్రభుత్వం కేవలం రైతుబంధు, రైతుబీమా ఇచ్చి అన్నిటికీ ఇదే మందు అని చెప్పింది. కానీ రైతులకు అసలైన లాభం పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే. తాజాగా సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నారు. పంటల సబ్సిడీ కల్పించారు. అలాగే పంటల బీమా కూడా పునరుద్ధరించారు. ఇవన్నీ గత ప్రభుత్వ హయాంలో చేతులెత్తేసినవే. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం రైతులకు ఏమి చేస్తే మేలు జరుగుతుందో గుర్తించి తొలి ఏడాదిలోనే చారిత్రక నిర్ణయాలు తీసుకుంది.
సంపూర్ణ రుణమాఫీ చేసేందుకు కసరత్తు
రైతులకు పెట్టుబడి సహాయం అందించడం, చేతులు దులుపుకోవడం కాదన్న విషయాన్ని రేవంత్ ప్రభుత్వం గుర్తించింది. అందుకే రైతుకు పెట్టుబడి దగ్గర్నుంచి సబ్సిడీలు అందించడం, పంటల బీమా కల్పించడం, చివరికి పండిన పంటను మద్దతు ధరతో కొనడమే కాదు.. సన్నాలకు బోనస్ లు వంటివి ఇవ్వడం అంటే మాటలు కాదు. ఇవన్నీ చేస్తే రైతు రాజు అవడం ఖాయం. ఈ ఏడాది కాలంలో జరిగిన మార్పులేంటో రైతులందరికీ తెలుసు. ఈ సీజన్ రైతు భరోసా, రుణమాఫీ కాని వారు కొంత అసంతృప్తి ఉన్నా.. ఇంత చేసి ఆ రెండు ప్రభుత్వం చేయకుండా ఉంటుందా అని మంత్రులు వివరిస్తున్నారు. సో ఇచ్చిన హామీలన్నీ నెరవేరి రైతులకు నిజమైన ఆర్థిక స్వాతంత్రం తీసుకొచ్చే దిశగా తొలి ఏడాదిలో గట్టి పునాదే పడింది.
రైతుల ఉచిత విద్యుత్ కు రూ.10,444 కోట్లు చెల్లింపు
అటు వ్యవసాయానికి కీలకంగా మారిన ఉచిత విద్యుత్ పథకానికి ఈ ఏడాది 10 వేల 444 కోట్ల రూపాయలు సబ్సిడీ కింద విద్యుత్ సంస్థలకు చెల్లించింది. అందులోనూ త్రీఫేజ్ నాణ్యమైన కరెంట్ ను ప్రభుత్వం అందించింది. అటు రేవంత్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తొలి 3 నెలల్లోనే రైతుభరోసా నిధులు అకౌంట్లలో వేసింది. రబీ సాగుకు పెట్టుబడి సాయంగా ఎకరానికి 5 వేల చొప్పున 7,625 కోట్లను 69 లక్షల 86వేల 519 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఇక గత కేసీఆర్ సర్కార్ హయాంలో పంటల బీమా అమలు చేయలేదు. కేంద్రం తెచ్చిన ఫసల్ బీమాలో చేరలేదు. రైతులకు మేలైంది తెస్తామని మొత్తానికే పక్కన పెట్టేశారు.
కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం పంటలు నష్టపోతే రైతులకు పరిహారం అందేలా పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించింది. ప్రీమియం చెల్లించేందుకు 1,300 కోట్ల రూపాయలు కేటాయించింది. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులకు ఎకరాకు పది వేల చొప్పున అకౌంట్లలో వేశారు. ఎవరైనా రైతులు ఏ కారణంతో చనిపోయినా 5 లక్షల రూపాయల బీమా పరిహారం బాధిత కుటుంబానికి అందిస్తోంది. రైతు బీమాకు ప్రీమియం కింద 1,455 కోట్ల రూపాయలు చెల్లించింది. గత రబీ సీజన్‌లో దాదాపు 9 లక్షల మంది రైతుల నుంచి 10,547 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని ప్రభుత్వం కొన్నది. వారికి కేవలం మూడు రోజుల్లోనే డబ్బులు చెల్లించింది.
నవంబర్ 26వరకు 71 లక్షల క్వింటాళ్ల సన్నాలు కొనుగోలు
ప్రస్తుత వానాకాలం సీజన్ నుంచి సన్న ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో సన్నాల సాగు విపరీతంగా పెరిగింది. వానాకాలం సీజన్‌లో 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా గతంలో ఎన్నడూ లేనివిధంగా 153 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అది కూడా కాళేశ్వరం నీళ్లు లేకపోయినా రికార్డు స్థాయిలో దిగుబడి సాధ్యమైంది. ఈ రికార్డు ప్రభుత్వం ప్రోత్సహించిన తీరు ప్రకారమే అన్నది నిజం. ఈసారి సన్నాలు పండించిన రైతుల పంట పండింది. రైతులకు బోనస్ డబ్బులు చాలా ప్లస్ అయింది. నవంబర్ 26వ తేదీ వరకు 71 లక్షల క్వింటాళ్లకు పైగా సన్నరకం ధాన్యాన్ని ప్రభుత్వం కొన్నది.
సన్నాలు పండించిన రైతులకు 355 కోట్లకు పైగా చెల్లింపులు చేసింది. ప్రభుత్వం బోనస్ ప్రకటించడంతో బహిరంగ మార్కెట్‌లోనూ ధాన్యం ధర పెరిగింది. మద్దతు ధర కన్నా ఎక్కువ ఇచ్చి ప్రైవేటు వ్యాపారులు కొంటున్నారు. ఎకరాకు దాదాపు 20 క్వింటాళ్లకు పైగా సన్నాల దిగుబడి వచ్చింది. దీంతో బోనస్ ఇస్తుండడంతో ప్రతీ రైతుకు 10వేల రూపాయలకు పైగా అదనపు ఆదాయం సమకూరింది. సో ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. అది కూడా ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలో కలిగిన ప్రయోజనాలే. ఇంకా నాలుగేళ్లలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఈ శాంపిల్ చూస్తే ఎవరికైనా అర్థమయ్యే విషయమే.
మహబూబ్ నగర్ లో రైతు సదస్సు
రైతు సదస్సు అంటే రైతుల్ని తీసుకురావడం, సభ పెట్టడం, పంపించడం మొత్తంగా ఓ పొలిటికల్ సభ మాదిరి.. ఇలాంటివే ఇప్పటిదాకా చూసి ఉంటారు. కానీ ఇప్పుడు మహబూబ్ నగర్ లో జరుగుతున్న రైతు సదస్సు గతం కంటే చాలా విభిన్నం. ఒక పండగ కళ వచ్చింది. ఈ సదస్సుకు వస్తే కొత్త విషయాలు తెలుసుకుని వెళ్లడం, సక్సెస్ అయిన రైతుల స్టోరీలతో ప్రేరణ పొందడం, కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.
ఆధునిక వ్యవసాయపద్ధతులపై అవగాహన
రేవంత్ రెడ్డి ప్రభుత్వం పగ్గాలు చేపట్టి డిసెంబర్ 7తో ఏడాది పూర్తవుతుంది. మరి ఈ ఏడాది కాలంలో రైతుల కోసం నిజంగా ఏం జరిగింది? ప్రయోజనం పొందారా? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వారికి ఉపయోగపడ్డాయా అంటే అవునన్న సమాధానమే వస్తోంది. ఎందుకంటే రుణమాఫీని సాగదీయకుండా తొలి ఏడాదిలోనే చేసేశారు. గతంలో ఎత్తేసిన పంటల సబ్సిడీలను తీసుకొచ్చారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోకుండా పంటల బీమాను పునరుద్ధరించారు. సన్నాలకు బోనస్ ప్రకటించారు. రైతును రాజు చేసేందుకు రైతు కమిషన్ ఏర్పాటు చేశారు. పంట కొన్న మూడు రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు వేశారు. వెంటవెంటనే పంటల కొనుగోళ్లు చేపడుతున్నారు. ఒక్కటేమిటి ఈ ఏడాది కాలంలో రైతులను రాజు చేసేందుకు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.
తొలి ఏడాదిలోనే రుణమాఫీ
తొలి ఏడాదిలో రైతుకోసం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర రైతులందరికీ వివరించేందుకు మహబూబ్ నగర్ లో రైతు సదస్సు ఏర్పాటు చేశారు. ఇది రాజకీయ సభ కాదు. రైతులకు పూర్తి విజ్ఞానం అందించే దిశగా దీన్ని ఏర్పాటు చేయించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని భూత్పూర్ ఇందుకు వేదికైంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సదస్సును ప్రారంభించారు. డిసెంబర్ 30న ముగింపు కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతారు. రైతు సదస్సుకు వచ్చిన రైతులకు సైంటిస్టుల ఆధ్వర్యంలో వివిధ రకాల పంటలు, వ్యవసాయ యాంత్రీకరణపై అవగాహన కల్పిస్తున్నారు. ఏ పరికరం ఎందుకు వాడుతారు. కొత్త రకం విత్తనాలు ఏమున్నాయి. చీడపీడల నివారణ ఎలా ఉంటుంది అనే వాటిపై రైతులకు సమగ్రంగా అవేర్ నెస్ తీసుకొచ్చేలా కార్యక్రమం డిజైన్ చేశారు.
25 శాఖల ఆధ్వర్యంలో 150 స్టాల్స్ ఏర్పాటు
సదస్సుకు హాజరుకాని రైతుల కోసం రాష్ట్రంలోని 560 రైతు వేదికల్లో లైవ్ షోలు ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు ఆదర్శ రైతుల ప్రసంగాలు, ఆధునిక వ్యవసాయ విధానాలపై వివరణలు, వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, ఫిషరీస్ వంటి రంగాలకు చెందిన సక్సెస్ స్టోరీలను ప్రదర్శిస్తున్నారు. ఒక్కో పంటకు సంబంధించి ఒక్కో ఆదర్శ రైతును గుర్తించి వారి అనుభవాలు సదస్సులో చెప్పిస్తున్నారు. మొత్తం 36 ఎకరాల్లో సభా ప్రాంగణం, స్టాల్స్, టెంట్లు ఏర్పాటు చేశారు. 25 డిపార్ట్ మెంట్లు మొత్తం 150 స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. ఇందులో 60 స్టాల్స్ వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించినవి, 30 స్టాళ్లు విత్తనాలు, పురుగు మందులు, ఎరువులకు సంబంధించినవి. 20 స్టాల్స్ హార్టికల్చర్ డిపార్ట్ మెంట్ ఏర్పాటు చేసింది. మిగతా స్టాల్స్‌ను పశుసంవర్ధక శాఖ, బ్యాంకర్లు, మార్కెటింగ్, వ్యవసాయ అనుబంధ శాఖలు పెట్టాయి.
కొత్తగా 148మంది అగ్రికల్చర్, 18 మంది హార్టికల్చర్ ఆఫీసర్లు
రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు, వారితో అధికారులు నేరుగా మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు రైతు నేస్తం పథకాన్ని రేవంత్ ప్రభుత్వం అమలు చేసింది. 2601 రైతు వేదికల్లో వీడియోకాన్ఫరెన్స్ యూనిట్లు ఏర్పాటు చేసింది. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, వివిధ పంట ఉత్పత్తులపై అవగాహన కల్పిస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు 148 మంది అగ్రికల్చర్ ఆఫీసర్లు, 18 మంది హార్టికల్చర్ ఆఫీసర్లను నియమించింది ప్రభుత్వం. ఆయిల్ పామ్ రైతులకు మరిన్ని అదనపు రాయితీలు అందించింది.
ఇక పచ్చి రొట్ట విత్తనాలు 60 శాతం రాయితీ పై రైతులకు సరఫరా చేశారు. సో ఇవన్నీ రైతులకు మేలు చేసే నిర్ణయాలే. విత్తు నాటిన దగ్గర్నుంచి పంట అమ్ముకునేదాకా రైతులకు టెన్షనే ఉంటుంది. ఎందుకంటే ఏ దశలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. పైగా వాతావరణం సహకరించాలి. అన్ని గండాలు దాటి పంట అమ్మాలంటే సవాలక్ష సవాళ్లు, అకౌంట్లలో డబ్బు పడేదాకా టెన్షన్. వీటన్నిటికి చెక్ పెట్టే లక్ష్యంతో తొలి ఏడాదిని రేవంత్ ప్రభుత్వం సక్సెస్ ఫుల్ గా ముగించిందని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. వచ్చే నాలుగేళ్లలో రైతుల దశ తిరగడం ఖాయమన్న నమ్మకం పెరుగుతోందంటున్నారు.