BigTV English

AICC Meeting 2025: మోదీ గడ్డపై కాంగ్రెస్ నయా ప్లాన్.. ఈ దెబ్బతో బీజేపీ ఖతం

AICC Meeting 2025: మోదీ గడ్డపై కాంగ్రెస్ నయా ప్లాన్.. ఈ దెబ్బతో బీజేపీ ఖతం

AICC Meeting 2025: భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. గుజరాత్‌ వేదికగా CWC, AICC విస్తృత స్థాయి సమావేశంలో అగ్రనేతలంతా కలిసి రోడ్ మ్యాప్ రెడీ చేశారు. పార్టీని ప్రక్షాళన చేయడానికి నాయకులంతా సిద్ధమయ్యారు. అధికారానికి దూరమై దశాబ్ధం దాటిపోగా.. పార్టీని గద్దెనెక్కించడానికి కార్యవర్గమంతా కష్టపడాలని దిశానిర్దేశం జరిగింది. ఇప్పుడిక కాంగ్రెస్ సంకల్పం మరింత బలంగా తయారయ్యిందనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్‌లో వచ్చిన కొత్త ఉత్సాహంతో రాబోయే రోజుల్లో రాజకీయం మరింత వేడక్కనుంది. అయితే, ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఏంటీ..? రాహుల్, ఖర్గే చేసిన సంచలన వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉండనుంది..? పకడ్బంధీ రోడ్ మ్యాప్‌తో పార్టీ లక్ష్యాన్ని చేరుకుంటుందా..?


అఖిల భారత కాంగ్రెస్ కమిటీ 84వ జాతీయ సమావేశం

బిజెపి కంచుకోటలో కీలక సమావేశాన్ని నిర్వహించిన భారత జాతీయ కాంగ్రెస్‌ వ్యూహాలను మార్చుతోంది. దశాబ్ధం పైగా కేంద్రంలో అధికారానికి దూరమైన పార్టీని తిరిగి గద్దెనెక్కించడానికి సిద్ధమయ్యింది. ప్రధాని మోడీ సొంత గడ్డ గుజరాత్ వేదికగా భారత జాతీయ కాంగ్రెస్ CWC, AICC విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకులంతా ఏప్రిల్ 8న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సమావేశమయ్యారు. గుజరాత్ రాష్ట్రంలో గత 30 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. అయితే, కాంగ్రెస్ కొత్త ప్లాన్ అక్కడి నుండే మొదలుపెట్టాలనే ఉద్దేశంతో.. ఏప్రిల్ 8, 9 తేదీల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ 84వ జాతీయ సమావేశంలో తదుపరి రాజకీయ వ్యూహాలకు రోడ్ మ్యాప్ రెడీ చేశారు.


పటేల్, నెహ్రూలకు అసలు వారసులం మేమేనన్న కాంగ్రెస్

గత 64 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ విస్త్రత స్థాయి సమావేశం గుజరాత్‌లో జరగడం ఇదే మొదటిసారి. సర్థార్ వల్లభాయ్ పటేల్‌ను ఓన్ చేసుకుంటున్న భారతీయ జనతా పార్టీ అసలు స్వరూపం వేరంటూ కాంగ్రెస్ అగ్రనేతలంతా ఈ వేదికపై విరుచుకుపడ్డారు. మహాత్మా గాంధీతో పాటు పటేల్, నెహ్రూలకు అసలు వారసులం మేమేనంటూ కాంగ్రెస్ మరోసారి బల్లగుద్ది చెప్పింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కొంత మెరుగైన ప్రదర్శన చేసిన కాంగ్రెస్.. తర్వాత జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో పరాజయాల నుండి కోలుకోవడానికి ఇదొక కీలక వేదికగా మారింది.

కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు..

ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సిడబ్ల్యుసి సమావేశంలో.. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులతో సహా 169 మంది నేతలు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీలను సంస్థాగత కేంద్రంగా ఎలా మార్చాలనే దానిపై ఈ వేదిక కీలకంగా చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే, రణదీప్ సుర్జేవాలా నేతృత్వంలోని 15 మంది సభ్యుల ముసాయిదా కమిటీ ఈ సమావేశానికి సంబంధించిన తీర్మానాలను ఖరారు చేశాయి. వీటిలో.. మొత్తం రాజకీయ, సంస్థాగత పరిస్థితులపై ఒక ముసాయిదా తయారుచేయాగా.. మరోకటి, ప్రత్యేకంగా గుజరాత్‌పై తీర్మానం చేశారు. ఇక, ఈ తాజా సమావేశంలో భాగంగా.. పార్టీ భవిష్యత్తు ప్రణాళికలు, కీలకమైన జాతీయ విషయాలు, అంతర్గతంగా సంస్థాపరమైన అంశాలు, రాబోయే ఎన్నికల వ్యూహాలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక చర్చలు చేసింది.

మెుదటి రోజు సర్దార్ పటేల్ స్మారక చిహ్నం వద్ద CWC మీట్

ఇందులో, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, CPP చైర్‌పర్సన్ సోనియా గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ.. ఇతర ప్రముఖ కాంగ్రెస్ నాయకులంతా పాల్గొన్నారు. ఈ సమావేశాల మొదటి రోజున సర్దార్ పటేల్ స్మారక చిహ్నం వద్ద కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగ్గా.. ఇక్కడ సీనియర్ నాయకులు సంస్థాగత పునరుద్ధరణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. తర్వాత ఏప్రిల్ 9న.. సబర్మతి నది ఒడ్డున ప్రతినిధుల సమావేశం జరిగింది. ఇక్కడ 17వందల 25 ​​మంది AICC సభ్యులతో సహా దాదాపు 2 వేల మంది ప్రతినిధులు పార్టీ రూపొందించిన కొత్త రోడ్‌మ్యాప్‌పై ఆమోద ముద్ర వేశారు.

ఢిల్లీలో మూడు బ్యా్చ్‌లుగా 862 జిల్లా అధ్యక్షులతో సమావేశం

ఈ సమావేశంలో నేతలకు భవిష్యత్ ప్రణాళికలపై స్పష్టత ఇచ్చారు అగ్రనేతలు. ఇందులో సైద్ధాంతిక శిక్షణ, సోషల్ ఇంజనీరింగ్, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను ఎదుర్కోవడం, పార్టీ అనుకూల కథనాన్ని రూపొందించడం.. ఎన్నికలు, నిధులు, మీడియా, సోషల్ మీడియా, పార్టీ ఆస్తులు, వాటి నిర్వహణకు సంబంధించిన అంశాలను కూడా చర్చించారు. ఇప్పటికే, కేంద్ర నాయకత్వం ఢిల్లీలో మూడు బ్యాచ్‌లుగా 862 జిల్లా అధ్యక్షులతో సమావేశం అయ్యింది. రాబోయే రోజుల్లో వారి అధికారాన్ని ఎలా నిర్వహించాలనే దానిపై కీలక చర్చలు జరిగాయి.

పార్టీలో వికేంద్రీకరణకు పూర్తి మద్దతు ఇచ్చిన అగ్రనేతలు

ఇక, తాజా సమావేశంలో ఖర్గే, రాహుల్ గాంధీలు పార్టీలో వికేంద్రీకరణకు పూర్తి మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే, గ్రౌండ్ లెవల్లో ఆఫీస్ బేరర్ల నియామకం, తొలగింపులపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక, రాష్ట్ర స్థాయి నాయకులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకుండా హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు సమాచారం.

జిల్లా అధ్యక్షులకు ఫుల్ పవర్స్

అభ్యర్థుల ఎంపికలోనూ కచ్ఛితమైన దిశానిర్దేశాలు జరిగాయి. జిల్లా అధ్యక్షులకు ఫుల్ పవర్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక నుంచి, కేంద్ర నాయకత్వం, జిల్లా అధ్యక్షుల మధ్య ప్రత్యక్ష, క్రమబద్ధమైన సంభాషణల కోసం ఒక కొత్త యంత్రాంగం కూడా ఏర్పాటు చేసారు. అలాగే, పార్టీ జిల్లా అధ్యక్షులు ఒక నిర్దిష్ట కాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలనే నిర్ణయం కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఏంటీ అక్క ఇంత పని చేసావు.. అరెస్ట్‌కు భయపడి.. మంత్రితో సీక్రెట్ మంతనాలు

బిజెపి మత విభజనను సృష్టిస్తుందని మండిపడ్డ ఖర్గే

2025వ సంవత్సరాన్ని సంస్థాగత పునరుద్ధరణ సంవత్సరంగా గుర్తించిన కాంగ్రెస్ పార్టీ.. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినిల్లు.. ప్రధాన ప్రత్యర్థి నరేంద్ర మోడీ సొంత గడ్డ అయిన గుజరాత్‌పై రాజకీయంగా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. CWC సమావేశంలో ప్రారంభ ప్రసంగం చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. భారతీయ జనతా పార్టీ‌ని తీవ్రంగా విమర్శించారు. “దేశంలో ప్రాథమిక సమస్యల నుండి దృష్టిని మళ్లించడానికి బిజెపి మత విభజనను సృష్టిస్తుంది” అని మండిపడ్డారు. జాతీయ నాయకులైన పటేల్, నెహ్రూలపై BJP-RSS ప్రణాళికాబద్ధమైన కుట్ర చేస్తుందని ఖర్గే ఆరోపించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సిద్ధాంతం RSS భావజాలానికి పూర్తిగా భిన్నంగా ఉందనీ.. స్వాతంత్ర్య ఉద్యమంలో ఎలాంటి పాత్రా లేని ఒక మతవాద పార్టీ ఇప్పుడు పటేల్ వారసత్వాన్ని పొందడానికి ప్రయత్నించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

వీళ్లద్దరూ ఒకే నాణేనికి రెండు వైపులా ఉన్నారన్న ఖర్గే

సర్దార్ వల్లభాయ్ పటేల్, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మధ్య సంబంధం గురించి బిజెపి తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తుందనీ.. వీరిద్దరి మధ్య విభేదాలున్నట్లు ప్రచారం చేస్తున్నారని ఖర్గే ఆరోపించారు. “వాస్తవంలో వీళ్లద్దరూ ఒకే నాణేనికి రెండు వైపులా ఉన్నారు” అని ఖర్గే వ్యాఖ్యానించారు. 140 సంవత్సరాల సుదీర్ఘ సేవ, పోరాట పటిమ గల కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని ఖర్గే అన్నారు. BJP-RSSని లక్ష్యంగా చేసుకుని, భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో వారికి ఎటువంటి సహకారం లేదని అనడంపై ఇప్పుడు రాజకీయ వేడి రాజుకుంది.

ఓబీసీ ఓటర్లు కాంగ్రెస్‌కు దూరమయ్యారన్న రాహూల్ గాంధీ

ఇక, కాంగ్రెస్‌ వర్కంగ్‌ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడైన రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకూ దళిత, ముస్లిం, బ్రాహ్మణ ఓట్ల కోసం పార్టీ కొట్టుమిట్టాడుతుందనీ, అందుకే.. ఓబీసీ ఓటర్లు కాంగ్రెస్‌కు దూరమయ్యారని అన్నారు. దీనికి ఉదాహరణగా ఉత్తరప్రదేశ్‌‌ని ప్రస్తావించారు. 1991 నుంచి యూపీలో అధికారానికి కాంగ్రెస్‌ దూరంగా ఉందనీ.. అక్కడ, కాంగ్రెస్‌ పార్టీ ముస్లింలకు మాత్రమే మద్దతిస్తుందనే ప్రచారం ప్రత్యర్థులు చేస్తున్నారనీ.. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.

Related News

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

Big Stories

×