Wanaparthy congress: ఒక్క కుర్చీ.. పోటీలో అరడజను మంది. ఇది వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠం కోసం నెలకొన్న పోటీ. వనపర్తి ఉమ్మడి పాలమూరు జిల్లాలో అతి చిన్న జిల్లా కానీ ఇప్పుడు ఆ జిల్లా కాంగ్రెస్ డీసీసీ పదవి కోసం ఓ పెద్ద పోటీ నెలకొంది. ఇప్పటికే నాయకుల మధ్య అక్కడ ఉన్న వర్గపోరుకు తోడు డీసీసీ ఎంపిక మళ్లీ పొలిటికల్ హీట్ ను పెంచేస్తోంది. తన మనిషే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలని సిట్టింగ్ ఎమ్మెల్యే చక్రం తిప్పుతుంటే… తన వారి కోసం మాజీ మంత్రి పావులు కదుపుతున్నారట.
వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష సీటుకు భారీ డిమాండ్
వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష సీటుకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఏకంగా అరడజనుకుపైగా ఆశావహులు ఆ కుర్చీ కోసం పట్టుబడుతున్నారు. మంత్రుల స్థాయి నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వరకు తమ అనుచరుడినే ఆ కుర్చీపై కూర్చోబెట్టడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. గాంధీభవన్ వరకు పైరవీలు నడుస్తున్నాయి అంటే ఆ సీటుకు ఏ మాత్రం డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇద్దరు మంత్రుల నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలు కలిగి ఉన్న వనపర్తి జిల్లా డీసీసీ పీఠానికి మునుపెన్నడూ లేనంతగా డిమాండ్ అయితే వచ్చింది. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, ప్లానింగ్ కమిటీ వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి నెక్స్ట్ లెవల్ లో పావులు కదుపుతున్నారట. ఆ పోస్టు మా వర్గం నేతకే వస్తుందని ఎవరికి వారు ధీమాను వ్యక్తం చేస్తున్నారట.
15 మండలాలతో ఏర్పాటైన చిన్న జిల్లా వనపర్తి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 15 మండలాలతో ఏర్పాటైన చిన్న జిల్లా వనపర్తి. వనపర్తి జిల్లా పరిధిలో పూర్తి స్థాయి వనపర్తి నియోజక వర్గంతో పాటు, మక్తల్ నియోజక వర్గంలోని ఆత్మకూరు, అమరచింత మండలాలు.. కొల్లాపూర్ నియోజక వర్గంలోని పానగల్, చిన్నంబావి, వీపనగండ్ల మండలాలు.. దేవరకద్ర నియోజక వర్గంలోని కొత్తకోట, మదనాపురం మండలాలు వనపర్తి జిల్లాలో ఉన్నాయి. వనపర్తి ఎమ్మెల్యేగా మేఘారెడ్డి , దేవరకద్ర ఎమ్మెల్యేగా మధుసూదన్ రెడ్డి , మక్తల్ ఎమ్మెల్యేగా మంత్రి వాకిటి శ్రీహరి , కొల్లాపూర్ ఎమ్మెల్యేగా మంత్రి జూపల్లి , వనపర్తి కే చెందిన మాజీ మంత్రి ప్రస్తుత ప్లానింగ్ కమిటి వైస్ చైర్మన్ చిన్నారెడ్డి లు కొనసాగుతున్నారు. వీరంతా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలే. దాంతో వనపర్తి డీసీసీ ఎంపిక విషయంలో వీరందరూ ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంది. కాని వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష ఎంపిక విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మేఘారెడ్డి , ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిలు తమ వర్గీయులకు పదవి ఇప్పించుకునేందుకు పోటీ పడుతున్నట్లు కనపిస్తోంది.
ప్రస్తుత అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ యాదవ్
ప్రస్తుతం వనపర్తి జిల్లా డీసీసీ అధ్యక్షులుగా రాజేంద్ర ప్రసాద్ యాదవ్ కొనసాగుతున్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కొత్త డీసీసీ నియామకం ఉంటుందనే సమాచారంతో అరడజను మందికి పైగా ఆశావహులు లాబీయింగ్ చేస్తున్నరట. వనపర్తి పట్టణానికి చెందిన లక్కాకుల సతీష్, వెంకటేష్, ప్రముఖ న్యాయవాది కిరణ్, ఖిల్లాఘనపురం మండలానికి చెందిన సాయిచరణ్, గోపాల్ పేట మండలానికి చెందిన సత్య శీలా రెడ్డి, వనపర్తి మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి లు డీసీసీ పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం డీసీసీగా కొనసాగుతున్న రాజేంద్ర ప్రసాద్ మరో మారు తనకే అవకాశం వస్తుందనే ధీమాలో ఉన్నారట. ఇందులో సతీష్, వెంకటేష్, సాయిచరణ్, సత్యశీలా రెడ్డి, కిచ్చారెడ్డిలు ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్గం కాగా.. రాజేంద్రప్రసాద్, కిరణ్ లకు చిన్నారెడ్డి మనుషులుగా పేరుంది.
పీసీసీ చీఫ్‌ను కలిసిన మేఘారెడ్డి
ఈ పీఠం దక్కించుకోవడం కోసం ఎమ్మెల్యే మేఘారెడ్డి చిన్నారెడ్డి కంటే ఒక్కడుగు ముందే ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి పలువురి పేర్లతో పాటు సామాజిక సమీకరణాల అంశాలను వివరించారట. మరో మూడు నాలుగు రోజుల్లో ఎమ్మెల్యే మేఘారెడ్డి సూచించిన వ్యక్తి పేరుతో కొత్త డీసీసీ ప్రకటన ఉండబోతోందని వనపర్తి కాంగ్రేస్ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. స్థానిక సంస్థల ముందు నూతనోత్సాహంతో ముందుకు పోయేలా పార్టీ జిల్లా రథసారధి రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే టైంలో తన వర్గీయులకు డీసీసీ పదవి ఇప్పించుకునేందుకు చిన్నారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం చిన్నారెడ్డి వర్గీయుడైన రాజేంద్ర ప్రసాద్ డీసీసీగా కొనసాగుతున్నారు కాబట్టి , కొత్త బాస్డి గా ఎమ్మెల్యే మేఘారెడ్డి మనిషే ఉంటారని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
Also Read: భద్రాచలంలో టెన్షన్ టెన్షన్.. భూ కబ్జాదారుల్ని అడ్డుకున్నందుకు ఈవోపై దాడి
ఓవరాల్‌గా వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జిల్లా స్థాయి అధ్యక్ష పదవులకు సహజంగానే ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. అయితే కాంగ్రెస్ లో సామాజిక వర్గాల ప్రాతిపదికన పదవుల కేటాయింపు జరుగుతుంది. వనపర్తి జిల్లాలో ఏ సామాజిక వర్గం బలంగా ఉందో, లేదా ఏ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలని అధిష్టానం భావిస్తుందో దానిపై కూడా పదవి ఎంపిక ఆధారపడి ఉంటుంది. మరోవైపు యువతను ప్రోత్సహించాలనే పార్టీ విధానం నేపథ్యంలో, కొంతమంది యువ నాయకులు కూడా జిల్లా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నవారిలో ఉన్నారు. మొత్తంగా చిన్న జిల్లా అయిన వనపర్తి డీసీసీ పీఠం కోసం పెద్ద పోటే నెలకొందని స్థానికంగా చర్చించుకుంటున్నారు. డీసీసీ పీఠాన్ని ఎవరి వర్గీయుడు దక్కించుకుంటారో ఎవరు పై చేయి సాధిస్తారో వేచి చూడాల్సిందే.
Story By Venkatesh, Bigtv