Bhadrachalam EO: దేవాలయ భూముల్లో దొంగలుపడ్డారు. ఏకంగా దేవుడి భూమిని దోచుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకున్న ఆలయ ఈవోపై దాడి చేశారు. ఇదంతా జరిగింది ఎక్కడో కాదు.. భద్రాద్రి రామయ్య పాదాలచెంతే. అల్లూరి జిల్లా పురుషోత్తపట్నంలో రామాలయంకు చెందిన భూములు కబ్జాకు గురవుతున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న ఈవో రమాదేవి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆక్రమణకు గురవుతున్న భూముల్ని భూకబ్జాదారుల నుంచి కాపాడేందుకు ప్రయత్నించారు. ఇదే టైంలో కబ్జాదారులు ఈవో రమాదేవిపై దాడి చేశారు. దాడిలో స్పృహ కోల్పోయిన ఈవోను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
మహిళ ఈవోపై గ్రామస్థులు దాడి
గత కొద్ది రోజులుగా ఆలయ భూమి కబ్జా వ్యవహారంలో దేవాదాయశాఖ, ఆక్రమణదారుల మధ్య వివాదం కొనసాగుతుంది. కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టే ప్రయత్నం చేయగా వాటిని నిర్మాణాలు జరగకుండా దేవాదాయ శాఖ సిబ్బంది అడ్డుకుంది. ఇదే టైంలో ఎంట్రీ ఇచ్చిన అధికారుల్ని గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. గ్రామంలోకి రావద్దంటూ నినాదాలు చేశారు. తోపులాట కూడా జరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ఎటపాక భద్రాద్రి రామయ్య భూములు..
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో భద్రాచలం రామాలయానికి చెందిన 889 ఎకరాల భూమి ఉంది. చాలా కాలంగా ఇది ఆక్రమణలకు గురి అయింది. ఈ వ్యవహారంలో ఏపీ హైకోర్టు దేవస్థానానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆలయ భూములకు సంబంధించి దేవస్థానానికి పట్టాదారు పాసు పుస్తకాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో నిర్మాణాలు చేపట్టవద్దని అడ్డుకునేందుకు వెళ్లిన ఈవోతో పాటు ఆలయ సిబ్బందిపై గ్రామస్థులు కర్రలతో దాడి చేశారు.
దేవాలయ భూములు ఆక్రమిస్తే పీడీ యాక్ట్: కొండా సురేఖ
భద్రాచలం ఈవో రమాదేవిపై జరిగిన దాడి ఘటనపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఈవోలపై దాడి చేస్తే ఊరుకునేది లేదన్నారు. దేవాలయ భూములను కబ్జా చేస్తే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఏపీ సీఎం చంద్రబాబును కొండా సురేఖ కోరారు. ఇటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఖండించారు. దేవస్థాన భూముల ఆక్రమణలపై అడిగేందుకు వెళితే దాడి చేయడం సరికాదన్నారు. దాడి చేసిన వారిపై పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
Also Read: అసెంబ్లీలో కాకుండా ప్రెస్ క్లబ్‌లో.. ఆన్ రికార్డ్ డిబేట్స్ అంటే KTRకి ఎందుకంత భయం
ఈవో రమాదేవిపై దాడి హేయం..
భద్రాచల ఆలయ ఈవో రమాదేవిపై భూ ఆక్రమణదారుల దాడిని తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచి డిప్యూటీ కలెక్టర్ల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు చంద్రమోహన్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ, ఆలయ భూములకు రక్షణగా విధులు నిర్వర్తించే అధికారులకు ప్రభుత్వం భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.