Montha Toofan: తుఫాన్.. ఈ పదం వింటే చాలు.. తీర ప్రాంత ప్రజలు వణికిపోతారు. అది దూసుకొస్తుందని తెలిస్తే చాలు.. సముద్రానికి దూరంగా వెళ్లిపోతారు. సముద్రంలో ఎక్కడో కంటికి కనిపించనంత దూరంలో ఏర్పడే సుడిగుండం.. భూమిపై తీరప్రాంతాల్లో ఉండే వాళ్లందరికీ దడ పుట్టిస్తుంది. తీరం దాటే దాకా.. ప్రతి ఒక్కరి గుండెల్లో డేంజర్ అలారమ్ మోగిస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాను కూడా అలాంటిదే! అసలు.. ఈ తుఫాన్లు ఎలా ఏర్పడతాయ్? తీరాన్ని తాకే సమయంలో ఏం జరుగుతుంది?
కొన్ని తుఫాన్లు వర్షాలకే పరిమితమవుతాయ్.. ఇంకొన్న తుఫాన్లు అల్లకల్లోలం సృష్టిస్తాయ్. ఒక్కోసారి తుఫాను సృష్టించే విలయం, దాని వల్ల జరిగే విధ్వంసం.. ఊహకు కూడా అందదు. అందుకే.. తుఫాన్లంటే తీరప్రాంత ప్రజలు ఇంతలా వణికిపోతారు. తుఫాను తాలూకూ నష్టం ఏవిధంగా ఉంటుందోనని నాలుగైదురోజుల పాటు భయంభయంగా గడుపుతారు. అసలు.. ఈ తుఫాన్లు ఎందుకొస్తాయ్? ఎలా వస్తాయనేది తెలియాలంటే.. ముందుగా అల్పపీడనం, వాయుగుండాల గురించి తెలుసుకోవాలి.
ఎక్కడైతే ఎక్కువ గాలులు వీస్తాయో ఆ ప్రాంతాన్ని అధిక పీడనం అంటారు. అదే.. తక్కువ గాలులు ఉంటే దానిని అల్పపీడనం అంటారు. ఈ రెండు పీడనాలు.. గాలుల కదలికల వల్లే ఏర్పడతాయ్. గాలుల్లోనూ.. రెండు రకాలుంటాయ్. అవే.. వేడి గాలి, చల్లగాలి. వేడిగాలి తేలికగా ఉండి.. పైకి చేరుతుంది. చల్లగాలి నెమ్మదిగా కిందకి దిగుతుంది. భూ వాతావరణాన్ని సమీపించేకొద్దీ.. ఈ గాలి చల్లబడుతుంది. గాల్లో ఉంటే.. ఆవిరి ఘనీభవించి మంచు స్ఫటికాలుగా ఏర్పడతాయ్. దట్టమైన మేఘాలు ఏర్పడతాయ్. కొన్ని చోట్ల సుడులు తిరుగుతూ.. మరింత గాలిని గ్రహిస్తాయ్. అలా.. ఈ అల్పపీడనం మరింత తీవ్రమైతే.. అది వాయుగుండంగా మారుతుంది. ఈ వాయుగుండం మరింత బలపడితే.. అప్పుడది తుఫానుగా ఏర్పడుతుంది. సముద్రంలో వేడెక్కిన నీటి ఆవిరిని.. తుఫాన్లు గ్రహిస్తాయ్. సముద్రంలో ఏర్పడే సుడుల వల్ల చల్లబడి.. దట్టమైన మేఘాలుగా ఏర్పడి.. తుఫాన్‌తో కలిసి ప్రయాణిస్తాయ్.
తుఫాన్ అంటే బలమైన గాలులు, దట్టంగా కమ్ముకున్న మేఘాలు. ఇవి.. తీరాన్ని సమీపించేకొద్దీ సముద్రంలో అలజడి పెరుగుతుంది. తుఫాన్ వేగానికి.. సముద్రంలోని నీరు.. భారీ అలల రూపంలో భూమి పైకి చేరుతుంది. దీనినే.. ఉప్పెన అంటారు. ఈ సమయంలోనే.. సముద్రంలో కొన్ని మీటర్ల వరకు ముందుకొస్తుంది. వీటి ద్వారా ఎక్కువ నష్టం జరగకముందే.. అధికారులు తీర ప్రాంతాలను ఖాళీ చేయిస్తారు. భారత వాతావరణ శాఖ ప్రకారం.. తుఫాన్లని.. గాలి వేగం ఆధారంగా విభజిస్తారు. గాలివేగం గంటకు 60 నుంచి 88 కిలోమీటర్ల లోపు ఉంటే.. దానిని తుఫాన్‌గా పిలుస్తారు. గాలి వేగం గంటకు 89 నుంచి 117 కిలోమీటర్లు ఉంటే.. తీవ్ర తుఫాన్ అంటారు. 118 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే.. దానిని అతి తీవ్ర తుఫాన్‌గా, 166 నుంచి 220 కిలోమీటర్ల వేగం ఉంటే.. పెను తుఫానుగా పిలుస్తారు. గంటకు 220 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే గనక.. దానిని సూపర్ సైక్లోన్‌గా ప్రకటిస్తారు. గాలి వేగం పెరిగేకొద్దీ.. తుఫాన్‌తో ముడిపడి ఉన్న ప్రమాదం స్థాయి, నాశనం పరిధి పెరుగుతాయ్. పెను తుఫాన్లు, సూపర్ సైక్లోన్‌లు అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి భారీ విధ్వంసం సృష్టిస్తాయి. వేగంగా వీచే గాలుల వల్ల భారీ వర్షాలు కురుస్తాయి. తీర ప్రాంతాల్లో అలల ఉద్ధృతి కూడా పెరుగుతుంది.
తుఫాన్లను ప్రాంతాలు, వాటి ప్రభావం ఆధారంగా.. వివిధ రకాలుగా పిలుస్తారు. ఆగ్నేయాసియా ప్రాంతాల్లో సైక్లోన్ అని, ఈశాన్య పసిఫిక్, అట్లాంటిక్ ప్రాంతాల్లో హరికేన్లు అని అంటారు. హరికేన్‌లు, టైపూన్‌ల మధ్య తేడాని గాలి వేగాన్ని బట్టి అంచనా వేస్తారు. గాలి వేగం గంటకు 100 కిలోమీటర్లు మించితే అది హరికేన్. గాలి వేగం అంతకన్నా తక్కువగా ఉంటే టైపూన్ అంటారు. మన బంగాళాఖాతం, హిందూ మహా సముద్రాల్లో ఎక్కువగా హరికేన్లే ఏర్పడతాయి. సముద్రంలో సుడుల రూపంలో ఉండే తుఫాన్.. భూవాతావరణంలోకి ప్రవేశించడాన్నే.. తీరాన్ని తాకడం అంటారు. తుఫాన్ తీరాన్ని తాకగానే.. సుడుల రూపంలో ఉన్న మేఘాలు చెల్లాచెదురై.. భారీ వర్షాలు కురుస్తాయి. సుడులకు కారణమైన గాలులు.. తీరం వెంబడి గంటకు 60 నుంచి 250 కిలోమీటర్ల కంటే వేగంగా ప్రయాణించే అవకాశాలుంటాయి.
సముద్రంలో అల్పపీడనంగా మొదలైనప్పటి నుంచి.. అది తుఫాన్, తీవ్ర తుఫాన్‌గా మారి తీరం దాటే దాకా.. ఎన్నో దశలుంటాయ్. కొన్ని వాయుగుండాలకే పరిమితమైతే.. ఇంకొన్ని మరింత బలపడి తీరం దాకా వస్తాయ్. అయితే.. ఈ తుఫాన్ గమనంలో కీలకమైనది.. దాని కేంద్ర స్థానమే. అసలేంటీ.. ఈ సైక్లోన్ ఐ.? సైక్లోన్ వాల్స్, సైక్లోన్ రింగ్.. తుఫాను ప్రభావాన్ని ఎలా డిసైడ్ చేస్తాయ్?
తుఫాన్ ఎలాంటిదైనా సరే.. దాని గమనంలో కీలకమైనది దాని సెంటర్ పాయింటే. తుఫాన్ తీవ్రతకు అనుగుణంగా.. దాని విస్తృతి పెరుగుతుంది. తుఫాన్ మధ్య భాగంలో.. అత్యంత వేగంతో సుడులు తిరిగే గాలులను.. తుఫాన్ కేంద్రంగా పిలుస్తారు. దానినే.. తుఫాను కన్నుగా పిలుస్తారు. ఈ కేంద్రంలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. గాలి నెమ్మదిగా వీస్తుంది. కొన్ని సార్లు అక్కడ గాలే ఉండకపోవచ్చు. వర్షం కూడా కురవదు. తుఫాను కన్ను చుట్టూ ఉండే ప్రాంతాన్ని.. ఐ వాల్‌గా పిలుస్తారు. ఈ ప్రాంతంలో.. అధిక వేగంతో గాలులు వీస్తాయి. భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, మేఘాలున్నీ.. తుఫాను కన్ను చుట్టూ ప్రభావం చూపిస్తాయి. వాయుగుండం బలపడిన తర్వాతే.. తుఫాను కన్ను స్పష్టంగా కనిపిస్తుంది. తీవ్ర తుఫాన్ అయితే.. ఇది మరింత పెద్దదిగా కనిపిస్తుంది. తుఫాను కేంద్ర స్థానం విస్తృతి.. 10 నుంచి 20 కిలోమీటర్ల దాకా ఉండొచ్చు. తుఫాను కన్ను గోడల విస్తృతి.. కేంద్ర స్థానం నుంచి 250 కిలోమీటర్ల దాకా ఉండే అవకాశం ఉంది. 1979 మే నెలలో ఆంధ్రప్రదేశ్‌లో తీరం తాకిన తుఫాన్ కన్ను గోడల విస్తృతి 425 కిలోమీటర్లుగా ఏర్పడింది. భారత తీరంలో ఇప్పటివరకు ఇదే రికార్డు. కొన్నేళ్ల క్రితం విశాఖలో బీభత్సం సృష్టించిన హుదుద్ తుఫాన్ విస్తృతి 66 కిలోమీటర్లు.
తుఫాను కేంద్రంలో వేడి గాలి కిందివైపు పయనిస్తుంది. ఇక్కడుండే గాలులు 18 కిలోమీటర్ల వరకు పైకి లేస్తాయి. గాలి వేగం.. గంటకు 200 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ ప్రాంతంలో.. కుంభవృష్టి వర్షం కురుస్తుంది. ఐ వాల్‌పై ఏర్పడే మేఘాలు పరిసర ప్రాంతాల్లోకి కూడా విస్తరించి.. వర్షాలు కురిపిస్తాయ్. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రాల్లో.. ఈ వర్షపాతం పరిధి 1200 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అందువల్లే.. తుఫాను కేంద్ర ప్రాంతంతో పాటు పరిసరాల్లోనూ విపరీతమైన వర్షం కురుస్తుంటుంది. ఈ తుఫానులు.. రోజుకు 300 నుంచి 500 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంటాయ్. అలా భూమి వైపు దూసుకొచ్చే తుఫాన్.. తీరం తాకిన తర్వాత.. మళ్లీ సముద్రంలోకి వెళ్లడం చాలా అరుదు. సాధారణంగా తుఫాన్లు తీరాన్ని తాకితే బలహీనపడతాయి. కానీ.. 2022 మే నెలలో ఏర్పడిన అసని తుఫాన్.. కృష్ణా జిల్లాలో తీరాన్ని దాటి.. వాయుగుండంగా బలహీనపడి తీరం వెంట ప్రయాణిస్తూ మళ్లీ కాకినాడ దగ్గర సముద్రంలోకి వెళ్లింది.
తుఫాన్ తీరానికి చేరువయ్యేకొద్దీ భారీ వర్షాలు, ప్రచండ గాలులు వీస్తాయి. తుఫాను తీరం తాకినప్పుడు ప్రభావం ఉండదు. ఆ తర్వాత.. కాసేపటికే విలయం మొదలవుతుంది. తీరం దాటినప్పుడు ఏ ప్రభావం లేదని అలసత్వం వహిస్తే.. ఆ తర్వాత భారీ నష్టాన్ని చూడాల్సి వస్తుంది. ప్రపంచంలో పది శాతం ట్రాపికల్ సైక్లోన్‌లు.. భారత తీరాన్ని తాకుతుంటాయ్. వీటిలో చాలా వరకు బంగాళాఖాతంలో ఏర్పడి.. తూర్పు తీరం దిశగా కదులుతుంటాయ్. ఇక.. ప్రచండ వేగంతో పశ్చిమ తీరాన్ని తాకే తుఫాన్లు అరుదుగా వస్తాయి. అరేబియా సముద్రంతో పోలిస్తే.. బంగాళాఖాతంలో తుఫాన్లు నాలుగు రెట్లు ఎక్కువగా వస్తుంటాయ్. గాలుల వేగం గంటకు 31 కిలోమీటర్ల కంటే తక్కువ ఉంటే.. దానిని అల్పపీడనం అంటారు. తుఫానుగా గుర్తించాలంటే.. గాలుల వేగం 61 కిలోమీటర్ల కంటే ఎక్కువే ఉండాలి. సూపర్ సైక్లోన్ అంటే గంటకు 221 కంటే ఎక్కువ వేగంతో గాలులు వీయాలి.
సాధారణంగా తుపానులు.. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే సముద్ర జలాల్లో పుట్టి.. క్రమంగా బలపడుతుంటాయ్. 27 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండే.. సువిశాల సముద్ర ఉపరితలం, భూభ్రమణం వల్ల జనించే కొరియోలిస్ బలాలు, నిట్టనిలువుగా వీచే గాలుల్లో తేడాలు, అల్పపీడన ప్రాంతాలు, అప్పటికే నెమ్మదిగా సుడులు తిరుగుతున్న గాలుల లాంటి అంశాలు.. తుఫాన్లు బలపడేందుకు తోడ్పడతాయ్. 20 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని దాటే తుఫాన్లు మలుపు తిరిగి మరింత విధ్వంసకరంగా మారతాయ్. వాతావరణంలోని పైపొరల్లో బలంగా దూసుకెళ్లే పవనాలు తుఫాన్ల దిశను ప్రభావితం చేస్తాయి. 1891 నుంచి 1990 మధ్య తూర్పు, పశ్చిమ తీరాల్లోని తుపాన్లను ఐఎండీ నిపుణులు విశ్లేషించారు. దాంతో.. 262 తుపాన్లు తూర్పు తీరంలోని 50 కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎక్కువగా తాకినట్లు తేలింది. వాటిలో.. 92 తీవ్రమైన తుపాన్లు సంభవించాయ్. అదే సమయంలో.. పశ్చిమ తీరంలో కేవలం 33 తుపాన్లు మాత్రమే వచ్చాయి. వీటిలో 19 మాత్రమే తీవ్రమైనవి.
సాధారణంగా.. ఈ తుఫాన్లు మే నుంచి జూన్ మధ్యలో, అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో వస్తుంటాయ్. తూర్పు తీరాన్ని తాకే తుఫాన్లు.. ఆగ్నేయ బంగాళాఖాతంలో పుడుతాయ్. ఒక్కోసారి.. వాయవ్య పసిఫిక్‌లో పుట్టి.. దక్షిణ చైనా సముద్రం మీదుగా బంగాళాఖాతంలోకి వస్తాయి. అందువల్ల.. బంగాళాఖాతంలో వచ్చే తుఫాన్లు ఎక్కువగా ఉంటాయ్. అరేబియా సముద్రంలో వచ్చే తుఫాన్లు.. లక్షద్వీప్‌లో ఏర్పడతాయ్. అవి.. ద్వీపకల్పాన్ని దాటుకొని వచ్చే క్రమంలో బలహీనపడతాయ్. అరేబియా సముద్రంతో పోలిస్తే.. బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం కూడా.. తుఫాన్ల సంఖ్య పెరిగేందుకు కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
Story by Anup, Big Tv