Bihar: ఏ సర్వే మీదైతే దేశవ్యాప్తంగా చర్చ జరిగిందో.. ఏ ఓట్ల తొలగింపుపై బీహార్ రాజకీయం వేడెక్కిందో.. ఏ ప్రక్రియపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయో.. ఇప్పుడు దానిమీదే ఎన్నికల సంఘం మరో అడుగు ముందుకు వేసేందుకి సిద్ధమైంది. ఎంత వ్యతిరేకత వచ్చినా.. ఎన్ని రకాల విమర్శలు వచ్చినా.. పాన్ ఇండియా లేవెల్లో.. ఓటర్ సర్వే నిర్వహించాలని డిసైడ్ అయింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.. రెండో విడతకు తేదీలు కూడా ప్రకటించేసింది. అసలు.. సెకండ్ ఫేజ్‌లో.. ఈసీ ఏం చేయబోతోంది?
కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఒక్క ప్రకటన.. ఇప్పుడు దేశం మొత్తం చర్చనీయాంశంగా మారింది. బీహార్ ఎన్నికల ముందు.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో చేసిన ఓటర్ జాబితా సవరణ.. ఇండియన్ పాలిటిక్స్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. బీహార్‌లో ఓటర్ సర్వేతో 60 లక్షలకు పైగా నకిలీ, బోగస్ ఓట్లని తొలగించింది ఎన్నికల సంఘం. దీనిపై.. అక్కడి రాజకీయ పార్టీల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ.. ఈ అంశంలో ఎన్నికల సంఘం దూకుడుగా ముందుకెళ్లాలని నిర్ణయించుకుంది. బీహార్ తర్వాత.. రెండో దశలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో.. ఓటర్ జాబితా సవరణ చేపట్టనున్నట్లు తెలిపింది. తొలి దశలో బీహార్‌లో.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ని విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది ఈసీ.
బీహార్‌లో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణలో.. 90 వేల కంటే ఎక్కువ పోలింగ్ బూత్‌లను కవర్ చేశారు. ఈ ప్రక్రియలో.. రాష్ట్రం మొత్తం మీద ఎలాంటి అభ్యంతరాలు రాలేవని ఎన్నికల సంఘం తెలిపింది. బీహార్‌లో ఓటర్ల భాగస్వామ్యం ఆదర్శమని.. ఎస్‌ఐఆర్‌లో పాల్గొన్న ఏడున్నర కోట్ల మంది బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు సీఈసీ జ్ఞానేశ్ కుమార్. తొలి దశ తర్వాత.. 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల అధికారులతో.. ఈసీ సమావేశాలు నిర్వహించి.. సమగ్రంగా చర్చించింది. రెండో దశలో.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టబోయే 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పేర్లను ప్రకటించారు. అండమాన్ నికోబార్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, యూపీ, పశ్చిమబెంగాల్‌లో.. సెకండ్ ఫేజ్ ఎస్ఐఆర్ నిర్వహించనున్నారు. ఇందులో.. 51 కోట్లమంది ఓటర్లు భాగం కానున్నారు. నవంబర్ 4 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ రాష్ట్రాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ జాబితాను డిసెంబర్ 9న ప్రకటిస్తామని, తుది జాబితాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల చేస్తామని చెప్పారు. అస్సాంలో ఓటర్ల జాబితా సవరణని.. విడిగా నిర్వహిస్తామని తెలిపారు.
ఓటర్ లిస్టుల్లో.. ఎలాంటి లోపాలు లేకుండా కచ్చితత్వాన్ని నిర్ధారించడమే లక్ష్యంగా.. ఎన్నికల సంఘం ఈ ఓటర్ సర్వే చేపట్టబోతోంది. 1951 నుంచి.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ని నిర్వహించారు. 2004లో చివరిసారి ఈ ఎస్ఐర్ ప్రక్రియ జరిగింది. వలసలు, ఫేక్ ఓట్లు, బోగస్ ఓట్లు, 2002 తర్వాత నమోదిత ఓటర్లలో మరణించిన వారి ఓట్లని తొలగించడం లాంటి కారణాలతో.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించడం తప్పనిసరిగా మారింది. ఇప్పుడు.. తొమ్మిదోసారి ఓటర్ జాబితాను సవరిస్తోంది ఎన్నికల సంఘం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించబడే 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఓటర్ లిస్టులను ప్రస్తుతానికి బ్లాక్ చేశారు. తర్వాత.. ఓటర్లకు అన్ని వివరాలతో కూడిన ప్రత్యేకమైన ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. అర్హత కలిగిన ఏ ఓటరుని కూడా మిస్ చేయకుండా.. లిస్టులో అనర్హమైన ఓటర్లు ఎవరూ లేకుండా చూసుకుంటారు. ఫేజ్-2 ఎస్ఐఆర్ కోసం.. పోలింగ్ అధికారులకు మంగళవారం నుంచే ట్రైనింగ్ ఇవ్వనున్నారు. పౌరసత్వానికి ఆధార్ ఓ ధ్రువీకరణ పత్రం కాదని, అయితే.. ఎస్ఐఆర్‌లో దానినొక ఐడెంటిటీ ప్రూఫ్‌గా సమర్పించొచ్చని ఎన్నికల సంఘం ప్రకటించింది.
పాన్ ఇండియా లెవెల్లో ఓటర్ సర్వే అంటే మామూలు విషయం కాదు. అయినాసరే.. ఈసీ ఈ విషయంలో బలంగానే ముందుకెళ్తోంది. అసలు.. దేశంలో ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అవసరం ఉందా? రాజకీయ పార్టీలు.. దీనిపై వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలేంటి? నకిలీ ఓట్లు, బోగస్ ఓట్లను తొలగించడమే ఈసీ ముందున్న లక్ష్యమా? రివిజన్ వెనుక.. మరేదైనా రీజన్ ఉందా?
మన దేశంలో ఓటరు జాబితా సమగ్రతను కాపాడటమే లక్ష్యంగా.. డూప్లికేట్ ఓట్లు, మృతి చెందిన వారి ఓట్లు, వలస వెళ్లిన ఓటర్ల పేర్లను తొలగించేందుకే.. ఎన్నికల సంఘం.. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపడుతోంది. ఓటు వేసేందుకు అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు.. ఓటర్ లిస్టులో ఉండేలా చూస్తోంది. కోట్లాది మంది యువ ఓటర్ల చేరిక వల్ల.. ఓటర్ లిస్టులు కూడా అప్‌డేట్ కావాల్సిన అవసరం ఉంది. అయితే.. కొన్ని రాజకీయ పార్టీలు ఈ రివిజన్‌ని మద్దతిస్తుండగా.. మరికొన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ ప్రక్రియ పట్ల తీవ్ర అభ్యంతరాలు, ఆందోళనని వ్యక్తం చేస్తున్నాయ్. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని.. ఈ రివిజన్ చేస్తున్నారని.. ఇది ఓటరు జాబితాలను తారుమారు చేసే ప్రయత్నమని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ.. తమకు అనుకూలంగా లేని వర్గాలు, మోనారిటీలు, షెడ్యూల్డ్ కులాలు, మహిళలు, పేద వర్గాల ఓటర్ల పేర్లను.. వ్యూహాత్మకంగా జాబితా నుంచి తొలగించే కుట్ర అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో.. ఓటర్లు తమ అర్హతని నిరూపించుకునేందుకు బర్త్ సర్టిఫికెట్ల లాంటి పత్రాలను సమర్పించాల్సి రావడం.. నిరక్ష్యరాస్యులు, పేదలు, వలస కార్మికులకు కష్టమని వాదిస్తున్నారు. బీహార్‌లో జరిగిన ఫస్ట్ ఫేజ్ రివిజన్ తర్వాత.. లక్షలాది మంది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారు. ముఖ్యంగా.. ప్రతిపక్ష పార్టీలకు ఓటు వేసే అవకాశం ఉన్నవారి పేర్లు.. ఎక్కువగా తొలగించారనే ఆరోపణలు వచ్చాయి. దాంతో.. ఎస్ఐఆర్‌పై కొన్ని పార్టీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా.. 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లందరూ జాబితాలో ఉండేలా చూడటమే.. ఎస్ఐఆర్ లక్షఅయం. వన్ మ్యాన్.. వన్ ఓట్ అనే సిద్ధాంతాన్ని బలోపేతం చేసే ఉద్దేశం కూడా ఉంది. అనేక రాజకీయ పార్టీలు గతంలో ఓటర్ లిస్ట్‌లపై ఆందోళన వ్యక్తం చేశాయి. వాటన్నింటిని పరిష్కరించేందుకు కూడా ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. కానీ.. కొన్ని ప్రతిపక్ష పార్టీలు.. ఈ రివిజన్ వెనుక రాజకీయ కారణాలున్నాయని.. నకిలీ ఓట్ల తొలగింపు పేరుతో.. తమ మద్దతుదారులను టార్గెట్‌గా చేసుకొని.. ఓటు హక్కును దోచుకునే ప్రయత్నమని ఆరోపిస్తున్నాయి. అయితే.. ఎన్నికల సంఘం మాత్రం.. ఇది తప్పనిసరిగా చేపట్టాల్సిన ప్రక్రియ అని, ఎన్నికల సంస్కరణల్లో భాగమని చెబుతోంది. ఎస్ఐఆర్‌లో భాగంగా.. ఓటర్ జాబితాలోని ఓటర్లందరికీ.. బూత్ లెవెల్ ఆఫీసర్లు.. ప్రత్యేక ఎన్యుమరేషన్ ఫామ్స్ అందిస్తారు. అందులో.. సమగ్రమైన ఓటర్ జాబితాకు కావాల్సిన అన్ని వివరాలు ఉంటాయి. బీఎల్‌వోలు.. ప్రతి ఇంటికి 3 సార్లు వెళ్తారు. వలస వచ్చిన ఓటర్ల సమస్యని కూడా పరిష్కరిస్తారు. అంతేకాదు.. ఓటర్లు కూడా తమ ఎన్యుమరేషన్ ఫామ్స్‌ని ఆన్‌లైన్‌లోనూ సమర్పించొచ్చు. బీఎల్‌వోలు.. ఫామ్స్ పంపిణీ చేయడం ప్రారంభించాక.. ఓటర్ల తమ వివరాలను పాత ఓటర్ లిస్టుతో ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. 2003 ఓటర్ లిస్టులో.. తమ పేరు ఉందో లేదో చూసుకోవాల్సి ఉంటుంది. వారి పేర్లు గానీ వారి తల్లిదండ్రుల పేర్లు గానీ 2003 నాటి ఓటర్ లిస్టులో కనిపిస్తే.. వారు ఎలాంటి అదనపు పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు. 2002 నుంచి 2004 కాలం నాటి ఓటర్ లిస్టులను.. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఓటర్లు.. తమ చేరికను నేరుగా ఆన్‌లైన్‌లోనే ధ్రువీకరించుకునే అవకాశం కల్పించారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పారదర్శకతని కాపాడేందుకు.. అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు.. రాజకీయ పార్టీల ప్రతినిధులను కలిసి.. ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి వివరించనున్నారు. ఎందుకంటే.. అనేక సార్లు రాజకీయ పార్టీలు ఓటర్ లిస్టుల గురించి ఆందోళనలు లేవనెత్తాయ్. అందువల్ల.. ఓటర్ లిస్టులో కచ్చితత్వం, పారదర్శకతని నిర్ధారించేందుకు.. ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయాలని నిర్ణయించింది. ఈ రివిజన్‌లో భాగంగా.. ప్రతి బూత్ లెవెల్ అధికారికి.. దాదాపు వెయ్యి మంది ఓటర్ల బాధ్యత అప్పగిస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని.. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మానిటర్ చేస్తారు. బీహార్ మోడల్‌లా.. ఈ ప్రక్రియని విజయవంతం చేయడమే లక్ష్యమని చెబుతోంది ఈసీ. అదేవిధంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో.. ఎలాంటి దోషాలు లేని సమగ్రమైన ఓటర్ లిస్టులను ప్రకటించడమే.. రెండో దశ ఎస్ఐర్ లక్ష్యమని ఎన్నికల సంఘం గట్టిగా చెబుతోంది.
Story by Anup , Big Tv