దేశంలో అప్పుడప్పుడూ కొన్ని ఊహించని మార్పులు సంభవిస్తుంటాయ్. వాటిని మనం గమనించేలోపే.. ఊహకు కూడా అందని స్థాయికి వెళ్లిపోతాయ్. ఇప్పుడు అలాంటి మార్పే.. దేశంలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచంలో.. ఇండియా మరో మ్యానుఫాక్చరింగ్ హబ్‌గా మారిపోయింది. దేశంలో ఒక్కసారిగా వచ్చిన ఐఫోన్ బూమ్‌తో.. లెక్కలన్నీ తారుమారయ్యాయ్. దేశంలో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు మూడో స్థానానికి చేరాయంటే.. అదేమంత చిన్నవిషయం కాదు. త్వరలోనే.. ఆయిల్ ఎక్స్‌పోర్ట్స్‌ని కూడా ఎలక్ట్రానిక్ గూడ్స్ దాటేస్తాయా?
ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో.. భారత్ మరింత ఎత్తుకు దూసుకెళ్తోంది. దేశంలో.. ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు వేగంగా పెరుగుతున్నాయ్. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే.. ఎలక్ట్రానిక్స్ ఎక్స్‌పోర్ట్స్ దేశంలో మూడో స్థానానికి చేరాయి. ఇది ఇంజనీరింగ్ వస్తువులు, పెట్రోలియం ఉత్పత్తుల తర్వాత అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఇదిలాగే కంటిన్యూ అయితే.. మరో రెండేళ్లలోనే.. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల్ని కూడా అధిగమిస్తుంది.. ఇంజనీరింగ్ ఉత్పత్తుల తర్వాత రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉందని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
2022 ఆర్థిక సంవత్సరంలో.. భారతీయ ఎగుమతుల జాబితాలో.. ఎలక్ట్రానిక్స్ ఏడో స్థానంలో ఉంది. అదే.. 2024 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి.. ఎలక్ట్రానిక్స్ ఐదో స్థానానికి పెరిగింది. ఈ సంవత్సరం.. టాప్ టెన్ కేటగిరీల్లో ఎలక్ట్రానిక్స్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. నాలుగో స్థానంలో ఉన్న కెమికల్స్‌ని, మూడో స్థానంలో ఉన్న రత్నాలు, ఆభరణాల ఎగుమతుల్ని అధిగమించింది. ప్రస్తుతం.. ఎలక్ట్రానిక్స్ మూడో స్థానానికి ఎగబాకి.. భారత్‌ని మరో మ్యానుఫాక్చరింగ్ హబ్‌గా ప్రపంచం ముందు నిలబెట్టింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 6 నెలల డేటా ప్రకారం.. ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 42 శాతం పెరిగి.. 22.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వీటిలో సగం.. ఐఫోన్లే ఉన్నాయి. ఇదే సమయంలో.. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 16 శాతం తగ్గాయి. అయినప్పటికీ.. భారత్‌లో రెండో అతిపెద్ద ఎక్స్‌పోర్ట్ కేటగిరీగా ఉన్న పెట్రోలియం.. క్రమంగా తగ్గిపోతోంది. గడిచిన మూడేళ్లలో.. దేశంలో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 63 శాతం పెరిగాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 24 బిలియన్ డాలర్ల నుంచి ఈ ఏడాది దాదాపు 39 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇప్పుడున్న ఎగుమతుల రేటు ప్రకారం.. ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెట్టింపవుతాయని అంచనా వేస్తున్నారు.
కొన్నేళ్లుగా.. ఇండియా ఎగుమతుల డీఎన్‌ఏ మారుతోంది. ఈ మార్పు.. రాత్రికి రాత్రి జరిగింది కాదు. 2020లో.. భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ కోసం.. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాన్ని ప్రారంభించినప్పుడు మొదలైంది. కోవిడ్ టైమ్‌లో.. ప్రపంచ దేశాలకు ఓ విషయం అర్థమైంది. అతిగా చైనా ఫ్యాక్టరీలపై ఆధారపడటం కరెక్ట్ కాదని గ్రహించాయి. అదే సమయంలో.. దిగ్గజ కంపెనీలన్నీ.. ప్రత్యామ్నాయాల కోసం చూశాయి. ఈ పరిస్థితులను.. భారత్ తనకు అనుకూలంగా మార్చుకుంది. మార్పుకు తగ్గట్లుగా.. వేగంగా ముందుకు కదిలింది. పీఎల్ఐ స్కీమ్ ప్రవేశపెట్టాక.. స్థానికంగా తయారయ్యే ఫోన్లు, వాటి కాంపొనెంట్స్.. దాదాపు 6 శాతం పెరిగాయి. 2020 ఆగస్టులో.. మొబైల్ హ్యాండ్‌సెట్ పథకాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇండియాలో ఉత్పత్తి పెంచిన కంపెనీలకు.. దాదాపు 41 వేల కోట్లు రివార్డ్‌గా అందుతుందని ప్రకటించడం.. గేమ్ ఛేంజర్‌గా మారింది. ఈ ప్రోత్సాహకాలు తొలి రెండేళ్లలో 6 శాతంగా ఉన్నాయి. ఐదో సంవత్సరంలో 4 శాతానికి తగ్గాయి. ముఖ్యంగా.. 15 వేల కంటే ఎక్కువ ధర ఉన్న స్మార్ట్ ఫోన్లని టార్గెట్ చేశారు. ఆపిల్, శామ్‌సంగ్ లాంటి దిగ్గజ కంపెనీలను కూడా ఈ ఇన్సెంటివ్స్ ఆకర్షించాయి. ఇదంతా.. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎగుమతుల్ని పెంచేందుకు.. భారత ప్రభుత్వం తీసుకున్న బిగ్ మూవ్ అని చెప్పొచ్చు. ఇది.. చైనాకు.. ఇండియాని ఓ ప్రత్యామ్నాయంగా మార్చే ఆలోచన.
ఇండియాలో ఎలక్ట్రానిక్స్ బూమ్‌కు మేజర్ రీజన్ ఆపిల్ ఐఫోన్స్. ఈ ఆర్థికసంవత్సరం తొలి ఆరు నెలల్లోనే 10 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లు.. ఇండియా నుంచి ఎగుమతి అయ్యాయి. ఇది.. దేశం మొత్తం ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో 45 శాతం. అంతేకాదు.. మిగతా స్మార్ట్ ఫోన్ ఎగుమతుల్లో.. మూడొంతుల కంటే ఎక్కువ. ఆపిల్.. చైనా తర్వాత భారత్‌ని తన రెండో అతిపెద్ద మ్యానుఫాక్చరింగ్ యూనిట్‌గా మార్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి ఐఫోన్లలో.. భారత్‌లో తయారయ్యే వాటి వాటా 20 శాతం దాటింది. ఇదే.. ఇండియా ఫ్యూచర్ స్ట్రాటజీపై చర్చ జరిగేలా చేస్తోంది. ఆపిల్ తీసుకున్న మూవ్.. ఇండియాని కూడా ఇప్పుడు మ్యానుఫాక్చరింగ్ హబ్‌గా మారుస్తోంది.
భారత్‌లో ఉన్నట్టుండి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు పెరగడానికి రీజనేంటి? ఐఫోన్స్.. మేజర్ వాటా ఎలా ఆక్రమించగలిగాయ్? దేశంలో ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ పెంచేందుకు.. భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? ఇదంతా.. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రామ్స్ వల్లే సాధ్యమైందా? ఇంకొన్నేళ్లలో.. ఇండియా వరల్డ్ మానుఫాక్చరింగ్ హబ్‌గా ఎదిగేందుకు ఉన్న అవకాశాలేంటి?
దశాబ్దాలుగా.. భారతదేశ ఎగుమతుల్లో.. చమురు, పెట్రోలియం ఉత్పత్తులే అగ్రస్థానంలో ఉన్నాయి. ఇప్పుడు. ఎలక్ట్రానిక్స్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. త్వరలోనే.. రెండో అతిపెద్ద ఎగుమతి కేటగిరిగా.. ఎలక్ట్రానిక్స్ నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే.. నెలలు గడుస్తున్నకొద్దీ.. ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం మధ్య గ్యాప్ తగ్గుతోంది. ఈ వేగం ఇలాగే కంటిన్యూ అయితే.. కొన్నేళ్లలోనే ఇంజనీరింగ్ ఉత్పత్తుల తర్వాత ఎలక్ట్రానిక్స్ సెకండ్ ప్లేస్‌లోకి వస్తుందనే చర్చ జరుగుతోంది.
మరోవైపు.. భారత ప్రభుత్వం కూడా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను పెంచేందుకు వీలుగా చర్యలు తీసుకుంటోంది. ఇటీవలే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ కాంపోనెంట్ స్కీమ్ కింద.. 5 వేల 532 కోట్ల విలువైన 7 ప్రాజెక్టులకు.. భారత సర్కార్ ఆమోదం తెలిపింది. వీటి ద్వారా.. 36 వేల 559 కోట్ల ఉత్పత్తి, 5,100కు పైగా ఉద్యోగాలు రానున్నాయి. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ దీని గురించి స్పందిస్తూ.. వంద శాతం దేశీయ కాపర్ క్లాడ్ లామినేట్, 20 శాతం పీసీబీ, 15 శాతం కెమెరా మాడ్యూల్ డిమాండ్‌ని తీర్చాల్సి ఉందన్నారు. ఇది.. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‌కు భారీ ప్రోత్సాహంగా చెబుతున్నారు. ముఖ్యంగా.. దిగుమతుల్ని తగ్గించడంతో పాటు రక్షణ, టెలికాం, ఈవీలు, రెన్యువబుల్ ఎనర్జీ కోసం నమ్మకమైన సప్లై చైన్‌ని నిర్మించడమే ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకుంది భారత్. ఇందుకోసం.. మాడ్యూల్స్, కాంపొనెంట్స్‌తో పాటు అవసరమైన ఎలక్ట్రానిక్ మెటీరియల్‌ని తయారుచేస్తోంది.
మొబైల్ ఫోన్లు, ఐటీ హార్డ్ వేర్ లాంటి రంగాల్లో తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం.. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌ని ప్రవేశపెట్టింది. ఇది.. దేశీయ, అంతర్జాతీయ సంస్థలను.. భారత్‌లో తయారీ యూనిట్లు స్థాపించేందుకు బాగా ఆకర్షించింది. మేకిన్ ఇండియా ప్రోగ్రామ్ కూడా.. విదేశీయంగా తయారీని పెంచడంపై ఫోకస్ పెట్టింది. ఇది.. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీకి, ఎగుమతులకు ఎంతో ఊతమిచ్చింది. గత పదేళ్లలో.. దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ 5 రెట్లు పెరిగింది. దీని విలువ.. 11 లక్షల కోట్లు దాటింది. ఎగుమతులు కూడా ఇదే కాలంలో 6 రెట్లు పెరిగాయి. యాపిల్ లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు.. ఐఫోన్ ప్రొడక్షన్‌లో కొంత భాగాన్ని చైనా నుంచి భారత్‌కు తరలించడం వల్ల ఎగుమతులు భారీగా పెరిగాయ్.
దేశంలో.. ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు వేగంగా పెరుగుతున్న క్రమంలో.. త్వరలోనే ఇంజనీరింగ్ ఉత్పత్తుల తర్వాత అత్యధికంగా ఎగుమతి అయ్యే రెండో కేటగిరీ.. పెట్రోలియం ఉత్పత్తులను కూడా దాటేసే సామర్థ్యం ఉందని నివేదికలు సూచిస్తున్నాయ్. PLI పథకం ప్రారంభించినప్పటి నుంచి.. పెట్రోలియం, ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల మధ్య అంతరం బాగా తగ్గింది. మరోవైపు.. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలుపై అమెరికా ఆంక్షలు విధించడం, భౌగోళిక రాజకీయ ఒత్తిళ్ల కారణంగా.. భారతీయ రిఫైనరీల పెట్రోలియం ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది.. పెట్రోలియం ఎగుమతుల తగ్గుదలకు దారితీసి, ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల పెరుగుదలకు దోహదపడుతుంది. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, అంతర్జాతీయ తయారీ సంస్థల ఆసక్తి కారణంగా.. ఎలక్ట్రానిక్స్ రంగం.. భారతదేశ భవిష్యత్ ఎగుమతుల వృద్ధికి కీ-ఫ్యాక్టర్‌గా మారబోతోంది. అయితే.. రష్యన్ ముడిచమురుపై.. అమెరికా వైఖరికి ప్రతిస్పందనగా.. భారతదేశ చమురు వాణిజ్యం ఎలా మారుతుందనేది ఆసక్తి రేపుతోంది.
అనేక సంవత్సరాలకు ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో చైనా నెంబర్ వన్‌గా ఉంది. భౌగోళిక రాజకీయ సంక్షోభం కారణంగా.. ఇంటర్నేషనల్ కంపెనీలు తమ సప్లై చైన్‌లకు.. ఆల్టర్నేట్స్ చూసుకోవాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో.. ఇండియా కూడా ఎలక్ట్రానిక్స్‌ని తన బలంగా మార్చుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. అందుకనుగుణంగానే.. ప్రపంచ మార్కెట్‌లో మేడిన్ ఇండియా ఐఫోన్‌ల వాటా కూడా స్థిరంగా పెరుగుతోంది. ఇప్పుడు.. ఐదో వంతుకు పైగా భారత దేశం నుంచి ఐఫోన్లు.. ఎగుమతి అవుతున్నాయి. ఇదే సమయంలో.. మేడిన్ ఇండియా ఉత్పత్తులపైనా.. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో విశ్వసనీయత పెరిగింది. కేవలం స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాదు.. నాన్ స్మార్ట్ ఫోన్ కేటగిరీల్లో ఉండే.. నెట్ వర్కింగ్ పరికరాలు, సోలార్ మాడ్యూల్స్, ఛార్జింగ్ అడాప్టర్‌ల ఎగుమతులు కూడా పెరిగాయి. వీటికి సెమీ కండక్టర్ చిప్‌ల ఉత్పత్తి కూడా తోడైతే.. ఇండియా నుంచి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు మరింత పెరిగే అవకాశం ఉంది.
Story by Anup, Big Tv