Khammam: ఉన్నవి రెండు పోస్టులు. దరఖాస్తు చేసుకున్నది మాత్రం 66 మంది. ఇందులోంచి ది బెస్ట్ అయిన ఇద్దరు క్యాండిడేట్లని ఫైనల్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానంపై ఉంది. ఖమ్మం జిల్లా అధ్యక్ష, నగర అధ్యక్ష పదవులకు భారీ డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో హైకమాండ్.. వచ్చిన దరఖాస్తులను వడబోస్తోంది. మరో వారం, పది రోజుల్లో కొత్త అధ్యక్షులను ఎంపిక చేయనుంది. ఇంతకీ ఖమ్మం జిల్లా అధ్యక్ష, నగర అధ్యక్ష పదవికి ఎవరెవరు పోటీలో ఉన్నారో ఇప్పుడు చూద్దాం.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్, నగర అధ్యక్ష పదవులకు నేతల ఎంపిక చివరి దశకు చేరింది. ఐదు నియోజకవర్గాల నుంచి జిల్లా అధ్యక్ష పదవికి 56 మంది, నగర అధ్యక్ష పదవికి 10 మంది దరఖాస్తు చేసుకున్నారట. పార్టీకి విధేయులుగా ఉంటూ. ఐదేళ్లుగా పార్టీలో కొనసాగుతూ ఉన్న వారికే పదవులు దక్కుతాయని అధిష్టానం చాలా స్పష్టంగా చెప్తూనే ఉంది. హస్తం పార్టీని అంటి పెట్టుకుని ఉన్న వారే కాక అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారు కూడా పదవులకు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో డీసీసీ పదవికి ఆరుగురు, నగర అధ్యక్ష పదవికి 12 మంది పేర్లతో ఏఐసీసీకి నివేదిక వెళ్లిందట. వడబోత అనంతరం.. అంటే మరో రెండు మూడు రోజుల్లో.. జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసి అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇటీవల జిల్లా అధ్యక్షులు ఎంపిక ప్రక్రియ చేపట్టే పనిలో భాగంగా ఆశావహుల నుండి దరఖాస్తులను స్వీకరణ కు ఏఐసీసీ పరిశీలకుడు మహేంద్ర జిల్లాల్లో పర్యటించారు. అదేటైంలో ఏఐసీసీ పరిశీలకులడిని జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, మట్టా రాగమయి తదితరులు కలిశారు. వారితో ఏఐసీసీ నిబంధనలు, అధ్యక్ష పదవికి కావాల్సిన అర్హతలపై చర్చించినట్లు సమాచారం. అన్ని నియోజకవర్గాల నుంచి డీసీసీ అధ్యక్ష పదవికి గతంలో ఎన్నడూ లేని విధంగా దరఖాస్తులు రావడంతో అధిస్థానానికి పరిస్థితులన్నీ.. కాస్త తలనొప్పిగా మారాయట.
2014 నుంచి 2023 వరకు అధికారంలో లేకపోవడంతో ఆ సమయాన పార్టీలో స్తబ్దత నెలకొంది. ప్రస్తుతం అధికారంలో ఉండడంతో జిల్లా అధ్యక్ష పదవి చేపట్టేందుకు పలువురు ఉత్సాహంగా ఉన్నారు. గత పది పది సంవత్సరాలు గులాబీ పార్టీ నేతల ఒత్తిళ్లు అక్రమ కేసులకు వేదింపులు తట్టుకొని మూడు రంగుల జెండా భుజాన వేసుకున్న వారికే ప్రియారిటీ ఇవ్వాలని అధిష్టానం చూస్తోందట. ముఖ్య నేతలు కూడా పార్టీకి విధేమయులుగా ఉన్నవారికే ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేశారట.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం వచ్చిన 56 దరఖాస్తుల్లో ముఖ్య నేతలైన ఆరుగురి పేర్లు ఏఐసీసీ పరిశీలనకు వెళ్లాయట. అలాగే నగర కమిటీకి కూడా ఆరుగురి పేర్లు ప్రతిపాదించారు. ఐదేళ్లపాటు నిరం తరాయంగా కాంగ్రెస్ కు సేవలు అందించిన వారి పేర్లను పరిగణనలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇదేసమయాన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు బంధువులు అయి ఉండొద్దనే నిబంధన విధించినట్లు తెలుస్తుంది. ఇవికాక పార్టీని ముందుకు నడిపించే సత్తా ఉన్న వారినే పరిగణనలోకి తీసుకుని పార్టీకి విధేయులై, గతంలో నామినేటెడ్ పదవులు ఆశించి భంగపడ్డ నేతలకు, సుదీర్ఘకాలం సేవలందిస్తున్న వారికి పదవి ఇస్తేనే న్యాయం చేసినట్లు అవుతుందనే భావన వ్యక్తమవుతోందట. డీసీసీ అధ్యక్ష పదవికి 56, ఖమ్మం నగర అధ్యక్ష పదవికి పది దరఖాస్తులు రావడంతో వడబోత అనంతరం ఒక్కో పదవికి ఆరుగురి పేర్లతో మహేంద్రన్ జాబితా రూపొందించారు. ఈ జాబితాతో పాటు ఆయా నేతలు నిర్వహించిన పదవులు, ప్రజాక్షేత్రం, పార్టీ కేడర్లో ఉన్న అభిప్రాయాలతో ఈనెల 25న ఆయన అధిష్టానానికి సమర్పించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా డీసీసీ, నగర అధ్యక్షులను వచ్చేనెల మొదటివారంలోగా పార్టీ ప్రకటిస్తుందని సమాచారం.
డీసీసీ, నగర అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్న నేతలు ఎవరికి వారు పదవి తమకే దక్కుతుందనే ఆశాభావంతో ఉన్నారు. డీసీసీకి దరఖాస్తు చేసుకున్న వారిలో వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ మట్టా దయానంద్, నూతి సత్యనారాయణ, నాగండ్ల దీపక్ చౌదరి, మద్ది శ్రీనివాస్ రెడ్డి, సూతకాని జైపాల్, కొత్త సీతారాములు, ఎండీ. ముస్తఫా, బెల్లం శ్రీనివాసరావు, పగడాల మంజుల, సూరంపల్లి రామారావు, చోట బాబా ఉన్నారు. అలాగే నగర అధ్యక్ష పదవికి నాగండ్ల దీపక్ చౌదరి, కమరపు మురళి, ఖాదర్ బాబ, రషీద్ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 66 దరఖాస్తులు రావడంతో రెండు పదవులకు ఆరుగురి చొప్పున పేర్లను ఏఐసీసీకి ప్రతిపాదించడంతో.. ఎవరి పేర్లు జాబితాలో ఉన్నాయి.. అందులో ఎవరికి పదవి దక్కుతుందనే అంశంపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొందట.
ఏఐసీసీ పరిశీలకులు మహేంద్రన్ ఈనెల 11 నుంచి 19 వరకు జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలతో సమావేశమై క్రియాశీలకంగా పని చేస్తున్న నేత ఎవరు.. ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నారు.. వారి పనితీరుపై అభిప్రాయాలు సేకరించారు. ఇలా ఐదు నియోజక వర్గాల్లో 3,800 మందితో ముఖాముఖి నిర్వహించగా.. అధ్యక్ష పదవులకు దరఖాస్తు చేసుకున్న వారితో ఈనెల 19 న ఖమ్మంలో సమావేశమయ్యారు. జిల్లా నుండి సేకరించిన నేతల దరఖాస్తులను రాష్ట్ర అధిష్టానం ఢిల్లీ పెద్దల వద్దకు తీసుకెళ్లి అక్కడ నుంచి జిల్లా అధ్యక్ష పదవిని ఎంపిక చేసేందుకు రంగం సిద్ధమైంది. సో… చూడాలి మరి జిల్లా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీఠం ఎవరికి దక్కనుందో.
Story by venkatesh, Big Tv