Jupally Krishna Rao: ఆయన ప్రభుత్వంలో ఓ మంత్రిగా ఉన్నారు. ఆయన శాఖకు చెందిన సమాచారం కావాలంటే అధికారులను పిలిచి తీసుకోవచ్చు. ఇతర డిపార్ట్ మెంట్ ల ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం నోట్ ఫైలింగ్ ద్వారా తెప్పించుకోవచ్చు. కానీ ఆర్టీఐ అప్లికేషన్ వేయడం అనేది జరగదు. అలాంటప్పుడు.. మంత్రి జూపల్లి కృష్ణారావు తన సొంత శాఖలతో పాటు ఇతర డిపార్ట్ మెంట్ లపై ఆర్టీఐ దరఖాస్తులు వేశారని కొన్ని పత్రికలు కథనాలు ప్రచురించాయి. దాన్ని జూపల్లి ఖండిస్తూ.. తనను కావాలనే ఇరికించే కుట్రలు జరుగుతున్నాయన్నారు. మరి మినిస్టర్ ను ఎవరు టార్గెట్ చేశారు? ఎందుకు ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారు? దీనిపై మంత్రి లీగల్ గా ఎలా ముందుకు వెళ్లనున్నారు.
ఇటీవల తరుచుగా వివాదాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎందుకు ఉంటున్నారు. ఆయనకు ఆయనే వివాదాలను కోరి తెచ్చుకుంటున్నారా? లేక ఎవరైనా మంత్రిని టార్గెట్ చేశారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకు అంటే.. ఇటీవల కొన్ని పత్రికలు మంత్రి జూపల్లి కొన్ని ప్రభుత్వ శాఖలపై ఆర్టీఐ దరఖాస్తులు వేసినట్లుగా వార్తలు ప్రచురించాయి. ప్రధానంగా భూముల కేటాయింపులు, టెండర్లపైనే ఆరా తీసినట్టు అందులో రాసుకొచ్చారు. ఏ భూములు ఎవరికి.. ఏ కంపెనీ ఎంతకు కోట్ చేసిందని కూపీ లాగారని కథనాలు రాశాయి కొన్ని వార్తా పత్రికలు. సమాచారం ఇవ్వకపోతే అధికారులకు దమ్కీలు కూడా ఇచ్చారని రాశాయి. అంతే కాదు భవిష్యత్ ప్రణాళికలో భాగంగానే వివరాలు సేకరిస్తున్నారని.. ప్రచురించాయి. ఇది ప్రభుత్వంలో చర్చకు దారి తీసిందట. సచివాలయంలోనూ దీనిపై గుసగుసలాడుకుంటున్నారట.
అయితే ఆర్టీఐ అస్త్రాలు.. అనే ఆరోపణలపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్ట్రాంగ్‌గా రియాక్ట్ కావాల్సి వచ్చింది. తనపై పని కట్టుకుని ఒక వర్గం మీడియా, సోషల్ మీడియా దుష్ప్రాచారం చేస్తోందని జూపల్లి మండిపడ్డారు. వికృత రాజకీయాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు పిర్యాదు చేయడంతో పాటు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఆర్టీఐ ద్వారా కొన్ని శాఖలకు సంబంధించిన సమాచారాన్ని అడిగించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని జూపల్లి ఫైర్ అయ్యారు. తన పరువుకు భంగం కలిగించేలా, అప్రతిష్ఠపాలు చేసేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా కుట్ర పన్నుతున్నారన్నారు. ఆ వార్తను ప్రచురించిన సంస్థలు, సోషల్ మీడియా పోస్టుల వెనుక ఉన్న బాధ్యులైన వ్యక్తులపై పరువు నష్టం దావా దాఖలు చేస్తానంటు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి జూపల్లి.
ఇలా వివాదాల నేపథ్యంలో మంత్రి జూపల్లిని టార్గెట్ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్సైజ్ శాఖలో దాదాపు 100 కోట్ల విలువైన హై-సెక్యూరిటీ హోలోగ్రామ్ లేబుల్స్ టెండర్ల ప్రక్రియలో మంత్రి జూపల్లికి, ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీకి మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి. రిజ్వీ ఉద్దేశపూర్వకంగా టెండర్ల ప్రక్రియను ఆలస్యం చేశారని, దాని వల్ల పాత వెండర్‌కే ప్రయోజనం కలుగుతోందని జూపల్లి ఆరోపించారు. మంత్రి ఆదేశాలను పట్టించుకోలేదనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, రిజ్వీ వీఆర్‌ఎస్ తీసుకున్నారు.
ఈ వ్యవహారంలో మంత్రి పాలనాపరమైన జోక్యం, అధికారిపై చర్య తీసుకోవాలని పట్టుబట్టడం తీవ్ర చర్చకు దారితీసి వివాదానికి కారణమైంది. రిజ్వీ VRS తీసుకున్న వివాదంలో, మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎస్‌కు లేఖ రాయడం, వీఆర్ఎస్‌ను అడ్డుకోవాలని ప్రయత్నించడం వంటి చర్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ పరిణామంపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులను వేధిస్తోందని, మంత్రి అవినీతి సొమ్ము పంపకాల విషయంలో గొడవ పడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేసింది.
జనరల్‌గా ఓ మంత్రి ప్రభుత్వంలోని ఇతర శాఖలపై లేదా సొంత శాఖపై ఆర్టీఐ దరఖాస్తులు వేయడం అనేది జరగదు. ఎందుకు జరగదు అంటే.. మంత్రులు ప్రభుత్వంలో అంతర్భాగం. వారికి తమ శాఖలకు లేదా ఇతర శాఖలకు సంబంధించిన సమాచారాన్ని పొందడానికి ప్రత్యేక ఛానల్ ఉంటుంది. నేరుగా శాఖ కార్యదర్శులను పిలిచి, ఫైళ్లను అడిగి, లేదంటే అధికారిక నోట్ ఫైలింగ్ ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. ఓ మంత్రి కామన్ పబ్లిక్‌లాగా ఆర్టీఐని ఆశ్రయించారంటే.. అది ఇంపాజిబుల్ అనే చెప్పాలి. దీన్నిబట్టి.. చూస్తే.. మంత్రి జూపల్లి ప్రభుత్వానికి భారీగా ఆదాయం తెచ్చిపెట్టే.. కీలకమైన శాఖలు నిర్వహిస్తున్నారు. మొన్నటి రిజ్వీ VRS వివాదాన్ని బీఆర్‌ఎస్ పొలిటికల్ గా వాడుకుంది. మంత్రులపై అవినీతి ఆరోపణలు కూడా చేశారు. ఇలా మళ్లీ జూపల్లిని కార్నర్ చేయాలనే స్కెచ్ బీఆర్ఎసే వేసింది అంటున్నారు మంత్రి అనుచరులు. ఏదిఏమైనా మంత్రి జూపల్లి ఇలా.. వరుస వివాదాల్లో ఇరుక్కోవడం అటు పార్టీకి.. ఇటు ప్రభుత్వానికి కొంత ఇబ్బందిగా మారిందని మాత్రం చెప్పవచ్చు. దీనిపై జూపల్లి ఎంతవరకు వెళ్తారనేది తెలియాల్సి ఉంది.
Story by Venkatesh, Big TV