BigTV English
Advertisement

Tirupati: పరకామణి అసలు దొంగ ఎవరు? రంగంలోకి సీఐడీ

Tirupati: పరకామణి అసలు దొంగ ఎవరు? రంగంలోకి సీఐడీ

Tirupati: తిరుమల.. కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం. అలాంటి చోట.. స్వామివారి కానుకలను లెక్కించే పరకామణిలో చోరీ జరగడం.. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. భక్తులు.. ఆ స్వామికి చెందాలని సమర్పించిన కానుకలను చోరీ చేయడమేంటి? ఆ కేసుని.. లోక్ అదాలత్‌ ద్వారా రాజీ చేసుకోవడమేంటి? పూర్తి స్థాయిలో విచారణ చేయకుండానే.. సాధారణ విషయంలా వదిలేయడమేంటి? ఇలా ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు. అందుకోసమే.. పరకామణి వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించి ఏపీ హైకోర్టు. ఈ కేసులో నెక్ట్స్ ఏం జరగబోతోంది?


చోరీ కేసుపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించిన ఏపీ హైకోర్టు:

తిరుమల.. కోట్లాది మంది హిందువులకు.. అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. కోరిన కోరికలు నెరవేర్చిన శ్రీనివాసుడికి.. అత్యంత భక్తిశ్రద్ధలతో కానుకలు సమర్పిస్తారు భక్తులు. వాటిని.. టీటీడీ అధికారుల పర్యవేక్షణలో.. పరకామణిలో లెక్కిస్తారు. ఇలాంటి చోట చోరీ జరగడం.. భక్తుల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. అంతేకాదు.. ఈ చోరీ కేసుని లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకోవడం సంచలనంగా మారింది. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరగాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయ్. మొత్తానికి.. మళ్లీ ఇన్నాళ్లకు ఈ కేసులో కదలిక వచ్చింది. ప్రకంపనలు సృష్టించిన పరకామణి వ్యవహారంపై.. సీఐడీ దర్యాప్తునకు ఏపీ హైకోర్టు ఆదేశించింది. చోరీపై నమోదైన కేసుని.. లోక్‌ అదాలత్‌లో రాజీ చేసుకోవడంపై న్యాయస్థానం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. చోరీకి పాల్పడిన రవికుమార్‌ ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించింది. కేసు రాజీ వ్యవహారంలో టీటీడీ బోర్డు, అధికారుల పాత్రపై దర్యాప్తు చేయాలని స్పష్టం చేసింది. రవికుమార్‌, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు, బ్యాంకు ఖాతాలు పరిశీలించాలని సూచించింది. ఆస్తులు ఎవరి పేర్ల మీదకైనా బదిలీ చేశారా? అనే అంశంపైనా దర్యాప్తు చేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన రిపోర్టుని.. తదుపరి విచారణలోగా అందించాలని సీఐడీ, ఏసీబీని ఆదేశించింది హైకోర్టు.

పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపకుండానే రాజీ చేయించారు:

వైసీపీ ప్రభుత్వ హయాంలో.. 2023లో తిరుమల పరకాణిలో చోరీ జరిగింది. దీనిపై.. కేసు నమోదైంది. ఈ ఘటనపై.. అదే ఏడాది టీటీడీ విజిలెన్స్‌కి కూడా ఫిర్యాదు అందింది. ఉద్యోగి రవికుమార్ పెద్దఎత్తున పరకామణిని కొల్లగొట్టారని అందులో తెలిపారు. దీనిపై.. అప్పటి టీటీడీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపకుండా.. లోక్ అదాలత్‌లో హడావుడిగా రాజీ చేయించారు. ఈ ఘటనపై.. పిటిషన్ దాఖలు కావడంతో.. హైకోర్టు విచారణకు స్వీకరించింది. పరాకమణిలో భారీగా అక్రమాలు జరిగాయనడానికి.. ఈ ఘటనే ఉదాహరణ అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయ్. ఇలా.. పరకామణి చోరీ వ్యవహారం మళ్లీ ప్రకంపనలు రేపుతోంది. తిరుమలలో ఇలాంటి దొంగతనం జరగడం, ఆ కేసుని పక్కదోవ పట్టించడంపై.. భక్తులతో పాటు పౌర సమాజంలోని ప్రముఖులు కూడా తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఈ ఒక్క ఘటనతో.. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెబుతున్నారు.


రవికుమార్ చేతివాటం ఎలా బయటపడింది?

తిరుమల పెద్ద జియ్యంగార్ మఠంలో క్లర్క్‌గా పనిచేసే రవికుమార్.. 2023 ఏప్రిల్ 29న ఎప్పటిలాగే పరకామణిలో స్వామివారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలు లెక్కించేందుకు వెళ్లాడు. అక్కడ.. వెంకటేశ్వరస్వామికి కానుకగా వచ్చిన అమెరికన్ డాలర్లలో.. రవికుమార్ 900 డాలర్లు దొంగిలించాడు. వాటిని దాచుకొని బయటకు తీసుకెళ్తుండగా.. టీటీడీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్‌కు దొరికిపోయారు. రవికుమార్ దగ్గర్నుంచి 72 వేల విలువైన అమెరికన్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీపై.. తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో రవికుమార్‌పై.. AVSO సతీశ్ కుమార్ ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా.. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తర్వాత విచారణలో భాగంగా రవి కుమార్ దగ్గర్నుంచి.. అమెరికన్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. మే 19న టీటీడీకి తనకు చెందిన 7 ఆస్తులను దానం చేస్తానని ప్రతిపాదించారు. అయితే.. వాటి విలువ కోట్లలో ఉంది. ఆస్తులు దానం చేయాలంటే.. వాటి వివరాలను పత్రికల్లో ప్రచురించి.. ఎవరికీ అభ్యంతరం లేకపోతేనే తీసుకోవాల్సి ఉంటుంది. కానీ.. ప్రకటన ఇచ్చేంత సమయం లేదని, దాని నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరడంతో.. బోర్డు అంగీకారం తెలిపింది. త్వరగా ప్రక్రియ ముగించేందుకు కారణాలు మాత్రం చెప్పలేదు. ఆ ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువే 14 కోట్లు ఉంది. కానీ.. రవికుమార్ దొంగిలించింది కేవలం 70 వేల విలువైన.. అమెరికన్ డాలర్లు మాత్రమే. ఆ తర్వాత విజిలెన్స్ అధికారి సతీశ్, చోరీకి పాల్పడిన రవికుమార్‌ లోక్‌అదాలత్‌కు వెళ్లారు. సమస్యని తామే పరిష్కరించుకుంటామని అనుమతి తీసుకున్నారు. అయితే.. పోలీసుల ఒత్తిడితోనే తాను రాజీకి అంగీకరించినట్టు సతీశ్‌ చెబుతున్నారు.

ఎవరి సాయం లేకుండానే రవికుమార్ చోరీ చేశాడా?

లోక్ అదాలత్‌లో కాంప్రమైజ్ అయ్యేందుకు సతీశ్ కుమార్‌కి ఎలాంటి అధికారాలు లేవు. లోక్ అదాలత్‌లో కాంప్రమైజ్ అవ్వాలంటే.. నిందితుడు, ప్రాపర్టీ ఓనర్ ఇద్దరూ ఒప్పుకొని తీరాలనే వాదన బలంగా వినిపిస్తోంది. కానీ.. ఇక్కడ ఓనర్ సతీశ్ కాదు. అతను కేవలం విజిలెన్స్ అధికారి మాత్రమే. ఒరిజినల్ ఓనర్.. ఆ వేంకటేశ్వరస్వామియే. అలాంటప్పుడు.. సతీశ్ ఎలా కాంప్రమైజ్ అవుతారనే ప్రశ్నలు వస్తున్నాయి. సతీశ్ కుమార్‌కు కాంప్రమైజ్ చేసే అధికారమే లేదంటున్నారు. అందువల్ల.. ఈ చోరీ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయించాలనే డిమాండ్లు వస్తున్నాయి. 2023 ఏప్రిల్‌లో.. రవికుమార్‌పై నమోదైన ఎఫ్ఐఆర్‌లోనూ సాధారణ దొంగతనంగానే చూపారు. 2023 మే 30న.. ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. రవికుమార్, ఆయన భార్య.. 2023 జూన్ 13న 7 ఆస్తులను స్వామివారికి దానం ఇచ్చారు. దాదాపు 20 ఏళ్లుగా శ్రీవారి సన్నిధిలో పనిచేస్తున్న వ్యక్తి దొంగతనానికి పాల్పడితే.. నమ్మకద్రోహం కింద కేసు పెట్టాలి కానీ.. ఎఫ్‌ఐఆర్‌ చాలా సాధారణంగా ఉందనే వాదన వినిపిస్తోంది. అసలు.. డబ్బు లెక్కించే స్థానంలో లేని రవికుమార్‌ దగ్గరకి డాలర్ల కట్ట ఎలా వచ్చింది? ఎవరి సాయం లేకుండానే ఇదంతా జరిగిందా? 2023 ఏప్రిల్‌లో దొంగతనం జరిగితే.. సెప్టెంబరు నాటికి ఎలా రాజీ చేశారు? పాలకవర్గం అనుమతి లేకుండా లోక్‌ అదాలత్‌తో.. ఎలా రాజీకి అనుమతి అడిగారు? అయినా.. వంద కోట్ల ఆస్తులున్న వ్యక్తి.. క్లర్క్‌గా పనిచేయడమేంటి? అనేది కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది.

పరకామణిలో చోరీ కేసును కదిలిస్తే.. లెక్కలేనన్ని డౌట్స్ వస్తున్నాయ్. స్వామివారి కానుకని దొంగిలించిన వ్యక్తితో.. రాజీ కుదర్చడమేంటి? నష్టపరిహారం కింద.. ఆస్తుల్ని రాసివ్వమనడమేంటి? చోరీ చేసిన వ్యక్తికి.. సరైన శిక్ష పడకుండా కేసు నుంచి తప్పించడమేంటి? ఇలా.. ఎన్నో సందేహాలున్నాయ్? అప్పట్లో.. కొందరు రాజకీయ పెద్దలు.. రవి కుమార్ కేసుల పాలవకుండా రక్షించారనేదే ఆరోపణలు కూడా ఉన్నాయ్. ఇలాంటి ఘటనలతో.. తిరుమలపై భక్తుల నమ్మకం సన్నగిల్లకుండా.. టీటీడీ ఎలాంటి చర్యలు చేపట్టాలి?

హుండీ నుంచి ఎంత డబ్బు మాయమైందనే దానిపై దర్యాప్తు:

పరకామణిలో చోరీ వ్యవహారం సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. తిరుమల లాంటి గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంలోనే ఇలాంటి దొంగతనం జరిగితే.. మిగతా ఆలయాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయనే ప్రశ్న తలెత్తుతోంది. హుండీ కానుకల లెక్కింపులో.. అన్ని రకాల పర్యవేక్షణ ఉండగా కూడా.. ఇలాంటి దొంగతనం ఎలా చేయగలిగారనేదే మేజర్ డౌట్. ఎందుకంటే.. తిరుమల శ్రీనివాసుడికి ప్రతిరోజూ భారీ ఎత్తున విరాళాలు వస్తుంటాయ్. అందులో.. ఇంకెన్ని అక్రమాలు జరుగుతున్నాయనే సందేహం తలెత్తుతోంది. అయినప్పటికీ.. రవికుమార్ ఈ దొంగతనం ఎలా చేయగలిగారు? ఎవరో సహకరిస్తేనే.. దొంగతనం చేశారనే అనుమానం బలపడుతోంది. దీని వెనక ఎవరున్నారు? స్వామివారి హుండీ నుంచి మొత్తం ఎంత డబ్బు మాయమైందనే దానిపైనా దర్యాప్తు జరగాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయ్.

పరకామణి చోరీ వ్యవహారం పై పెద్ద కథే ఉందంటున్నారు:

పరకామణిలో చోరీ వ్యవహారం కేవలం.. 72 వేల విలువ చేసే డాలర్లకు సంబంధించింది కానే కాదు. దీని వెనుక.. చాలా పెద్ద కథే ఉందంటున్నారు. రవికుమార్ కొన్నేళ్లుగా పరకామణి నుంచి డాలర్లు దొంగిలిస్తున్నాడనే ఆరోపణలున్నాయ్. అతనికి మిగతా వాళ్లలా తనిఖీలు ఉండకపోవడం.. కలిసొచ్చింది. అలా.. డాలర్లను మార్చి.. కోట్లు వెనకేసినట్లు తెలుస్తోంది. కేవలం 72 వేల విలువైన అమెరికన్ డాలర్ల కోసమైతే.. తన ఆస్తుల్ని టీటీడీకి రాసివ్వడు. కేసును ఎదుర్కొంటాడు. బెయిల్ కూడా త్వరగానే వచ్చేస్తుంది. అయినప్పటికీ.. కోట్లు విలువ చేసే ఆస్తుల్ని రాసిచ్చేశాడంటే.. కచ్చితంగా లోపాయికారిగా కొందరు పెద్దలకు డబ్బులు, ఆస్తులు ముట్టజెప్పాడనే ప్రచారం జరుగుతోంది. చోరీకి పాల్పడిన వ్యక్తి ఆస్తుల్ని.. టీటీడీకి రాయించేశాం కాబట్టి.. అతని మీద కేసులవీ వద్దని.. లోక్‌ అదాలత్‌లో రాజీ చేశారు. అసలు.. ఓ నిందితుడు విరాళం ఇస్తే అప్పటి టీటీడీ పెద్దలు ఎలా తీసుకున్నారు? శ్రీనివాసుడి పరకామణిలో కొట్టేసిన విదేశీ కరెన్సీతో సంపాదించిన కోట్లు విలువ చేసే ఆస్తుల్ని.. మళ్లీ శ్రీవారికే విరాళం ఇవ్వడమేంటి? టీటీడీ విజిలెన్స్ అధికారులపై పోలీసులు ఎందుకు ఒత్తిడి తెచ్చారు? ఈ వ్యవహారాన్ని వెనకుండి నడిపించిందెవరు? అయినా.. ఓ దొంగతనం కేసులో నష్టపరిహారం కట్టించడమేంటి? పోలీసులు కూడా బలహీనమైన సెక్షన్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇవే ప్రశ్నలు.. అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయ్.

అధికారుల పాత్రపై దర్యాప్తు చేయాలని హైకోర్టు స్పష్టం:

టీటీడీ ఉద్యోగులు, అధికారులపై భక్తులు ఎంతో నమ్మకం ఉంచుతారు. అలాంటి చోట.. చోరీ జరగడం, లోక్ అదాలత్ ద్వారా కేసు రాజీ కుదర్చడం, పూర్తి స్థాయి విచారణ జరగకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు రావడం.. టీటీడీ నైతికతపై ప్రశ్నల్ని లేవనెత్తుతాయ్. ఇలాంటి ఘటనలు.. ఆలయ నిర్వహణలో పారదర్శకత లోపించిందనే భావనని కలగజేస్తాయ్. పూర్తిగా దైవకార్యానికే అంకితం కావాల్సిన వ్యవస్థలో.. అవకతవకలు జరుగుతున్నాయంటే.. భక్తుల విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఈ కేసులో.. ఏపీ హైకోర్టు సీఐడీ దర్యాప్తునకు ఆదేశించడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర క్షేత్రంలో జరిగిన వ్యవహారంలో.. చట్టం తన పని తాను చేస్తుందనే భరోసానిస్తుంది. చోరీకి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవడంతో పాటు, కేసుని లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకోవడంలో.. టీటీడీ బోర్డు సభ్యులు గానీ, అధికారుల పాత్ర గానీ ఏమైనా ఉందా? అనే విషయంపైనా.. దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.

స్వామి వారి సేవ , హుండీ లెక్కింపులో పాల్గొనే వారికి ట్రైనింగ్:

ముఖ్యంగా.. పరకామణిలో చోరీ ఘటనతో ఒక విషయం మాత్రం క్లియర్‌గా అర్థమవుతోంది. టీటీడీ మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. హుండీ లెక్కింపు ప్రక్రియ, ఉద్యోగుల పర్యవేక్షణ, అంతర్గత విజిలెన్స్ వ్యవస్థని.. మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు.. స్వామి వారికి సేవ చేసేవారికి, హుండీ లెక్కింపులో పాల్గొనే వారికి కచ్చితంగా ట్రైనింగ్ ఇవ్వాలనే సూచనలు కూడా చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని శ్రీనివాసుడి భక్తులు చెబుతున్నారు. స్వామివారి హుండీ డబ్బులు ముట్టుకోవాలంటేనే భయపడే విధంగా.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. నేరచరిత్ర ఉన్నవాళ్లెవరూ.. ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఉండకూడదని చెబుతున్నారు. ఏదేమైనా.. భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని.. తిరుమల పవిత్రతని పునరుద్ధరించేందుకు.. సీఐడీ దర్యాప్తు ముఖ్యమైన చర్యగా భావిస్తున్నారు.

Story by Anup, Big  Tv

Related News

Chittoor: టీడీపీకి దిక్కెవరు.. ఉమ్మడి చిత్తూరు జిల్లా పై బాబు ప్లాన్ ఏమిటి?

Cyclone Montha: తీరాన్ని తాకిన మొంథా తుఫాన్.. ఇంకో 3 గంటల్లో తీరం దాటనున్న సైక్లోన్

Cyclone Montha: దూసుకొస్తున్న మొంథా.. ఈ ఏడు జిల్లాల్లో తుఫాన్ ఉగ్రరూపం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Jagan Tweet: ఆ ట్వీట్ సరే.. జగన్ ఈ ట్వీట్ కూడా వేస్తే బాగుండేది

Cyclone Montha Live Updates: ఈ రాత్రికి మొంథా ఉగ్రరూపం.. ఈ సమయంలో మాత్రం జాగ్రత్త, హెల్ప్ లైన్ నంబర్లు ఇవే..

AP New Districts: అస్తవ్యస్తంగా జిల్లాల విభజన.. పునర్ వ్యవస్థీకరణపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Viral Video: వైజాగ్‌లో భారీ కొండచిలువ.. 12 అడుగుల పామును చూసి జనం బెంబేలు!

Montha Cyclone Alert: ఏపీపై మొంథా తుపాను పంజా.. తీరంలో రాకాసి అలలు.. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ

Big Stories

×