BigTV English

Srisailam Dam: డేంజర్‌లో శ్రీశైలం డ్యాం.. అదే జరిగితే ఊహకందని విపత్తు..!

Srisailam Dam: డేంజర్‌లో శ్రీశైలం డ్యాం.. అదే జరిగితే ఊహకందని విపత్తు..!

Srisailam Dam: శ్రీశైలం డ్యాం పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. గత కొన్నాళ్లుగా డ్యాం బాగోగులను పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు డేంజర్ జోన్‌లోకి చేరుకుంది. ఏం చేసినా వర్షాకాలం పూర్తిస్థాయిలో రాకముందే చేయాలి. పరిస్థితి చూస్తుంటే డ్యాంలోకి ఆల్రెడీ వరద మొదలైంది. ఇంకాస్త గట్టిగా వానలు పడితే శ్రీశైలం నిండడం ఖాయం. మళ్లీ గేట్లు ఓపెన్ చేస్తే డ్యాం పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్‌గా మారింది.


డేంజర్ జోన్‌లో శ్రీశైలం డ్యాం
ప్లంజ్ పూల్ సమస్యతో టెన్షన్ టెన్షన్
ఆలస్యంగా మొదలైన పరీక్షలు
వర్షాలతో డ్యాంలోకి భారీగా వరద..
రిపేర్లు పూర్తయ్యేదెప్పుడన్న ప్రశ్నలు

గట్టిగా ఖర్చు చేస్తే శ్రీశైలం జలాశయం మెయింటెనెన్స్ కు ఏటా జస్ట్ 3 కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. పోయేది 3 కోట్లే గానీ.. ఈ ప్రాజెక్ట్ తో ఏపీ, తెలంగాణకు ఎంతో మేలు జరుగుతుంది. వందల కోట్ల ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఏం లాభం? గత కొన్నేళ్లుగా సరైన మెయింటెనెన్స్ లేక శ్రీశైలం డ్యాం ఇప్పుడు డేంజర్ జోన్ లోకి వెళ్లింది. విభజన తర్వాత నాగార్జున సాగర్ డ్యాం బాధ్యత తెలంగాణ చూస్తుండగా, శ్రీశైలం నిర్వహణ ఏపీ చూస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలంలో కేవలం 50 లక్షల నిధులు మాత్రమే మంజూరు చేశారు. 54 మంది జేఈలు అవసరం ఉంటే కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు. అంటే పరిస్థితి అస్సలు బాగా లేదు.


గేట్ల ముందు భారీ గొయ్యితో ముంచుకొస్తున్న ముప్పు

డ్యాం గేట్లు తెరిచినప్పుడు కిందికి వచ్చే నీళ్లు పడే చోట పెద్ద గొయ్యిలా తయారైంది. నీటి ఫోర్స్ కు ఆ గొయ్యి పెరిగి పెద్దదైంది. అది అటు తిరిగి ఇటు తిరిగి డ్యాం పునాదుల కింది నుంచే పెద్ద గుంతగా మారుతోందంటున్నారు. సో ఫౌండేషన్ కే పెద్ద ప్రమాదం. అదే జరిగితే నీళ్లు ఇక రిజర్వాయర్ లో ఆగే పరిస్థితి ఉండదు. వీటికి తోడు పునాదులు కదిలితే డ్యాం గేట్లకే ముప్పు వాటిల్లుతుంది. అదీ డ్యాం ప్రెజెంట్ కండీషన్.

అప్రోచ్ రోడ్డుకు రూ. 52 కోట్లు అవసరం

ప్లంజ్ పూల్ దాకా వెళ్లే అప్రోచ్ రోడ్డుకు 52 కోట్లు అవసరం. ఏప్రాన్‌ రిపేర్ కు 40 కోట్లు కావాలి. సో అసలు సమస్యలేంటో గుర్తించేందుకు 12 రకాల పరీక్షలు చేయాలి. వాటి కోసం చాలా టైం తీసుకున్నారు ఇరిగేషన్ ఆఫీసర్లు. నిధులు కూడా సరిపోలేదు. అయితే కూటమి ప్రభుత్వం ఐదు నెలల కిందటే అవసరమైన టెస్టుల కోసం 14.70 కోట్లు మంజూరు చేసింది. నిజానికి డ్యామ్‌కు ఉన్న ఇతర రిపేర్లు, కరెంట్ వ్యవస్థలు వంటి పనులన్నింటికీ కలిపి డ్రిప్‌ పథకం కింద 108కోట్లు మంజూరు చేయడానికి ప్రపంచబ్యాంకు ఒప్పుకుంది. ఆ ఒప్పందం కూడా ముందడుగు పడలేదు.

భారీ గొయ్యి మూసివేత ఇప్పటికిప్పుడు అసాధ్యం?

సో NDSA నివేదిక తర్వాత ఏపీ ప్రభుత్వం ముందుకు కదిలింది. లేటెస్ట్ గా శ్రీశైలం డ్యాంను పూణెకు చెందిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సైంటిస్టులు పరిశీలించారు. డ్యామ్ అధికారులతో సమీక్షించారు. ఫ్లంజ్ ఫుల్ లోతుపై ఆరా తీశారు. 2009లో భారీ వరదల కారణంగా డ్యామ్ ముందు ఏర్పడిన భారీ గొయ్యిని, గ్యాలరీని, గేట్లను, అప్రోచ్ రోడ్డును పరిశీలించారు. ఏప్రిల్ లో శ్రీశైలం డ్యాం ను నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ, డ్యాం డిజైనింగ్ అధికారులు పరిశీలించి రిపోర్ట్ ఇచ్చారు. శ్రీశైలం డ్యామ్ కు పెద్ద సమస్య ఏంటంటే.. ప్లంజ్ పూల్. ఈ గొయ్యిని మూసేయ్యాలి. ఇది ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు. అందుకే టెంపరరీ రిపేర్లతో ఈ వర్షాకాలం సీజన్ ముగించాలి. ఆ తర్వాత శాశ్వత ప్రాతిపదినక పనులు చేయాల్సి ఉంటుంది.

బుధవారం అండర్ గ్రౌండ్ వాటర్ వీడియో రికార్డ్

శ్రీశైలం డ్యాం ప్లంజ్ పూల్ తో డ్యాం భద్రతకే ముప్పు ఉండడంతో ఇతర దేశాల టెక్నాలజీని వాడి సమస్యను పరిష్కరించే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే కృష్ణా, తుంగభద్రలో వరద ప్రవాహం పెరుగుతుండడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూన్ 4న విశాఖకు చెందిన ప్రైవేట్ సంస్థ అత్యాధునిక కెమెరాలతో అండర్ గ్రౌండ్ వాటర్ వీడియో రికార్డ్ చేసి రిపోర్ట్ అందిస్తుంది. ఇటీవలే కర్నూల్ కు చెందిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ టీమ్.. డ్యామ్ అధికారులకు వీడియో ఫుటేజ్ అందించారు. ముప్పు పెరగకుండా తక్కువ టైంలో ఏం చేయాలి ఇదే పెద్ద టాస్క్ గా మారిపోయింది.

మరి ఇప్పుడు ఇంజినీర్ల ముందున్న మార్గమేంటి?

శ్రీశైలం డ్యాం నిర్వహణ విషయంలో అనుకున్న పనులు అనుకున్న సమయానికి మొదలు కాలేకపోయాయి. దీంతో సమస్య పెరిగి పెద్దదై ఇక్కడి దాకా వచ్చింది. భారీ వరదలు వస్తే ఏంటన్న డౌట్లు పెరుగుతున్నాయి. అంతకు ముందే ఏం చేయాలన్నది కూడా చాలా కీలకంగా మారుతోంది. చిన్నగా మొదలైన సమస్యను ఇప్పటిదాకా పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. మరి ఇప్పుడు ఇంజినీర్ల ముందున్న మార్గమేంటి?

143 అడుగుల లోతైన భారీ గుంతతో ప్రమాదం

ప్లంజ్ పూల్ సమస్యకు పరిష్కారం.. చాలా శ్రమ, సమయం, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంత ఈజీ కాదు. గుంత చిన్నదిగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయడంతోనే ఇప్పుడది భారీ ఊబి మాదిరి తయారైంది. ఏకంగా 143 అడుగుల లోతైన గుంత అంటే మాటలు కాదు. ఇప్పటికే NDSA డ్యాం విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని గతంలో చాలాసార్లు సీరియస్ అయింది కూడా. శ్రీశైలం డ్యామ్ నిర్మాణం 1960లో ప్రారంభమైంది. అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ 1963 జులై 24న శంకుస్థాపన చేశారు.

రెండో దశ నిర్మాణం 1987లో పూర్తి

డ్యామ్ నిర్మాణం జులై 26, 1980లో పూర్తైంది. నాటి ప్రధాని ఇందిరా గాంధీ దీన్ని ప్రారంభించారు. ఇక రెండో దశ నిర్మాణం 1987లో పూర్తైంది. దీంతో ఇది జలవిద్యుత్ ఉత్పత్తితో పాటు సాగునీటి సౌకర్యం కల్పించే బహుళ ప్రయోజన ప్రాజెక్టుగా మారింది. నిజానికి ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థిక, సాంకేతిక సమస్యలతో పనులు ప్రారంభమైన 20 ఏళ్లకు పూర్తయింది. మొత్తం నిల్వ సామర్థ్యం 216 టీఎంసీలు, 12 గేట్లు ఉన్నాయి.

19 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా డిజైన్

శ్రీశైలం డ్యామ్ 19 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా రూపొందించబడినప్పటికీ, 2009లో 25.5 లక్షల క్యూసెక్కుల వరదను సక్సెస్ ఫుల్ గా కంట్రోల్ చేసింది. నాడు డ్యాం భద్రతపై నీలి నీడలు కమ్ముకున్నా బలంగానే ఆపింది. అయితే అప్పుడే ప్లంజ్ పూల్ మరింత విస్తరించింది. నిజానికి శ్రీశైలం ప్రాజెక్టులో వెంటనే చేయాల్సిన పనులపై జాతీయ డ్యాం భద్రత అథారిటీ దృష్టి సారించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకమైన ప్రాజెక్టులో అనేక సమస్యలు ఉండటంతో వచ్చే వరదల్లోపు చేయాల్సిన పనులు ఏమిటో ఇటీవలే తేల్చి చెప్పింది.

సిలిండర్ల రిపేర్ కు ప్రాధాన్యం ఇవ్వాలన్న అథారిటీ

ప్లంజ్‌పూల్‌ సమస్య శాశ్వతంగా పరిష్కారం కావడానికి టైం పట్టేలా ఉండడంతో అది స్పిల్‌ వే వైపు, డ్యాం వైపు విస్తరించకుండా మొదట సిలిండర్ల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇవ్వాలని అథారిటీ నిర్ణయానికి వచ్చింది. స్పిల్‌ వే దిగువన రెండువైపులా ఉన్న కొండలు జారిపోతున్నాయి. ఆ రాళ్లు స్పిల్‌ వేకు అడ్డంగా పడే ప్రమాదమూ ఉంది. ఈ పరిస్థితుల్లో కొండలు జారిపోకుండా ట్రీట్‌మెంట్‌ చేయాల్సిన అవసరాన్ని సూచించింది. వీటితో పాటు ఏప్రాన్‌లోకి వెళ్లేందుకు వీలుగా రోడ్డు పనులు చేయాలన్నది.

ఏప్రాన్‌కు, ప్లంజ్‌పూల్‌ గొయ్యికి మధ్య 62 స్టీల్‌ సిలిండర్లు

ప్లంజ్ పూల్ ను ఎలా పూడ్చాలన్నది బిగ్ టాస్క్ గా మారింది. ఎందుకంటే 143 అడుగుల లోతు పూర్తి చేయడం కష్టమే. శ్రీశైలం స్పిల్‌ వే దిగువన ఏప్రాన్‌కు, ప్లంజ్‌పూల్‌ గొయ్యికి మధ్య గతంలో 62 స్టీల్‌ సిలిండర్లు ఏర్పాటు చేశారు. 2009 భారీ వరదలకు ఇవి ధ్వంసమయ్యాయి. వీటిలో దాదాపు 20 సిలిండర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మిగిలినవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ సిలిండర్లు ఉండటం వల్ల ప్లంజ్‌పూల్‌ డ్యాం వైపు విస్తరించకుండా ఆపొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని సిలిండర్లను వెంటనే రిపేర్ చేయాలన్నది NDSA.

ఫౌండేషన్ గ్యాలరీలోనూ సీపేజీ గుర్తింపు

ఎన్‌డీఎస్ఏ, ఏపీ ప్రభుత్వానికి మొత్తం 23 పేజీల లేఖ, 5 పేజీల టెక్నికల్ రిపోర్ట్ ను ఇటీవలే ఇచ్చింది. డ్యామ్ ఏప్రాన్ రోడ్డు కొట్టుకుపోయినా తిరిగి నిర్మించలేదని, 2018 నాటి హైడ్రోగ్రాఫిక్ సర్వే ప్రకారం, ఏప్రాన్‌కు 50 నుంచి 220 మీటర్ల దూరంలో కోత ఉందని చెప్పింది. కుడి, ఎడమ వైపున, అలాగే సిలెండర్ల దగ్గర కూడా 160 మీటర్ల వరకూ, కొన్ని చోట్ల 160 నుంచి 122 మీటర్ల వరకూ ప్లంజ్ పూల్ గుంతలు ఉన్నాయి. ఫౌండేషన్ గ్యాలరీలోనూ సీపేజీని NDSA టీం ఐడెంటిఫై చేసింది. ఎడమగట్టు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో గేట్ నంబర్ 1 నుంచి వరదనీటి విడుదల చేయొద్దన్నారు.

1 – 39 సిలెండర్లకు వెంటనే రిపేర్ అవసరం

వర్షాలు పెరిగి వరదలు వచ్చేలోపు తాత్కాలిక చర్యలు తీసుకోవాలని, అందుకోసం మరిన్ని అధ్యయనాలు జరపాలన్నది NDSA. 1 నుంచి 39 సిలెండర్లు తక్షణం బాగు చేయాలి. వాటిని కాంక్రీటుతో నింపడం వంటివి చేయాలి. 5, 6 గేట్ల వినియోగం తగ్గించాలి. శాశ్వత చర్యల కోసం సీడబ్ల్యూసీని సంప్రదించాలి. కొండ చరియలు కోతకు గురికాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలి. ఈ ప్లంజ్ పూల్ పూర్తిస్థాయిలోరీ డిజైన్ చేయాలి. స్లోప్ స్టెబిలైజేషన్ చేయాలి. కేబుల్ వే ఆధునీకరించాలి. మానిటరింగ్ వ్యవస్థలన్నీ పాతవి ఉన్నాయి. అప్‌గ్రేడ్ అవ్వలేదు. ఆధునిక జియో టెక్నికల్ సామాగ్రి ఏర్పాటు చేయాలి అని NDSA సూచించింది.

1985లోనే డ్యాం ముందు ప్లంజ్ పూల్

నిజానికి కొందరు ఇరిగేషన్ ఎక్స్ పర్ట్స్ 1985లోనే డ్యాం ముందు ప్లంజ్ పూల్ ఏర్పడిందంటున్నారు. దాన్ని రిపేర్లు చేయకపోవడంతో ఇక్కడి దాకా వచ్చిందని గుర్తు చేస్తున్నారు. నిజానికి ఇప్పుడు రిపేర్లు చేయాలంటే చాలా సవాళ్లు ఉన్నాయి. యాప్రాన్ దగ్గర పనులు చేయడం అంత ఈజీ కాదు. రోడ్డు వేస్తే వరద వచ్చినప్పుడు మళ్లీ డ్యామేజ్ అవుతుంది. అండర్ వాటర్ టెక్నిక్స్ వాడాల్సి ఉంటుంది. ఇందుకోసం నెలల కొద్దీ టైం పడుతుందంటున్నారు. కాఫర్ డ్యామ్ కట్టి, లేటెస్ట్ టెక్నాలజీ వాడి దశల వారీగా పనులు చేయాలి. మరోవైపు ఈ డ్యాం మెయింటెనెన్స్ విషయంలో మరో ఇష్యూ కూడా ఉంది. ఇది అటవీప్రాంతంలో ఉండడంతో ఇంజినీర్లు తమ పలుకుబడి ఉపయోగించుకుని శ్రీశైలం డ్యాం దగ్గర పోస్టింగ్ పడకుండా చూసుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

సిమెంట్ కాంక్రీట్ టెట్రాపాడ్స్‌తో టెంపరరీ రిలీఫ్

ప్లంజ్ పూల్‌లో ఏర్పడిన గుంతను తాత్కాలికంగా సిమెంట్ కాంక్రీట్ టెట్రాపాడ్స్‌తో నింపడం ద్వారా నీటి ప్రవాహ శక్తిని తగ్గించవచ్చంటున్నారు. ఈ టెట్రాపాడ్స్ నీటి వేగాన్ని తగ్గించి, ఎక్కువ కోత లేకుండా నివారిస్తాయి. అయితే ఈ మెథడ్ తాత్కాలికమే. ఎందుకంటే రుతుపవనాలు వచ్చేశాయి. వర్షాకాలం సీజన్ కూడా ప్రారంభమైంది. ముంబై తీరంలో భూమి కోత లేకుండా ఉండేలా టెట్రాపాడ్స్‌ను సక్సెస్ ఫుల్ గా ఉపయోగించారు. సో ఇప్పుడు టెంపరరీగా ఇది ఉపయోగపడుతుందా లేదా అన్నది చూడాలి.

కొనసాగుతున్న జియోఫిజికల్, టోపోగ్రాఫికల్ సర్వేలు

ప్లంజ్ పూల్ గుంత లోతు, విస్తీర్ణం, డ్యామ్ ఫౌండేషన్‌పై దాని ప్రభావాన్ని అంచనా వేయడానికి జియోఫిజికల్, టోపోగ్రాఫికల్ సర్వేలు చేస్తునన్నారు. ఈ సర్వేలతో గుంతలోని కావిటీలు, బెడ్‌రాక్ స్థాయిలేంటో తేలిపోనున్నాయి. అడ్వాన్స్‌డ్ అండర్‌వాటర్ వీడియోగ్రఫీతో ప్లంజ్ పూల్ నీటి అడుగున ఉన్న నిర్మాణాలను పరిశీలించి గుంతకు సంబంధించి కచ్చితమైన డేటా గుర్తిస్తారు. సో ప్లంజ్ పూల్ సమస్య నుంచి బయటపడాలంటే స్వల్పకాలిక చర్యలతో మొదలు పెట్టి దీర్ఘకాలిక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.

-Story By vidya Sagar, Bigtv Live

Related News

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

Big Stories

×