Delhi Air Pollution: భారత రాజధానిలో భయం కమ్ముకుంటోంది. ప్రాణాలు మాస్కుల్లో పెట్టుకొని బతుకుతున్నారు అక్కడి ప్రజలు. ముసలీ ముతకా.. చిన్నా పెద్దా తేడాలేదు.. అంతెందుకు, పుట్టక ముందే కడుపులో బిడ్డకి కూడా ఢిల్లీ ప్రాణాపాయంగా మారింది. ఢిల్లీ నగరం ఇప్పుడు గ్యాస్ ఛాంబర్‌లో మగ్గిపోతుంది. అక్కడ ఒక గంట గాలి పీలిస్తే చాలు, వరుసగా పది సిగరేట్లు తాగినంత కిక్ వస్తుంది. దానితో పాటు క్యాన్సర్ కూడా ఖాయమవుతుంది. అదీ ఢిల్లీ పరిస్థితి! ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిమితికి 50 రెట్లు అధికంగా ఢిల్లీ కాలుష్యం ఆందోళన కలిగిస్తుంది. అసలు ఢిల్లీకి ఏమయ్యింది..?
పుట్టని బిడ్డకు కూడా ఢిల్లీ గాలి ప్రాణాంతకం
కాలుష్యం అసలు రూపం చూడాలంటే ఢిల్లీకి వెళ్లాల్సిందే! అలాగని అక్కడికి వెళ్లారో మీ ఆయుష్షు మీరు తీసుకుంటారు జాగ్రత్త! రాజధాని నగరంలో గంట గాలి పీలిస్తే మీ జీవితంలో ఒకరోజును బలిచ్చినట్టే లెక్క! దుప్పటిలా కప్పేసే పొగ మంచులో క్యాన్సర్ కణాలు కోకొల్లలుగా ఉన్నాయి. శ్వాస తీసుకుంటే విషయం తాగినంత ప్రమాదం. ఢిల్లీలో బతకడమే ఒక నరకంగా ఉందంటే నమ్ముతారా?! నమ్మక తప్పదు. ఎందుకంటే, ఢిల్లీలో నివశిస్తున్న ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరికి ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులున్నాయి. అంతెందుకు, ఇంకా పుట్టని బిడ్డకు కూడా ఢిల్లీ గాలి ప్రాణాంతకంగా మారుతోంది. పేరుకే రాజధాని నగరం, అక్కడ జీవితం చాలా ప్రమాదకరం.
ప్రస్తుతం, నగరంలో రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దుంటూ సూచనలు వెళ్లాయి. స్కూళ్లూ, కాలేజీలు, ఆఫీసులు చివరికి భారత అత్యున్నత న్యాయస్థానం కూడా తలుపులు మూసుకోవాల్సి వచ్చింది. అందరూ, అన్ని పనులూ ఇంటి దగ్గర నుండే! ఆన్ లైన్ క్లాసులు… వర్క్ ఫ్రమ్ హోమ్‌లు! పొరపాటున బయటకొస్తే.. గుండెల నిండా విషం నింపుకొని వెళ్లాల్సిందే! ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ కట్టుకుపోవాల్సిందే! దేశ రాజధాని ఎందుకంత విషతుల్యంగా మారింది? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయ్? అసలు, ప్రజలు ఎలా బతుకుతున్నారు? అందరి మైండ్‌లో ఇప్పుడు ఇవే ప్రశ్నలు.
ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరితమైన గాలి
ప్రపంచంలోనే అత్యధిక వాయు కాలుష్యం ఉన్న నగరం భారత రాజధాని ఢిల్లీ. ఇక్కడ వాయు కాలుష్యం వల్ల ప్రజల ఆయుర్దాయం 10 ఏళ్ళు తగ్గిపోతోందని గతంలో పలు నివేదికలు కూడా వెళ్లడించాయి. అయినా, ఢిల్లీ కాలుష్యంలో మార్పు రాలేదు సరికాదా.. నానాటికీ పెరుగుతూనే ఉంది. ఈ వాయుకాలుష్యం కారణంగా ఢిల్లీలో ప్రజారోగ్యం విషయంలో హెల్త్ ఎమర్జెన్సీ ఏర్పడింది. శ్వాసకోశ వ్యాధులతో వేలాది మంది రోగులు ఆస్పత్రుల బాటపడుతున్నారు.
ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరితమైన గాలిని పీలుస్తూ అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం, రాజధాని ఢిల్లీ పూర్తిగా విషపూరిత పొగమంచుతో కప్పబడి, ఉక్కిరిబిక్కిరి అవుతోంది. న్యూ ఢిల్లీలో విషపూరిత PM 2.5 స్థాయి 247 మైక్రోగ్రాములు ఉంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన 15 మైక్రోగ్రాముల కంటే చాలా చాలా ఎక్కువగా ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం, 500 గరిష్ట స్థాయితో అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ వాతారవణంలో ఢిల్లీ వాసుల్లో నిరంతరం దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస ఇబ్బందులతో బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
ఇది వరకూ ఎప్పుడూ లేనంత డేంజరస్
ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఢిల్లీ శీతాకాలం ముప్పులో చిక్కుకుంది. అయితే, ఇది వరకూ ఎప్పుడూ లేనంత డేంజరస్‌గా ఈ పరిస్థితి ఉంది. నిజానికి, రాజధానిలో వాయు కాలుష్యం ఏడాది పొడవునా ఉన్నప్పటికీ శీతాకాలంలో చలితో పాటుగా మరింత విజృంభిస్తుంది. అందుకే, శీతాకాలం వచ్చిందంటే ఢిల్లీకి ప్రమాదం వచ్చినట్లే లెక్క.. చలితో పాటు వాయు కాలుష్యం రాజధాని నగరాన్ని చుట్టుముట్టేస్తుంది. పొగ మంచు ఊపిరాడకుండా చేస్తుంది. గ్యాస్ ఛాంబర్‌లో నగరం విలవిలా కొట్టుకుంటుంది. ప్రతీ ఏడాది ఢిల్లీకి ఇదే సమస్య. నవంబర్ నుండి జనవరి దాటే వరకూ ఢిల్లీ నివాసయోగ్యం కాదనే చెప్పాలి.
Also Read: ఢిల్లీలో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత.. అమల్లోకి స్టేజ్ 4 ఆంక్షలు
ప్రపంచంలో అత్యంత పొల్యూటెడ్ నగరాల్లో అగ్ర స్థానంలో ఉన్న ఢిల్లీ ఈ రోజుల్లో తీవ్రమైన వాయు కాలుష్యంతో నిండిపోతుంది. పరిష్కరించే మార్గాలు ఎన్నున్నా.. అమలులో మాత్రం మీనమేషాలు లెక్కించే పరిస్థితి. ఢిల్లీని పాలిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ… ఆరోపణలు, ప్రత్యారోపణలతోనే కాలం వెళ్లదీస్తారు. అందుకే, శీతాకాలంలో ఢిల్లీ వాసులంతా సొంతగా తమ జాగ్రత్తలు తాము పాటించడానికి సిద్ధమవుతారు. ఇప్పుడు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ చూస్తే ఇంత దారుణమైన వాతావరణంలో ప్రజలు బతుకుతున్నారా అని ఆశ్చర్యం వేస్తుంది.
ఇంతకుమించి ప్రమాదకరం అంటే ప్రాణాలు కోల్పోవడమే!
ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ అత్యంత ప్రమాదకరంగా ఉంది. మొన్న గాలి నాణ్యత పేలవంగా ఉంటే.. నిన్న ప్రమాదకరంగా.. ఈరోజు అత్యంత ప్రమాదకరంగా మారింది. ఇది సివియర్ ప్లస్ కేటగిరీని సూచిస్తుంది. ఇక ఇంతకుమించి ప్రమాదం ఏదైనా ఉందంటే అది ప్రాణాలు కోల్పోవడమే అనుకోవాలి. అవును, ఇందులో అతిగా చెబుతుంది ఏమీ లేదు. పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందంటే… అసలు, దేశ రాజధానిగా ఢిల్లీ ఉండటం అవసరమా? అని తాజాగా కాంగ్రెస్ నేత శశీథరూర్ ప్రభుత్వాలని ప్రశ్నించారు.
దానికి కారణం, ప్రస్తుతం ఢిల్లీ గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయిలో 500 మార్క్‌ను చేరుకోవడమే. నవంబర్ 19 ఉదయం, ఢిల్లీ రాజధాని ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 494గా నమోదైంది. దాదాపు ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. ఇక్కడ అతి తక్కువగా ద్వారకలో 480 నమోదయ్యింది. 400 మార్కే డేంజరస్ కాగా.. అది దాటిందంటే ఎంత తీవ్రమైన ప్రభావం ఉంటుందో ఊహించొచ్చు. ఢిల్లీ వ్యాప్తంగా కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ప్రజలు కళ్ల మంటలు, దురద, గొంతు నొప్పితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎయిర్ క్వాలిటీ 0-5 ఉంటే గాలి నాణ్యత బాగుంది
ఒక్కసారి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో ఎంత స్థాయిలో ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దాం.. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది బాహ్య గాలి నాణ్యత, ఆరోగ్యం గురించి సమాచారం ఇచ్చే EPA సాధనంగా పరిగణిస్తారు. ఎయిర్ క్వాలిటీ 0 నుండి 5 ఉంటే అది ఆకుపచ్చ రంగంలో గాలి నాణ్యత బాగుందనీ.. వాయు కాలుష్యం తక్కువగా, ఎలాంటి ప్రమాదం లేకుండా ఉందని అర్థం. ఇక, 51 నుండి 100 ఎయిర్ క్వాలిటీ అంటే.. ఆమోదయోగ్యమైన గాలి నాణ్యతతో పసుపు రంగు. ఈ స్థాయిలో వాయు కాలుష్యం పడనివారికి మాత్రమే ప్రమాదం. ఇక, 101 నుండి 150 వరకూ ఉండే ఇండెక్స్‌లో శ్వాసకోస వ్యాధులతో బాధపడే వారికి మాత్రమే ఇబ్బంది ఉంటుంది.
సామాన్య ప్రజానికం అనారోగ్యం పాలవడం తక్కువ. ఆ తర్వాత ఎరుపు రంగుకు మారే స్థాయి 151 నుండి 200 ఉన్న ఎయిర్ క్వాలిటీ.. ఈ స్థాయిలో సాధారణ ప్రజల్లో కొందరు ఆరోగ్య ప్రభావాలకు లోనవుతారు. ఇక, అనారోగ్యంతో బాధపడుతున్న వారిపై మరింత తీవ్రమైన ప్రభావం ఉంటుంది. తర్వాత స్థాయి, 201 నుండి 300. ఇది చాలా అనారోగ్యకరమైన పరిస్థితికి చేరిందని అర్థం. ఈ స్థాయిలో అందరికీ ఇబ్బంది పెరుగుతుంది. ఇక, చివరి ప్రమాదకర స్థాయి 301 నుండి అంతకంటే ఎక్కువ. ఇది అత్యవసర పరిస్థితిని సూచిస్తుంది. దీని ప్రకారం, ఇప్పుడు ఢిల్లీలో 500 మార్క్ చేరుకుంది. అంటే, గాలి కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఢిల్లీవ్యాప్తంగా 11th పాయింట్ యాక్షన్ ప్లాన్ అమలు
ప్రస్తుతం ఢిల్లీ నగరంలో ప్రజలకు భోజనం కంటే ఎక్కువగా ఎయిర్ ప్యూరిఫైయర్లు, మాస్క్‌ల అవసరం పెరిగింది. అందుకే, ప్రజలు తమ ఇళ్ల కోసం మాత్రమే కాకుండా ఆఫీసుల్లో వినియోగించుకోడానికి కూడా ఎయిర్ ప్యూరిఫైయర్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. ఢిల్లీ వ్యాప్తంగా హోమ్ ఎయిర్ ప్యూరిఫైయర్‌ల అమ్మకాలు 80 శాతానికి పైగా పెరిగినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇక, ఆఫీసుల్లో వినియోగించే ఎయిర్ ప్యూరిఫైయర్ల అమ్మకాలైతే 200 శాతం పెరిగాయి. ఇక, క్యాపిటల్ ప్రాంతంతో పాటు ఢిల్లీవ్యాప్తంగా అన్ని చోట్లా 11th పాయింట్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా, రోడ్లపై మెకానికల్ వాక్యూమ్ స్వీపింగ్‌తో పాటు నీటిని చిలకరించడం, భవన నిర్మాణాలు కూల్చివేత ప్రదేశాల్లో తనిఖీలు ముమ్మరం చేయడం, నిర్దేశించిన ప్రదేశాల్లో సేకరించిన ధూళిని సరిగ్గా పారేయడం వంటి చర్యలను వేగవంతం చేశారు. ఢిల్లీ అంతటా భవన నిర్మాణాలను పూర్తిగా నిలిపివేశారు. ఇక, ప్రజలు ప్రజా రవాణాను ఉపయోగించాలని, వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించాలని, వారి వాహనాల్లో ఎయిర్ ఫిల్టర్‌లను క్రమం తప్పకుండా మార్చుకోవాలని అధికారులు సూచించారు. అలాగే, దుమ్మూ ధూళికి కారణమయ్య పనులు ఆపేయాలని.. ఘన వ్యర్థాలు, బయోమాస్‌ను బహిరంగంగా కాల్చడం వంటివి చేయకూడదని కూడా స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేశారు.