దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. వాయుకాలుష్య తీవ్రత రోజురోజుకూ ప్రమాదకరస్థాయికి చేరుకుంటుంది. అక్కడ దీపావళి నుండి గాలి నాణ్యత రోజురోజుకు తగ్గుతున్న సంగతి తెలిసిందే. దీంతో రోడ్డుపై పొగమంచు కమ్ముకుంది. వాహనాలు వెళ్లడానికి కూడా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో కాలుష్య నివారణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 4 ఆంక్షలు నేటి నుండి అమలులోకి రానున్నాయి.
Also read: బీఆర్ఎస్ కు షాకిచ్చిన మాజీ ఎమ్మేల్యే.. కొనసాగడం కష్టమంటూ ప్రకటన
ఈరోజు ఉదయం 8గంటల నుండి ఈ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. వాయు కాలుష్యం పెరుగుతుండటంతో కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆంక్షల కారణంగా భారీ వాహనాల రాకపోకలను నగరంలోనికి అనుమతించరు. నిత్యావసరాల సరుకులను తరలించే ట్రక్కులకు మాత్రం రావడానికి అనుమతించారు. అంతే కాకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల్లో 50 శాతం ఉద్యోగులకు ఇంటి నుండే పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.
6వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలోకి వచ్చే భారీ ట్రక్కులకు అనుమతి నిరాకరించారు. కానీ బీఎస్ 6 వాహనాలను మాత్రం అనుమతిస్తున్నారు. నిర్మాణాల కూల్చివేతలపై సైతం నిషేదం విధించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుండే పనిచేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది.