కడప జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై వైసీపీ నాయకుల దాడి నేపథ్యంలో ఆ పార్టీ ఆత్మరక్షణలో పడింది. ఘటనను ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తీవ్రంగా పరిగణించడం, బాధితుడిని పరామర్శించడంతో పాటు దాడి జరిగిన ఎంపీడీవో కార్యాలయాన్ని పరిశీలించడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దళిత అధికారిపై దాడిని ఉద్యోగవర్గాలు జీర్ణించుకోలేకపోతున్న తరుణంలో ప్రభుత్వం స్పందించడంతో పోలీసులు ప్రధాన నిందితులను పట్టుకుని వారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఈ పరిణామాలన్నీ వైసీపీని ఇరకాటంలో పడేశాయి. వైసీపీ పరాజయం పాలై అధికారం కోల్పోయినప్పటికీ ఆ పార్టీ నేతల్లో అధికార మదం తగ్గలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనలో కీలక నిందితుడు జల్లా సుదర్శన్‌రెడ్డి వైసీపీలో కీలక పదవులు అనుభవించడంతోపాటు చట్టాలపై అవగాహన ఉన్న వ్యక్తి అయినప్పటికీ ఆయన ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలొచ్చాయి. ఈ వ్యవహారం నుంచి బయటపడలేనంతగా పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగవర్గాల నుంచే కాకుండా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను వైసీపీ మూటగట్టుకుంది.
సుదర్శన్‌రెడ్డి కుటుంబంలో ఇద్దరు వైసీపీ హయాంలో రెండు ఎంపీటీసీ స్థానాల నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సుదర్శన్‌రెడ్డి గాలివీడు మండలం గోపనపల్లి నుంచి, ఆయన తల్లి పద్మావతమ్మ గరుగుపల్లి నుంచి ఎంపీటీసీ సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పద్మావతమ్మ అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ప్రారంభంలో సుదర్శన్‌రెడ్డి గాలివీడు ఎంపీపీగా పనిచేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్‌తో ఉన్న సాన్నిహిత్యంతో ప్రాసిక్యూషన్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
Also Read: రాజుగారి ఇలాకాలో క్రికెట్ లొల్లి.. పదవుల కోసమేనా?
ప్రాసిక్యూషన్ డైరెక్టరగా నియామకానికి ముందు సుదర్శన్‌రెడ్డి ఎంపీపీ పదవికి రాజీనామా చేసి ఆ స్థానంలో తన తల్లిని కూర్చోబెట్టారు. ప్రస్తుత ఘటన నేపథ్యంలో ఆత్మరక్షణలో పడిన వైసీపీ చివరకు ఎదురు దాడికి సిద్ధమైంది. బాధితుడైన ఎంపీడీవో వ్యక్తిత్వాన్ని హననం చేసేవిధంగా వివిధ రూపాల్లో వైసీపీ నాయకులు ప్రచారానికి పాల్పడుతున్నారు. తన శాఖకు చెందిన అధికారిపై దాడి విషయమై స్పందించిన పవన్‌కల్యాణ్‌పై విమర్శల దాడికి సైతం దిగుతున్నారు. ఘటన నుంచి బయటపడటానికి ప్రత్యామ్నాయం లేక వైసీపీ నాయకులు ఎదురుదాడిని ఎంచుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అయితే రాయలసీమ ఎవరి జాగీరూ కాదని, రౌడీమూకల ఆటకట్టిస్తానని, అవసరమైతే కడపలఅోనే పార్టీ ఆఫీసు పెట్టి, మకాం వేస్తానని హెచ్చరించడం అధికారుల్లో భరోసా నింపిందంటున్నారు. అధికారులపై దాడి అంటే ఒక్కరి మీద జరిగినట్టు కాదని.. రాష్ట్ర యంత్రాంగంపై జరిగిన దాడిగా చూస్తున్నామని పవన్ వ్యాఖ్యానించారు. వైసీపీని 11 సీట్లకు ప్రజలు పరిమితం చేసినా వారిలో అహంకారం చావలేదని.. ఫ్యాన్ పార్టీ నేతల్లో అది తగ్గే వరకూ వారిని వదలబోమంటూ హెచ్చరికలు జారీ చేశారు.
దాడి ఘటనలో 13 మంది పాల్గొన్నట్లు పోలీసులు సాక్ష్యాధారాలతో గుర్తించారు. వీరిలో ప్రధాన వ్యక్తులైన సుదర్శన్‌రెడ్డి, భయ్యారెడ్డి, వెంకట్రెడ్డిలను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వీరిని రిమాండు ఖైదీలుగా రాయచోటి సబ్‌జైలుకు తరలించారు. మిగిలిన పది మంది పరారీలో ఉండగా, వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరంతా తాము వినియోగిస్తున్న ఫోన్లు సైతం వదిలిపెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఘటనపై స్పందించిన తీరుతో గబ్బర్‌సింగ్ కొత్త ట్రెండ్‌కు తెర లేపారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.