BRS: బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోందా? అంతర్గత కుమ్మలాటలు తారాస్థాయికి చేరాయా? పార్టీలు పగ్గాలు అందుకునేందుకు వారసుల మధ్య పోటీ తీవ్రమవుతుందా? మార్చిలోపు బీఆర్ఎస్‌కు కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా? కేటీఆర్ వర్సెస్ కవిత మధ్య పోటీ ఉంటుందా? ఈ వ్యవహారంలో పార్టీ నేతలు రెండుగా చీలిపోయారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
తెలంగాణలో అధికారం పోయిన తర్వాత ఫామ్‌హౌస్‌కి పరిమితమయ్యారు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పార్టీలో ఆయన ఏమాత్రం యాక్టివ్‌గా లేరు. అవసరమను కుంటే తన ఇంటికి నేతలను రప్పించుకుంటున్నారు. వయస్సు రీత్యా రాజకీయాలకు దూరంగా ఉండాలని పెద్దాయన నిర్ణయించుకున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
అందుకే ఫామ్‌హౌస్ దాటి కేసీఆర్ బయటకు రాలేదనే వాదన లేకపోలేదు. ఇదే క్రమంలో పార్టీ పగ్గాల కోసం వారసుల మధ్య పోటీ షురూ అయ్యింది. కొద్దిరోజులుగా బీఆర్ఎస్‌లో దీనిపై చర్చ తీవ్రమైంది. ఎన్నికలు గడిచి ఏడాది అయినా, పార్టీలో ఇంకా ప్రక్షాళన జరగలేదు.. వివిధ విభాగాలకు నేతలను నియమించలేదు. ఇలాగైతే కేడర్ వలసపోవడం ఖాయమనే టాక్ ఆ పార్టీలో జోరుగా నడుస్తోంది.
సోమవారం మీడియాతో చిట్‌చాట్ చేశారు కేటీఆర్. ఈక్రమంలో కొన్ని విషయాలు బయటపెట్టారు. సమయం వచ్చినప్పుడు మాత్రమే కేసీఆర్ బయటకు వస్తారని అన్నారు. తెలంగాణ కోసం రెండున్నర దశాబ్దాలపాటు పలుపెరగని పోరాటం చేశారని, ఇప్పుడు రెస్ట్ తీసుకోవడంలో తప్పేముందన్నది ఆయన మాట.
ALSO READ: తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీలు..
దీనికితోడు మరో మాట వెల్లడించారు. 2025లో పార్టీ తరపున అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నమని, పనిలోపనిగా పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ చేపడతామని చెప్పకనే చెప్పేశారు. పార్టీని విజయం వైపు నడిపించేందుకు కేడర్‌ను సిద్ధం చేస్తామన్నారు. స్వయంగా కేటీఆర్ నుంచి వెలువడిన మాటలు.
అంతర్గతం ఏం జరిగిందనేది ఒక్కసారి లోతుల్లోకి వెళ్దాం. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. కేటీఆర్ చిట్‌చాట్ మాటల ముందు పార్టీకి పగ్గాల వ్యవహారంపై అధినేత కేసీఆర్ ఇంట్లో సుధీర్ఘ చర్చలు జరిగాయట. కవిత పార్టీకి కాబోయే అధ్యక్షురాలని తన సన్నిహితుల వద్ద కేసీఆర్ చెప్పారట. ఆ మరుసటిరోజు కేటీఆర్ చిట్‌చాట్‌లో ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.
పార్టీ పగ్గాల కోసం వారసుల మధ్య కుమ్మలాట మొదలైందన్న చర్చ తెలంగాణ వ్యాప్తంగా మొదలైంది. ఈ క్రమంలో కవిత యాక్టివ్ అయ్యారన్నది నేతల మాట. అధ్యక్షుడి ఎన్నికలో విజయం సాధించేందుకు కేటీఆర్-కవిత ఎవరికి వారే తమతమ ప్రయత్నాలు చేస్తున్నారట.
ఎవరు గెలిచినా పార్టీలో హరీష్‌రావు రోలేంటి అన్నదే అసలు ప్రశ్న. ఉద్యమం సమయంలో కేసీఆర్‌కు వెన్నంటి నడిచినట్టుగానే హరీష్‌రావు.. కాబోయే అధ్యక్షుడికి చేదోడు వాదోడుగా వుంటారా? లేదా? అనేది మరోవైపు ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల నాటికి ఇంకెన్ని అంశాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.