E-Paper
Advertisement

Udayagiri TDP Politics: ఉదయగిరి టీడీపీలో ముసలం

Udayagiri TDP Politics: ఉదయగిరి టీడీపీలో ముసలం
Advertisement

Udayagiri TDP Politics: ఉదయగిరి కోట టీడీపీలో పొలిటికల్ వార్ ముదురుతోంది. నేతల ఎత్తుకు పైఎత్తులతో అక్కడ రాజకీయం ఉత్కంఠ రేపుతోంది. ఎన్నికల సమయంలో సొంత పార్టీ వాళ్లే వెన్నుపోట్లు పొడిచినా తట్టుకుని నిలబడ్డానని.. అభివృద్ధికి అడ్డువస్తే తొక్కుకుంటూ పోతా అంటూ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేసిన వ్యాఖ్యలు మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావును ఉద్దేశించి ఇచ్చిన మాస్ వార్నింగ్‌గా భావిస్తున్నారు. దాంతో ఉదయగిరి టీడీపీలో రెండు వర్గాలు ఉన్నాయనేది తేటతెల్లమైంది. అయితే మున్ముందు అంతర్గత విభేదాలు పార్టీని దెబ్బకొడతాయా అన్నా చర్చ నడుస్తోంది. ఆ క్రమంలో 25 ఏళ్లు ఇక్కడే ఉంటా.. ఉదయగిరిని అభివృద్ధి చేశాకే వెళ్తా అంటూ క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే కాకర్ల మాటలు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారాయి.

సాఫ్ట్‌వేర్ రంగంలో విజయవంతమైన కాకర్ల సురేష్
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత రసవత్తరంగా మారాయి. సాఫ్ట్‌వేర్ రంగంలో విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగి, రాజకీయాల్లోకి రాకముందే ‘కాకర్ల ఛారిటబుల్ ట్రస్ట్’ ద్వారా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన కాకర్ల సురేష్, 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగి సంచలన విజయం సాధించారు. దశాబ్దాలుగా మేకపాటి కుటుంబం ఆధిపత్యం ఉన్న ఆ గడ్డపై, ఒక సామాన్యుడిగా అడుగుపెట్టి 9,621 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది.

Advertisement

మాజీ ఎమ్మెల్యే బొలినేని వర్గంతో విభేదాలు
అయితే అధికారం చేపట్టిన 18 నెలలకే ఎమ్మెల్యే సురేష్‌కు క్షేత్రస్థాయిలో ఊహించని సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని దశాబ్దాలుగా నమ్ముకున్న మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకట రామారావు వర్గానికి, ప్రస్తుత ఎమ్మెల్యే కాకర్ల వర్గానికి మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు పార్టీని రెండు వర్గాలుగా చీల్చిందంట. ఎన్నికల సమయంలో అధిష్ఠానం జోక్యంతో ఇద్దరు నేతలు ఒకే వేదికపైకి వచ్చినప్పటికీ, నేడు చేతులు కలిసినా మనసులు కలవని చందగా పరిస్థితి తయారైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రోటోకాల్ విషయంలో రెండు వర్గాల మధ్య విభేదాలు
ఉదయగిరి నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాల నిర్వహణ, ప్రోటోకాల్ విషయంలో కూడా ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో విబేధాలు భగ్గుమంటున్నాయి. తనను పట్టించుకోవడం లేదని, కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని బొలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. మాజీ ఎమ్మెల్యే అనవసరంగా ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకుంటున్నారని కాకర్ల వర్గం ప్రత్యారోపణలు చేస్తోంది. బొలినేని కేడర్‌ను ఎమ్మెల్యే విస్మరిస్తున్నారని, కేవలం తన చుట్టూ ఉన్న కోటరీకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఒక వర్గం ఆరోపిస్తే.. మరో వర్గం అభివృద్ధికి అడ్డుపడుతూ.. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపిస్తుండడం ఉదయగిరి నియోజకవర్గం జిల్లాలో హాట్ టాపిక్ అయింది.

Advertisement

రూ.300 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామంటున్న ఎమ్మెల్యే
తనపై విమర్శలన్నింటినీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అత్యంత ధీటుగా తిప్పికొడుతూ..అభివృద్ధి విషయంలో తాను వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నారు. గత 18 నెలల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో సుమారు 300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే ఇటీవల ఓ సమావేశంలో వెల్లడించారు. సోమశిల ఉత్తర కాలువ విస్తరణకు రూ. 67 కోట్లు, 149 చెరువుల బలోపేతానికి రూ. 7 కోట్లు వెచ్చించి రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. చారిత్రాత్మక ఉదయగిరి కోటను రూ. 52 కోట్లతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది, వలసలను అరికట్టడమే తన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. నియోజకవర్గంలోని పేద ప్రజల కోసం ఇప్పటివరకు రూ. 7 కోట్ల CMRF నిధులను లబ్ధిదారులకు అందజేశామని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ‘ప్రజా దర్బార్’ నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే..

పదిమంది ఎదురు వస్తే తొక్కుకుంటూ పోతానని వార్నింగ్
తాను తెలుగుదేశం పార్టీ ప్రోడక్ట్‌నని, ఎన్టీఆర్ విద్యా సంస్కరణలు, చంద్రబాబు ఐటీ సంస్కరణల వల్లే ఈ స్థాయికి ఎదిగానని సురేష్ గుర్తుచేశారు. నియోజకవర్గ అభివృద్ధికి ఒకరు అడ్డువస్తే నెట్టుకుంటూ పోతానని..పదిమంది వస్తే తొక్కుకుంటూ పోతానని, పనికిమాలిన ఆరోపణలకు తాను భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా నుండి తాను వచ్చింది కేవలం ప్రజా సేవ కోసమేనని, ప్రైవేట్ పంచాయతీలు చేయడం తన ఉద్దేశం కాదని ప్రత్యర్ధి వర్గం ఆరోపణలకు ఘాటుగా సమాధానమిచ్చారు. వింజమూరులో డైయాలసిస్ సెంటర్ ఏర్పాటు, మారుమూల గ్రామాలకు 21 కొత్త మొబైల్ టవర్ల మంజూరు వంటి పనులు తన చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. పార్టీ సభ్యత్వ నమోదులో ఉదయగిరి రాష్ట్రంలోనే 12వ స్థానంలో నిలవడం కార్యకర్తల పనితీరుకు నిదర్శనమని కొనియాడారు.

మరో 25 ఏళ్లు ఉదయగిరిలోనే ఉంటానంటున్న కాకర్ల
తనను ఎన్నారై అని, త్వరలోనే వెనక్కి వెళ్లిపోతానని కొందరు నాయకులు ప్రచారం చేస్తున్నారని, కానీ తాను మరో 25 ఏళ్లు ఉదయగిరిలోనే ఉండి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన తర్వాతే విశ్రమిస్తానని స్పష్టం చేశారు. రాజకీయ కక్షలు లేని ప్రశాంత ఉదయగిరిని నిర్మించడమే తన సంకల్పమని ప్రకటించారు. ప్రతి నిత్యం ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి ఎజెండాతో ముందుకు వెళ్తుంటే..తనపై కొంతమంది కుట్రపూరితంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు కాకర్ల సురేష్. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ తనకు ఎలాంటి సంబంధం లేని అంశాల్లో బ్యాడ్ చేస్తున్నారని.. ఇలాంటివన్నీ తన దగ్గర కుదరవని హెచ్చరిస్తున్నారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

రోడ్లు నిర్మాణ కాంట్రాక్టర్ల విషయంలో వివాదం..
ఇటీవల ఉదయగిరి నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం చేపట్టారు. రోడ్లు నిర్మాణ కాంట్రాక్టర్ల విషయంలో మరో వివాదం ఏర్పడిందట. బొల్లినేని రామారావు వర్గానికి చెందినవారికి కాంట్రాక్ట్ పనులు ఇచ్చేది లేదని ఎమ్మెల్యే వర్గం చెబుతోంది. ఆ క్రమంలో పొరుగు ప్రాంతాలకు చెందిన వారిని తెచ్చి కాంట్రాక్టు పనులు అప్పగించారట. ఆ కాంట్రాక్టర్లను బొల్లినేని వర్గం బెదిరింపులకు గురి చేసిందన్న ఆరోపణలున్నాయి. ఇలా ఎమ్మెల్యే కాకర్ల, బొల్లినేని మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

Also Read: కత్తితో వ్యక్తిపై దాడి.. కెమెరాలో రికార్డైన ఘటన, వికారాబాద్‌లో దారుణం

మొత్తానికి ఈ ఇద్దరు నాయకులు టీడీపీలోనే ఉన్నా.. అంతర్గత కుమ్ములాటలు పెరగడంతో.. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బహిరంగ వార్నింగులు ఇచ్చారన్న చర్చ నడుస్తోంది. మొత్తానికి ఉదయగిరి రాజకీయం ఇప్పుడు అభివృద్ధి సంకల్పానికి, రాజకీయ ఆధిపత్య పోరుకు మధ్య సాగుతున్న ఒక యుద్ధంగా మారింది. ప్రజలు ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి పనులను స్వాగతిస్తున్నప్పటికీ, సొంత పార్టీలోని విభేదాలు వస్తున్న ఆరోపణలు నియోజకవర్గ భవిష్యత్తును ఎలా మలుపు తిప్పుతాయోనని ఉదయగిరి ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు.

Story By Rami Reddy, Bigtv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×