Donald Trump: డొనాల్డ్ ట్రంప్.. ఈ పేరు ఎంత సంచలనమో.. ఈ క్యారెక్టర్ అంత మిస్టరీ! ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం దగ్గర్నుంచి మొదలుపెడితే.. కఠిన వలస చట్టాలు, అడ్డగోలు టారిఫ్‌లు, అమెరికాకు అవసరం లేకపోయినా యుద్ధాలు, వార్నింగ్‌లు.. ఇలా, ఒకటా, రెండా? ట్రంప్ ఎప్పుడేం చేస్తారో.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో.. అతనికే తెలియదు. అందుకే.. అగ్రరాజ్యం అధ్యక్షుడి తీరుపై ఇంతటి వ్యతిరేకత వస్తోందూ. సొంత దేశం అమెరికాలో నో కింగ్స్ స్లోగన్ రీసౌండ్‌లో వినిపిస్తే.. రాజకీయ ప్రత్యర్థి వర్గం డెమొక్రాట్లు ఏకంగా ట్రంప్‌నే అధికారం నుంచి దించేయాలని అనుకుంటున్నారు. అమెరికాకు అనిపిస్తున్నదే.. దాదాపుగా ప్రపంచ దేశాలన్నింటికీ అనిపిస్తోంది.
నిజానికి.. ట్రంప్ అన్ ప్రెడిక్టబుల్. ట్రంప్ నిర్ణయాలు ఎంత వేగంగా ఉంటాయో, అంతే వేగంగా కాంట్రవర్శీగా మారిపోతాయ్. ఇన్నాళ్లూ వీటన్నింటిని భరించిన అమెరికా ప్రజలు.. ఇప్పుడు భరించలేకపోతున్నారు. అందుకే.. అమెరికా వీధుల్లోనే కాదు మిగతా దేశాల్లోనూ ట్రంప్ అంటే జనాలకు చిర్రెత్తిపోతోంది. ప్రజాస్వామ్య దేశమైన అమెరికాలో అయితే.. నో కింగ్స్ నినాదం పుట్టుక వెనుక లోతైన కారణాలు, అనేక రాజకీయ పరిణామాలు ఉన్నాయ్. అమెరికా అధ్యక్షుడికి అపరిమితమైన అధికారాలు ఉండొద్దనే ఉద్దేశమే.. ఆ ఉద్యమం. ట్రంప్ రెండోసారి అగ్రరాజ్యం అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక.. ఆయన ఓ రాజులా కనిపిస్తున్నారనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఇరాన్‌తో యుద్ధం తర్వాత ట్రంప్‌పై వ్యతిరేకత ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. రాత్రికి రాత్రి ఓ దేశ నాగరికతను అంతం చేసేస్తామన్న ప్రకటన.. మరింత చిర్రెత్తుకొచ్చేలా చేసింది. దాంతో.. ఆయన్ని పదవి నుంచి తొలగించేందుకు డెమొక్రాట్లు అభిశంసన ప్రక్రియను ముమ్మరం చేస్తున్నారు. యుద్ధ నేరాలు, రాజ్యాంగ విరుద్ధమైన చర్యల ఆరోపణలపై.. ట్రంప్‌ని అభిశంసించాలని ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు తీర్మానాలు ప్రవేశపెట్టారు.
Also Read: దేశంలోనే పేద సీఎం.. సొంత ఇల్లు లేదు.. ఆమె మొత్తం ఆస్తి ఎంతో తెలుసా!
ప్రెసిడెంట్ ట్రంప్.. ఇరాన్, యెమెన్, సిరియా లాంటి దేశాలపై అనధికారికంగా యుద్ధ చర్యలకు దిగారని, అమెరికా ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారారని డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు. ట్రంప్ తన తొలి టర్మ్‌లో రెండుసార్లు అభిశంసనకు గురయ్యారు, ఇప్పుడు మూడోసారి అభిశంసించేలా డెమొక్రాట్లు ప్రణాళికలు వేస్తున్నారు. ట్రంప్‌పై చర్యలు తీసుకోవడానికి వీలైనంత త్వరగా ప్రతినిధుల సభలో ఓటింగ్ జరపాలని భావిస్తున్నారు. కొందరు రిపబ్లికన్ సభ్యులు కూడా ట్రంప్ చర్యలపై అసంతృప్తిగా ఉన్నప్పటికీ, సెనేట్‌లో వాళ్ల ఆధిపత్యమే ట్రంప్‌కు రక్షణగా నిలుస్తోంది. అభిశంసనతో పాటు ట్రంప్‌ని పదవి నుంచి తొలగించాలని కొందరు డెమొక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ట్రంప్ మాత్రం.. తనపై వస్తున్న అభిశంసన ఆరోపణలను రాజకీయ ప్రేరేపితమైనవిగా కొట్టిపారేస్తున్నారు. 2026 మధ్యంతర ఎన్నికల్లో.. డెమొక్రాట్లు గెలిస్తే తనని అభిశంసించడానికి ప్రయత్నిస్తారని కూడా చెప్పారు.
అమెరికాలో వచ్చే నవంబర్‌లో జరగబోయే మధ్యంతర ఎన్నికల్లో.. ప్రెసిడెంట్ ట్రంప్ గ్రాఫ్ అంత బాలేదు. ఆయనకు ప్రజాదరణ తగ్గినట్లు సర్వేలు చెబుతున్నాయ్. ఆయన అప్రూవల్ రేటింగ్ 33 శాతం నుంచి 43 శాతం మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంది. 55 నుంచి 60 శాతం వరకు ఓటర్లు ఆయన పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. ద్రవ్యోల్బణం, నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల.. ఆయన గ్రాఫ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయ్. అమెరికా పొలిటికల్ హిస్టరీ ప్రకారం.. అధికారంలో ఉన్న పార్టీ మధ్యంతర ఎన్నికల్లో సాధారణంగా సీట్లు కోల్పోతుంది. ప్రస్తుతం.. రిపబ్లికన్ పార్టీకి ఉన్న స్వల్ప మెజారిటీకి ముప్పు పొంచి ఉంది. డెమొక్రాట్లు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో మళ్లీ పట్టు సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: తెలంగాణలో జనాభా గణనకు డేట్ ఫిక్స్.. ఈ తప్పులు అస్సలు చేయకండి?
ఇరాన్ మొత్తాన్ని తుడిచి పెట్టేస్తామంటాడు.. రాత్రికి రాత్రే సీజ్ ఫైర్‌కి ఒప్పేసుకుంటాడు. ప్రెజర్ పెంచుతాడు.. టెన్షన్ పెడతాడు.. ఆఖరి నిమిషంలో డెసిషన్ మార్చుకుంటాడు. ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు రాజకీయాలు, ఇరాన్‌పై యుద్ధం, కఠిన నిర్ణయాలు, ఆంక్షలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో.. ట్రంప్ అధికారంలో లేకపోతేనే ప్రపంచం మొత్తం సర్దుకుంటుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి.. ట్రంప్ పొలిటికల్ స్టైల్ అంతా విధ్వంసమే! పాత పద్ధతుల్ని తుడిచిపెట్టేసి, తనకంటూ ఓ కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. ట్రంప్ హయాంలో అమెరికా తన మిత్రదేశాలైన నాటో, యూరోపియన్ యూనియన్‌లతోనూ ఘర్షణ పడుతోంది. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో టారిఫ్ యుద్ధం ప్రకటించారు. ఇది భారత్ లాంటి అనేక అభివృద్ది చెందుతున్న దేశాలను సైతం ప్రభావితం చేసింది.
డొనాల్డ్ ట్రంప్ మీద ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత రావడానికి ఆయన అనుసరిస్తున్న వివాదాస్పద విధానాలే కారణం. ఆయన రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న కొన్ని నిర్ణయాలు.. అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా దాదాపు 66 అంతర్జాతీయ సంస్థలు, ఒప్పందాల నుంచి అమెరికాను తప్పించారు. ఇందులో వాతావరణ మార్పులపై పోరాడే సంస్థలు కూడా ఉన్నాయి, ఇది ఇతర దేశాలకు ఆగ్రహం కలిగించింది. వెనెజులా లాంటి దేశాల్లో సైనిక జోక్యం చేసుకోవడం, గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికా భూభాగంగా మార్చుకుంటామని బెదిరించడం లాంటి చర్యలు.. ఇతర దేశాల సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తున్నాయని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. అమెరికాకు దశాబ్దాలుగా అండగా ఉన్న యూరోపియన్ దేశాలు, ఇతర మిత్రదేశాలతో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు, ఆ దేశాల మధ్య ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసింది. ఐక్యరాజ్యసమితి లాంటి సంస్థలకు నిధులు తగ్గించడం కూడా తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది.
Also Read: కూటమిలో కాకరేపుతున్న జమ్మలమడుగు రాజకీయం.. ఆదినారాయణ రెడ్డి అసలు స్కెచ్ అదేనా..!
ఇతర దేశాలపై భారీగా టారిఫ్‌లు విధించడం, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను పక్కన పెట్టి.. అమెరికా ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఏర్పడింది. ముఖ్యంగా.. ఇరాన్ లాంటి దేశాల విషయంలో కఠినంగా వ్యవహరించడం, అంతర్జాతీయ చట్టాలను గౌరవించకపోవడం లాంటివి శాంతిని కోరుకునే దేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం, అమెరికా ప్రయోజనాల కోసం.. పాత మిత్రులను దూరం చేసుకోవడం వల్ల.. ట్రంప్‌పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రంప్ గనక తన దూకుడుని ఇలా కంటిన్యూ చేస్తే.. రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలు అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి రావొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. ఇప్పటికే, ప్రపంచ దేశాలు అగ్రరాజ్యంగా అమెరికా నాయకత్వంపై నమ్మకం కోల్పోతున్నాయ్. చాలా దేశాలు తమ రక్షణ కోసం ఇతర కూటముల్ని ఏర్పరచుకోవడం, సొంతంగా సైనిక శక్తిని పెంచుకోవడం మొదలుపెట్టాయ్. దాదాపు అన్ని దేశాల నుంచి వచ్చే దిగుమతులపై భారీగా టారిఫ్‌లు విధించడంతో.. అంతర్జాతీయ వాణిజ్యం మందగించింది. ఇతర దేశాలు కూడా ప్రతిచర్యగా అమెరికా వస్తువులపై పన్నులు వేస్తాయ్. దీనివల్ల.. వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి, ప్రపంచవ్యాప్తంగా సామాన్యులపై భారం పడుతుంది. ఇది.. గ్లోబల్ రిసెషన్‌కు దారితీసే ప్రమాదం ఉంది.
ఇక ట్రంప్ పారిస్ వాతావరణ ఒప్పందం, ఇతర 66 అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికాను బయటకు తీసుకొచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఇచ్చే నిధులను కూడా నిలిపేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా పక్కకు తప్పుకుంటే, గ్లోబల్ వార్మింగ్ తగ్గించే ప్రయత్నాలు కుంటుపడతాయ్. దీనివల్ల.. ప్రకృతి వైపరీత్యాలు పెరిగి అన్ని దేశాలు నష్టపోతాయనే చర్చ జరుగుతోంది. అంతర్జాతీయ సహాయ సంస్థలకు నిధులు నిలిపేయడం వల్ల.. ఆఫ్రికా, ఆసియాలోని పేద దేశాల్లో లక్షలాది మంది ఆకలితో అలమటించే పరిస్థితి రావొచ్చు. తను అనుసరిస్తున్న విధానాలు అమెరికాను బలోపేతం చేస్తాయని ట్రంప్ భావిస్తుండొచ్చు. కానీ, అంతర్జాతీయంగా చూస్తే ఇదొక అస్థిరమైన ప్రపంచ క్రమానికి పునాది వేస్తోంది. సహకారం ఉండాల్సిన చోట వివాదాలు పెరగడం వల్ల అభివృద్ధి కుంటుపడి, సంఘర్షణలు పెరిగే ప్రమాదం ఉందంటున్నారు.
Storey By: Anup Big Tv
Also Read: తెలంగాణ టీమ్‌కు దేశ బాధ్యతలు.. ఏఐసీసీ సంచలన నిర్ణయం..?