Telangana Politics: స్వేచ్ఛ బ్యూరో: కేరళంలో యూడీఎఫ్ విజయం సాధిస్తే, టీ కాంగ్రెస్ లీడర్లకు మరింత ప్రాధాన్యత ఇచ్చేందుకు ఏఐసీసీ సిద్ధమైనట్లు సమాచారం. కేరళం ఫలితాలు ఆధారంగా దేశ వ్యాప్తంగా ప్రత్యేకంగా కమిటీలు వేయాలని, ఇందులో తెలంగాణ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏఐసీసీ అగ్రనేత భావిస్తున్నట్లు తెలిసింది. ఇదే విషయంపై తాజాగా ఏఐసీసీలో చర్చ జరుగగా, మెజార్టీ సభ్యులు అంగీకరించినట్లు పార్టీలో ప్రచారం జరుగుతుంది. కేరళ శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత, పార్టీలో సంస్థాగత మార్పులు చేపట్టి తెలంగాణ నేతలకు జాతీయ కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆలోచిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ పీసీసీ కి కూడా హైకమాండ్ నుంచి ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు.
కేరళలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, రేవంత్ రెడ్డి మధ్య జరిగిన ‘మాటల యుద్ధం’ జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. సీఎం రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు యూడీఎఫ్ కూటమికి ప్లస్ అవుతున్నాయి. కేరళంలోని ప్రజల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు ఆలోచింపచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వస్తే, అది తెలంగాణ నేతల వ్యూహాలకు దక్కిన విజయంగా ఏఐసీసీ గుర్తించే ఛాన్స్ ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉన్నది. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా ఎన్నికలు లేని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అమలు చేస్తున్న ‘ఆరు గ్యారంటీలు, ఇతర ప్రభుత్వ ఫాలసీలపై ప్రచారం చేయడానికి ప్రత్యేక టీమ్‌ను ఉపయోగించుకోవాలని హైకమాండ్ ప్లాన్ చేస్తోంది.
Also Read: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..?
రాహుల్ గాంధీ మార్గనిర్దేశంలో మల్లికార్జున ఖర్గే ఆదేశాలతో కాంగ్రెస్‌ను ఇక నుంచి నిరంతరం మరింత ఎక్కువగా ప్రజల్లో ఉండే ‘మూవ్‌మెంట్’గా మార్చాలని చూస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి ప్రత్యేక టీమ్ ప్రచారానికి వెళ్లనున్నది. ఎన్నికల లేని రాష్ట్రాల్లోనూ విడతల వారీగా తెలంగాణ నేతలతో మీటింగ్‌లు, సమన్వయ చర్చలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నదిన ఏఐసీసీ లెవల్లో చర్చ జరిగింది. దీనికి అగ్రనాయకత్వ సభ్యులంతా సపోర్టు చేసినట్లు తెలిసింది. కేరళ ఫలితాల అనంతరం ఏర్పాటు చేసే ఏఐసీసీ సమన్వయ కమిటీల్లో తెలంగాణకు చెందిన కనీసం నలుగురు సీనియర్ నేతలకు చోటు దక్కే అవకాశం ఉంది. మరో వైపు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక తరహాలోనే తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా ప్రదర్శించడానికి ఒక ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసే యోచనలో ఖర్గే ఉన్నారు. కేరళ ఫలితాలు సానుకూలంగా వస్తే, ఏఐసీసీలో తెలంగాణ నేతల హవా మరింత పెరగడం ఖాయం. రేవంత్ రెడ్డిని కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాకుండా, పార్టీ జాతీయ స్టార్ క్యాంపెయినర్‌గా ఖర్గే ప్రమోట్ చేయనున్నారు.
గతంలో కర్ణాటక ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి, సీఎల్పీ లీడర్ గా భట్టి విక్రమార్కలు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధానంగా కలబురగి, బీదర్ వంటి ఏరియాల్లో విస్తృతంగా పర్యటించారు. దీంతో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ లోకి వచ్చింది. ఇక మహారాష్ట్రలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కలు ప్రచారం చేశారు. ముఖ్యంగా తెలుగు జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగారు. తద్వారా గతంతో పోల్చితే కాంగ్రెస్ ఓట్ షేర్ పెరిగింది.ఇక రాజస్థాన్లో మంత్రి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు క్షేత్రస్థాయిలో సమన్వయం చేసినా, ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ఆశించిన ఫలితం రాలేదు. ప్రస్తుతం కేరళంలో సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ సీఎం విజయన్‌పై చేసిన వ్యాఖ్యలతో ప్రచారంలో జోష్ నింపారు.ఇక ప్రస్తుతం కేరళతో పాటు అస్సాం, తమిళనాడులో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో తెలంగాణ నేతలు చురుగ్గా పాల్గొంటున్నారు. కేవలం ప్రసంగాలు మాత్రమే కాకుండా, బూత్ స్థాయిలో ఓటర్లను సమీకరించే ‘తెలంగాణ మోడల్’ మైక్రో-మేనేజ్‌మెంట్‌ను అక్కడ అమలు చేస్తున్నారు.అంతేగాక సోషల్ మీడియాలో ‘తెలంగాణ అభివృద్ధి’ వీడియోలను ఆయా రాష్ట్రాల భాషల్లోకి అనువదించి ప్రచారం చేస్తున్నారు.
Also Read: తెలంగాణలో జనాభా గణనకు డేట్ ఫిక్స్.. ఈ తప్పులు అస్సలు చేయకండి?