Trump Tariffs: ట్రంప్.. తాను తీసుకున్న గోతిలోనే తానే పడుతున్నారా? అమెరికాను మాంద్యంలోకి నెడుతున్నారా..?రికా అమెరిక ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కానుందా..? ఆర్థిక నిపుణులంతా ఇప్పుడు దీన్నే చర్చిస్తున్నారు. ట్రంప్ దెబ్బకు ఇది వరకు ఎన్నడూ లేని విధంగా అమెరికన్ స్టాక్ మార్కెట‌్లు పతనాన్ని చవిచూస్తున్నాయి. ట్రంప్ టారీఫ్‌లతో గ్లోబల్ మార్కెట్ కూడా బెంబేలెత్తుతోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే, అమెరికాలో మళ్లీ మాంద్యం రాబోతోందా అనే డౌట్లు వస్తున్నాయి. ఇక అమెరికాలో మాంద్యం తప్పదా..? తాజాగా మార్కెట్ క్రాష్ అవ్వడానికి కారణం ఏంటీ..? ప్రపంచ వ్యాప్తంగా దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది..?
ఏప్పిల్ 2న, ప్రపంచ దేశాలపై ప్రతీకారం తీర్చుకున్న ట్రంప్
అమెరికాకు రెండోసారి ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ దెబ్బ మామూలుగా లేదు. ట్రంప్ వేసే టారిఫ్‌లతో ప్రపంచ దేశాలకు సమస్య వస్తుందేమో అనుకున్నారు అంతా. అయితే, ట్రంప్ టారీఫ్‌లు అమెరికా మెడకే చుట్టుకునే పరిస్థితి వచ్చిందనేది ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట. తాను ఎప్పటి నుండో చెబుతున్నట్లుగానే ఏప్రిల్ 2న, ప్రెసిడెంట్ ట్రంప్ ప్రపంచ దేశాలపై ప్రతీకారం తీర్చుకున్నారు. వైట్ హౌస్‌లోని రోజ్ గార్డెన్‌లో “లిబరేషన్ డే”ను నిర్వహించిన ట్రంప్, తాను అమలు చేయబోయే సుంకాలతో సంచలన ప్రకటన చేశారు. అమెరికా ఫస్ట్ నినాదంతో “విముక్తి దినోత్సవం” చేశారు కానీ.. ఈ చర్యల ఫలితంగా ఇప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ అయోమయంలో పడేటట్లు ఉంది.
అత్యంత దారుణంగా దెబ్బతిన్న యుఎస్ స్టాక్ మార్కెట్
అమెరికా దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై 10% సుంకం ప్రవేశపెట్టిన ప్రెసిడెంట్ ట్రంప.. 60 ఇతర దేశాలపై రకరకాలుగా అదనపు దిగుమతి పన్నులు విధించారు. కట్ చేస్తే.. ఒక్క రోజులో అమెరికా మార్కెట్ అతలాకుతలం అయ్యింది. ఒక్క అమెరికానే కాదు.. ట్రంప్ సుంకాల ప్రభావం ప్రపంచ మార్కెట్లపై ఇప్పటికే కనిపించేసింది. యుఎస్ స్టాక్ మార్కెట్ ఇప్పటివరకు ఎప్పుడూ లేనంతగా అత్యంత దారుణంగా దెబ్బతింది. వాల్ స్ట్రీట్ తిరోగమనం, ప్రపంచ స్టాక్‌లలో తగ్గుదలతో ఆర్థికవేత్తల్లో కొత్త భయాలు మొదలయ్యాయి. యుఎస్ మాంద్యంలోకి వెళుతుందా అనే ఆందోళనలు పెరిగాయి.
యూరోతో పోలిస్తే ఆరు నెలల కనిష్ట స్థాయికి యుఎస్ డాలర్
ప్రెసిడెంట్ ట్రంప్ తెంపరితనంతో వేసిన సుంకాల తర్వాత.. యూరోతో పోలిస్తే యుఎస్ డాలర్ ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. దిగుబడితో పాటు యుఎస్ బాండ్ కుప్పకూలిపోయింది. వాస్తవానికి, ఈ సుంకాలు అమెరికాలో ఆర్థిక వృద్ధి, ఉత్పత్తిని పెంచడం కోసం ఉద్దేశించినప్పటికీ.. ఫలితం మాత్రం తల్లకిందులయ్యేలా ఉంది. గత కొన్ని వారాలు వెనక్కి తిరిగి చూసుకుంటే.. గతంలో ట్రంప్ చేసిన సుంకాల ప్రతిపాదనలకు ఆర్థిక వేత్తలు చాలా సవరణలు చేసారు. అయినా, ట్రంప్ స్టైల్ సుంకాలను అడ్డుకోలేకపోయారు. దీంతో.. రాబోయే రెండు నెలల్లో సుంకాల విధానం ఎలా ఉంటుందో చెప్పడం.. ఇండస్ట్రీయల్ నిపుణులు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ దెబ్బకు తట్టుకోలేక, అమెరికాలోకి పెట్టుబడులు ఆలస్యం అయితే.. అది మాంద్యాన్ని సృష్టిస్తుందనే అభిప్రాయాలు పెరుగుతున్నాయి.
ఇటీవల రూ.349 లక్షల కోట్ల మేరకు ఆవిరి
ఇటీవల, అధిక అమ్మకాల ఒత్తిడితో అమెరికన్ మార్కెట్ టెన్షన్ పెంచింది. నాస్‌డాక్, ఎస్ అండ్ పీ దారుణంగా పడిపోగా.. ఏకంగా నాలుగు ట్రిలియన్ డాలర్లు… అంటే, రూ.349 లక్షల కోట్ల మేరకు తుడిచిపెట్టుకుపోయింది. ఫ్రాన్స్, యూకే వంటి కొన్ని దేశాల జీడిపి కంటే ఇది ఎక్కువ మొత్తం. ఈ పరిణామంతో అగ్రరాజ్యంలో ఆర్థికమాంద్యం నెలకొందనే వాదనలు ఊపందుకున్నాయి. ఇప్పుడు, ట్రంప్ లిబరేషన్ డే దెబ్బతో మార్కెట్ అంతా కుదేలయ్యింది.
ఏప్రిల్ 4న ట్రేడింగ్ ఆరంభంలోనే డౌజోన్స్ సూచిక..
ప్రెసిడెంట్ ట్రంప్ సుంకాలు విధిస్తూ చేసిన ప్రకటన, స్టాక్ మార్కెట్ సూచీలను కుదిపేసింది. భారీ నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభం అయ్యింది. ట్రంప్ నిర్ణయాలతో ఆర్థిక మాంద్యం భయాలు తీవ్రంగా ఉండటంతో… పెట్టుబడిదారులు అమ్మకాలకు దిగారు. వివిధ దేశాలపై ట్రంప్ సుంకాలను విధించడం వల్ల వాణిజ్య యుద్ధం మొదలవుతుందనే ఆందళనతో పాటు ఆర్థిక మాంద్యం వస్తుందనే భయాలు కూడా ఎక్కువయ్యాయి. ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను భారీగా దెబ్బతీసింది. ఏప్రిల్ 4న ట్రేడింగ్ ఆరంభంలోనే డౌజోన్స్ సూచిక 1500 పాయింట్లకు పైగా నష్టపోయి 40 వేల 665 వద్ద ట్రేడ్ అయ్యింది. నాస్డాక్ దాదాపు 5% క్షీణించగా, S&P 500 సూచిక 4 శాతం వరకు పతనమైంది. ఇక, వాల్ స్ట్రీట్‌కు వెన్నెముకగా ఉన్న ప్రధాన కంపెనీల షేర్లలో అమ్మకాలు భారీగా పెరిగాయి. దీంతో.. నైకీ షేర్లు 12 శాతం పతనమయ్యాయి. యాపిల్ షేర్లు కూడా 9% నష్టపోయాయి.
మెటా, టెస్లా, అమెజాన్, ఇతర ప్రధాన కంపెనీల షేర్లు కుదేలు
ఐఫోన్ తయారీకి ప్రధాన సరఫరాదారుగా ఉన్న చైనాపై అమెరికా భారీ సుంకాలు విధించడంతో సరఫరా వ్యవస్థకు అంతరాయం కలుగుతుందనే భయంతో యాపిల్ షేర్లు భారీగా పతనమయ్యాయి. 2020 తర్వాత యాపిల్ స్టాక్ ఈ స్థాయిలో పతనం కావడం ఇదే మొదటిసారి. మెటా, టెస్లా, అమెజాన్ వంటి ఇతర ప్రధాన కంపెనీల షేర్లలోనూ అమ్మకాలు పెరుగుతున్నాయి.
Also Read: గ్లాసు గల్ గల్.. సైకిల్ క్లింగ్ క్లింగ్.. వైసీపీ ఖాళీ
చిప్ తయారీ కంపెనీ ఎన్విడియా సైతం ఇదే పరిస్థితి
ఇక, చిప్ తయారీ కంపెనీ ఎన్విడియా సైతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ కంపెనీ చిప్‌ల తయారీ కోసం ప్రధానంగా తైవాన్‌పై ఆధారపడటంతో షేర్లు పతనమవుతున్నాయి. అమెరికాకు అత్యంత సన్నిహితమైన వాణిజ్య భాగస్వామి తైవాన్ ఉంది. అలాంటి దేశం కూడా ట్రంప్ టారిఫ్‌తో షాకయ్యింది. తైవాన్‌పై అమెరికా ప్రకటించిన 32% సుంకం తైవాన్ ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావాన్ని చూపడంతో పాటు అక్కడి నుండి అమెరికాకు భారీగా దిగుమతి అయ్యే చిప్‌లపై ఇప్పుడు ఒత్తిడి పడనుంది.
తైవాన్ ఆర్థిక వ్యవస్థలో 60% కంటే ఎక్కువ ఆదాయం ఎగుమతుల నుండే వస్తుంది. అయితే, ఈ సుంకాల కారణంగా అమెరికాకు ఎగుమతులు బాగా తగ్గడం వల్ల రెండు దేశాలకూ నష్టం వాటిల్లుతుంది. ప్రస్తుతం, ఈ భయంతోనే అమెరికన్ మార్కెట్లు షేర్లన్నీ ఆవిరైపోతున్నాయి. ఇక, ట్రంప్ సుంకాల ప్రభావం క్రిప్టోకరెన్సీ మార్కెట్ పై కూడా భారీగా పడింది. బిట్ కాయిన్ 5% పతనమై 81 వేల 843 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా.. ఎథీరియం 7%, సోలానా 13% మేర నష్టపోయాయి.
ఒకే సెషన్‌లో యూఎస్ స్టాక్ విలువ $2.4 ట్రిలియన్లు ఆవిరి
ట్రంప్ లిబరేషన్ డే ప్రకటనల తర్వాత… ఒకే సెషన్‌లో యూఎస్ స్టాక్ విలువ $2.4 ట్రిలియన్లు ఆవిరైపోయింది. గ్లోబల్ మార్కెట్లు పతనమయ్యాయి. టెక్, బ్యాంకులు, ఇంధనం, రిటైలర్లు అన్నీ ఈ భారాన్ని భరించాల్సి వచ్చింది. ఏప్రిల్ 4న S&P 500 $2.4 ట్రిలియన్ల విలువను కోల్పోయింది. మార్చి 2020 తర్వాత ఒకే రోజులో ఇది అత్యంత దారుణమైన పతనం. ఇండెక్స్ 4.84% పడిపోయింది.
1679 పాయింట్లు కోల్పోయిన డౌలో
గంటల్లోనే వారాలుగా వచ్చిన లాభాలను తుడిచిపెట్టేసింది. డౌలో 16 వందల 79 పాయింట్లు కోల్పోయింది. ఇది జూన్ 2020 తర్వాత ఒక రోజులో ఏర్పడిన అత్యధిక క్షీణత. ఇక, నాస్డాక్ దాదాపు 6% క్షీణించింది. ఆపిల్ 9.2% నష్టాన్ని చవిచూసింది. అమెరికాలోని గృహాలకు $3 వేల 800 డాలర్ల వార్షిక నష్టం ఏర్పడింది. అలాగే.. స్మాల్ క్యాప్స్‌లో 6.6% తగ్గుదల కనిపించింది. చిన్నపాటి యూస్ కంపెనీలకు బెంచ్‌మార్క్ అయిన రస్సెల్ 2000… 6.6% పడిపోయింది. ట్రంప్ లెసోతోపై దేశంపై వేసిన 50% సుంకం కూడా ప్రభావం చూపింది.
అమెరికాలో 17% పెరుగుతున్న దుస్తుల ధరలు
ప్రస్తుతం, అమెరికా వ్యాప్తంగా.. దుస్తుల ధరల్లో 17% పెరుగుదల కనిపిస్తోంది. ఆగ్నేయాసియా నుండి వస్తున్న వస్త్రాలపై దిగుమతి సుంకాలు వేయడం వల్ల అమెరికాలో దుస్తుల ధరలు 17% పెరుగుతున్నట్లు యేల్ యూనివర్సిటీ అంచనా వేసింది. మరోవైపు, రిటైలర్‌లు నైక్ 14.4%, రాల్ఫ్ లారెన్ 16.3% షేర్లు నష్టపోయాయి. ట్రంప్ టారిఫ్ టార్చర్‌కు భయపడి.. పెట్టుబడిదారులు భద్రత వైపు పారిపోవడంతో.. 10 సంవత్సరాల ట్రెజరీ దిగుబడి 4.20% నుండి 4.04%కి పడిపోయింది. ఇది అక్టోబర్ 2024 తర్వాత.. స్లోగా పెరుగుతున్న మాంద్యం భయాలకు సంకేతంగా ఉంది.
అమెరికా సగటు టారిఫ్ రేటును 22.5%
ట్రంప్ కొత్త టారిఫ్‌లు అమెరికా సగటు టారిఫ్ రేటును 22.5%కి తీసుకువచ్చాయి. ఇది 1909 తర్వాత అత్యధికంగా కనిపిస్తోంది. ఇక, పాత సుంకాలతో కలిపి, చైనీస్ వస్తువులపై ట్రంప్ వేసిన సుంకం రేటు ఇప్పుడు 70%కి చేరుకుంది. దీనితో చైనా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది. ఈ పరిణామం తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా చైనాల ట్రేడ్ వార్ షురూ కానుంది. ఇది, అమెరికా ఆర్థిక వ్యవస్థను అల్లకల్లోలం చేసే ఛాన్స్ కూడా లేకపోలేదు.