LSG Vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025లో భాగంగా శుక్రవారం రోజు అటల్ బిహారీ వాజ్పేయి స్టేడియం వేదికగా లక్నో తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ముంబై బ్యాటింగ్ చివరి ఓవర్ కి ముందు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీసుకున్న నిర్ణయంతో అందరూ షాక్ కి గురయ్యారు. హార్దిక్ పాండ్యా తీసుకున్న ఆవేశపూరిత నిర్ణయం ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీసింది.
లక్నోతో జరిగిన మ్యాచ్లో తెలుగు ఆటగాడు తిలక్ వర్మను రిటైర్డ్ చేయాలని ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయం పై విమర్శలు వస్తున్నాయి. ముంబై విజయానికి 7 బంతుల్లో 24 పరుగులు అవసరం అయిన దశలో.. ముంబై ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. చివరి ఓవర్లలో బౌండరీలు కొట్టేందుకు తిలక్ వర్మ ఇబ్బందులు పడుతున్న సమయంలో ముంబై హెడ్ కోచ్ జయవర్ధనే, కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ విషయాన్ని కోచ్ జయవర్ధనే డగౌట్ లో కూర్చుని మ్యాచ్ చూస్తున్న స్టార్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ కి చెప్పాడు. ఇది విన్న సూర్య కుమార్ యాదవ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అతడు తన భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడు. అతడికి నచ్చజెప్పేందుకు జయవర్ధనే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ పై అతడు సంతోషంగా లేనట్లుగా అనిపించింది.
ఇక తిలక్ వర్మ రిటైర్డ్ హార్ట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన మిచెల్ షాంట్నర్ కేవలం రెండు బంతులే ఆడాడు. ఇంత దానికి ఈ షాకింగ్ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. మ్యాచ్ మధ్యలో ఇలా వెనక్కి రప్పించడంతో అతడి కాన్ఫిడెన్స్ దెబ్బతింటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత సంవత్సరం ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ తర్వాత అత్యధిక పరుగులు {416} చేసింది తిలక్ వర్మ ఏనని గుర్తు చేస్తున్నారు.
ఐపీఎల్ మాత్రమే కాదు టీమిండియా తరఫున టీ-20 ల్లో ఈ యంగ్ ప్లేయర్ కి మంచి రికార్డ్ ఉంది. తిలక్ 25 మ్యాచ్ లలో 50 సగటుతో 749 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా పర్యటనలో వరుసగా ఈ రెండు సెంచరీలు నమోదు చేశాడు. అలాంటి ఆటగాడిని ముంబై యాజమాన్యం మ్యాచ్ మధ్యలో ఇలా వెనక్కి రప్పించి అవమానించిందని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన తిలక్ వర్మ 23 బంతుల్లో 25 పరుగులు చేసి రిటైర్డ్ అవుట్ గా పెవిలియన్ చేరాడు.
ఇక ముంబై విజయం సాధించాలంటే ఆరు బంతుల్లో 22 పరుగులు చేయాల్సి ఉంది. ఆఖరి ఓవర్ లో మిచెల్ శాంట్నర్ కి స్ట్రైకింగ్ ఇచ్చేందుకు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆసక్తి చూపించలేదు. ఇక మ్యాచ్ ఓటమి ఖాయమైన తరువాత ఆఖరి బంతికి శాంట్నర్ కి స్ట్రైకింగ్ ఇచ్చాడు. కానీ అతడు పరుగులేమి చేయలేదు. దీంతో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు ఆడగా.. ఇది ఆ జట్టుకు మూడో ఓటమి కావడం గమనార్హం.
Sky's sad reaction for Tilak verma when they made him retired out.💔💔
It will truly dent the Confidence of Tilak Varma 🥺
pic.twitter.com/jJOy60cqAi— Radha (@Rkc1511165) April 5, 2025