Karnataka RSS: ఒకవైపు ప్రియాంక్ ఖర్గే..
ఇంకోవైపు యతీంద్ర సిద్ధరామయ్య..
ఇద్దరు కాంగ్రెస్ యువ నేతలు ఆల్ ఆఫ్ సడెన్ గా ఆరెస్సెస్ పై విరుచుకుపడడం కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.
ఒకరు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొడుకు. ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వంలో మంత్రి.
మరొకరు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కొడుకు. ఎమ్మెల్సీగా ఉన్నారు.
ఒకరు ఆరెస్సెస్ ను బ్యాన్ చేయాలి.. పబ్లిక్ ఈవెంట్లకు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వొద్దంటే.. మరొకరు.. ఆరెస్సెస్, తాలిబాన్ మైండ్ సెట్ ఒకటే అని, హిందూయిజాన్నే మొత్తం తీసుకురావాలనుకుంటోందన్నారు. దీంతో ఒక్కసారిగా అలజడి పెరిగింది.
ఉన్నట్లుండి ఈ ఇద్దరూ ఆరెస్సెస్ ను టార్గెట్ చేసుకోవడం వెనుక ఏం జరుగుతోందన్నది కీ ఫ్యాక్టర్ గా మారింది.
అసలు కర్ణాటకలో ఆరెస్సెస్ ఉండొద్దు..
ఆ పదమే వినిపించొద్దు..
యూత్ మైండ్ సెట్ పాడు చేస్తున్నారు..
రాజ్యాంగ వ్యతిరేక పనులు చేస్తున్నారంటూ ప్రియాంక్ ఖర్గే కౌంటర్ ఇచ్చారు.
సంఘ్ పై విమర్శల వరకు అయితే వివాదం ఉండేది కాదు.
ప్రభుత్వ స్థలాల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకలాపాలను నిషేధించాలని కోరుతూ కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాసిన తర్వాత కర్ణాటకలో రాజకీయ వివాదం చెలరేగింది.
కర్ణాటక కాంగ్రెస్ లో సంఘ్ వ్యతిరేక రాగాలు
లేఖలో ఏముందంటే.. ప్రభుత్వ పాఠశాలలు, ఆట స్థలాలు దేవాలయాలలో సంఘ్ శాఖలు, సమావేశాలను నిర్వహించడం ద్వారా పిల్లలు, యువతలో విభజన ఆలోచనలను ఆర్‌ఎస్‌ఎస్ వ్యాపింపజేస్తోందని ఆరోపించారు. అలాంటి కార్యక్రమాలు రాజ్యాంగ విరుద్ధమని, జాతీయ ఐక్యతా స్ఫూర్తికి వ్యతిరేకమన్నారు. వాటిని పూర్తిగా బ్యాన్ చేయాలని స్వరం పెంచుతున్నారు. పోలీసుల అనుమతి లేకుండా జరిగే సంఘ్ శాఖల్లో దండ ఉపయోగిస్తారని, కర్రసాములు ఉంటాయని, పిల్లలు, యువతపై చెడు ప్రభావాన్ని చూపుతాయన్నారు ప్రియాంక్ ఖర్గే. అందుకే ప్రభుత్వ గ్రౌండ్లలో, బైఠక్ అనో, సాంఘిక్ అనో ఏ సమావేశం పెట్టినా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలను నిషేధించాలన్నారు. ఆ దిశగానే కర్ణాటకలో కథ ముందుకెళ్లింది. సర్కార్ కూడా సంఘ్ కార్యకలాపాలపై అడుగు ముందుకేస్తోంది.
కర్ణాటక కాంగ్రెస్ నేతల్లో సంఘ్ వ్యతిరేక స్వరాలు
ప్రియాంక్ ఖర్గే అక్కడితో ఆగలేదు. ఆర్ఎస్ఎస్ ప్రతిపాదించిన ఫండమెంటలిస్టిక్ భావజాలం కారణంగా భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పై షూ విసిరే వాతావరణం ఏర్పడిందన్నారు. రాజ్యాంగం ఆదర్శాలను – ఐక్యత, సమానత్వం సమగ్రతను – నిలబెట్టే లక్ష్యంతో పని చేసుకువెళ్దామని, అలాంటి ప్రయత్నాలను నిరోధించే లక్ష్యంతో పని చేసే వ్యక్తులను సంస్థలను అడ్డుకోవాలన్న స్వరాలు కర్ణాటక కాంగ్రెస్ లో పెరుగుతున్నాయి. అయితే కర్ణాటకలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలను ప్రైవేట్‌గా నిర్వహించుకోవచ్చని, ప్రభుత్వ సంబంధిత స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో మాత్రం అనుమతించొద్దంటున్నారు.
సంఘ్ ను తాలిబాన్లతో పోల్చిన యతీంద్ర
అటు మల్లికార్జున ఖర్గే కుమారుడు అలా లేఖ రాయగానే.. ఇలా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు, కాంగ్రెస్ నాయకుడు యతీంద్ర సిద్ధరామయ్య రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను తాలిబన్లతో పోల్చడం పెను దుమారానికి కారణమైంది. తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత పర్యటన సందర్భంగా యతీంద్ర ఈ కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరో కాంగ్రెస్ నాయకుడు బికె హరిప్రసాద్ కూడా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. సో కర్ణాటక కాంగ్రెస్ లో ఇప్పుడు ఆరెస్సెస్ వ్యతిరేక స్లోగన్స్ పెరుగుతున్నాయి. కోరస్ పెరుగుతోంది. ఉన్నట్లుండి ఎందుకిలా?
సంఘ్ గురించి ఏం తెలుసు అని బీజేపీ కౌంటర్
సంఘ్ పై కాంగ్రెస్ నేతలు ఇంతలా ఫైర్ అవుతుంటే.. బీజేపీ ఊరుకుంటుందా.. గట్టిగానే కౌంటర్లు ఇస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం, ఆ సంస్థ నిర్వహిస్తున్న కార్యకలాపాలు తెలియని వారు మాత్రమే ఇలాంటి కామెంట్లు చేస్తారని కర్ణాటక బిజెపి అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర కౌంటర్ ఇచ్చారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ప్రియాంక్ ఖర్గే రాసిన లేఖ ఆయన మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తుందన్నారు. కాంగ్రెస్ రెండు మూడు సార్లు ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించిందని, కానీ తర్వాత ఆ నిషేధాలను ఉపసంహరించుకుందని విజయేంద్ర అన్నారు. మరి తప్పు లేకపోతే బ్యాన్ ఎందుకు ఎత్తేస్తారని క్వశ్చన్ చేశారు. ఆరెస్సెస్ వ్యతిరేక కామెంట్లు అన్నీ పదవులు కాపాడుకునేందుకు, గాంధీ కుటుంబాన్ని సంతృప్తి పరచడమే లక్ష్యంగా ఉన్నాయంటోంది బీజేపీ.
RSS సేవను ఖర్గే అభినందించారన్న కర్ణాటక బీజేపీ
ఈ డైలాగ్ వార్ సందర్భంగా కర్ణాటక బిజెపి మల్లికార్జున ఖర్గేకు సంబంధించి ఓ ఫోటో షేర్ చేసింది. ( GFX-13-101/ KHARGE RSS) ఈ ఫోటో 2002 నాటిది. ఇందులో మల్లికార్జున ఖర్గే ఉన్నారు. బెంగళూరులోని నాగవారాలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమానికి మల్లికార్జున్ ఖర్గే హాజరైన ఈ పాత ఫోటోను షేర్ చేసింది బీజేపీ. 2002లో కర్ణాటక హోం మంత్రిగా ఉన్నప్పుడు వెళ్లిన సీన్ ను ఎగ్జాంపుల్ గా చూపింది. మీ నాన్న స్వయంగా RSS క్యాంప్ ను సందర్శించి, RSS సామాజిక సేవా కార్యకలాపాలను అభినందించి, పూర్తి సహకారాన్ని అందిస్తే.. ఇవాళ మీరు కాంగ్రెస్ హైకమాండ్‌ను ఆకర్షించేందుకు షో చేస్తున్నారా అని ప్రియాంక్ ఖర్గేను ఉద్దేశించి కామెంట్ పెట్టింది.
ప్రజలను హెచ్చరించడానికే తన తండ్రి వెళ్లాడన్న ప్రియాంక్
అయితే ఈ పోస్ట్ పై ప్రియాంక్ ఖర్గే రియాక్ట్ అయ్యారు. బిజెపి వాదన తప్పుడు ప్రచారం అని కొట్టిపారేశారు. శాంతిభద్రతలకు భంగం కలిగించకుండా ప్రజలను హెచ్చరించడానికే తన తండ్రి అప్పటి పోలీస్ కమిషనర్ సాంగ్లియానాతో కలిసి ఆరెస్సెస్ క్యాంప్ సైట్ దగ్గరికి వెళ్లారని పోస్ట్ పెట్టారు. దేశ చట్టానికి కట్టుబడి ఉండాలి లేదా పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అని మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారన్న మాటల్ని గుర్తు చేశారు. సో మొత్తంగా కర్ణాటకలో ఇప్పుడు ఆరెస్సెస్ కేంద్రంగా సరికొత్త పొలిటికల్ గేమ్ సడెన్ గా కనిపించడం ఆసక్తికరంగా మారింది. అటు ఖర్గే కుమారుడు, ఇటు సిద్ధరామయ్య కుమారులిద్దరూ సంఘ్ కు వ్యతిరేకంగా ఒకేసారి రాగం ఎత్తుకోవడంతో తెరవెనుక ఏం జరిగి ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.