పిఠాపురంలో వర్మను జీరో చేశామని స్వయంగా మంత్రి నారాయణ టెలి కాన్ఫరెన్స్ లో మాట్లాడారంటూ వస్తున్న వార్తలపై ఆయనే నేరుగా స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. విశాఖలో పర్యటించిన మంత్రి నారాయణ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వ్యాఖ్యలపై స్పందించారు. ఆ వ్యాఖ్యలు తనవేనని ఒప్పుకున్న ఆయన, కట్ అండ్ పేస్ట్ చేసి సోషల్ మీడియాలో తప్పుడుప ప్రచారం చేశారని అన్నారు.
అసలేం జరిగింది?
ఇటీవల నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయడుకు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఈ దుమారం రేగింది. ఆ వ్యాఖ్యలతో జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ నొచ్చుకోవడంతో, సమస్యను సర్దుబాటు చేసేందుకు నెల్లూరు నాయకులతో మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే ఆ టెలికాన్ఫరెన్స్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి కారణం అయ్యాయి. పిఠాపురంలో జనసేనతో టీడీపీకి సమస్యలున్నాయని, అక్కడ వర్మ ఫెరోషియస్ నేత అని, ఆయన్ను జీరో చేయడంతో సమస్యలు సర్దుబాటు అయ్యాయని చెప్పుకొచ్చారు. దీంతో వర్మను జీరో చేయడమేంటని వైరి వర్గాలు ప్రశ్నించాయి. వర్మ కూడా తనను జీరో చేశారన్న వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారని సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.
వర్మ జీరో కాదు, హీరోనే..
నెల్లూరు నాయకులతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ప్రస్తావించానని చెప్పుకొచ్చారు మంత్రి నారాయణ. పిఠాపురంలో జనసేన, టీడీపీ ద్వితీయ శ్రేణి నేతల మధ్య ఉన్న విభేదాలను చర్చించి “జీరో” చేశామని తాను చెప్పానన్నారు. సమస్యలను జీరో చేశానని తాను అంటే, వర్మను జీరో చేశారన్నారని విపరీతార్థాలు తీస్తూ కట్ అండ్ పేస్ట్ చేసి తన వ్యాఖ్యల్ని తప్పుగా ప్రచారం చేశారన్నారు. టెలి కాన్ఫరెన్స్ లో తాను మాట్లాడిన కంటెంట్ మొత్తం బహిర్గతం చేసి ఉంటే వక్రీకరణలు ఎలా జరిగాయో అర్థం అయ్యేదని చెప్పారు. వక్రీకరించి విభేదాలు సృష్టించడం ఎవరి వల్ల కాదని, NDA కూటమి చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పారు. గతంలో పిఠాపురంలో ఇండిపెండెంట్ గా 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన బలమైన నాయకుడు వర్మ అని మరోసారి కితాబిచ్చారు. పిఠాపురంలో జనసేన,టీడీపీ సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాయని వివరించారు.
Also Read: మంత్రి నారాయణ కామెంట్స్ పై.. ఇన్ డైరెక్ట్‌గా స్పందించిన వర్మ..
వర్మ కూడా..
మంత్రి నారాయణను కలసిన వర్మ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చంద్రబాబు ఏం చెబితే అది చేస్తానన్నారు. చంద్రబాబు ఆగమంటే ఆగుతానని… దూకమంటే దూకుతానని చెప్పుకొచ్చారు. మంత్రి నారాయణ వ్యాఖ్యలపై అభూత కల్పనలు ప్రచారం చేశారని మండిపడ్డారు. పేటీఎం బ్యాచ్ చేసే అసత్య ప్రచారాలను తాను పట్టించుకోనన్నారు. తెలుగుదేశం పార్టీలో తాను పిల్లర్ లాంటి వాడినని, మంత్రి నారాయణ.. జనసేన, టీడీపీ మధ్య కాకినాడ జిల్లాలో వారధిగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. నారాయణ వివరణతో ఈ వ్యాఖ్యల దుమారం తగ్గిపోయిందనే చెప్పాలి. సమస్యలను జీరో చేశానని తానంటే, వర్మను జీరో చేశానన్నానని తప్పుడు ప్రచారం చేశారని చెబుతున్నారు నారాయణ.
Also Read: అలా మాట్లాడటం సరికాదు.. నారాయణపై నాదెండ్ల సీరియస్