Bihar Elections: దేశంలో చక్రం తిప్పిన స్ట్రాటజిస్ట్ అతడు. పీఎం దగ్గర్నుంచి సీఎంల దాకా తెరవెనుక పదునైన వ్యూహాలతో పీఠాలపై కూర్చోబెట్టిన చరిత్ర అతడిది. మరిప్పుడు సొంత స్ట్రాటజీ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో టైం వచ్చేసిందా? అంటే అవునన్న సమాధానమే వస్తోంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ కింగ్ అవుతుందా.. కింగ్ మేకర్ అవుతుందా? పొలిటికల్ ఎక్స్ పరిమెంట్ చేస్తున్నాడా? సొంత వ్యూహాలు ప్రశాంత్ కిషోర్ ను గట్టెక్కిస్తాయా?
స్వరాష్ట్రంలో సొంత పార్టీని గెలిపిస్తాడా?
రాజకీయ పార్టీలు ప్రశాంత్ కిషోర్ టీమ్ ను వ్యూహకర్తగా పెట్టుకునేందుకు పోటీ పడుతుంటాయి. అలాంటిది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కే పెద్ద టెస్ట్.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత పార్టీ జన సురాజ్ ను గట్టెకిస్తారా.. ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతున్నారు. తాను మాత్రం పోటీకి ఎందుకు దూరంగా ఉన్నారు.. జనరల్ సీట్లలో ఎస్సీ, ఎస్టీలకు ఎందుకు టిక్కెట్లు ఇస్తున్నారు.. జేడీయూ 20 సీట్లు దాటితే రాజకీయ సన్యాసం చేస్తానని సవాళ్లెందుకు విసురుతున్నారు.. మద్యపాన నిషేధం ఎందుకు ఎత్తేస్తానన్నారు.. ఉద్యోగ కల్పనపై ఎవరూ ఇవ్వని హామీలు ఎందుకు ఇస్తున్నారు..
తాను పోటీకి దూరంగా ఉంటానంటూ ప్రకటన
243 అసెంబ్లీ సీట్లలో బరిలో దింపుతున్న ప్రశాంత్ కిషోర్.. తాను మాత్రం పోటీకి దూరం అంటున్నారు. ఇందుకు కూడా చాలా లాజిక్స్ చెబుతున్నారు. ఇప్పటిదాకా ఎన్నో లాజిక్స్ చెప్పిన పీకే.. ఇప్పుడు సొంత పార్టీ గెలుపులో ఆ లాజిక్స్ ఎలా అప్లై చేస్తారు.. ఎలా తన పార్టీని గెలిపించుకుంటారన్నది కీలకంగా మారుతోంది. రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ ఏ పని చేసినా దాని వెనుక పెద్ద లాజిక్కులే ఉంటాయి. ఇప్పుడు తాను పోటీ నుంచి వైదొలగాలన్న నిర్ణయం వెనుక పొలిటికల్ యాక్సిడెంట్లు లేకుండా, కాస్ట్ డైనమిక్స్, ఇమేజ్ మేనేజ్‌మెంట్ ఉన్నాయంటున్నారు. వీటికి తోడు నితీష్ కుమార్ ఫార్ములా ఫాలో అయ్యే ప్లాన్ కనిపిస్తోంది. నితీష్ కూడా ఏ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ చేస్తారు. ఎమ్మెల్సీగా ఉంటూ సీఎం పగ్గాలు చేపడుతూ వస్తున్నారు. సో పీకే కూడా అదే ఫార్ములా అప్లై చేస్తున్నారు. మరి ప్రశాంత్ కిషోర్ పోటీ నుంచి తప్పుకోవడం ఆ పార్టీకి ఊపు తీసుకొస్తుందా.. ఆపేస్తుందా అన్నది చూడాలి.
తమ అభ్యర్థులకు నెగెటివ్ అవ్వొద్దనే పోటీకి దూరమా?
తాను పోటీ చేస్తే పార్టీ వనరులు దారి మళ్లి ఇతర అభ్యర్థులకు నెగెటివ్ అవుతుందంటున్నాడు ప్రశాంత్ కిషోర్. తాను ఎన్నికల్లో పోటీ చేస్తే, చాలా మంది జన్ సురాజ్ అభ్యర్థులు నష్టపోవచ్చని, పార్టీ ప్రయోజనాల కోసమే తగ్గుతున్నానన్నారు. అంతకు ముందు తేజస్వి యాదవ్ పై పోటీ చేసేందుకు పీకే రెడీ అయి తొడగొట్టారు. కానీ ఆ తర్వాత వెనక్కు తగ్గాడు. తేజస్వి యాదవ్ కంచుకోటలో గెలుపు అసాధ్యమనుకున్నాడో మరేంటో గానీ ఫైనల్ గా తప్పుకున్నారు. పీకే ఇప్పుడు ఏది మాట్లాడినా రాజకీయ వ్యూహం కోసం కాదు, ప్రజా హితం కోసమన్న మాట వినిపిస్తున్నాడు. తమ లక్ష్యం 150 సీట్లు గెలవడమంటున్నాడు. తన ఫోకస్ పార్టీని బలోపేతం చేయడం, అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులకు సపోర్ట్ ఇవ్వడం అని చెబుతున్నారు. తనకు సీట్లు రావాలని కోరుకోవడం లేదని, రాజకీయాలను మార్చాలనుకుంటున్నానన్నాడు పీకే. అయితే ప్రశాంత్ కిషోర్ పోటీ చేస్తే, ఆయన్ను అంతా సీఎం అభ్యర్థిగా చూస్తారని, బ్రాహ్మణ వర్గానికి చెందిన పీకేకు కులాల లెక్కలు ఎన్నికల్లో నెగెటివ్ అవుతాయంటున్నారు.
చాలా మంది నేతలు ప్రచారాలు చేస్తూ గెలవలేదా?
అయితే పోటీకి ఎందుకు దూరమో.. ప్రశాంత్ కిషోర్ చెప్పిన కారణం కరెక్ట్ ఉందా అంటే.. కంప్లీట్ రాంగ్ అని కొందరు అంటున్నారు. చాలా మంది అగ్ర నేతలు మిగితా వారి కోసం ఎన్నికల ప్రచారాలు చేస్తూ పోటీ చేసి గెలిచారు. ప్రధాని నరేంద్ర మోడీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో 206 ర్యాలీలు, రోడ్‌షోలు చేసి వారణాసిలో పోటీ చేసి గెలిచారు. రాహుల్ గాంధీ సుమారు 75 ర్యాలీలు చేసి రాయ్‌బరేలీ వాయనాడ్‌లో రెండింటిలోనూ గెలిచారు. అటు 2023లో రేవంత్ రెడ్డి తెలంగాణ అంతటా కాంగ్రెస్ అభ్యర్థుల తరపున రోజూ ప్రచారాలు చేసి కొడంగల్ లో ఘన విజయం సాధించారు. తేజస్వి యాదవ్ 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 247 ర్యాలీలు, 4 రోడ్‌షోలు చేసి రాఘోపూర్‌లో పోటీ చేసి గెలిచారు. ఇవన్నీ ఉదాహరణలు ఉండగా.. పీకే ఎందుకు పోటీకి దూరంగా ఉన్నారన్న ప్రశ్నలు వస్తున్నాయ్.
సొంత వ్యూహాల్లో పీకే సక్సెస్ అవుతారా?
ఎందరికో వ్యూహాలు అందించి సక్సెస్ అయిన ప్రశాంత్ కిషోర్ తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జన్ సురాజ్ పార్టీ మొదటిసారి పోటీ పడుతోంది. ఇలా బిహార్ లో తొలిసారి పోటీ చేసిన పార్టీలు ఒక్కసీటు కూడా గెలుచుకోకుండా కనుమరుగైపోయాయి. 2019లో పప్పు యాదవ్ జన అధికార్ పార్టీ ఒక్క సీట్ కూడా గెలవలేదు. 2024లో కాంగ్రెస్‌లో విలీనమైంది. 2020లో ప్రియా చౌదరీ ప్లూరల్స్ పార్టీ 102 సీట్లలో పోటీ చేసి ఒక్కటి కూడా గెలవలేదు. అయితే గత పార్టీల అనుభవాలతో ఈసారి గట్టిగానే పొలిటికల్ ప్రయోగానికి పీకే రెడీ అయ్యారు. టిక్కెట్ల కేటాయింపుల్లో సోషల్ ఇంజినీరింగ్ ను ఫాలో అవుతున్నారు. జనరల్ స్థానాల్లోనూ ప్రయోగాత్మకంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ, ముస్లిం మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే బిహార్ లో గత లెక్కల్ని చూద్దాం. 2005 నుంచి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి మొత్తం 1,205 మంది SC ST అభ్యర్థులు జనరల్ సీట్లల్లో పోటీ చేశారు. అయితే అందులో ఐదుసార్లు మాత్రమే గెలిచారు. అంటే కేవలం 0.42% మాత్రమే. మరి ప్రశాంత్ కిషోర్ లెక్కల్ని తిరగరాస్తాడా అన్నది కీలకంగా మారింది.
ఎన్నో రాష్ట్రాల్లో.. అంతెందుకు కేంద్రంలోనూ ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడుతారు అని సర్వేలు చేసి అంచనాలు వెలువరించిన ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు బిహార్ లో ఎలాంటి ప్రీపోల్ అంచనాలు రిలీజ్ చేశారు? ఆయన చెప్పిన ప్రిడిక్షన్ ఏంటి? అది సొంత రాష్ట్రంలో పీకే అనుకున్నట్లు జరుగుతుందా? తొలిసారి పోటీ చేస్తున్న జన్ సురాజ్ పార్టీకి బిహార్ లో వెల్కమ్ ఎంట్రీ ఎలా ఉండబోతోంది?
జన్ సురజ్ పార్టీ గెలుపు లెక్కలేంటి?
బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. ఇందులో 122 స్థానాలను గెలుచుకున్న వారికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవైపు ఎన్డీఏ కూటమి ఉంది. ఇంకోవైపు మహా గట్ బంధన్ ఉంది. మధ్యలో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సురాజ్ ఉంది. అన్ని లెక్కలు వేసుకున్న ప్రశాంత్ కిషోర్ బిహార్ ఎన్నికల్లో ఏం జరగబోతోంది.. ఎవరు గెలుస్తారు.. ఓడేదెవరు.. తన పార్టీ పరిస్థితి ఏమిటన్నది ఇటీవలే అంచనాలు రిలీజ్ చేశారు. బిహార్ లో ఎన్డీఏ కూటమి కచ్చితంగా ఓటమికి రెడీగా ఉందన్నాడు పీకే. సీట్లు, అభ్యర్థులను ఖరారు చేయడంలో బీజేపీ-జేడీయూ కూటమి విఫలమైందన్నారు. సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపికపై ఎన్డీఏలోని కొందరు నాయకులు అసంతృప్తిగా ఉన్నారన్న విషయాలను ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రీయ లోక్ మోర్చా చీఫ్ ఉపేంద్ర కుష్వాహా ఈసారి NDAలో ఏదీ బాగా లేదు అని చెప్పిన విషయాన్ని ప్రస్తావించడం, జితన్ రామ్ మాంఝీ తమ పార్టీని లైట్ తీసుకుంటున్నారని చెప్పడాన్ని ప్రస్తావిస్తూ ముందుకు వెళ్లే పరిస్థితి లేదంటున్నారు. మొదట ఎన్నికల వ్యూహకర్తగా తర్వాత జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ తో క్లోజ్ గా పనిచేసిన ప్రశాంత్ కిషోర్…, నితీష్ పని అయిపోతున్నట్లు లెక్కలు వేశారు. పీకే అంచనాల ప్రకారం జేడీయూకు 25 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. నితీష్ ఇక బిహార్ సీఎం అవడం కలే అంటున్నారు. అటు ఇండియా కూటమి అంటే మహా గఠ్ బంధన్ లో కూడా పరిస్థితి ఏమంత బాగాలేదంటున్నారు. ఆర్జేడీ-కాంగ్రెస్ మధ్య పరిస్థితులు బాగా లేవని, రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రతిపక్ష నేత అయినప్పటికీ బిహార్ లో ఆయన్ను లైట్ తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో రాహుల్ ఎఫెక్ట్ ఏదీ లేదంటున్నారు.
JSPకి వస్తే 150, లేదంటే పదిలోపే అంటూ జోస్యం
ఆశ్చర్యంగా తన సొంత పార్టీకి బిహార్ లో ఎలాంటి విజయావకాశాలు ఉన్నాయో కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పేశారు. జన్ సురాజ్ విషయంలో ప్రశాంత్ కిషోర్ చిత్రమైన లెక్క చెప్పారు. గెలిస్తే బంపర్ మెజార్టీ లేదంటే గ్రౌండ్ జీరో అన్నారు. అంటే వస్తే 150 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని లెక్కలేశారు. లేకపోతే 10 సీట్లలోపే పరిమితం అవుతుందని చెప్పడం ద్వారా ఒక సిగ్నల్ ఇచ్చుకున్నారు. అయితే గెలుపుపై కచ్చితమైన అంచనాలను పీకే కూడా వేసుకోలేకపోతున్నారు. ప్రశాంత్ కిషోర్ బిహార్ లో చేపట్టిన పాదయాత్రలో 3 ఏళ్లలో 1 కోటి మందిని కలిశాడు. గ్రాస్‌రూట్ ఇమేజ్ పెంచుకున్నాడు. మిడిల్ క్లాస్ ను ఆకర్షించే పని చాలా చేశారు. అయినప్పటికీ తన పార్టీకి ఓట్లు వేసే విషయంలో మహిళలు, యూత్ ఎలాంటి ఆలోచనతో ఉన్నారో కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. మహిళల కోసం ప్రస్తుత ప్రభుత్వం చాలా పథకాలు అమలు చేస్తోంది. ఎన్నికల హామీలుగా చాలా గుప్పించింది. మరి ఈ నేపథ్యంలో మహిళలు, యువత ఓట్లను ప్రశాంత్ కిషోర్ పార్టీ ఏమేరకు గ్రాబ్ చేస్తుందన్న విషయాలపై ఆధారపడి గేమ్ ఉండబోతోంది.
థర్డ్ ఫ్రంట్‌గా ఎదగాలనుకుంటున్న ప్రశాంత్
2022లో ప్రారంభించిన జన్ సురాజ్ అభియాన్ పాదయాత్ర ద్వారా పీకే… 5 వేలకు పైగా గ్రామాలను కవర్ చేసి, 2024 అక్టోబర్‌లో పార్టీని అధికారికంగా లాంచ్ చేశాడు. 243 సీట్లలో 150+ సీట్లు గెలవడం టార్గెట్ పెట్టుకున్నారు. నితీష్, తేజస్వి కూటములకు ధీటుగా థర్డ్ ఫ్రంట్ గా ఎదగాలనుకుంటున్నాడు. అందుకే బిహార్ ఎన్నికల్లో హామీలను నిర్మాణాత్మకంగా ఇచ్చారు. అందులో కొన్ని చూద్దాం. ప్రతి గ్రామంలో ఇంగ్లీష్ మీడియంలో ఒక స్మార్ట్ స్కూల్, డిజిటల్ లెర్నింగ్ ఏర్పాట్లకు హామీ ఇచ్చాడు. యువతకు ఉచిత స్కిల్ ట్రైనింగ్, IIT- ఐఐఎం లాంటి ఇన్‌స్టిట్యూట్లు బిహార్‌లో స్థాపించేలా చొరవ, నిరుద్యోగం తగ్గించడం వంటి హామీలిచ్చారు.
Also Read: ఆస్తి కోసం 3 రోజులుగా తల్లికి అంత్యక్రియలు చేయని కూతుళ్లు.. ఛీ, వీళ్లు మనుషులేనా?
అటు మేక్ ఇన్ బిహార్ క్యాంపెయిన్ తో IT, మాన్యుఫాక్చరింగ్ హబ్‌లు తీసుకొస్తానంటున్నారు. ప్రతి జిల్లాలో 1 లక్ష ఉద్యోగాలు కల్పించడం, పెట్టుబడిదారులకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం, ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్, మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫండ్ ఏర్పాటు, అవినీతి చేసిన రాజకీయ నేతల ఆస్తుల స్వాధీనం, డిజిటల్ గవర్నెన్స్ అంటే అన్ని ప్రభుత్వ సర్వీస్‌లు ఆన్‌లైన్ లోనే అందించడం, RTI సింప్లిఫై చేయడం, గంగా క్లీనప్, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌లు ఇలాంటి పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు పీకే. మరి వీటికి జనం ఓట్లు వేస్తారా లేదా అన్నది చూడాలి. వీటికి తోడు రాజకీయం ఎలాగూ ఉండనే ఉంటుంది. జేఎస్‌పీని ‘RJD B-టీమ్’గా BJP అంటోంది. ఇది మైనారిటీ వోట్లను పోలరైజ్ చేస్తుందంటున్నారు. బిహార్ రాజకీయాలు అంటేనే కులాల కుంపట్లుంటాయ్. ఇందులో ఎవరిది పైచేయి?
Story By Vidya Sagar, Bigtv