Etela Rajender: కాషాయ పార్టీలో కీలకంగా ఎదిగిన మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మైండ్ బ్లాంక్ చేశాయా..? సొంత ఇలాక హుజురాబాద్‌లోనే ఆయన పట్టు తగ్గిందా..? మరో ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకోవడంలో కీ రోల్ పోషించిడంతో పార్టీలో బలం, బలహీనతల సమీకరణాలు మారిపోయాయా..? ఆ క్రమంలో గ్రేటర్ సహా, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు రాబోయే ఎన్నికలు ఇప్పుడు ఈటలకు ప్రతిష్టాత్మక పోరాటంగా మారబోతున్నాయా..?
తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ ప్రయాణం ప్రత్యేకమైందని చెప్పవచ్చు. కానీ బీజేపీలో చేరిన తర్వాత ఆయనకు బయట రాజకీయాల కంటే అంతర్గత సమీకరణాలే పెద్ద సవాల్‌గా మారాయట. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఆయన సొంత నియోజకవర్గం హుజురాబాద్‌లో నెలకొన్న పరిస్థితులు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మల్కాజ్‌గిరి ఎంపీఈటల రాజేందర్ మధ్య జరుగుతున్న కోల్డ్‌వార్‌కి మున్సిపల్ ఎన్నికలే నిదర్శనంగా నిలిచాయన్న టాక్ నడుస్తోంది. కొంతకాలంగా ఆ ఇద్దరు నేతల అనుచర వర్గాలు పరస్పరం విమర్శలు చేసుకుంటుండటం.. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో ఐక్యత .. ఎండమావిలా తయారైంది.
హుజురాబాద్ నియోజకవర్గం ఈటల రాజకీయ జీవితానికి బలమైన పునాది వేసింది. టీఆర్ఎస్‌తో పొలిటికల్ ఎంట్రి ఇచ్చి అప్పటి కమలాపురం నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 2009తో కమలాపురం హుజూర్‌నగర్లో విలీనం అవ్వడంతో అక్కడి నుంచి గులాబీపార్టీ అభ్యర్ధిగా వరుసగా నాలుగు సార్లు గెలిచి మంత్రిగా పనిచేసిన చరిత్ర ఆయనది. తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరి 2021లో జరిగిన బైపోల్స్‌లో ఏడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ క్రమంలో హుజూరాబాద్ నా గడ్డ, ఎవ్వడు అడ్డు వచ్చినత అంతు చూస్తానని పలుమార్లు ఈటల హాట్ కామెంట్స్ చేసినప్పటికీ 2023 ఎన్నికల్లో అదే హుజూరాబాద్ నుంచి తొలిసారి ఓటమి పాలయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీగా గెలిచి ఈటల సత్తా చాటుకున్నారు. అలాంటాయన ప్రభావం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పెద్దగా కనిపించకపోవడం .. ముఖ్యంగా హుజూరాబాద్‌లో అసలు కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. పార్టీ అంతర్గత నిర్ణయాల కారణంగా ఆయన్ని కరీంనగర్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో ప్రచారానికి దూరంగా ఉంచారనే ఆరోపణలు ఈటల వర్గం నుంచి వినిపిస్తున్నాయి. అంతేకాదు కావాలనే ఈటలను కరీంనగర్ లో అడుగు పెట్టకుండా బండి సంజయ్ అడ్డుపడ్డారన్న టాక్ సైతం ఉంది.
ఈటల గులాబీ పార్టీలో ఉన్నప్పుడు హుజురాబాద్ సెగ్మెంట్లోని హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో ఆ పార్టీ జెండా ఎగిరింది. అయితే తాజా ఎన్నికల్లో ఆ రెండు చోట్ల బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేక, ఆశించిన ఫలితాలు రాబట్టడంలో విఫలం అయ్యింది. దాంతో బండి సంజయ్ కేవలం కరీంనగర్ కార్పొరేషన్ మీద మాత్రమే ఫోకస్ చేసి, ఆ జిల్లాల్లో మున్సిపాలిటీలను పూర్తిగా విష్మరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కరీం నగర్ కార్పొరేషన్ మినహాయిస్తే అక్కడ ఉన్న మున్సిపాలిటీల్లో కాషాయపార్టీ ప్రభావం చూపలేకపోవడం చర్చనీయాంశమైంది.
ఇక కరీంనగర్ కార్పొరేషన్‌లో విజయాన్ని కేంద్రమంత్రిగా బండి సంజయ్ తన రాజకీయ ప్రతిష్టగా భావించి పనిచేశారు. అక్కడ కార్పొరేటర్‌గా పనిచేసిన అనుభవంతో స్థానికంగా పట్టుచాటుకుని, ఢిల్లీ నాయకత్వం దగ్గర మంచి మార్కులు సంపాదించారు. మరోవైపు ఈటల రాజేందర్‌ను కరీంనగర్ కాదు కనీసం తన హుజురాబాద్ సెగ్మెంట్ కు కూడా రానివ్వకపోవడం, ప్రచారం చేయనివ్వకపోవడం ఆ పార్టీలోపెద్ద దుమారమే రేపుతోంది. ఈటలను దూరం చేయడం బీజేపీకి కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో పెద్ద మైనస్ అయిందన్న టాక్ ఆ జిల్లా పార్టీ బీజేపీ వర్గాల్లో నడుస్తుందట.
ఇక ఈటలను సొంత జిల్లాకు వెళ్లనివ్వకుండా ఆయనకు మల్కాజిగిరి సెగ్మెంట్‌లోని మేడ్చల్ పరిధిలోని కొన్ని మున్సిపాలిటీలను అప్పజెప్పారు. ఆ మున్సిపాలిటీల్లోనూ ఈటల పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కొన్ని చోట్ల మద్దతు రాజకీయాలు చేసి వైస్ చైర్మన్ పదవులు తీసుకోవడం తప్ప సొంతగా బీజేపీ ఏ మున్సిపాల్టీలోనూ విజయం సాధించలేదు. దాంతో ఈటల రాజేంద్రపై సొంత పార్టీ నేతలు చేస్తున్న కుటిల రాజకీయాలకు సంబంధించి ఆయన వర్గీయులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట.
కరీంనగర్ పంచాయితి అటుంచితే హైదరాబాద్‌ను ప్రభుత్వం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించింది. అయితే మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్‌కు ఇప్పుడు అక్కడ రానున్న కార్పొరేషన్ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారే అవకాశముంది. కరీంనగర్‌లో బండి సంజయ్ పార్టీని గెలిపించుకున్న తరహాలో ఈటల మల్కాజ్‌గిరి కార్పొరేషన్లో సత్తా చూపిస్తారా? లేక ఇక్కడ కూడాఅంతర్గత విభేదాలే అడ్డంకిగా మారతాయా..? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
మొత్తానికి కమలం పార్టీలో బండి, ఈటల మధ్య ఆధిపత్యపోరు మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తోంది. ఒకరు కరీంనగర్ కార్పొరేషన్ గెలిచి పైచేయి సాధిస్తే, మరొకరు రాబోయే ఎన్నికల్లో తన శక్తి చాటుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. మరి మల్కాజ్‌గిరి కార్పొరేషన్ ఫలితం ఈటల రాజకీయ భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్ అవుతుందా..? పార్టీ అంతర్గత సమీకరణాలు మారతాయా..? అన్న చర్చ మొదలైంది. అయితే ఇదంతా బండి సంజయ్ వర్గాలే కావాలని ప్రచారం చేయిస్తున్నాయని, ఈటల రాజేందర్‌పై ఉద్దేశపూర్వకంగా బురద జల్లెందుకు ప్రయత్నిస్తూ.. ఆయన ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని చూస్తున్నాయని ఈటల వర్గీయులు మండిపడుతున్నారు. చూడాలి మరి కరీంనగర్ రిజల్ట్ మల్కాజిగిరిలో రిపీట్ అవుతుందా..?లేక ఈటల విషయంలో మొదటికే మోసం వస్తుందో?
Story by: Apparao, Big Tv