Assembly Attendance: స్వేచ్ఛ బ్యూరో: ప్రజా సమస్యలపై చర్చించి, ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టాల్సిన శాసనసభలో అధికార పక్షం సభ్యుల హాజరు చర్చనీయాంశంగా మారింది. 22ఏపై కీలక చర్చ జరుగుతున్న సమయంలో దాదాపు 10 నిమిషాల పాటు సభలో ఒక్క మంత్రి కూడా లేకపోవడం ఆసక్తికర పరిణామానికి దారితీసింది. ప్రభుత్వం తరఫున సమాధానం చెప్పాల్సిన సందర్భంలో మంత్రులు సభకు దూరంగా ఉండటం కనిపించింది. ఆ సమయంలో సభలో అధికార పక్షానికి చెందిన సుమారు 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీంతో అధికార పక్షం బెంచీలు దాదాపు ఖాళీగా కనిపించాయి. ప్రతిపక్షం నుంచి సీపీఐ, ఎంఐఎం, బీజేపీ సభ్యులు సభలో ఉన్నప్పటికీ.. ప్రభుత్వ పక్షం నుంచి మంత్రులెవరూ లేకపోవడం చర్చకు దారితీసింది.
శాసనసభ సమావేశాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరుకావాలని ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు, హెచ్చరికలు చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ ఉంది. ముఖ్యంగా కీలక అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు సభలో అందుబాటులో ఉండాలని సూచించినప్పటికీ.. 22ఏ అంశంపై చర్చ సందర్భంగా పరిస్థితి భిన్నంగా కనిపించింది. మధ్యాహ్నం 12.55 గంటల నుంచి1.05 గంటల వరకు ఒక్కరూ సభలో కనిపించలేదు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వచ్చారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా సభలోకి వచ్చారు. సీఎం హెచ్చరికలను సైతం పట్టించుకోకుండా మంత్రులు సభకు దూరంగా ఉండటంపై అధికార పక్షంలోనే అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు సభా సమావేశాలకు హాజరై చర్చల్లో పాల్గొనాల్సిన బాధ్యత ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
Also Read: యుపిఐ పేమెంట్స్‌పై ఫ్లాట్ MDR.. పెట్రోల్, రైల్వే, ఇన్‌సూరెన్స్ రంగాలకు కొత్త రూల్స్
అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలోకి ప్రవేశించిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అప్పటివరకు పలుచగా కనిపించిన అధికార పక్షం బెంచీల్లోకి మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసగా రావడం ప్రారంభించారు. కొద్దిసేపటికే మంత్రులు, అధికార పార్టీ సభ్యులతో సభ నిండిపోయింది.దీంతో సీఎం సభలో ఉన్నప్పుడు మాత్రమే మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతున్నారా? అనే చర్చ మొదలైంది. సీఎం సభకు వచ్చిన వెంటనే అధికార పక్షం బెంచీల్లో హాజరు పెరగడం ఈ ఘటనకు మరింత ప్రాధాన్యం తెచ్చింది.
శాసనసభలో ఏ అంశంపైనైనా చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల మంత్రులు సభలో ఉండటం, సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం సాధారణ ప్రక్రియ. అలాంటి సమయంలో ఒక్క మంత్రి కూడా సభలో లేకపోవడం అధికార పక్షం సభా నిర్వహణపై ప్రశ్నలు తలెత్తేలా చేసింది. అధికార పార్టీ సభ్యులు మాట్లాడుతున్న సమయంలో ప్రధానప్రతిపక్షం గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాలను ఎత్తిచూపే సందర్భంలో సపోర్టుగా ఉండాల్సి ఉంది. అయితే ఆస్థాయి స్పందన కూడా రాకపోవడం గమనార్హం.ముఖ్యమంత్రి పదేపదే హాజరుపై దృష్టి సారిస్తున్నప్పటికీ.. ఆచరణలో మాత్రం మంత్రులు, ఎమ్మెల్యేల హాజరు విషయంలో ఇలాంటి పరిస్థితులు కనిపించడం గమనార్హం. సీఎం వస్తేనే సభ కిక్కిరిసిపోవడం.. అంతకుముందు మంత్రులెవరూ లేకపోవడం అధికార పక్షం సభ్యుల హాజరు తీరుపై మరోసారి చర్చకు తెరతీసింది.
Also read: కీసరలో అర్ధరాత్రి 5 లక్షల లంచం.. ఏసీబీకి రెడ్ హ్యండెడ్‌గా దొరికిన ఎస్ఐ!