22A Land: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితా (సెక్షన్ 22-ఏ)చుట్టూ ఇప్పుడు నడుస్తున్న రాజకీయం మాత్రం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. భూముల సర్వే, కేటాయింపులు, వర్గీకరణలో అసలు పొరపాటు ఎవరిది?సీసీఎల్ ఏ దా? క్షేత్రస్థాయిలో రెవెన్యూ యంత్రాంగాన్ని నడిపించే కలెక్టర్లదా? అనేది చర్చాంశనీయమైంది. ఈ వ్యవహారం వెనుక ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు పక్కా వ్యూహంతో ఏదైనా ‘కుట్ర’ జరుగుతోందా? అని ఇప్పుడు అధికార కాంగ్రెస్ నాయకులతో పాటు ఎమ్మెల్యేల్లోనూ డిస్కషన్ జరుగుతుంది.
ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లోనూ, బయటా కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం హయాంలో ఉన్నతాధికారులుగా ఉన్న కొందరు ఆఫీసర్లు.. ఇప్పటికీ ప్రతిపక్ష నేతలతో లాలూచీ పడి ఉన్నారనేది ఆయా అధికార పక్ష ఎమ్మెల్యేల ప్రధానంగా ఆరోపించారు. 22 ఏ ఎపిసోడ్ లోనూ కొందరు అధికారులు కావాలనే ప్రభుత్వాన్ని బద్నాం చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుమానిస్తున్నారు. దీనిపై త్వరలోనే సంపూర్ణ వివరాలను వెలికితీస్తామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. పైగా సీసీఎల్ఏ ఆదేశాల మేరకే 22 జాబితాలోకి భూములు చేర్చామని కలెక్టర్లు కూడా ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో మిస్టేక్‌ను పసిగట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ప్రభుత్వ అంతర్గత నిర్ణయాలు, రెవెన్యూ నివేదికలు అధికారుల నుంచే నేరుగా విపక్షాల చేతుల్లోకి వెళ్తున్నాయనే అనుమానాలు కొంత మంది ఎమ్మెల్యేల్లో వ్యక్తమవుతుంది. అంతేగాక క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ కావాల్సిన కలెక్టర్లు, ప్రాక్టికల్ సమస్యలను పరిష్కరించకుండా డీలే చేయడంతోనూ ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తుంది. టెక్నికల్ గా జరిగిన పొరపాట్లను సరిదిద్దడంలో అధికారుల జాప్యం వల్ల ప్రభుత్వంపై విమర్శల పర్వం కొనసాగుతుంది. మరోవైపు గత ప్రభుత్వాల హయాంలో జరిగిన భూ రికార్డుల గందరగోళాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వానికే ఆపాదిస్తూసోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో రైతులు, బాధితుల్లో గందరగోళం ఏర్పడుతుంది. అధికారుల నిర్లక్ష్యంతో 22 ఏ అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం ఏర్పడింది.
Also read: హుజూరాబాద్‌లో షాకింగ్ ఘటన.. అర్ధరాత్రి ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో గురుకుల విద్యార్థులు కలకలం
ఈ పరిణామాలన్నింటిపై ముఖ్యమంత్రి తీవ్ర సీరియస్‌గా ఉన్నారు. విపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు సీఎం రంగంలోకి దిగారు. బుధవారం అసెంబ్లీలో సుదీర్ఘంగా 22 ఏ అంశంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై సమాధానం ఇచ్చారు. బీఆర్ ఎస్ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు, నిర్లక్ష్యాన్ని సభ ముందు ఉంచారు. కలెక్టర్లు, సీసీఎల్ ఏ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, 22-ఏ భూముల సమస్యను త్వరితగతిన పరిష్కరించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు నిజాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని పార్టీ వర్గాలకు సీఎం ఆదేశాలిచ్చారు. బాధితులకు న్యాయం జరిగేలా 22-ఏ జాబితాను సమీక్షించి, అర్హులైన భూ యజమానులకు ఊరటనిచ్చే దిశగా స్పష్టమైన కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సీఎం అసెంబ్లీలో ప్రకటించారు.
కొన్ని పాత జాబితాలను, సరైన క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు, ఆన్‌లైన్ పోర్టళ్లకు పంపడం ద్వారా వేలాది సర్వే నంబర్లు బ్లాక్ అయ్యాయని రెవెన్యూ శాఖ మంత్రి కూడా అంగీకరించారు. జిల్లా స్థాయిలో రికార్డులను సమగ్రంగా పరిశీలించకుండా కలెక్టర్లు నివేదికలు పంపడం, సమస్యను గుర్తించినా వెంటనే సరిదిద్దకుండా కాలయాపన చేయడం వల్ల పరిస్థితి చేజారింది.మైనింగ్, పారిశ్రామిక ప్రాజెక్టులు,ప్రభుత్వ కేటాయింపుల సర్వే నంబర్ల పరిధిలో ఉన్న చుట్టుపక్కల ప్రైవేటు భూములను కూడా గుడ్డిగా నిషేధిత జాబితాలో చేర్చడం శాపంగా మారింది.
అనవసరంగా 22-ఏ పరిధిని విస్తరించి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి రగిలించేలా అధికారులు వ్యవహరిస్తున్నారని, ఆ రగడను విపక్షాలు రాజకీయంగా వాడుకునేందుకు ఆఫీసర్లు సహకరిస్తున్నారని కొందరు ఎమ్మెల్యేలు సీఎం వద్ద మొరపెట్టుకున్నారు. ఇక ఊళ్లలో, నగరాల్లో ప్రతి రోజూ ప్రజలు తమ ఆస్తులను ఎందుకు 22-ఏ లో పెట్టారని ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు. మొత్తానికి 22 ఏ అంశం ఇటు అసెంబ్లీ.. అటు కౌన్సిల్ లో పెద్ద రచ్చకు దారి తీసింది.
Also read: అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల షాక్.. మూడేళ్ల తర్వాత పెరుగుదల, భారత్ మార్కెట్‌పై ప్రభావం?