సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహంలో కేటీఆర్ చిక్కుకున్నాడా? ఆది నుంచి కేటీఆర్ డైరెక్షన్ మొత్తం బూమరాంగ్ అవుతుండగా.. తనంతట తానే సర్కార్‌కు అస్త్రాలను సమకూర్చి ఇస్తున్నాడా..? అతి చేయబోయి అది తిరగబడి సెల్ఫ్ డిఫెన్స్‌లో పడుతున్నాడా…? అసెంబ్లీ సెషన్స్ మొదలైనప్పటి నుంచి తాజాగా ఫామ్‌హౌజ్ భూముల లొల్లి దాకా కేటీఆర్ వ్యవహార శైలి, తప్పటడుగులు ఆ పార్టీని మరింత డ్యామేజీ చేస్తున్నాయా? అంటే అవుననే సమధానాలే వస్తున్నాయి.. ఆ పార్టీ మేలు కోరే వారి దగ్గర నుంచి కూడా.
నిన్నఅసెంబ్లీలో రేవంత్‌రెడ్డి .. కేసీఆర్ ఫామ్‌హౌజ్ భూముల లెక్కలు తేల్చాలని ఆదేశించడం … కేటీఆర్ కోపం నశాళానికి అంటేలా చేసినట్టుంది. ఇవాళ అదే వీరావేశంతో ప్రెస్‌మీట్ పెట్టాడు. తిట్ల పురాణం అందుకున్నాడు. కేసీఆర్‌ను భూస్వామ్య కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా చెప్పుకున్నాడు. పుట్టడమే 2 వేల ఎకరాల్లో పుట్టాడని అన్నాడు. ఆయన తండ్రికి వందల ఎకరాలుండేనని కూడా చెప్పుకొచ్చాడు. కానీ ఉండేందుకు ఇప్పటికీ ఇల్లే లేదన్నాడు. అందుకే ఆయన ఫామ్‌హౌజ్‌లో ఉంటున్నాడని, తాను మరోచోట ఉండాల్సి వస్తుందని సమర్థించుకున్నాడు కేటీఆర్.
కేసీఆర్ గురించి గొప్పులు చెప్పుకున్నాడు బాగానే ఉంది. కానీ సీఎంను కించపరిచేలా నువ్వో పెయింటర్.. నీకు ఎక్కడ్నుంచి ఇన్ని ఆస్తులు వచ్చాయో చెబుతావా? అంటూ ఎదురుదాడికి దిగాడు కేటీఆర్. తన చదువు గురించి గొప్పగా చెప్పుకున్న కేటీఆర్.. సీఎం చదువుపైనా వెటకారంగా మాట్లాడటం బూమరాంగ్ అయ్యింది. తమ్ముళ్ల అక్రమ ఆస్తులు ఎలా కూడబెట్టారనే ఆరోపణలే తప్ప.. కచ్చితమైన ఆధారాలు చూపకుండానే మాట్లాడటం కూడా దెబ్బకు దెబ్బ అనే రీతిలో కేటీఆర్ స్పందించినట్టుగా అనిపించింది.
తండ్రిపై వచ్చిన ఈ భూ ఆరోపణలను కేటీఆర్ తట్టుకోలేకపోయినట్టున్నాడు. కంట్రోల్ తప్పినట్టుగా మాట్లాడాడు. రారా పోరా.. సన్నాసి.. హౌలాగా అనే మాటలను విరివిగా అనేశాడు. గోడలపై రాతలు రాసేవాడు.. అనడం దొరహంకారం కిందకే వస్తుంది. కంటెంట్ మీద మాట్లాడి.. సూటిగా సమాధానాలు, ఎదురు ప్రశ్నలు వేయడం ఓకే.. కానీ వ్యక్తిగతంగా దాడి చేయడమే సరైన సమాధానం చెప్పినట్టవుతుందనే కేటీఆర్ భావన ప్రతీసారి బూమరాంగ్ అవుతూ వస్తోంది.
సీఎం ఆరోపణలు అవాస్తవమైనప్పుడు వాటిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించి.. తమ సచ్చీలతను చాటుకునే విధంగా కేటీఆర్ మాట తీరుండాలి. కేసీఆర్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు.. రేవంత్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆస్తుల వివరాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిద్దామనడం ఓకే.
కానీ మధ్యలో వీరావేశంలో మాట్లాడిన తీరు కేటీఆర్‌ను ఆవేశపరుడిగానే చూపుతుంది తప్ప.. ఓ పరిణతి చెందిన నేతగా జనాలు స్వీకరించలేరు. పైగా మీడియాను స్లాటర్ హౌజులు అంటూ తిట్టిపోశాడు. తన ఫ్రస్ట్రేషన్ స్థాయి ఎలా ఉందో ఈ ఒక్క మాటతో బయటపడింది. మరి కేటీఆర్ నెలకు కోట్లకు కోట్లు పెట్టి పెంచి పోషిస్తున్న మీడియా హౌజులను ఏమంటారు? ఇక్కడే కేటీఆర్ తడబడుతున్నాడు. తప్పుటడుగులు వేస్తున్నాడు. దొరికిపోతున్నాడు. అంతిమంగా కాంగ్రెస్ వ్యూహానికి చిక్కి విలవిలలాడుతున్నాడు.