Ex Minister Yanamala: యనమల రామకృష్ణుడు.. ఏపీ పాలిటిక్స్ గురించి కాస్త తెలిసిన వారికైనా పరిచయం అక్కరలేని పేరు. మోస్ట్ సీనియర్, మోస్ట్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పొలిటిషియన్ ఆయన. పార్టీ అధికారంలో ఉన్నా.. విపక్షంలో ఉన్నా.. పదవులు ఆయనను వరించేవి. అలాంటి నేత ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. అది కూడా చాలా నెలలుగా. చిరకాల కోరిక అంటూ పదవి కోసం ఆయన నోరు తెరిచి అడిగినా కానీ.. పార్టీ ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇంతకీ యనమల ఫ్యూచర్ ఏంటి? అధిష్టానం ఆయనను పక్కన పెట్టేసిందా? లేక ఆయన కోసం ఏదైనా పెద్ద పదవిని సిద్ధం చేస్తుందా?
42 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారి పదవి లేకుండా యనమల
పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా కీలక బాధ్యతలు నిర్వర్తించడంలో తొలి స్థానంలో ఉంటారు యనమల రామకృష్ణుడు. కానీ తన 42 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ పదవీ లేకుండా ఉండటం ఇదే తొలిసారి కావొచ్చు. టీడీపీలో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న యనమల ఇలా పదవి లేకుండా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. యనమల శకం ఇక ముగిసినట్టేనా అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతోంది.
2025 మార్చిలో ముగిసిన ఎమ్మెల్సీ పదవీకాలం
తన ఎమ్మెల్సీ పదవీకాలం 2025 మార్చిలో ముగిసింది. ఆ తర్వాత మరోసారి కొనసాగింపు ఉంటుందని భావించిన యనమల అనుచరులకు నిరాశే మిగిలింది. టీడీపీకి దక్కిన మూడు స్థానాల్లో రెండు బీసీలకు కేటాయించారు సీఎం చంద్రబాబు. కానీ అందులో యనమలకు అవకాశం ఇవ్వకపోవడం దేనికి సంకేతమనే చర్చ అప్పట్లోనే జరిగింది. కావాలనే పక్కన పెట్టారా? లేక ఇంకా పెద్ద పదవి ఆయన కోసం సిద్ధం చేస్తున్నారా అనే చర్చ జరిగింది.
టీడీపీలో అత్యంత సీనియర్ నేతల్లో యనమల ఒకరు
చంద్రబాబుతో పాటు టీడీపీలో అత్యంత సీనియర్ నేతల్లో రామకృష్ణుడు ఒకరు. మంత్రిగా, స్పీకర్‌గా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అనేక కీలకపదవులు నిర్వహించిన యనమల 73 ఏళ్ల వయస్సులోనూ చురుగ్గానే ఉంటున్నారు. తుని నియోజకవర్గం నుంచి 1983-2004 మధ్య ఏకంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు యనమల. కానీ 2009లో తొలిసారి ఓడిపోయారు. అయినప్పటికీ కీలక పదువులు ఇచ్చి గౌరవించింది టీడీపీ. ఈ సారి మాత్రం ఆ సంప్రదాయం కొనసాగించకపోవడం యనమల పొలిటికల్ కెరీర్‌కు చెక్ పెట్టినట్టే అని ప్రచారం సాగుతోంది.
యనమల పొలిటికల్ కెరీర్‌కు చెక్ పెట్టినట్టే అని ప్రచారం
పార్టీలో యువతను ప్రోత్సహించాలనే కొత్త ఫార్ములావల్లే యనమల లాంటి సీనియర్లను పక్కన పెడుతున్నారని పార్టీలోనే అంతర్గత ప్రచారం సాగుతోంది. యనమల కుమార్తె దివ్యను తుని నుంచి రంగంలోకి దింపడం అందులో భాగమే అంటున్నారు. మరి కొందరు మాత్రం యనమల ఇటీవల చేసిన పొరపాట్ల కారణంగానే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారనే చర్చ జరుగుతోంది.
సొంత పార్టీపై బాహాటంగానే తన అసంతృప్తి
ఇన్ని సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడు హుందాగా ఉండే యనమల రామకృష్ణుడు.. ఇటీవల సొంత పార్టీపై బాహాటంగానే తన అసంతృప్తిని వెళ్ళగక్కారు. కాకినాడ సెజ్ విషయంలోతన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కారు. ఇక తనకు రాజ్యసభకు వెళ్లాలని ఉందంటూ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇలా అంతర్గతంగా చర్చించాల్సిన విషయాలపై ఆయన వ్యవహరించిన విధానం పార్టీలోని యువ నాయకత్వానికి.. యనమలకు మధ్య గ్యాప్ తీసుకొచ్చిందనే చర్చ జరుగుతోంది.
తన కుమార్తెకు తుని అసెంబ్లీ టికెట్
గత ఎన్నికల ముందు యవత రాజకీయాల్లోకి రావాలని భారీ స్టేట్‌మెంట్ ఇచ్చి తన కుమార్తెకు తుని అసెంబ్లీ టిక్కెట్ తెచ్చుకున్నారు యనమల. ప్రస్తుతం ఆమె గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. చిన్నల్లుడు మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీగా, వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ మైదకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. తన కుటుంబం నుంచి ఇంతమంది పదవుల్లో ఉన్నా సరే నా చిరకాల కోరిక సంగతేంటి అంటున్నారు యనమల. రాజ్యసభ సభ్యునిగా చేయలనేది తన జీవితకాలపు కోరిక అని, ఆ విషయం పార్టీ అధిష్టానం చేతుల్లో ఉందని తుని టీడీపీ కార్యకర్తల సమావేశంలో చెప్పడం కూడా చర్చనీయాంశం అవుతోంది. ఇన్నాళ్ళు ఎన్ని పదవులు చేసినా ఒక్కసారి రాజ్యసభకు వెళ్ళాలని.. తన చిరకాల కోరిక తీర్చుకుని తన రాజకీయ జీవితానికి ఘనంగా ముగింపు పలకాలన్నది యనమల ఆలోచనగా కనిపిస్తోంది.
ఎక్కడా వినిపించని యనమల పేరు
యనమల ఇలా బహిరంగంగా మాట్లాడుతున్నా కానీ.. టీడీపీ అధిష్టానం మాత్రం స్పందించడం లేదు. ఎక్కడా ఆయన పేరు వినిపించడం లేదు. పార్టీ పెద్దలు కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఇదే సమయంలో యనమల మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై వైసీపీ చేపట్టిన నిరసనలపై ఆయన స్పందించారు. ప్రభుత్వం వీటిని లైట్‌గా తీసుకుంటోందని, అలా చేయడం సరికాదంటున్నారు. వైసీపీ చేస్తున్న ఆందోళనలు క్షేత్రస్థాయికి చేరుతున్నాయంటూ హెచ్చరించారు. మరి ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.
Also Read: సర్పంచ్ ఎన్నికలపై బండి మాస్టర్ ప్లాన్..
మరోవైపు యనమల పార్టీకి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని హై కమాండ్ ఏదో ఒక కీలకపదవి ఇస్తుందనే చర్చ అయితే జరుగుతోంది. 2027లో ఖాళీ అయ్యే 23 ఎమ్మెల్సీ స్థానాల్లో ఆయనకు చోటు కల్పిస్తారని యనమల అభిమానులు ఆశిస్తున్నారు. మరి వారి కోరిక నెరవేరుతుందో లేదో చూడాలంటే టీడీపీ పార్టీ అధ్యక్షుడు నిర్ణయం కోసం మరికొంతకాలం ఆగాల్సిందే.
Story By Vamshi Krsihna, Bigtv