Big Stories

Farmers Protest in Delhi: బీజేపీని వెంటాడుతున్న రైతు ధర్నా భయం.. మరోసారి ఢిల్లీ వద్ద భారీ నిరసనకు అన్నదాతలు రెడీ!

Farmers Protest in Delhi: మూడేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీని భారీ సంఖ్యలో చుట్టుముట్టిన రైతులు.. మరోసారి నిరసనకు రెడీ అయ్యారు. మరి కొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలుండగా.. ఇలాంటి నిరసనలు తమ ప్రభుత్వానికి అపఖ్యాతి తెచ్చిపెడతాయని మోదీ నాయకత్వంలోని బిజేపీ ప్రభుత్వం భయపడుతోంది. అందుకే రైతు సంఘాలను నిరసన చేయకుండా ఆపేందుకు, అణిచివేసేందుకు.. అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

- Advertisement -

ఫిబ్రవరి 13న దేశంలోని 200కు రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల వద్ద మహాధర్నాకు సన్నధమవుతున్నారు. ఈ ధర్నాలో పంజాబ్, హర్యాణా, కేరళ, కర్ణాటక లాంటి రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనేందుకు తరలి వస్తున్నారు. దాదాపు 20000కు పైగా రైతులు ఢిల్లీ సరిహద్దులను దిగ్బంధనం చేసేందకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మహాధర్నాకు సంయుక్త్ కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దార్ మోర్చా.. రైతు సంఘాలు నాయకత్వం వహిస్తున్నాయి.

- Advertisement -

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపీకి రైతులును తలుచుకుంటే చెమటలు పట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే రాజకీయంగా మిగతా అన్ని పార్టీలను నిర్వీర్యం చేసి.. సమస్యలపై మాట్లాడకుండా, ప్రజలలో మత పరంగా విభజన చేయగలిగే మోదీ ప్రభుత్వం.. ఒక్క రైతులను మాత్రం ఎదుర్కొలేకపోతోంది. అందుకే మూడేళ్ల క్రితం రైతులు పెద్ద ఎత్తున నిరసన చేసినప్పుడు వారిని ఖలిస్తానీ ఉగ్రవాదులని వ్యాఖ్యలు చేసినా.. ఫలితం లేకపోయింది. పైగా రైతుల డిమాండ్లు న్యాయ సమ్మతంగా ఉన్నాయి. అయినా వాటిని బిజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

రైతుల డిమాండ్లు ఇవే..
పండించిన పంటకు కనీస మద్దతు ధర లభించేలా చట్టం తీసుకురావాలి.
మూడేళ్ల క్రితం ఢిల్లీ వద్ద నిరసన సమయంలో రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలి.
నకిలీ విత్తనాలు విక్రయించే కంపెనీలను కఠినంగా శిక్షించాలి
లఖింపూర్ ఖేరిలో రైతులను వాహనంతో తొక్కించి హత్య చేసిన రాజకీయ నాయకులను శిక్షించాలి
రైతులకు పంట బీమా ఇవ్వాలి
పంట నష్టం జరిగిన రైతులకు రుణ మాఫీ ఇవ్వాలి.
స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలి

రైతులను ఆపేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నం
మూడు రోజుల క్రితం రైతు నాయకులతో ముగ్గురు కేంద్ర మంత్రులు, అధికారులు, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చర్చలు జరిపారు. ఈ చర్చలలో రైతులు తమ డిమాండ్లను తెలిపారు. కానీ కేంద్ర మంత్రులు ముఖ్యమైన కనీస మద్దతు ధర, రైతులకు రుణ మాఫీ, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు వంటి అంశాలపై అంగీకరించలేదు. దీంతో రైతు నాయకులు మహాధర్నా జరిపితీరుతామని హెచ్చరించారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్ర మోదీ.. రైతులకు కనీస మద్దతు ధర చట్టం తప్పనిసరిగా తీసుకురావాలని చెప్పారు. మరి దేశ ప్రధాన మంత్రి పది సంవత్సరాలున్నా.. ఆయన ఈ చట్టం ఎందుకు తీసుకురావడం లేదని రైతులు నిలదీస్తున్నారు.

రైతు ధర్నాను అడ్డుకునేందుకు సిద్ధమైన బిజేపీ ప్రభుత్వాలు
మహాధర్నా చేసేందుకు రైతులు పంజాబ్ నుంచి హర్యాణా మీదుగా బయలుదేరి ఢిల్లీ చేరుకుంటారు. ఈ ధర్నా ఒక్కసారి ప్రారంభమైతే ఎన్నిరోజులుంటుందో చెప్పలేని పరిస్థితి. 2020లో ఇలాగే రైతులు మహాధర్నా చేపట్టినప్పుడు.. ఆ నిరసన ఒక సంవత్సర కాలం నడిచింది. అందుకే రైతులు ట్రాక్టర్లలో వంట సామాగ్రితో బయలుదేరుతామని తెలిపారు.

అయితే రైతులు పంజాబ్ నుంచి హర్యాణా రాష్ట్రంలోకి ప్రవేశించకుండా.. హర్యాణాలోని బిజేపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.

హర్యాణా సరిహద్దులను మూసివేస్తూ.. అక్కడ పోలీసులతో గట్టి బందోబస్తు పెట్టింది. పంజాబ్, హర్యాణా రాష్ట్రాల సరిహద్దు జిల్లాలైన అంబాలా, జింద్, ఫతేహబాద్‌లలో అన్ని దారులు మూసివేసింది.

అలాగే అంబాలా, ఫతేహబాద్, కురుక్షేత్ర, కేథాల్, హిసార్, జింద్, సిర్సా జిల్లాలో ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 13 రాత్రి వరకు మొబైల్, ఇంటర్‌నెట్ సేవలు నిలిపివేసింది.

ఒకవేళ రైతులు ఢిల్లీ సరిహద్దుల వద్దకు చేరుకున్నా.. వారిని అడ్డుకునేందుకు పోలీసులతో పాటు భద్రతా బలగాలు సిద్ధంగా ఉన్నాయి. సిమెంటు బారికేడ్లు, ఇనుప తీగల కంచెలు, రోడ్ల మీద రైతుల ట్రాక్టర్లను ఆపేందుకు ఇనుప మేకులు సిద్ధం చేశారు. హర్యాణా పోలీసులు 50 కంపెనీల పారామిలిటరీ బలగాలను పంజాబ్ సరిహద్దుల వద్ద మోహరించామని తెలిపారు.

ధర్నా సమయంలో ఢిల్లీ, చండీగడ్‌ మధ్య రాకపోకలకు ఇబ్బంది కలగకుండా.. ప్రజలు ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.

వ్యవసాయ ప్రధానమైన భారతదేశంలో రైతుల పట్ల ఇంత కఠినంగా వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వం.. బిజేపీదేనని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News