Criminal Wives: గతంలో మహిళలకు రక్షణ లేక పోయేదనే వార్తలు హల్ చల్ చేసేవి. దీంతో మహిళా సమాజం ఈ విషయాలపై తీవ్రంగా విరుచుకుపడేవి. భారీ ఎత్తున చర్చలు సాగేవి. మహిళా సంఘాలు తమ భద్రత పట్ల గట్టిగా వాయిస్ వినిపించేవారు. అదే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. గత ఐదేళ్లలో ఏకంగా 785 మంది భర్తలు హతమయ్యారనే వార్త సంచలనం రేకెత్తిస్తోంది. ఇంతకీ ఏమిటా వివరాలు.. ఆయా ఘటనల్లో తప్పెవరిది? వీటిలో భార్యల తప్పెంత? భర్తల అపరాధమెంత?
భార్య విడాకులిచ్చిందని.. పాలతో శుద్ధి వేడుక చేసుకున్న భర్త మాణిక్ అలీ
ఇదిగో ఇతడ్ని చూశారా? పాలతో ఎంత సంబరంగా స్నానం చేస్తున్నాడో గమనించారా? దీనికి అతడు పెట్టిన పేరు శుద్ధి వేడుక. ఇతడిలా ఎందుకు చేస్తున్నట్టు? ఇంతకీ ఇతడెవరు? ఆ వివరాలేంటి? అని చూస్తే.. భార్య విడాకులిచ్చిందని పాలతో శుద్ధి వేడుక చేసుకున్న.. ఇతడి పేరు మాణిక్ అలీ. అస్సాంలోని నల్బరీ జిల్లా ముకుల్మువా గ్రామానికి చెందిన వాడు. గతంలో ఇతడికి ఒక మహిళతో పెళ్లయ్యింది. ఒక కుమార్తె కూడా ఉంది. అయితే ఆమె పెళ్లయినా.. తన ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగించేది. అంతే కాదు. ఒకటికి రెండు సార్లు భర్తా పిల్లల్ని వదిలి ప్రియుడితో వెళ్లిపోయింది.
పిల్లల కోసం పెద్ద మనసు చేసుకున్న మాణిక్
పెద్దమనుషులు.. మాణిక్ భార్యను మళ్లీ తీసుకొచ్చి.. అతడికి అప్పగించారు. గతం మరచి వర్తమానంలో హాయిగా జీవించమని ఆశీర్వదించి వెళ్లారు. పిల్లల కోసం పెద్ద మనసు చేసుకున్న మాణిక్ సైతం పోనీలే.. పశ్చాతాపానికి మించిన విరుగుడు లేదన్న కోణంలో ఆమెను క్షమించేశాడు. యధావిధిగా తన దైనందిన జీవితంలో పడిపోయాడు. కానీ, అతడికీమధ్య తెలిసిందేంటంటే.. తన భార్య ఎంతకీ మారలేదని. ఇంకా తన ప్రియుడితో ఆమె సన్నిహతంగానే ఉంటుందని గ్రహించాడు. దీంతో విడాకులకు అప్లై చేశాడు. చివరికి కోర్టు మాణిక్ అలీ మొర ఆలకించి.. ఎట్టకేలకు విడాకులు మంజూరు చేసింది. దీంతో అతడి ఆనందం ఇదిగో.. ఇలా పాల స్నానాల సంబరాలు చేసుకునేలా చేసింది.
ఈ మధ్య విడాకుల వరకూ వెళ్లని వివాహేతర ఘటనలు
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రకరకాల డైలాగులు డైనమేట్లలా పేలుతున్నాయ్. వాటిలో మొదటి వరుసలో నిలిచిన కామెంట్ ఏంటో తెలుసా? హమ్మయ్యా నా భార్య నన్ను చంపకుండా వదిలేసింది. బతికాన్రా దేవుడా.. అంటూ అతడి ఆనందం వ్యక్తం చేస్తున్నాడని కామెంట్ చేశారు కొందరు. ఇలాంటి భార్య ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని మరి కొందరు. మనోడ్ని ముప్పు తిప్పలు పెట్టి 40 లీటర్ల పాలు తాగించిందని ఇంకొందరు. ఏం గుండెరా నీది రెండు సార్లు ప్రియుడితో వెళ్లిపోయినా.. నీ భార్యను క్షమించావ్ అంటూ మాస్ కామెంట్స్ చేస్తున్న వారు మరి కొందరు. ఒక దరిద్రం వదిలిందని ఇంకొందరు. ఇలా రకరకాల సెటైరికల్ కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో విడాకుల వరకూ వెళ్లడం లేదు ఇలాంటి పతీ పత్నీ ఔర్ ఓ కహానీలు. ప్రియుడితో జత కట్టిన ఆ ఇల్లాళ్లు.. ఏకంగా అతడ్ని కడతేర్చుతున్న ఘటనలే అధికంగా కనిపిస్తున్నాయి. ఈ మాత్రం తనకు బతికే అవకాశం లభించింది కాబట్టి.. పాలాభిషేకాల పండగ చేస్కుంటున్నాడని ఇంకొందరు.. ఇలా రకరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
బతికి బయట పడ్డ భర్తల్లోనే ఓ రికార్డ్ అంటూ కామెంట్లు
కొందరేమంటారంటే.. ఇది అతడు పాలాభిషేకం చేసుకోదగిన ఘటనగానే చెబుతారు. ఎందుకంటే గత 5 ఏళ్ల.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ గణాంకాలను అనుసరించి చెబితే.. ఒక భర్త ఇలా బతికి బట్టకట్టడం.. ఓ అరుదైన రికార్డుగా అభివర్ణిస్తున్నారు. జాతీయ నేర నివేదిక వివరాల ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం భర్తల మరణాలలో తొలి స్థానంలో ఉన్నట్టు సమాచారం. 2020లో ఇక్కడ 45 మంది భర్తలు చనిపోయిన ఘటనలు నమోదయ్యాయి. 2021లో ఈ సంఖ్య 52కి చేరింది. 2022లో 60, 2023లో 55, 2024లో 62 మంది భర్తలు చనిపోయినట్టుగా చెబుతున్నాయి లెక్కలు. ఇక బీహార్ విషయానికి వస్తే.. 2020లో 30 మంది భర్తలు, 2021లో 35 మంది, 2022లో 40 మంది, 2023లో 39, 2024లో 42 మంది భర్తలు హతమయినట్టు చెబుతున్నాయి NCR రికార్డులు. రాజస్థాన్ సంగతి చూస్తే.. 2020లో 20 మంది, 2021లో 25 మంది, 2022లో 28, 2023లో 30, 2024లో 35 మంది భర్తలు భార్యల చేతుల్లో హతమైపోయినట్టు చెబుతున్నాయి రిపోర్టులు.
మహారాష్ట్ర క్రైమ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే.. 2020లో 15 మంది భర్తలు తమ భార్యల కారణంగా హతం కాగా.. 2021లో 18 మంది, 2022లో 20 మంది, 2023లో 22. 2024లో 25 మంది భర్తలు హతమైనట్టు చెబుతున్నాయి గణాంకాలు. మధ్యప్రదేశ్ సంగతి చూస్తే.. 2020లో 12 మంది, 2021లో 15 మంది, 2022లో 18 మంది, 2023లో 20 మంది, 2024లో 22 మంది భర్తలు భార్యల చేతిలో హతమయినట్టు చెబుతున్నాయి జాతీయ నేర నివేదిక గణాంకాలు. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే.. ఈ మొత్తం మరణాలకు వివాహేతర సంబంధాలే అధిక కారణంగా తెలుస్తున్నాయి.
ఈ కేసుల్లో కీలకంగా కాల్ డాటా
ఇక్కడ గుర్తించాల్సిన మరో విషయమేంటంటే.. కొందరు భర్తలు భార్యా బాధితులు కాగా.. మరి కొందరు ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకుని.. తర్వాత జరిగిన వివాదాల కారణంగా హతమైనట్టు తెలుస్తోంది. మరి కొందరు భర్తలు తమ పశు ప్రవృత్తి కారణంగా హతమైన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఈ మొత్తం కేసులలో వీలైనంత త్వరగానే పురోగతి సాధించినట్టు చెబుతున్నారు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు. వీటిలో కాల్ డాటా కీలకంగా మారినట్టుగా చెబుతున్నారు. వీటి వల్లే పోలీసులు నిందితులను సులువుగా గుర్తించినట్టు చెబుతున్నారు. పకడ్బందీ ఆధారాలతో వీరందరినీ కటకటాల వెనక్కి పంపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మరణాలకు కారణమైన వారంతా ఊచల్లెక్కిస్తున్నట్టుగా చెబుతున్నారు పోలీసులు.
డబ్బుకోసం తల్లినే హతమార్చిన క్రూరుడు కనకయ్య
ఇవన్నీ ఉత్తరాది రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో కాదు కదా? అనడానికి లేకుండా పోతోంది. ఇక్కడ కూడా తరచూ ఇలాంటి ఘటనలు నమోదవుతున్నాయి. రీసెంట్ గా జనగామ జిల్లాకి చెందిన కనకయ్యా అనే భర్తను తన ఇద్దరు భార్యలు చంపేశారు. అయితే ఇతడేం తక్కువైన వాడేమీ కాదు. మద్యానికి బానిస. తాగుడు వ్యసనానికి అలవాటైన ఇతడు డబ్బు కోసం తల్లినే హతమార్చాడు. పరారీలో ఉన్న ఇతడు తన ఇద్దరు భార్యాల దగ్గరకు వచ్చాడు. వారిద్దరి పై గొడ్డలితో విరుచుకుపడ్డాడు. ఆత్మరక్షణార్ధం ఆ ఇద్దరూ తమ భర్తను అదే గొడ్డలితో హతమార్చారు. ఈ ఘటనలో తప్పు భర్త కనకయ్యదేనంటారు స్థానికులు.
అప్పట్లో పుత్తడి బొమ్మ పూర్ణమల గురించి బాధ పడేవాళ్లు. ఆ తర్వాత కట్నాల వేధింపుల కొద్దీ బలైన నవ వధవుల గురించి కూడా కలత చెందేవాళ్లు. పారాణింకా ఆరక ముందే అన్న పాటలను కూడా వినే ఉంటాం. కానీ ఇప్పుడీ పాటలు కొందరు పెళ్లి కొడుకుల విషయంలో పాడుకోవల్సి వస్తోంది.
20 లక్షల సుపారీ ఇచ్చి మరీ భర్తను చంపించిన సోనమ్
ఇష్టం లేని పెళ్లిళ్లే అసలు కారణం- మానసిక నిపుణులుఅవి భారత్- పాక్ మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతున్న రోజులు. అంటే మే రెండో వారం నాటి రోజులు. ఆ సమయంలో నవ వధువు.. హిమాన్షి నర్వాల్ గురించి బాధ పడుతోంది భారత దేశం యావత్తు. పెళ్లయిన కొన్నాళ్లకే భర్తను కోల్పోయిన ఆ నవ వధువు దుఃఖానికి కారణమైన ఉగ్రవాదుల పని పట్టాలని తీవ్రంగా ఆగ్రహిస్తోంది భారతీయ సమాజం. సరిగ్గా ఆ సమయంలో అంటే మే 11న మధ్యప్రదేశ్ కి చెందిన రఘువంశీ, సోనమ్ కి పెళ్లయ్యింది. వీరు హానీమూన్ కోసం.. మేఘాలయ వెళ్లారు. హానీమూన్లో ఉండగానే అనుమానాస్పదంగా చనిపోయాడు రఘువంశీ. కారణమెవరని చూస్తే నవ వధువు సోనమ్ గా గుర్తించారు పోలీసులు. పెళ్లికి ముందే ఆమెకు రాజ్ కష్వాహాతో ప్రేమ వ్యవహారముంది. తన భర్త హానీమూన్ నుంచి తిరిగి రాకూడదన్న కోణంలో 20 లక్షల సుపారీ ఇచ్చి మరీ చంపించేసింది సోనమ్. ప్రియుడు రాజ్ అతడి ముగ్గురు స్నేహితులతో కలసి.. రఘువంశీని లోయలోకి తోసి చంపేశారు. ఈ మొత్తం మాస్టర్ ప్లాన్ వేసింది- పారాణి ఇంకా ఆరని పెళ్లి కుమార్తె సోనమ్ గా గుర్తించారు పోలీసులు.
మేనేజర్ తిరుమలరావుతో ఐశ్వర్యకు వివాహేతర సంబంధం
ఈ ఘటన మరవక ముందే తెలుగు రాష్ట్రాల్లో ఒక నవ వధువు సరిగ్గా ఇలాగే తన భర్తను హతమార్చిన వార్త వెలుగులోకి రావడంతో ఉలిక్కి పడ్డారంతా. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్ కి, ఏపీ కర్నూలు జిల్లాకు చెందిన ఐశ్వర్యకు అనేక డ్రామాల తర్వాత ఎట్టకేలకు పెళ్లయ్యింది. కర్నూలు జిల్లాకు చెందిన సుజాత బ్యాంకులో స్వీపర్ గా పని చేస్తోంది. బ్యాంకు మేనేజర్ తిరుమలరావుతో ఆమెకు వివాహేతర సంబంధముంది. సుజాత కూతురు ఐశ్వర్యతోనూ అతడికి వివాహేతర సంబంధముంది. మేనేజర్ తిరుమలరావు సుజాత కూతురు ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఎందుకో సాధ్యపడలేదు. విధిలేని పరిస్థితుల్లో ఆమె తేజేశ్వర్ ని వివాహమాడాల్సి వచ్చింది. పెళ్లయిన తర్వాత కూడా ఐశ్వర్య తన ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. నెలలో 2 వేల సార్లు ఫోన్లు చేసినట్టు గుర్తించారు పోలీసులు. వీరి సంభాషణ సారాంశం ఏంటంటే.. ఎలాగైనా సరే తేజేశ్వర్ ని హతమార్చడం. తల్లీ కూతుళ్లు వారి ప్రియుడు కలసి.. తేజేశ్వర్ని సుపారీ ఇచ్చి మరీ హతం చేసేందుకు నిర్ణయించారు. ఎట్టకేలకు ఓ ముగ్గురి సాయంతో తేజేశ్వర్ని హత్య చేయించి. కర్నూలు జిల్లా పిన్నాపురం చెరువులో పడేశారు. అలాగని ఇదేం గుట్టుగా సాగలేదు. వెంటనే పోలీసుల కంట పడ్డం.. ఆపై నిందితులను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఇప్పుడున్న టెక్నాలజీ కారణంగా.. నేర రహస్యం ఎక్కువ సేపు దాగడం లేదు. వెంటనే బయట పడిపోతోంది. ఇలా జరుగుతుందని తెలిసినా .. ఎందుకు చేస్తారో అర్ధం కావడం లేదని అంటారు పోలీసులు.
తేజేశ్వర్ని చంపడానికి పెళ్లెందుకు చేసినట్టు? ఎవర్ని మభ్య పెట్టడానికి ఇలా ఒక నిండు జీవితాన్ని బలి తీసుకున్నట్టు? ఒక వేళ తన గతం చెప్పి.. ఆమె విడిపోతానంటే.. కొన్నాళ్లు బాధ పడి ఆ తర్వాత మరచి పోతాడు. వీలుంటే వేరే పెళ్లి చేసుకుంటాడు. అంతే కానీ ఇలా చేయడం ఎంత వరకూ సమంజసం? ఇదెక్కడి ఆలోచన? అన్నది అర్ధం కావడం లేదంటారు పోలీసులు.
రాయ్‌చూర్‌లో సెల్ఫీ దిగుతుండగా భర్తను తోసేసిన భార్య
కర్ణాటక- తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో కృష్ణానది ఒడ్డున ఇంకో ఘటన. రాయచూర్ కి చెందిన తాతప్ప బైక్ పై భార్యతో కలసి వెళ్తున్నాడు. ఇంతలో ఒక బ్రిడ్జ్ దగ్గర భార్య బైక్ ఆపమని అడిగింది. సెల్ఫీ దిగుదామని కోరింది. భార్య కోరికను కాదనలేక తాతప్ప సెల్ఫీ దిగేందుకు భార్య వెంట నడిచాడు. బ్రిడ్జ్ పై సెల్ఫీ దిగుతుండగా తన భర్తను అమాంతం తోసేసిందా భార్య. నది ప్రవాహంలో అతడు కొట్టుకుపోయి చనిపోతాడని భావించి.. ఏమీ ఎరుగనట్టు నటించింది. ఇంతలో అతడొక బండరాయిని ఆసరాగా చేసుకుని బతికి బయట పడ్డాడు. దీంతో వారిని వీరినీ కేక వేసింది. తన భర్తను కాపాడాల్సిందిగా నాటకమాడింది. ప్రాణాలతో బయట పడ్డ అతడు మాత్రం భార్య తనను కావాలని తోసేసిందని అంటున్నాడు. తన కుటుంబ సభ్యులకు కూడా అదే చెప్పాడు. ఇందులో తన ప్రమేయం ఏదీ లేదని.. ప్రమాదవశాత్తూ తన భర్త నదిలో పడ్డాడని అంటుందీ భార్య. అయితే ఆమె తనను చంపాలని చూస్తోందని అంటాడా బాధిత భర్త.
మహారాష్ట్రలో పెళ్లయిన 15 రోజులకే భర్తను చంపిన భార్య
మహారాష్ట్రలో మరో ఘటన. పెళ్లయిన 15 రోజులకే భర్తను చంపేసిందో భార్య. ఈ ఇద్దరు భార్యా భర్తల పేర్లు రాధిక, అనిల్. అనిల్ కి గతంలో పెళ్లయ్యింది. మొదటి భార్య క్యాన్సర్ తో చనిపోగా.. రాధికను రెండో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయినప్పటి నుంచీ ఇద్దరి మధ్య గొడవలు. ఘటన జరిగిన రోజు కూడా ఇద్దరూ తీవ్రంగా తగువులాడుకున్నట్టు చెబుతారు స్థానికులు. తన భర్త నిద్రిస్తుండగా.. గొడ్డలితో అతడి తలపై విచక్షణా రహితంగా దాడి చేసి చంపేసింది భార్య రాధిక. కర్ణాటకలోని తుముకూరు జిల్లాకు చెందిన సుమంగళ భర్త శంకరమూర్తి తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించింది. తన ప్రియుడు నాగరాజుతో కలసి అతడ్ని అడ్డు తొలిగించుకోవాలని నిర్ణయించింది. భర్త కంట్లో కారంపొడి చల్లి కర్రతో కొట్టింది. తర్వాత అతడి మెడపై కాళ్లతో తొక్కి చంపేసింది. భర్త ప్రాణం పోయిందని నిర్దారించుకున్న తర్వాత.. ప్రియుడితో కలసి మృతదేహాన్ని ఒక గోనె సంచీలో కుక్కి.. గ్రామానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో పొలం బావిలో పడేసింది. శంకరమూర్తి కనిపించడం లేదంటూ పోలీసు ఫిర్యాదు నమోదయ్యింది. భార్య సుమంగళను పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయట పడింది.
భర్త స్నేహితుడితో భార్య వివాహేతర సంబంధం
గత మార్చిలో ఒక భార్య ఎంతకు బరితెగించిందంటే.. తన ప్రియుడితో కలసి భర్తను ముక్కలు కింద కోసి.. ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి.. ఆపై సిమెంటుతో కప్పి పెట్టింది. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ ఉందంతం వెలుగులోకి వచ్చింది. మృతుడి పేరు సౌరభ్ రాజ్ పుత్ కాగా.. భార్య పేరు ముస్కాన్ రస్తోగి. మర్చంట్ నేవీలో పని చేస్తుంటాడు సౌరభ్. అలాగని వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు. ప్రేమ వివాహం. కొన్నాళ్ల పాటు సజావుగా సాగిన వీరి వివాహ బంధం.. సౌరభ్ జాబ్ వదిలిపెట్టడంతో.. గొడవగా మారింది. భర్త స్నేహితుడు సాహిల్ తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో ఇరువురి మధ్య మళ్లీ గొడవలు మొదలయ్యాయి. తనకు జాబ్ రావడంతో 2023లో విదేశాలకు వెళ్లాడు. కుమార్తె జన్మదిన వేడుకల కోసం తిరిగి ఇండియా వచ్చాడు. భర్తను శాస్వతంగా అడ్డు తొలిగించుకోవాలని భావించిన భార్య.. భోజనంలో నిద్ర మాత్రలు కలిపింది. అతడు నిద్రలో ఉండగానే ప్రియుడితో కలిసి హత్య చేసింది. భర్త శవాన్ని ముక్కలు కింద కోసి.. ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి సిమెంటుతో కప్పి పెట్టింది. దీంతో సోషల్ మీడియాలో ఈ డ్రమ్ము పై విపరీతమైన మీమ్స్ తయారవుతున్నాయి.
భార్య వివాహేతర సంబధమే భర్త మృతికి కారణం
తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో సరిగ్గా ఇలాంటిదే మరో ఘటన. స్వామి- స్వాతికి ఈ మధ్యే పెళ్లయ్యింది. ఇటీవల ఒక కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు స్వామి. బాధితుడ్ని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తుండగా చనిపోయాడు. అనుమానమొచ్చిన పోలీసులు విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భార్య తన ప్రియుడితో కలిసి కావాలనే స్వామికి యాక్సిడెంట్ చేయించినట్టు తెలిసింది. దీంతో షాకవడం బంధుమిత్రుల వంతు అయ్యింది. జూబ్లీ హిల్స్‌లో భార్యతో గొడవపడిన ఒక భర్త కోపంతో మేడ మీద నుంచి దూకేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. మారిన సామాజిక పరిస్థితులు. పెళ్లయ్యాక వివాహేతర సంబంధం తప్పు లేదని చట్టాలు సైతం చెబుతుండటం. అందుబాటులో ఉన్న సోషల్ మీడియా పరిచయాలు.. వెరసీ అనేక హత్యలకు కారణమవుతున్నట్టు గుర్తించారు పోలీసులు. ఎప్పుడైతే ఒక వివాహేతర సంబంధం మొదలవుతుందో.. ఆపై భార్య, భర్తలలో ఎవరో ఒకరు కడతేరడం ఖాయమైందని.. అంటారు నిపుణులు. ఒక వేళ వారికి ఎంతగా విడిపోవాలనుకుంటే.. పోలీసులను ఆశ్రయిస్తే.. తప్పక సాయం అందుతుందని చెబుతున్నారు.
భార్యతో గొడవ పడి మేడపై నుంచి దూకేసిన ఓ భర్త
ఉదాహరణకు దుబాయ్ లో జాబ్ చేస్తున్న భర్త తన భార్య ఎవరితోనో తిరుగుతోందని చెన్న పోలీసులకు కంప్లయింట్ చేశారు. వివరాలు తెలుసుకున్న పోలీసులు.. ఆమెకు తన ప్రియుడినిచ్చి పెళ్లి చేసి ఆ ఫోటోలను భర్తకు పంపారు. దీంతో ఆ భర్త లబోదిబోమన్నాడు. ఇదేంటని అడిగితే.. చట్టాలు ఇలాగే ఉన్నట్టు ఆ భర్తతో చెప్పారు పోలీసులు. ఇక విశాఖలో తన పెళ్లిరోజు విహారానికి వెళ్లి అటు నుంచి అటే కనిపించకుండా పోయిందా భార్యామణి. తీరా పోలీసు విచారణలో తేలింది ఏంటంటే ఆమె తనప్రియుడితో కలిసి వెళ్లిపోయిందని. ఈ రెండు ఘటనల ద్వారా తెలుస్తోంది ఏంటంటే.. ఇలాంటి కేసులలో తల్లిదండ్రులే కాదు పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి వివాహ బంధం ఇష్టం లేని వారు తమకు ఇష్టం లేదని చెప్పడమే సమంజసం. కుటుంబ సభ్యులు ఒప్పుకోరని.. ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని.. ఆపై ఇలాంటి నేరాలకు ఘోరాలకు తెగబడుతున్నట్టు అంచనా వేస్తున్నారు మానసిక నిపుణులు. కాబట్టి బీ అవేర్ ఆఫ్ ఇట్ అన్నది నిపుణుల సూచనగా తెలుస్తోంది.
Story By Adhinarayana, Bigtv