AP Politics: వారంతా ఒంటి చేత్తో ప్రకాశం జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలను శాసించగల నేతలు. కానీ నేడు వాళ్ళ పరిస్థితి తారుమారు అయ్యింది. వారసత్వంగా తమ పిల్లలను రాజకీయాల్లోకి తీసుకురావడానికి తెరవెనుక, తెరముందు కూడా చెయ్యని ప్రయత్నాలు లేవంట..అయితే వారసుల రాజకీయ భవిష్యత్తు కోసం వారు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం సఫలం కావటం లేదట.ఇంతకు ఎవరా సీనియర్ పొలిటిషన్స్…వారికి వచ్చిన కష్టాలు ఏంటి?
ఎందరికో రాజకీయ గురువు కరణం బలరాం..
ఉమ్మడి ప్రకాశం జిల్లా లో రాజకీయాలను ఒంటి చేతితో శాసించగలిగే సీనియర్ పొలిటిషన్లు చాలా మందే కనిపిస్తారు. ఎందరికో రాజకీయ గురువు లాంటివారు కరణం బలరామకృష్ణ మూర్తి. ఆయన రాజకీయంగా ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. కానీ తన కుమారుడికి సరైన రాజకీయ ప్లాట్‌ఫాం మాత్రం ఏర్పాటు చేయలేకపోతున్నారట. 2014 ఎన్నికల్లో తనకు పూర్తి పట్టు కలిగిన అద్దంకి నియోజకవర్గం నుండి టిడిపి పార్టీ తరఫున తన కొడుకును రాజకీయ అరంగేట్రం చేయించారు… అయితే ఆ ఎన్నికల్లో టిడిపి రాష్ట్రవ్యాప్తంగా విజయదుందుభి మోగించింది కానీ కరణం వెంకటేష్ కు మాత్రం లక్ చిక్కలేదు.
2019 చీరాల నుంచి గెలిచి వైసీపీలో చేరిన కరణం బలరాం..
దీంతో 2019 ఎన్నికల సమయానికి వెంకటేష్‌కు సీటు ఇచ్చేందుకు టిడిపి నిరాకరించటంతో ఏమి చేయాలో తోచక, తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికి తిరిగి తానే పోటీలో వేసి కరణం బలరాం చీరాల నుండి విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో వైసిపి రాష్ట్రవ్యాప్తంగా విజయదుంది విమోగించడంతో తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం తన కొడుకును కూడా వైసీపీలో జాయిన్ చేసి నియోజకవర్గంలో పూర్తిస్థాయి రాజకీయ నేతగా రంగంలోకి దించారు.. 2024 ఎన్నికల్లో తన కుమారుణ్ణి వైసిపి తరఫున చీరాల నుంచి బరిలోకి దించారు . కానీ రిజల్ట్ సేమ్ టు సేమ్. దీంతో కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం మధన పడుతున్న బలరాం , కుమారుడు రాజకీయాల్లో విజయం సాధించే విధంగా చేయడానికి తెగ ఆలోచిస్తున్నారంట.
ఒంగోలులో మకుటం లేని మహరాజులా వెలుగొందిన బాలినేని
ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజక వర్గానికి మకుటం లేని మారాజు లాగా ఒక వెలుగు వెలిగిన వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. అటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ సమీప బంధువుగా, ఇటు ఒంగోలు ప్రజల నేతగా వరుసగా ఐదు సార్లు ఓటమి అనేది లేకుండా గెలిచారు. 2014 ఎన్నికలలో ఓడినప్పటికీ 2019 ఎన్నికల్లో తిరిగి విజయం సాధించి తన సత్తా చాటారు అయితే 2024 ఎన్నికలలో ఒంగోలు నుంచి పోటీ చేస్తూ ఇదే తన చివరి ఎన్నికలని, కుమారుడికి వారసత్వం అప్పగిస్తానని ప్రకటించారు. అయితే బాలినేనికి ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైంది. కొడుకు భవిష్యత్తు ఏమో కానీ భారీ తేడాతో ఓడిపోయిన బాలినేని వైసీపీలో ఇమడలేక జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
జనసేనలో బాలినేని వారసుడ్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో..?
జనసేనలో యాక్టివ్ గా ఉంటూ తన కుమారుని భవిష్యత్తు నేతగా చేయాలని ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే పలు రాజకీయ కార్యక్రమాలలో కుమారుని యాక్టివ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో కుమారుని బరిలోకి దించేందుకు ఇప్పటి నుంచే రాజకీయ వ్యూహాలు పన్నుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేన పార్టీ బాలినేనికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ తన కుమారుడిని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుందో అనే భయం మాత్రం బాలినేనిని వెంటాడుతూనే ఉందట. కుమారుడు భవిష్యత్తు కోసం సొంత బంధువులను వదులుకొని జనసేనలో చేరిన బాలినేని తన నిర్ణయం పై పునరాలోచనలో పడుతున్నారంట. భవిష్యత్తు రాజకీయాలలో పార్టీ తనకు తన కుమారునికి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తుంది, తనేమైనా పార్టీ మారి పొరపాటు చేశానా? జనసేనలో తగిన ప్రాధాన్యత లేకపోతే తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు ఏంటి అన్న అంశాలపై మల్ల గుల్లాలు పడుతున్నారట. ఆయన సన్నిహితులు జనసేనలో చేరి తప్పు చేశావంటూ పదేపదే అయన్ని విసిగిస్తున్నారంట. మరి బాలినేని తన కుమారుడు ప్రణీత్ రెడ్డి భవిష్యత్తు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోర చూడాలి.
మంత్రిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శిద్దా రాఘవరావు
జిల్లాకు చెందిన మరో నాయకులు మాజీ మంత్రి శిద్దా రాఘవరావు. రాజకీయాలు చేసింది తక్కువ కాలమైన మంత్రిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా టీడీపీలో జిల్లాని శాసించే స్థాయికి ఎదిగారు సిద్ధ రాఘవరావు.. 2014 ఎన్నికలలో మొదటిసారి విజయం సాధించి రాష్ట్ర మంత్రిగా తనదైన శైలిలో పనిచేసే చంద్రబాబుకు చాలా దగ్గర అయ్యారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే తన కుమారుడ్ని కూడా సెటిల్ చేయాలని తన నియోజకవర్గమైన దర్శి బాధ్యతలు కుమారుడికి అప్పగించారు. 2019 ఎన్నికలలో అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో శిద్దా రాఘవరావు ఒంగోలు ఎంపీగా పోటీ చేయాల్సి రావడంతో, తన కుమారుడ్ని దర్శి నుంచి పోటీ చేయించాలని అనేక ప్రయత్నాలు చేశారు. కానీ అవి విఫలమయ్యాయి. ఆయన ఎంపీగా ఓటమి పాలయ్యారు దీంతో తన వ్యాపారాలను కాపాడుకోవడానికి సైకిల్ దిగి ఫ్యాన్ కిందకు చేరారు.2024 ఎన్నికల సమయానికి వైసీపీ శిద్దాకు కాని, ఆయన కుమారుడికి కాని టికెట్ ఇవ్వలేదు. దాంతో కలత చెందిన రాఘవరావు ఎన్నికలకు ముందే తిరిగి సైకిల్ ఎక్కే ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో వైసీపీ అధిష్టానం ఆయనకు సీరియస్ వార్నింగ్ ఇచ్చి భయపెట్టడంతో వెనకడుగు వేశారు.
వైసీపీకి రాజీనామా చేసిన శిద్దా రాఘవరావు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి ఏదో ఒక విధంగా సైకిల్ ఎక్కి తన కుమారుడు రాజకీయ భవిష్యత్తును తీర్చిదిద్దాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే వైసీపీకి రాజీనామా చేసిన శిద్దా రాఘవరావుకి టీడీపీ తలుపులు మాత్రం తెరుచుకోవడం లేదు. పార్టీ కార్యక్రమాలలో చురుకుగా ఉంటున్న లోకేష్ కష్ట కాలంలో పార్టీ వీడిన నేతల అవసరం లేదని అయన ముఖం మీదే చెప్పి బయటకు పంపారంట. దీంతో టిడిపిలో చేరలేక రాజకీయాలకు దూరంగా ఉండలేక, కుమారుడు భవిష్యత్తు గురించి తెగ ఆలోచిస్తున్నారంట ఆయన.
ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మాగుంట కుటుంబం హవా
ప్రకాశం జిల్లా రాజకీయాలలో తమదైన ముద్ర వేసింది మాగుంట కుటుంబం. మాగుంట సుబ్బరామిరెడ్డి, ఆయన భార్య పార్వతమ్మ, తమ్ముడు మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఒంగోలు రాజకీయాలను ఒంటిచేత్తో శాసిస్తూ వస్తున్నారు. మొదట కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వారు తరువాత వైసిపి, టీడీపీల్లో అటుఇటూ మారినా రాజకీయంగా మాగుంట కుటుంబం ప్రాధాన్యత మాత్రం ఎక్కడా తగ్గలేదు.. అయితే 2024 ఎన్నికలకు ముందు తన కుమారుడు రాఘవరెడ్డిని రాజకీయ అరంగేట్రం చేయడానికి శ్రీనివాసులురెడ్డి ప్రయత్నాలు చేశారు… అటు వైసీపీలో తగిన గౌరవం ఇవ్వకపోవడంతో కుమారుడు భవిష్యత్తు కోసం టిడిపి పంచన చేరారు.. అయితే అప్పటికే ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణంలో మాగుంట రాఘవరెడ్డి పేరు ప్రధానంగా తెరపైకి రావడంతో టీడీపీ అధిష్టానం రాఘవరెడ్డికి సీటు ఇచ్చేందుకు నిరాకరించింది. దాంతె రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికి తప్పనిసరి స్థితిలో శ్రీనివాసరెడ్డి తిరిగి ఎంపీగా పోటీ చేసి గెలిచారు.
కుమారుడు రాఘవరెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం పావులు
మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎంపీగా కొనసాగుతున్నప్పటికీ కుమారుడు రాఘవరెడ్డి రాజశీయ భవిష్యత్తు కోసం పావులు కదుపుతున్నారు. రాఘవరెడ్డి సైతం ప్రజలకు అందుబాటులో ఉంటూ, రాజకీయ పాఠాలు నేర్చుకునే పనిలో పడ్డారు. అయితే టిడిపి అధిష్టానం 2029 నాటికి ముందుగా మాటిచ్చినట్లు రాఘవరెడ్డికి సీటు కేటాయిస్తున్న లేదా అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉందట . వైయస్ రాజశేఖర్ రెడ్డి తోడల్లుడు వైవి సుబ్బారెడ్డి వైసీపీలో తగిన గుర్తింపుతో పాటు జిల్లా తో పాటు రాష్ట్ర రాజకీయాలను ఒంటిచేత్తో నడిపిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన వైవి సుబ్బారెడ్డి కి తదనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో తిరిగి వైసిపి అధిష్టానం ఎటువంటి సీటు కేటాయించలేదు.. కానీ ఎక్కడ పోటీ చేయకపోయినా పార్టీ కార్యక్రమాలలో చురుకుగా ఉంటూ అన్నీ తానై జిల్లాలో పార్టీని నడిపిస్తూ వస్తున్నారు ఇదే సమయంలో తన కుమారుడు విక్రాంత్ రెడ్డి రాజకీయ భవితవ్యాన్ని కూడా తీర్చిదిద్దాలని జగన్ కి సన్నిహితంగా కుమారుని ఉంచుతూ వచ్చారు.
కొడుకుని జిల్లా రాజకీయాల్లోకి దింపాలని చూస్తున్న వైవీ
అయితే కాకినాడ పోర్టు కుంభకోణంలో వై వి కుమారుడు విక్రాంత్ రెడ్డి పేరు ప్రధానంగా రావడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. దీంతో విక్రాంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో అనే దిగులు తండ్రి వైవి సుబ్బారెడ్డికి పట్టుకుందట. ఏదో ఒక విధంగా తిరిగి తన కుమారుడిని ప్రకాశం జిల్లా రాజకీయాల్లో దించాలని 2019 నుంచి ప్రయత్నం చేస్తున్నప్పటికీ తన బావమరిది బాలినేని శ్రీనివాస్ రెడ్డి వల్ల 2024 వరకు కూడా అది కార్యరూపం దాల్చలేదట. బాలినేని పార్టీ మారి జనసేన గూటికి చేరిన నేపథ్యంలో జిల్లా వైసీపీ మొత్తం వైవి సుబ్బారెడ్డి చేతికి వచ్చింది.. దీంతో ఇప్పుడైనా సరే తిరిగి తన కుమారుడిని ప్రకాశం జిల్లా రాజకీయాల్లో దించాలని ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారట.
Also Read: ఇదెక్కడి వింత రా బాబు.. చిల్లర కోసం బస్సు ముందు ధర్నా..
అందులో భాగంగా తన సొంత నియోజకవర్గమైన బాపట్ల జిల్లా అద్దంకికి విక్రాంత్ రెడ్డిని ఇన్చార్జిగా నియమించాలని ప్రయత్నాలను ముమ్మరం చేశారట… కానీ ఏమైందో కానీ అద్దంకి ఇన్చార్జిగా డాక్టర్ అశోక్ బాబును జగన్ నియమించడంతో తిరిగి వైవీ చూపు ఒంగోలు మీద పడిందంట.అయితే జగన్ చుద్దాంలే అంటున్నారంట కాని వైవీకి ఎలాంటి హామీలు ఇవ్వడం లేదంంట. మొత్తానికి జిల్లాలో వారసుల కోసం సీనియర్ల పాట్లు అలా ఉన్నాయి.
Story By apparao, Bigtv