Pakistan – Afghanistan: దక్షిణాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తలకు తెరపడింది. పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్ మధ్య గత కొద్ది రోజులుగా వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే.. అయితే సరిహద్దు ఘర్షణలకు ముగింపు పలుకుతూ.. ఇరుదేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఖతార్ మంత్రిత్వశాఖ స్వయంగా ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ చర్చలు ఆఫ్ఘనిస్తాన్ ఆగ్నేయ పాక్టికా ప్రావిన్స్‌లో జరిగిన ఘోర వైమానిక దాడి తరువాత జరిగాయి. పాకిస్తాన్ వైమానిక దళం నిర్వహించిన ఈ దాడిలో.. కనీసం 17 మంది మరణించగా, వారిలో ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లు ఉన్నారని మీడియా వెల్లడించింది. ఆ ఘటనతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఉధృతమయ్యాయి. సరిహద్దు గ్రామాల వద్ద నిరంతర కాల్పులు, దాడులు జరుగుతుండడంతో సైనికులు, పౌరులు ఇరువైపులా ప్రాణాలు కోల్పోయారు.
ప్రాంతీయ శాంతికి కట్టుబడి ఉన్న ఖతార్, తుర్కియే మద్దతుతో ఈ చర్చలను మొదలుపెట్టింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రతినిధి బృందాలు దోహాలోని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కాల్పుల విరమణ చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో జరిగిన చర్చలు ఫలించాయని ఖతార్ పేర్కొంది.
రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు నిర్వహించి, దీర్ఘకాల శాంతి ఒప్పందం రూపుదిద్దుకునేలా చర్యలు తీసుకుంటామని అధికార వర్గాలు ధృవీకరించాయి. ఉమ్మడి సరిహద్దులో ఉద్రిక్తతలను తగ్గించడానికి ఒప్పందం సహాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది ఖతార్.
తుర్కియే, ఇరాన్, చైనా వంటి దేశాలు ఈ పరిణామాన్ని స్వాగతించాయి. ఐక్యరాజ్యసమితి కూడా దోహా ఒప్పందాన్ని ప్రశంసిస్తూ, దక్షిణాసియా శాంతి కోసం ఆశాకిరణంగా పేర్కొంది.
Also Read: ఆపరేషన్ సిందూర్ జస్ట్ ట్రైలర్ మాత్రమే.. ‘బ్రహ్మోస్’ పాక్ తాట తీస్తుంది: రాజ్ నాథ్ సింగ్
పాకిస్తాన్–ఆఫ్ఘనిస్తాన్ మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సరిహద్దు.. ఉద్రిక్తతలకు ఈ కాల్పుల విరమణ ఒక చారిత్రాత్మక మలుపు కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఒప్పందం విజయవంతంగా అమలు అయితే, దక్షిణాసియా ప్రాంతంలో శాంతి, అభివృద్ధికి కొత్త దిశగా పునాది పడనుంది. ఖతార్ మధ్యవర్తిత్వం ఈ రెండు దేశాల మధ్య నమ్మకాన్ని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు అందరి దృష్టి ఈ ఒప్పందం ఎంతకాలం నిలుస్తుందనే దానిపై నిలిచింది.
పాక్-అఫ్గాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య ఫలించిన శాంతి చర్చలు
దోహా వేదికగా తక్షణ కాల్పుల విరమణకు ఇరుదేశాల అంగీకారం
అధికారికంగా వెల్లడించిన ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ
ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంతో పాక్- అఫ్గాన్ల మధ్య కాల్పుల విరమణకు… pic.twitter.com/AWmXKU5CfN
— BIG TV Breaking News (@bigtvtelugu) October 19, 2025