GHMC Billing: అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులను లెక్కపెడుతున్నారన్నట్టుగా ఉంది జీహెచ్ఎంసీ పరిస్థితి. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అత్యధిక మంది జనాభాకు పౌర, అత్యవసర సేవలందిస్తున్న జీహెచ్ఎంసీ స్తోమతకు మించి అప్పులు చేసి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెల్సిందే. నామమాత్రం జీతాలకు పని చేస్తున్న ఔట్ సోర్స్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని దుర్బర స్థితిలో ఉన్న జీహెచ్ఎంసీని కాస్త ఆర్థికంగా గట్టెక్కించేందుకు ఎంతో చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేయాల్సిన అధికారులు ఖజానాకు కన్నం వేస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి గడ్డు సమయంలో జీహెచ్ఎంసీ పైనాన్స్ అధికారుల నిర్లక్ష్యం, కమిషన్ల కక్కుర్తి ఫలితంగా కాంట్రాక్టర్లకు ఒకే పనికి రెండు సార్లు బిల్లులు చెల్లించిన వ్యవహారం బయట పడటం, దీనిపై ఉన్నతాధికారులు విజిలెన్స్ విచారణకు ఆదేశించిన సంగతి తెల్సిందే.
ఈ వ్యవహారంపై గుట్టుచప్పుడు కాకుండా సీక్రెట్ గా స్టడీకి సిద్దమైన అధికారులు ఈ విషయం బయటపడటంతో రెండు రోజుల క్రితం జీహెచ్ఎంసీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ను తన మాతృశాఖకు సరెండర్ చేసి చర్యలు తీసుకున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు. సుమారు రూ.70 కోట్ల విలువైన 200 బిల్లులకు రెండు సార్లు చెల్లించిన విషయం వెలుగులోకి రావటంతో విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించిన తర్వాత దాదాపు 74 మంది డబుల్ బిల్లులు స్వీకరించిన కాంట్రాక్టర్ల నుంచి రూ. 7 కోట్ల వరకు రికవరీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
జీహెచ్ఎంసీని మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించడంతో పాటు కొత్త సాఫ్ట్ వేర్ అప్ డేట్, రీ మ్యాపింగ్ చేసే సమయంలో సాఫ్ వేర్ లో కాంట్రాక్టర్ల ఈఆర్పీల్లో రీపిటెడ్ అంటూ రావటంతో అధికారులు కాస్త లోతుగా స్టడీ చేసే సరికి ఒకే పనికి రెండు సార్లు బిల్లులు చెల్లించిన వ్యవహారం బయట పడింది. అధికారులు, కాంట్రాక్టర్ల బాగోతం బహిర్గతమైంది. ఈ దందా రెండేళ్లుగా కొనసాగుతున్నట్లు, ఫైనాన్స్ విభాగం అధికారులు గానీ, కమిషనర్ గానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది. పైగా ఈ వ్యవహారంపై జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగం కాకుండా స్టేట్ విజిలెన్స్ విభాగం విచారణ చేపడితే మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయన్న వాదనలున్నాయి.
Also read: కొండా సురేఖ ఎపిసోడ్‌పై ఏఐసీసీ సంచలన నిర్ణయం!
జీహెచ్ఎంసీలో చేసిన పనులకు సంబంధించి నాణ్యత, బిల్లుల చెల్లింపులకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసినప్పటికీ, ఒకే పనికి కాంట్రాక్టర్లకు రెండు సార్లు బిల్లులు చెల్లించటం పలు అనుమానాలకు తావిస్తుంది. కమిషనర్ ఆమోదం లేనిదే ఖజానా నుంచి పైసా కూడా ట్రాన్స్ ఫర్ కాని పరిస్థితి ఉండగా, ఏకంగా రూ. 70 కోట్ల వరకు బిల్లుు డబుల్ చెల్లింపులు జరగటం వెనకా ఆంతర్యమేమిటీ? అన్న వాదనలున్నాయి. కానీ రెండు సార్లు బిల్లులు తీసుకున్న కాంట్రాక్టర్లు వచ్చే బిల్లులో పది శాతం అధికారులకు, స్వీకరించిన బిల్లు మొత్తానికి జీఎస్టీలు కూడా చెల్లించినందున, ఇపుడు తిరిగి ఎలా చెల్లించాలని ససే మిరా అంటున్నట్లు సమాచారం.
మొత్తం క్రెడిట్ అయిన బిల్లులో 28 శాతం తమకు భారంగా మారిందని, ఆ 28 శాతం కట్ చేసుకుని మిగిలిన బిల్లు మొత్తం చెల్లిస్తామని కొందరు కాంట్రాక్టర్లు వ్యాఖ్యానిస్తుండగా, మరి కొందరు అసలు చెల్లించేది లేదని తేల్చి చెబుతున్నట్లు తెలిసింది. రీపిటెడ్ గా బిల్లుల చెల్లింపులు జరుగుతున్న విషయాన్ని కనీసం పరిశీలించని ఫైనాన్షియల్ అడ్వైజర్ విభాగం అధికారులు తిరిగి చెల్లించాలని కాంట్రాక్టర్లను బతిమాలుకున్న పరిస్థితులు సైతం లేకపోలేవు.
జీహెచ్ఎంసీలో అక్రమాలు జరిగినపుడు, అడ్డదారిలో బిల్లుల రూపంలో నిధులు దారి మళ్లించనపుడు కాంట్రాక్టర్లకు ఓ న్యాయం, బాధ్యులైన అధికారులకో న్యాయాన్ని అమలు చేస్తున్నారా? అన్నది హాట్ టాపిక్ గా మారింది. రెండేళ్ల క్రితం జీహెచ్ఎంసీకి ఇలంబరితి కమిషనర్ గా విధులు నిర్వహించిన సమయంలో సైదాబాద్ ఐఎస్ సదన్ లో రూ. 10 లక్షల రోడ్డు పనులు మంజూరు కాగా, సదరు కాంట్రాక్టర్, ఇంజనీర్లు కుమ్మక్కై పని చేయకుండానే బిల్లులు డ్రా చేసుకున్నట్లు ఓ కార్పొరేటర్ ఫిర్యాదు చేయటంతో విచారణకు ఆదేశించిన కమిషనర్ విచారణ నివేదిక ఆధారంగా ఓ ఇంజనీర్ ను విధుల నుంచి తొలగించారు.
మరో ఇంజనీర్ పై సస్పెన్షన్ వేటు వేయటంతో పాటు సదరు కాంట్రాక్టర్ ను రూ. 10 లక్షలను రికవరీ చేసి, క్రిమినల్ కేసు నమోదు చేసిన సందర్భాలున్నాయి. కానీ ఒకే పనికి రెండు బిల్లులు చెల్లించిన వ్యవహారంలో ఫైనాన్షియల్ అడ్వైజర్ ఒక్కరినే బాధ్యడ్ని చేసి, ఆయనపై ఎలాంటి క్రిమినల్ కేసు లేకుండా, రికవరీ లేకుండా కేవలం మాతృశాఖకు సరెండర్ చేశారన్న వాదనలున్నాయి. ప్రజాధనం దారి మళ్లించినా, దుర్వినియోగం చేసినా, క్రిమినల్ కేసు నమోదు చేయాలని నిబంధనలు చెబుతున్నా, జీహెచ్ఎంసీలో డబుల్ బిల్లుల చెల్లింపు వ్యవహారంలో ఎందుకు అమలు చేయలేదో? అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
Also Read: సీఎం ఛాన్స్ వస్తే.. ఆ దేవుడు కూడా ఆపలేడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు