Konda Surekha: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పార్టీలో అంతర్గత విబేధాలు, ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ రాజధాని ఢిల్లీ వేదికగా తుది ఘట్టానికి చేరుకుంది. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ఏ ఐ సీ సీ ఇంచార్జీ కే సీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు.. పార్టీ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు, మంత్రి కొండ సురేఖ ఎపిసోడ్ పై తన అభిప్రాయాన్ని చెప్పినట్లు తెలిసింది.ఇక ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో బుధ వారం ఉదయం అత్యున్నత స్థాయి భేటీ జరగనుంది.ఈ కీలక సమావేశంలో ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు పాల్గొననున్నారు. మరోవైపు వివాదంలో చిక్కుకున్న దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా అధిష్టానం పిలుపు మేరకు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. దీనిపై స్పందించిన టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ సమగ్రంగా విచారణ జరిపి, క్రమశిక్షణా రాహిత్యాన్ని ఉపేక్షించకూడదని నివేదిక తయారు చేసింది. మంత్రి కొండా సురేఖపై పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీకి నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే.
Also read: ప్రభాస్ తో సుమంత్ ప్రభాస్.. ఒక్కమాటతో రియల్ క్యారెక్టర్ రివీల్!
కేసీ వేణుగోపాల్‌తో భేటీ కానున్న మంత్రి కొండా సురేఖ తన వర్గం వాదనను అధిష్టానం ముందు ఉంచనున్నారు. కూతురు చేసిన వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని, అది వ్యక్తిగత వ్యాఖ్య అని సమర్థించుకునే అవకాశం ఉంది.ఇక పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని టీపీసీసీ స్పష్టం చేసిన నేపథ్యంలో, కొండా సురేఖపై ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దానిపైఅధిష్టానం ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకోనుంది.
కొండా సురేఖ ఎపిసోడ్‌తో పాటు, త్వరలో చేపట్టబోయే తెలంగాణ కేబినెట్ విస్తరణ, పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ చర్చిస్తున్నారు.గాంధీ భవన్ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన రిపోర్టును పరిగణనలోకి తీసుకుని, తెలంగాణ కాంగ్రెస్ ఉమ్మడి భవిష్యత్తు క్రమశిక్షణను దృష్టిలో ఉంచుకుని హైకమాండ్ ఈరోజు సమావేశం తర్వాత ఓ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: జస్ట్ 4.5 గంటల్లో 1,170 కిమీ ప్రయాణం.. బుల్లెట్ రైలు జోష్ మామూలుగా లేదుగా!