ఎమ్మెల్సీ ఎన్నికల పోటీకి దూరంగా బీఆర్ఎస్
కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాదు, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంది. కాంగ్రెస్ ప్రభత్వంపై అప్పుడే వ్యతిరేకత పెరిగిపోయిందని గులాబీ పార్టీ పెద్దలు తెగ ఊదరగొడుతున్నారు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అన్న రేంజ్ డైలాగ్స్ చెబుతున్న కేసీఆర్.. మరి ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకునే అవకాశం ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో వచ్చినా.. వినియోగించుకోవడంపై సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతుంది.
ఉప ఎన్నికల్లో దుమ్ము దులిపేద్దాం అంటున్న బీఆర్ఎస్ పెద్దలు
ఉత్తర తెలంగాణలో జరుగతున్న టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి.. ప్రభుత్వం మీద ఉందంటున్న ప్రజా వ్యతిరేకతను ఎందుకు క్యాష్ చేసుకోలేకపోతున్నారని అడుగుతున్నారు. ఓవైపు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడుతుంది, ఉప ఎన్నికల్లో దుమ్ము దులిపేద్దాం.. సిద్ధంగా ఉండండని కేడర్‌కి చెబుతున్న గులాబీ అధిష్టానం.. ఇప్పుడెందుకు కామ్‌గా ఉందో అర్ధం కావడం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు… వస్తాయో? రావో? తెలియని ఉప ఎన్నికల కోసం సిద్ధంగా ఉండమని.. స్వీప్ చేసేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న అధిష్టానం. అందివచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్ని ఎందుకు చేజార్చుకుంటోందో అర్ధం కావడం లేదంటూ గులాబీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అందరి కంటే ముందు అభ్యర్ధిని ప్రకటించిన బీజేపీ
మొత్తానికి ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ చేతులెత్తేయడంతో.. కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అందరి కంటే ముందు అంజిరెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించిన బీజేపీ ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది. బీజేపీ అభ్యర్ధి గెలుపు బాధ్యతలను ఆ పార్టీ ఎంపీలు ధర్మపురి అరవింద్, రఘునందన్, బండి సంజయ్‌లు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రిగా ఉన్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కి ఈ ఎన్నిక ఇజ్జత్‌కా సవాల్‌లా మారింది.
పలువురు పోటీ పడినా నరేందర్‌రెడ్డి వైపు మొగ్గు చూపిన కాంగ్రెస్
మరోవైపు కాంగ్రెస్‌కు సిట్టింగు సీటును కాపాడు కోవడం ప్రెస్టేజియస్‌గా తయారైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ కోసం చాలామంది పోటీ పడినా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి చెందిన నరేందర్ రెడ్డి వైపే కాంగ్రెస్ మొగ్గు చూపింది. కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్న నరేందర్ రెడ్డి కి ఇప్పుడు గెలుపు అంతా అషామాషిగా ఏమీలేదంటున్నారు. చివరి నిముషం వరకు కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడిన ప్రసన్న హరికృష్ణ ఇప్పుడు బీఎస్పీ అభ్యర్ధిగా బరిలో నిలిచి ఆయనకు సవాల్ విసురుతున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్ధికి మద్దతుగా ఆ పార్టీ నేతలు ప్రచారాన్ని మమ్మరం చేస్తున్నారు.
గెలుపు భారాన్ని భుజానికెత్తుకున్న శ్రీధర్‌బాబు, పొన్నం
ఆ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు భారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి చెందిన మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లపై పడింది. అభ్యర్ధి విషయం లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి చెందిన ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడంతో పాటు నామినేషన్ల దగ్గరి నుండి ప్రచారం వరకు మంత్రులు అన్ని తామై వ్యవహరిస్తున్నారు. నామినేషన్లు దాఖలు చేసిన రోజు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్ , శ్రీధర్ బాబులతో పాటు ఇన్చార్జ్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే లు అందరూ కలిసి .. తామంతా ఏకతాటిపై ఉన్నామని గెలిపించే బాధ్యత కూడా తమదే అన్నట్లు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
42 నియోజక వర్గాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల డామినేషన్
అయితే నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని మొదట్లో కొంత మంది ఎమ్మెల్యే లు వ్యతిరేకించిన జిల్లా మంత్రులిద్దరూ చొరవ తీసుకొని ఆ ఎమ్మెల్యేలను సముదాయించి యాక్టివ్ చేశారు. మంత్రుల సారథ్యంలో నేతలంతా కలిసి పనిచేస్తుండటంతో .. కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా కొత్త జోష్ కనిపిస్తుంది. నాలుగు ఉమ్మడి జిల్లాలలోని 42 నియోజకవర్గాల పరిధిలో ఈ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఆయా సెగ్మెంట్లలో ఎక్కువ గా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండడంతో నరేందర్ రెడ్డి విజయానికి అందరూ సహాకరించేలా అ ఇద్దరూ మంత్రులు చొరవ తీసుకొని సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.
Also Read: మేడమ్ వేరే లెవల్.. కాంగ్రెస్ నేతల్లో కొత్త టెన్షన్
తమ సెగ్మెంట్లలో ముమ్మర ప్రచారం చేస్తున్న మంత్రులు
సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవడానికి బీజేపీకి ధీటుగా కాంగ్రెస్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది.42 నియోజకవర్గాల్లోని 3 లక్షల 50 వేల పైచిలుకు పట్టభద్రుల ఓటర్లలో ప్రతి ఒక్కర్ని కలిసేలా మంత్రులు పార్టీ శ్రేణులను గైడ్ చేస్తున్నారు. నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలని ఇద్దరు మంత్రులు మానిటరింగ్ చేస్తూ.. వారి సలహాలు, సూచనలు ఇస్తూనే తమ నియోజకవర్గాల్లో పట్టు సడలకుండా పకడ్బందీగా ఓటర్లని ప్రసన్నం చేసుకునే విధంగా ప్రచారం కొనసాగిస్తున్నారు.
హైకమాండ్‌కి గిఫ్ట్ ఇవ్వాలని మంత్రుల పట్టుదల
ఈ నెల 27న పోలింగ్ ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ నరేందర్ రెడ్డిని గెలిపించి.. కాంగ్రెస్ అధిష్టానానికి గిఫ్ట్‌గా ఇవ్వాలని మంత్రులు పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి, యువతకు ఉద్యోగాల కల్పన, ఉద్యోగాల భర్తీ గురించి ప్రచారంలో వివరిస్తూ.. నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కాంగ్రెస్ పట్టభద్రులని కోరుతోంది. మొత్తమ్మీద కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వర్సెస్ రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ల మధ్య పోరులా మారిన ఈ ఎన్నిక అందరిలో ఆసక్తి రేపుతోంది.