BigTV English

Mega Terrorist Meet In PoK: పీఓకేలోకి హమాస్..!మరో యుద్ధం తప్పదా?

Mega Terrorist Meet In PoK: పీఓకేలోకి హమాస్..!మరో యుద్ధం తప్పదా?

Mega Terrorist Meet In PoK కశ్మీర్ వ్యవహారం ఫైనల్ స్టేజ్‌కు చేరుకోబోతుందా..? పరిస్థితులు చూస్తుంటే.. అలాగే కనిపిస్తోంది. ముఖ్యంగా, పాక్ ఆక్యూపైడ్ కశ్మీర్ కేంద్రంగా భారత్‌ను ఇబ్బందిపెట్టడానికి వ్యతిరేక గ్రూపులన్నీ పన్నాగం పనున్నతున్నాయా అనిపిస్తోంది. పీఓకేలో హమాస్ తీవ్రవాదుల ఎంట్రీ గురించి భారత్ అప్రమత్తం అవుతున్న తరుణంలో.. కశ్మీర్ అంశాన్ని శాంతి చర్చలతో పరిష్కారించాలని పాక్ ప్రధాని భారత్‌కు పిలుపునిస్తున్నారు. పీఓకేలో సోకాల్డ్ ప్రధాని కూడా దీనికి వంత పాడుతున్నారు. మరోవైపు, కశ్మీర్‌లో టెర్రరిస్టులను క్రూరంగా అణిచివేయాలంటూ తాజాగా భారత్ హోం మంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. అంటే, కశ్మీర్ అంశంలో ఫైనల్ స్టెప్ పడుతోందా..? గాజా నుంచి హమాస్ తీవ్రవాదులు వచ్చి, పీఓకేలో పాగా వేస్తున్నారా..? పీఓకేని భారత్ స్వాధీనం చేసుకోవడానికి ఇదే సరైన సమయమా..?


పీఓకే వేదికగా కశ్మీర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

దశాబ్ధాలుగా కొనసాగుతున్న కశ్మీర్ వివాదంలో చివరి అంకం మొదలైనట్లే కనిపిస్తోంది. త్వరలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో సహా కశ్మీర్ అంశంలో పాకిస్తాన్‌‌కు భారత్ బుద్ది చెప్పే తరుణం ఆసన్నమయ్యింది. స్వతంత్రం వచ్చిన కొన్నాళ్లకే పాకిస్తాన్ తీవ్రవాదం కశ్మీర్‌‌పై కన్నేయగా.. పాకిస్తాన్ దొంగ బుద్ది కారణంగా కశ్మీర్‌లో కొంత భాగం తీవ్రవాద గ్రూపులకు అడ్డా అయ్యింది. ఆజాద్ కశ్మీర్ అనే పేరుతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌ వివాదానికి కేంద్రంగా మారింది. ఇప్పుడు, అదే పీఓకే వేదికగా కశ్మీర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోంది. తాజా పరిణామాలు చూస్తుంటే కశ్మీర్ ఆపదలో పడుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇటీవల కాలంలో జమ్మూ కశ్మీర్‌‌లో పెరుగుతున్న ఉగ్ర ఉనికి నేపథ్యంలో. తాజాగా సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.


పీఓకేలోకి హమాస్ తీవ్రవాదులు ఎంటర్ అవుతున్నట్లు అంచనా

నిన్నటి వరకూ ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ విషయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అయితే, ఇప్పుడు షెహబాజ్ మాటల్లో ఏదో తేడా కనిపిస్తోంది. కశ్మీర్ అంశాన్ని శాంతి చర్చలతో పరిష్కరించాలని పాక్ ప్రధాని షెహబాజ్ భారత్‌కు పిలుపునిచ్చారు. మరోవైపు, పీఓకేలోకి హమాస్ తీవ్రవాదులు ఎంటర్ అవుతున్నట్లు భారత నిఘా వ్యవస్థ అంచనా వేసింది. ఈ తరుణంలోనే… భారత్ అప్రమత్తం అవుతోంది. తాజాగా, జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల్ని అణిచివేయడానికి క్రూరంగా వ్యవహరించాలని భారత హోం మంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు.

భారత భూభాగంలోకి ‘చొరబాట్లను పూర్తిగా తొలగించడం’..

జమ్మూ కశ్మీర్‌లో చొరబాట్లు, ఉగ్రవాద చర్యల పట్ల కఠినంగా వ్యవహరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా భారత భద్రతా దళాలకు వెల్లడించారు. భారత భూభాగంలోకి ‘చొరబాట్లను పూర్తిగా తొలగించడం’, ‘ఉగ్రవాదుల ఉనికిని నిర్మూలించడం’ అనే రెండు కీలక లక్ష్యాలను సాధించడంపై దృష్టి పెట్టాలని వారిని కోరారు. జమ్మూ కశ్మీర్‌లో భద్రతా పరిస్థితిపై ఫిబ్రవరి 5న న్యూ ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన అమిత్ షా కీలక ఆదేశాలిచ్చారు.

కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడానికి అమిత్ షా ఆదేశాలు

ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడంలో, చొరబాటుదారులకు అవకాశం కల్పిస్తున్న మాదకద్రవ్యాల పాత్రను కూడా ఇక్కడ చర్చించారు. అందుకే, క్రూరంగా వాటిని అరికట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఉగ్రవాద దాడిలో మాజీ సైనికుడు మంజూర్ అహ్మద్ వాగే మృతి చెందగా.. ఆయన భార్య, మరో బంధువు గాయపడిన నేపథ్యంలో అమిత్ షా వరుసగా సమావేశాలు నిర్వహించారు. జమ్మూ కశ్మీర్ నుండి ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టడానికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని హోం మంత్రి పేర్కొన్నారు.

కొత్త క్రిమినల్ చట్టాలను సకాలంలో అమలు

అయితే, గత 10 సంవత్సరాలుగా ఉగ్రవాద పర్యావరణ వ్యవస్థను బలహీనపరచడానికి కేంద్ర బలగాలు పనిచేశాయి. చొరబాటుదారులు, ఉగ్రవాదులు, ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టారు. ఇకపై దీన్ని మరింత కఠినంగా అమలు చేయాలని భారత్ నిర్ణయించుకుంది. కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఉనికిని నిర్మూలించడమే లక్ష్యంగా వ్యూహాలు రూపొందిస్తున్నారు. దీని దిశగా.. కొత్త క్రిమినల్ చట్టాలను సకాలంలో అమలు చేయాడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ పోస్టుల్లో కొత్త నియామకాలు కూడా చేయపడుతున్నారు.

‘ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం’ పఠిష్టంగా అమలు

ఉగ్రవాద రహిత జమ్మూ కశ్మీర్ లక్ష్యాన్ని సాధించడానికి, ‘ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం’ మరింత పఠిష్టంగా అమలు చేస్తున్నారు. అలాగే, పీఓకేలో హమాస్ తీవ్రవాదుల ఉనికి విషయంలో కూడా అన్ని భద్రతా సంస్థలు అప్రమత్తంగా ఉంటున్నాయి. ఇజ్రాయెల్‌ దాడులతో తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటున్న హమాస్‌ ఇప్పుడు పీఓకేలో అడుగుపెట్టబోతోందనే ప్రచారం గట్టిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో, భారత నిఘా వర్గాలు హమాస్‌ కదలికలను నిశితంగా గమనిస్తున్నాయి. ఈ పరిణామం, భారత్‌ భద్రతకు పెనుముప్పుగా మారే అవకాశముందని ఆందోళన పెరుగుతోంది.

ఫిబ్రవరి 5న పీఓకేలో ‘అల్ అక్సా ఫ్లడ్స్’ కార్యక్రమం

కశ్మీర్ సంఘీభావ దినోత్సవంలో భాగంగా ఫిబ్రవరి 5న పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ‘అల్ అక్సా ఫ్లడ్స్’ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మిడిల్ ఈస్ట్‌ కేంద్రంగా పనిచేస్తున్న హమాస్‌ తీవ్రవాద గ్రూపు సీనియర్ నేత ప్రసంగించనున్నట్టు ప్రచారం జరిగింది. రావల్కోట్‌లోని సబీర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా సంస్థల సీనియర్ నేతలు కూడా పాల్గొంటున్నారని వార్తలు బయటకు పొక్కాయి. హమాస్ ప్రతినిధి ఖలీద్ కద్దౌమి ప్రసంగిస్తారంటూ కరపత్రాలు, ఇతర మాద్యమాల ద్వారా ప్రచారం చేశారు. అయితే, 2024 ఆగస్టులో ఖతార్ రాజధాని దోహాలో హమాస్ నేతలతో లష్కరే తోయిబా ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ సమావేశం అయ్యారు.

కశ్మీర్‌‌ను పాలస్తీనాతో ముడిపెట్టి హమాస్ నేత ఖలీద్ వ్యాఖ్యలు

2018లోనే అమెరికా ఆయనను ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు ఖలీద్ దగ్గరివాడు. కాగా.. పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ సంస్థ హమాస్.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో అడుగుపెడుతుందనే వార్తల నేపథ్యంలో భారత ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. కశ్మీర్‌లో పోరాటాన్ని పాలస్తీనాతో ముడిపెట్టి హమాస్ నేత ఖలీద్ మాట్లాడినట్లు కూడా అనుమానిస్తున్నారు. అంతేగాక, ఇటీవల కాలంలో హమాస్‌-పాకిస్థాన్‌ మధ్య సంబంధాలు మరింత పెరిగాయి. ఇది భవిష్యత్తులో పీఓకేలో ఉగ్రవాద కూటములకు దారితీయొచ్చని నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

పాకిస్తాన్‌ ఉగ్రసంస్థలకు మద్దతునిచ్చే హమాస్‌

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న జిహాదీ సంస్థలు ఇన్నేళ్లుగా చేస్తున్న పోరాటాలకు బలం చేకూర్చేలా హమాస్ ఎంట్రీ మరింతగా ఉగ్రవాద చర్యలను పెంచే అవకాశం ఉంది. తాజాగా జరిగిన ‘అల్ అక్సా ఫ్లడ్స్’ కార్యక్రమాన్ని దీని కోసం ఉపయోగించుకుంటారనే అనుమానాలు కూడా వచ్చాయి. ఎందుకంటే, కరుడుగట్టిన తీవ్రవాది మసూద్‌ అజర్‌ సోదరుడు తల్హా సైఫ్‌, అస్గర్‌ ఖాన్‌, ఇలియాస్‌ మసూద్‌ వంటి ఉగ్రవాదులు కూడా ఈ సభకు హాజరయ్యారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. హమాస్‌-లష్కరే తోయిబా మధ్య సంబంధాలు బలపడితే, భారత భద్రతకు పెనుముప్పుగా మారొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

పాకిస్తాన్‌ ఉగ్రసంస్థలకు మద్దతునిచ్చే హమాస్‌.. కశ్మీర్‌లో తమ ప్రభావాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోందని కూడా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇదే అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్‌ అంశంలో హైలెవెల్ మీటింగ్‌ నిర్వహించారు. కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. కశ్మీర్‌లో వాహన తనిఖీలను తీవ్రతరం చేయడం, ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం, సీమాంతర చొరబాట్లను అడ్డుకోవడంతో సహా పలు కీలక అంశాలపై దృష్టిసారించాలని అధికారులకు కేంద్రమంత్రి ఆదేశించారు.

ఫిబ్రవరి 5న కశ్మీర్ సంఘీభావ దినోత్సవం

దాయాది దేశానికి పీఓకే భయం పట్టుకుందన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో జమ్మూ కశ్మీర్‌లో తీవ్రవాదుల్ని భారత్ బలగాలు ఏరి పారేస్తుంటే.. మరోవైపు, పీఓకేని త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని భారత ప్రభుత్వం పలు సందర్భాల్లో వెల్లడించింది. ఈ నేపధ్యంలో.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గందరగోళంలో పడ్డారు. ఫిబ్రవరి 5న కశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌తో సహా అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని.. అదే సమయంలో కాశ్మీరీ ప్రజలకు పాకిస్తాన్ నుండి అచంచలమైన నైతిక, దౌత్య, రాజకీయ మద్దతును కొనసాగిస్తామని అన్నారు.

భారత్ ఆగస్టు 5, 2019 నాటి ఆలోచన నుండి బయటపడి..

ముజఫరాబాద్‌లో జరిగిన పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ శాసనసభ ప్రత్యేక సమావేశంలో షరీఫ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌తో సహా అన్ని సమస్యలను భారత్‌తో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అదే సమయంలో.. “భారత్ ఆగస్టు 5, 2019 నాటి ఆలోచన నుండి బయటపడి.. ఐక్యరాజ్యసమితికి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలనీ… చర్చలు ప్రారంభించాలని కోరారు. అలాగే, జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన ఆర్టికల్ 370 రద్దు గురించి చర్చించారు.

1999 లాహోర్ డిక్లరేషన్‌‌కు కట్టుబడి ఉండాలని కోరిన పాక్

భారత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి పాకిస్తాన్ పర్యటన సందర్భంగా సంతకం చేసిన 1999 లాహోర్ డిక్లరేషన్‌‌కు కట్టుబడి ఉండాలని కోరారు. “కాశ్మీర్ సమస్యకు ఏకైక పరిష్కారం UNSC తీర్మానం ప్రకారం స్వయం నిర్ణయాధికార హక్కు..” అని షెహబాజ్ అన్నారు.

కాశ్మీరీల అంతిమ గమ్యస్థానం పాకిస్తాన్‌ అన్న పీఓకే “ప్రధాని”

గతేడాది కూడా పాక్ ప్రధాని ఐరాస వేదికపై అక్కసు వెళ్లగక్కారు. సాధారణ చర్చ సందర్భంగాప్రధాని షెహబాజ్ షరీఫ్, జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని ఎత్తివేయడంపై స్పందించారు. 2019 ఆగస్టులో భారత్ ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా చేపట్టిన చర్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. పాలస్తీనా ప్రజల మాదిరిగానే జమ్ముకశ్మీర్ ప్రజలు కూడా స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారన్నట్లు వ్యాఖ్యానించారు.

హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాల్సిన సమయం

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకునేందుకు భారత్ తన సైనిక సామర్థ్యాలను భారీగా పెంచుకుంటోందని, నియంత్రణ రేఖను దాటుతామని బెదిరింపులు జారీ చేస్తోందని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపించారు. దాన్ని అడ్డుకొని తీరుతామని బల్ల గుద్ది మరీ ఆవేశపడ్డారు.

కశ్మీర్ సమస్యపై భారత్ వైఖరి స్పష్టం

అయితే, ఇప్పుడు షెహబాజ్ వాయిస్‌లో కాస్త మార్పు కనిపించింది. చర్చించుకుందాం రండీ అంటూ భారత్‌ను కోరుతున్నారు. కానీ, దీని వెనుక కుట్ర ఉందనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే.. ఒకవైపు, పాక్ ప్రధాని షెహబాజ్ చర్చలు జరపాలని చెబుతుంటే.. మరోవైపు, పీఓకే సోకాల్డ్ ప్రధాన మంత్రి, పాకిస్తాన్ తొత్తు అయిన అన్వరుల్ హక్ మాత్రం అతిగప్రసంగం చేస్తున్నారు. కాశ్మీరీల అంతిమ గమ్యస్థానం పాకిస్తాన్‌ అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అందులోనూ.. పీఓకేలో జరిగే కార్యక్రమానికి పలు తీవ్రవాద గ్రూపుల నేతలు వస్తున్నారు. అందుకే, హమాస్ నేతలు పీఓకేలో ఉండటం భారత్‌కు అనుకూలమైన పరిణామం కానేకాదు.

పాకిస్తాన్‌తో సాధారణ సంబంధాల కోసం భారత్ రెడీ

ఈ నేపథ్యంలో, హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాల్సిన సమయం వచ్చిందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం భారత్ హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించలేదు. భారత ప్రభుత్వం దీర్ఘకాలంగా పాలస్తీనాకు మద్దతు ఇస్తూ వస్తోంది. ఇజ్రాయెల్ మాత్రం భారత్‌ను పలుమార్లు హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని కోరింది. 2023లో ఇజ్రాయెల్, 26/11 ముంబై దాడులకు కారణమైన లష్కరే తోయిబాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన భారత్.. హమాస్ విషయంలోనూ అలాంటి నిర్ణయం తీసుకోవాలని కోరింది.

కశ్మీర్ సమస్యపై భారత్ వైఖరి స్పష్టం

ఇక, పాక్ కూడా అంతర్జాతీయ వేదికలను ఉపయోగించుకొని, ఇస్లామిక్ దేశాలన్నింటినీ భారత్‌కు వ్యతిరేకంగా చేయడానికి అవకాశం దొరికినప్పుడల్లా ప్రయత్నిస్తూనే ఉంది. అల్‌ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌కు దీర్ఘకాలంగా ఆతిథ్యం ఇచ్చిన పాక్ చెబుతున్న మాటలను ఇప్పుడు భారత్ విశ్వసించే పరిస్థితిలో లేదు. కశ్మీర్ సమస్యపై భారత్ వైఖరి స్పష్టంగా ఉందని, టెర్రరిజాన్ని ఏరిపారేస్తామనీ, కశ్మీర్ వ్యవహారంలో ఎవరు హద్దు దాటిని దానికి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పాక్‌కు ఎన్నోసార్లు భారత్ వార్నింగ్ ఇచ్చింది. అలాగే, ఉగ్రవాదం, శత్రుత్వం, హింస లేని వాతావరణం ఉంటే.. పాకిస్తాన్‌తో సాధారణ సంబంధాల కోసం భారత్ రెడీగా ఉంటుందని కూడా భారత్ చెబుతూనే ఉంది. ఇంకా, జమ్మూ కశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు దేశంలో శాశ్వత భాగాలు అని భారత్ చాలా దృఢంగా ప్రకటిస్తోంది.

పీఓకేను స్వాధీనం చేసుకుంటామన్న కేంద్ర హోం మంత్రి షా

ఇటీవల కాలంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి భారతదేశ రాజకీయ నాయకులు చర్చిస్తూనే ఉన్నారు. అతి త్వరలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్‌‌ భారత్‌లో విలీనం కాబోతుందంటూ నాయకులు ప్రకటనలు చేస్తునే ఉన్నారు. పీఓకేను స్వాధీనం చేసుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పలుమార్లు వెల్లడించారు. మోడీ మూడోసారి ప్రధాని అయిన ఆరు నెలల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను ఇండియాలో కలుపుతామన్నారు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాధ్. ప్రధాని మోడీ సైతం పలు సందర్భాల్లో పీఓకే అంశాన్ని లేవనెత్తారు. అది ఎప్పుడూ, ఎల్లప్పుడూ భారత్‌లో భాగమనే చెప్పారు. అంతెందుకు, ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో పీఓకేకు 24 సీట్లను కేటాయించారు.

జమ్మూ కశ్మీర్‌ రీఆర్గనైజేషన్‌ (సవరణ) చట్టం

జమ్మూ కశ్మీర్‌ రిజర్వేషన్‌ (సవరణ) బిల్లు, జమ్మూ కశ్మీర్‌ రీఆర్గనైజేషన్‌ (సవరణ) పేరుతో 2023లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లుల్ల సందర్భంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. కశ్మీర్‌లో రెండు సీట్లను అక్కడి నుంచి వలస వెళ్లినవారికి, ఒక సీటును పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి వచ్చి స్థిరపడిన వారికి రిజర్వు చేశారు. పీఓకే భారతదేశంలో భాగమే కాబట్టి, ఆ ప్రాంతానికి కూడా సీట్లు కేటాయించినట్లు తెలిపారు. అప్పటి నుండి మొదలైన పాకిస్తాన్ డ్రామా ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఈ తరుణంలో, గాజా యుద్ధంలో ఖంగుతిని, తమ కీలక నేతల్ని పోగొట్టుకున్న హమాస్‌ను భారత్‌పై ఉసిగొల్పడానికి సిద్ధపడినట్లు అనుమానం వస్తోంది.

పాక్ తమను సెకండ్ సిటిజన్లుగా పరిగణిస్తున్నారన్న పీఓకే ప్రజలు

అయితే, ఇటీవల కాలంలో పీఓకే ప్రాంతంలో తీవ్రమైన ఆందోళనలు చోటుచేసుకున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వం వారిని సెకండ్ సిటిజన్లుగా పరిగణిస్తున్నారంటూ పీఓకే ప్రజలు కూడా రగిలిపోతున్నారు. పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి స్థానికులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వస్తున్నారు. అక్కడ స్థానికులు పాకిస్థాన్‌ పెత్తనం మాకొంద్దంటూ ఆందోళనలు చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి, సైన్యానికి వ్యతిరేకంగా నిరసనలు తరచుగానే కనిపిస్తున్నాయి.

పాకిస్తాన్ ప్రభుత్వానికి, సైన్యానికి వ్యతిరేకంగా నిరసనలు

ఆ మధ్య, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్ నగరం నుండి వచ్చిన నిరసన స్వరాలు పాక్ అధికార పీఠాన్ని కూడా తాకాయి. అందుకే, పీఓకేపై తమ పెత్తనం ఎక్కడ ఉండకుండా పోతుందేమోనని పాక్‌కి భయం పుట్టుకుంది. ఇంత వ్యతిరేకతను మూటగట్టుకుంటూ కూడా పాక్, కశ్మీర్‌పై ప్రేమాభిమానాలు ఒలకబోస్తున్నట్లు కపట నాటకం ఆడుతుంది. ఏది ఏమైనా, పాక్ వెకిలి డ్రామాలకు భారత్ సరైన సమాధానం ఇస్తుందని గత అనుభాలే కాదు, భవిష్యత్ ప్రణాళికలు కూడా నిరూపిస్తాయనడంలో సందేహం లేదు. అలాగే, త్వరలోనే భారత్ పీఓకేను స్వాధీనం చేసుకుంటుందనే నమ్మకం కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×