Puvvada Ajay Kumar: అనుచరులు అనుకున్న వాళ్లే ఆయన్ను నిట్ట నిలువునా ముంచారట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా భారీగా వెనకేశారట. ఫలితం.. ఆయన ఓటమి. పోనీ.. అధికారం దూరమయ్యాక అయినా ఆయన మారారా అంటే అలాంటిదేమీ లేదట. ఎవరైతే ఆయన ఓటమికి కారణమయ్యారనే విమర్శలు విన్పిస్తున్నాయో.. మళ్లీ వాళ్లే ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్నారట. దీంతో.. పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే కేడర్ ఆవేదన చెందుతోందట. ఇంతకీ ఆయన ఎందుకిలా చేస్తున్నారు..? బీఆర్ఎస్ నాయకుల్లో ఇప్పుడివే ప్రశ్నలు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదేళ్ల పాటు హవా
పువ్వాడ అజయ్ కుమార్.. బీఆర్ఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన నేత. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదేళ్లపాటు పార్టీలో చక్రం తిప్పిన లీడర్. ఖమ్మం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు పువ్వాడ అజయ్. మారిన పరిస్థితులలో అప్పట్లో టీఆర్ఎస్‌లో చేరారు. 2018 ఎలక్షన్లలో మరోసారి విజయం సాధించారాయన. అంతేకాదు నాటి.. కేసీఆర్ మంత్రివర్గంలో చోటు సంపాదించారు పువ్వాడ అజయ్ కుమార్. ముచ్చటగా మూడోసారి 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావించారు పువ్వాడ అజయ్. కానీ, ప్రజల తీర్పు మాత్రం మరోలా వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర్ రావును ప్రజలు బంపర్ మెజార్టీతో గెలిపించారు. దీంతో.. పువ్వాడకు షాక్ తప్పలేదు.
పువ్వాడ అజయ్ ఎలా ఓటమి పాలయ్యారన్నది.. అంతు చిక్కని మాట
వాస్తవానికి.. నియోజకవర్గాన్ని భారీగా అభివృద్ధి చేశారన్న పేరు తెచ్చుకున్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్. ఇంకా చెప్పాలంటే ఎక్కడ అవకాశం ఉన్నా నిధులు తీసుకొచ్చి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని బీఆర్ఎస్ నేతలు చెబుతుంటారు. సోషల్ మీడియాను సైతం తన ప్రచారానికి బాగానే వాడుకున్నారట అజయ్. మరి.. అలాంటిది పువ్వాడ అజయ్ ఎలా ఓటమి పాలయ్యారన్నది ఆయనకు ఇప్పటికీ అంతు చిక్కడం లేదన్న మాట విన్పిస్తోంది.
పువ్వాడ ఓటమికి ప్రధాన అనుచరులే కారణం..!
అయితే.. ఇక్కడే ఓ ట్విస్టు ఉందట. పువ్వాడ ఓటమికి ప్రధాన కారణం ఆయన వెంట ఉండే ముఖ్యమైన అనుచరులేనట. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న చందంగా ఆయన చుట్టూ ఉండే కొందరు షాడో నేతలే అందినకాడికి దోచుకున్నారన్న ఆరోపణలు నియోజకవర్గంలో గుప్పుమంటున్నాయి. వాస్తవానికి మాజీ మంత్రి పువ్వాడ 2014 ఎన్నికల్లో ఇలాంటి షాడో నేతల ప్రమేయం లేకుండానే ముందుకెళ్లారు. విజయం సాధించారు. 2018 ఎన్నికల్లోనూ ఇదే మాదిరిగా విక్టరీ కొట్టారు. కానీ.. ఆ తర్వాతే సీన్ మారిపోయిందట. ఇంకా చెప్పాలంటే ఎప్పుడైతే కొంతమంది షాడో నేతలు ఆయనకు దగ్గరయ్యారో అప్పటి నుంచే ఆయన కెరీర్ గ్రాఫ్.. నియోజకవర్గంలో పడిపోతూ వచ్చిందట.
ఖమ్మం నగరంలో సెటిల్‌మెంట్లు, భూదందాలు బెదిరింపులతో
ఖమ్మం నగరంలో సెటిల్ మెంట్లు, భూ దందాలు, పోలీస్ స్టేషన్ సాక్షిగా పంచాయితీలు నిర్వహించడం, బెదిరింపులు ఇలా ఒకటేమిటి అనేక రకాల చర్యలతో.. పువ్వాడ చుట్టూ ఉన్న షాడో నేతలు ప్రజలను బాగానే ఇబ్బందులకు గురి చేశారన్న గుసగుసలు విన్పించాయి. అజయ్ ప్రధాన అనుచరుడిగా ఉన్న నగర పార్టీ నేతతోపాటు పలువురు కార్పొరేటర్లు ఇందులో కీలక పాత్ర పోషించారట. నియోజకవర్గంలో అనేక సమస్యలకు కారణంగా మారుతున్న వాళ్లు పువ్వాడకు బాగా దగ్గరి వారు కావడంతో ఇతర నాయకులు, కేడర్.. ఆయా నేతలు చేసే అక్రమాలను పువ్వాడ దృష్టికి తీసుకెళ్లలేదట. అయితే.. ఇదే విషయాన్ని 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించారు తుమ్మల నాగేశ్వర్ రావు. చివరకు విజయం సాధించారాయన.
పువ్వాడ అజయ్ ఓటమికి కారణం..!
అప్పటి వరకు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తనను గెలిపిస్తాయని భావించిన పువ్వాడ అజయ్‌కి ఓటమి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిందట. అయితే.. ఇంత జరిగినా ఆయన మాత్రం ఇప్పటికీ తన ఓటమికి కారణాలు ఏంటన్న దానిపై ఓ నిర్ణయానికి రాలేకపోయారట. ఇందుకు కారణం తన ఓటమిపై పూర్తిస్థాయి విశ్లేషణ చేసుకోకపోవడమేనన్న వాదన బలంగా విన్పిస్తోంది.
ఓటమి నాటి నుంచి సైలెంట్‌గా ఉన్న పువ్వాడ
ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పటికి కూడా పువ్వాడ అజయ్ వ్యవహార శైలి ఏ మాత్రం మారలేదన్న టాక్ విన్పిస్తోంది. ఎన్నికల తర్వాత చాలా రోజుల పాటు సైలెంట్‌గా ఉన్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. కానీ, ఇటీవలి కాలంలోనే అడపాదడపా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అందరినీ కలుస్తూ మళ్లీ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారట అజయ్. కానీ, ఎవరైతే ఆయన ఓటమికి ప్రధాన కారణంగా నిలిచారో అలాంటి నేతలే ఇప్పుడు మళ్లీ ఆయన వెంట కన్పిస్తుండడం హాట్ టాపిక్‌గా మారుతోంది.
ఎందుకీ పరిస్థితి అంటున్న బీఆర్‌ఎస్ కేడర్
పువ్వాడ తీరుతో నిజాయితీగా పనిచేసే బీఆర్ఎస్ కేడర్ ఆవేదన చెందుతోందట. గెలుస్తారనుకున్న సీటు కాస్తా పోవడం, అయినా మాజీ మంత్రి పువ్వాడ పరిస్థితిలో మార్పు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికైనా తమ నేత మారకపోతే ఎలా అని చాటుగా మాట్లాడుకుంటున్నారట. అసలు.. తన ఓటమికి కారణమైన టీమ్‌ను పువ్వాడ ఎందుకు దూరం పెట్టలేదన్న డిస్కషన్ నియోజకవర్గంలో గట్టిగానే జరుగుతోందట.
Also Read: కర్నూలు జిల్లాలో టీడీపీ ఆగమాగం.. ఏమైందంటే..
ఇక్కడే మరో వాదనా విన్పిస్తోంది. తన ఓటమికి గల కారణాలు, అందుకు దారి తీసిన పరిస్థితులు, కారకులైన నాయకుల వివరాలు అన్నింటిపైనా పువ్వాడకు పూర్తిస్థాయిలో అవగాహన ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయినా సరే తన ఓటమికి కారకులైన వారిని పక్కన పెట్టకపోవడానికి కారణం.. నియోజకవర్గంలోని పరిస్థితులేనన్న టాక్ నడుస్తోంది. నిజానికి మొదటి నుంచీ బీఆర్ఎస్‌కు ఖమ్మం జిల్లాలో పెద్దగా పట్టులేదు. పైగా ఇప్పుడు పార్టీ సైతం అధికారంలో లేదు. ఇలాంటి వేళ వాళ్లను దూరం పెడితే తన పక్కన కేడర్ లేకుండా పోతుందని భావిస్తున్నారట పువ్వాడ అజయ్. అందుకే తప్పని పరిస్థితుల్లోనే అలాంటి వారితో కలిసి ముందుకు సాగుతున్నారని పువ్వాడ అజయ్ వర్గం చెబుతోంది.