Textile Waste: ఒక్క నిమిషం ఆలోచించండి.. మీరు వేసుకున్న బట్టలు మీకు అందాన్ని ఇస్తున్నాయా , లేక మన హైదరాబాద్ భవిష్యత్తును బూడిద చేస్తున్నాయా అని ఎందుకంటే మనం రోజూ ఉదయం ఆల్మారా తెరిచి ‘ఈరోజు వేసుకోవడానికి బట్టలు లేవు’ అని అనుకునే ప్రతిసారీ, తెరవెనుక ఒక భయంకరమైన పర్యావరణ యుద్ధానికి తెరలేపుతున్నాం. ఏంటి ఇదంతా అంటారా ఓ సారి జాగ్రత్తగా వినండి.. ఒకప్పుడు మన ఇళ్లల్లో కొత్త బట్టలు అంటే కేవలం ఒక వస్త్రాలు కాదుఅదొక సెంటిమెంట్. ఉగాదికో, దీపావళికో ఏవైనా ప్రత్యేక ఫంక్షన్ లకో కొన్న బట్టలు ఏల్ల తర్వాతే చెత్త కుండికి చేరేవి.
బట్టలకు గౌరవప్రదమైన స్థానం
బట్టలకు ఎంత గౌరవప్రదమైన స్థానం ఉండేదంటే పండుగ రోజో పుట్టిన రోజునాడో ఏదైనా శుభకార్యం రోజో కొత్త బట్ట వేసుకుని పెద్దలు, పిల్లలు వీధిలో తిరుగుతుంటే, ఆ ఆనందమే వేరు. రెండేళ్లు గడిచాక ఆ డ్రస్ కొంచెం చిన్నదవుతుంది. అంతే, అక్క డ్రస్ చెల్లెకువచ్చేది . అన్నది తమ్ముడి ఒంటికి వచ్చేది. ‘అన్నయ్య డ్రస్ నాకు పట్టింది అని ఆ తమ్ముడు సంతోషపడేవాడు తప్ప, ‘పాత బట్టలు’ అని ఎన్నడూ పీల్ కాకుండేవాడు.. అందులో ఒక ఆత్మీయత ఉండేది, ఒక పొదుపు ఉండేది.
ఫ్యాషన్ క్రేజ్ ఆపుదాం..
కాలం గడిచేకొద్దీ మోచేతి దగ్గరో, వెనక భాగానో చిన్న చిరుగు పడిందా? అమ్మ వెంటనే సూది, దారం తీసేది. లేదంటే ఒక పిన్నిస పెట్టి తాత్కాలికంగా ఆ చిరుగును కప్పేసి, ‘ఏం కాదులేరా, ఇంట్లోనేగా ఉండేది, వేసుకో’ అనేది. అది పేదరికం కాదు, ప్రకృతిని గౌరవించే సంస్కృతి. రాత్రి పూట వేసుకునే నైట్ డ్రస్సుగా ఆ డ్రస్ గా అది మారేది. పూర్తిగా రంగు వెలిసిపోయి,బట్ట పలచబడిపోయాక అది కిచెన్‌లోకివచ్చేది ..వేడి వేడి గిన్నెలు దించడానికి ‘మసిబట్ట’గా, లేదా ఇల్లు తుడవడానికి వాడే బట్టగా లేదా ‘డోర్ మ్యాట్’గా మారిపోయేది.
చిరిగేదాకా వాడుదాం
చివరికి.. ఆ వస్త్రం దారాలు దారాలుగా విడిపోయి, ఇక దేనికీ పనికిరాదు అనుకున్నప్పుడే అది చెత్తకుప్పకు చేరేది. అంటే, ఒక బట్టలోని ప్రతి నూలుపోగును పిండేసి, దాని పూర్తి ఆత్మను వాడిన తర్వాతే భూమికి వదిలేవాళ్లం. అప్పుడు ప్రకృతి కూడా నవ్వుతూ ఆ కాటన్ ముక్కను తన మట్టిలో కలిపేసుకునేది.
ఇన్‌స్టాగ్రామ్ ‘లైక్స్’ కోసం
నేడు? కథ పూర్తిగా మారిపోయింది! పాత పద్ధతులన్నీ అంతరించిపోయాయి. ‘రిపీటింగ్ క్లోత్స్ ఈజ్ క్రైమ్’ అనే ఒక విపరీతమైన భ్రాంతిని ఫ్యాషన్ బ్రాండ్లు మన నెత్తిన రుద్దాయి. ఇన్స్టాగ్రామ్‌లో ఒక్కసారి ఫోటో పెడితే, మళ్లీ ఆ బట్ట వేసుకోకూడదనే ఒక సామాజిక రోగం సమాజాన్ని పీడిస్తోంది.ఈ విపరీత ధోరణి వల్ల మన హైదరాబాద్ ఎలాంటి భయంకరమైన ఉపద్రవాన్ని ఎదుర్కొంటుందో అధికారిక లెక్కలు చూస్తే షాక్అ వుతారు. హైదరాబాద్ నగరంలో ప్రతిరోజూ సుమారు 9,000 నుండి 10,000 టన్నుల మున్సిపల్ ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో పాతబట్టలు మరియు వస్త్ర వ్యర్థాల వాటా మాత్రమే సుమారు 5.7% నుండి 8% వరకు ఉందని పర్యావరణ అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే ప్రతిరోజూ సుమారు 800 టన్నుల పాతబట్టలు చెత్తకుప్పల్లోకి చేరుతున్నాయి! 800 టన్నులు అంటే అక్షరాలా 8,00,000 (ఎనిమిది లక్షల) కిలోల పాతబట్టలు ప్రతిరోజు మన హైదరాబాద్ నగర వీధుల్లో చెత్తగా మారుతున్నాయి!
ఒక మనిషి వరుసగా మూడేళ్ల పాటు తాగే నీరు
మీకుతెలుసా..ఆన్‌లైన్ సేల్‌లో మారు ఆర్డర్ చేసే ఒక్క కాటన్ టీ-షర్ట్ తయారు చేయడానికి 2,700 లీటర్ల స్వచ్ఛమైన నీరు ఖర్చవుతుంది అంటే.. ఒక మనిషి వరుసగా మూడేళ్ల పాటు తాగే నీరు అన్నమాట ! మీ వార్డ్‌రోబ్‌లో ఉన్న స్టైలిష్ జీన్స్ ప్యాంట్ తయారి వెనుక 7,500 లీటర్ల నీటి విధ్వంసం దాగుంది. కానీ.. అదే టీ-షర్ట్, జీన్స్ ప్యాంట్‌ను రేపు పొద్దున మీరు ‘మోజు తీరిపోయింది’ అని చెత్తబుట్టలో పారేస్తే.. అది భూమిలో కలవడానికి ఎన్నో ఏళ్లు పడుతుందో తెలుసా? అక్షరాలా 200 సంవత్సరాలు! కారనం ఒకప్పుడు బట్ట మట్టిలో కలిసిపోయేది. కానీ నేటి ఫ్యాషన్ దుస్తులు చాలావరకు చేనేత లేదా ప్యూర్ కాటన్ కావు. పాలిస్టర్ మిశ్రమాలు. పాలిస్టర్ అంటే మరేదో కాదు.. ఒక రకమైన ప్లాస్టిక్! కాబట్టి ఇన్నివందలఎల్లు పడుతుంది .
చెత్త కొండల్లా.. డంపింగ్ యార్డులు
ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ జవహర్‌నగర్ లాంటి డంపింగ్ యార్డులు చెత్త కొండల్లా మారిపోయాయి. ఆ కొండల్లో సగం ఈ పాతబట్టల కుప్పలే! అక్కడ రోజువారీ వచ్చే చెత్తకు తోడు ఈ పాతబట్టలు తోడై కొండలు ఇంకా పెద్దవవుతున్నాయి.
పైగా హైదరాబాద్ లో అతిపెద్ద డంపింగ్ యార్డ్ ఇప్పటికే నిండిపోయింది ఇప్పుడు ఎక్కడ కొత్త డంపింగ్ యార్డ్ పెట్టాలన్నా స్థానికులు అడ్డుకుంటున్నారు. ‘మా ఊరు పాడుచేయకండి, మాకు డంప్ యార్డ్ వద్దు!’ అని రోడ్డెక్కుతున్నారు. మన లగ్జరీ కోసం, కొందరి ఫ్యాషన్ కోసం అమాయకపు పల్లెటూరి ప్రజలు విషవాయువులు పీల్చాలా? ప్రకృతి ఎందుకు బలికావాలి?
డంపింగ్ యార్డులలో రసాయన చర్యలు..
ప్యాషన్ ట్రెండ్ తో ప్రకృతిని చెరబడుతున్నవారి బాధ్యతారాహిత్యం ఇలాగే కొనసాగితే భవిష్యత్తు ఎలా నగరం విస్తరిస్తున్న కొద్దీ చెత్త పెరుగుతుంది, కానీ భూమి పెరగదు కదా!డంపింగ్ యార్డులలో రసాయన చర్యల వల్ల ఈ పాతబట్టల కుప్పలకు మంటలు అంటుకున్నప్పుడు వెలువడే అత్యంత ప్రమాదకరమైన విషవాయువులు గాలిలో కలిసి మన ఊపిరితిత్తులను దెబ్బతీస్తున్నాయి. బట్టలలోని మైక్రోప్లాస్టిక్స్ భూగర్భ జలాల్లోకి, చివరికి మనం తినే ఆహారంలోకి చేరుతున్నాయి.
ఐటీ కారిడార్ల పక్కనే ‘చెత్త కారిడార్లు
డబ్బుంది కదా అని కొనేవాళ్లు కొంటున్నారు.. పారేసేవాళ్లు పారేస్తున్నారు. ఈ విపరీత తత్వం ఇలాగే కొనసాగితే భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఊహించుకోండి.. మరో పదేళ్లలో హైదరాబాద్ చుట్టూ ఐటీ కారిడార్ల పక్కనే ‘చెత్త కారిడార్లు’ వెలుస్తాయి.. రాబోయే తరాలకు మనం ఇచ్చే ఆస్తి కేవలం ‘విషపూరితమైన చెత్త కొండలు’ అవుతాయి.
కాలుష్య చక్రానికి బ్రేక్ వేయాల్సింది ఎవరు?
ఈ విపరీతమైన ప్యాషన్ కాలుష్య చక్రానికి బ్రేక్ వేయాల్సింది ఎవరు? అంటే జెన్ జీ ఈ తరం యువత అనుకుంటే సాధ్యం కానిది లేదు. రాజకీయాల కోసమో, సినిమాల కోసమో, ట్రెండ్స్ కోసమో సోషల్ మీడియాలో విప్లవాలు తెచ్చే జెన్ జీ యువత.. ఇప్పుడు ‘ప్రకృతి తరుపున’ నడుం బిగించాలి. ఎందుకంటే జెన్ జీ చెప్తే ఈ సమాజం వింటుంది, ఫాలో అవుతుంది.
1.సెకండ్ హ్యాండ్ బట్టలు వేసుకోవడం తక్కువతనం కాదు, అదొక పర్యావరణ బాధ్యత అని చాటి చెప్పాలి.
2. చిరిగిన బట్టలను పారేయకుండా వాటికి ప్యాచ్‌లు వేసి, సరికొత్త డిజైన్లుగా మార్చి ‘రిపేర్ ఈజ్ మై స్టైల్’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయాలి.
3. స్నేహితుల మధ్య బట్టలను ఎక్స్ఛేంజ్ చేసుకుని వేసుకోవాలి.
డబ్బు ఉంది కదా అని కొనే ప్రతి బట్ట వెనుక… వేల లీటర్ల నీరు నశించిపోతోంది, ఎంతో భూమి విషమైపోతోంది. ఫ్యాషన్ అంటే నెలకోసారి వార్డ్‌రోబ్ మార్చడం కాదు.. ఉన్న బట్టను గౌరవించడం.ఇప్పటికైనా మారదాం.. పాత పద్ధతిని గౌరవిద్దాం.
గ్లోబల్ సిటీనా.. లేక గార్బేజ్ సిటీనా..?
ఆలోచించండి రేపు మన నగరం గ్లోబల్ సిటీగా వెలగాలా, లేక గార్బేజ్ సిటీగా మారాలా అనేది బ్రాండ్ల చేతుల్లో లేదు, మన చేతుల్లోనే ఉంది. షాపింగ్ మాల్స్‌లో మనం స్వైప్ చేసే క్రెడిట్ కార్డ్ మన అకౌంట్‌ను మాత్రమే కాదు, ఈ భూమి ఆయుష్షును కూడా కరిగిస్తోంది! గుర్తుపెట్టుకోండి.. డబ్బు మీది కావచ్చు, కానీ ప్రకృతి మీ ఒక్కరి సొత్తు కాదు! ప్యాషన్ మీ వార్డ్‌రోబ్ రేపు మన హైదరాబాద్ భూమిని నింపకుండా చూసుకోండి. చినిగితే కుట్టుకుందాం.. చిరిగేదాకా వాడుదాం.. ప్రకృతిని కాపాడుకుందాం!
Also Read: ఎంపీ, ఎమ్మెల్యే సీట్లపై బిగ్ డిబేట్.. 70 ఏళ్లుగా ఒకే వర్గానికి రిజర్వేషన్.. రొటేషన్ ఎందుకు లేదు?