Aadhaar vs Voter ID: ఒక్కసారి ఊహించుకోండి.. మీకు రేషన్ కావాలి.. పెన్షన్ రావాలి.. రైతు భరోసా లాంటి ఆర్థిక సాయం అందాలి.. కానీ ప్రభుత్వం అడిగిన ఓటర్ ఐడీ నంబర్ మీ దగ్గర లేకపోతే? లేదా బయోమెట్రిక్ మిషన్ మీ వేలిముద్రను గుర్తించకపోతే? మీకు రావాల్సిన ప్రభుత్వ సాయం ఆగిపోతుందా? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల గుర్తింపు కోసం ఆధార్‌కు బదులుగా ఓటర్ ఐడీ నంబర్, అంటే EPIC నంబర్‌తో పాటు బయోమెట్రిక్ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేయాలనే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ.. అంటే SIR చుట్టూ వివాదాలు నడుస్తున్న సమయంలో ఈ ప్రతిపాదన రావడం మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. అసలు కేంద్రం ఆలోచన ఏంటి? ఓటర్ ఐడీకి, సంక్షేమ పథకాలకు సంబంధం ఏంటి?
కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ప్రకటన..
కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఓ ఇంట్రెస్టింగ్ ప్రకటన చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించడానికి ఇకపై ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డు.. అంటే EPIC నంబర్‌తో పాటు బయోమెట్రిక్ వెరిఫికేషన్ కూడా అవసరమవుతుందన్నారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇప్పటివరకు అనేక ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారుల గుర్తింపు కోసం ఆధార్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఆధార్ ఆధారిత గుర్తింపు విధానంపై మంత్రి సందేహాలు వ్యక్తం చేశారు. ఆధార్ కార్డు ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ ఎన్రోల్ట్ సదుపాయాల ద్వారా నిమిషాల్లోనే పొందే పరిస్థితి ఉందని, అందువల్ల అది మాత్రమే లబ్ధిదారుల గుర్తింపునకు నమ్మదగిన ఆధారం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ ప్రతిపాదనలో కొన్ని కీలక ప్రశ్నలకు ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఏ పథకాలకు ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది..?
మరి ఏయే సంక్షేమ పథకాలకు ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది? ఏ శాఖలు దీన్ని అమలు చేస్తాయి? అసలు ఓటర్ ఐడీ లేని లబ్ధిదారుల పరిస్థితి ఏంటి? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ముఖ్యంగా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నేరుగా వ్యక్తిగత లబ్ధిదారులకు నగదు చెల్లించే పథకాలను నిర్వహించదు. మరి ఈ ప్రతిపాదన పరిధి ఎంతవరకు ఉంటుందన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
బయోమెట్రిక్ మిషన్లు గుర్తించలేకపోతే ఎలా..?
మరి ఈ విధానం అమల్లోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, వృద్ధులు, వ్యవసాయ కూలీలు, అట్టడుగు వర్గాల ప్రజలు ప్రభుత్వ పథకాలకు దూరమయ్యే ప్రమాదం ఉందనే ఆందోళనలు ఉన్నాయి. చాలా మంది వృద్ధ మహిళా వ్యవసాయ కూలీలకు వయసు కారణంగా ఐరిస్ స్కానింగ్ సరిగ్గా పనిచేయడం లేదు. మరికొందరు రోజువారీ కూలీల ఫింగర్ ప్రింట్స్ సరిగా పడటం లేదు. ఇలాంటి సందర్భాల్లో బయోమెట్రిక్ మిషన్లు వారిని గుర్తించలేకపోతే ఏం జరుగుతుంది? అనే దానిపై క్లారిటీ రావాలి.
ఇక మరో సమస్య స్మార్ట్ఫోన్లు..
ఇక మరో సమస్య స్మార్ట్ఫోన్లు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ స్మార్ట్‌ఫోన్ ఉండదు. అలాంటప్పుడు స్మార్ట్‌ఫోన్ ఆధారిత ఈ-కేవైసీ నిబంధనలు కూడా పేదలకు అదనపు భారంగా మారతాయి. అంటే టెక్నాలజీ అందరికీ అందుబాటులో లేకపోతే.. టెక్నాలజీ పేరుతో సంక్షేమ పథకాలే దూరమయ్యే ప్రమాదం ఉందన్నది ఆ పార్టీ వాదన.
సంక్షేమ పథకాలకు ఓటర్ ఐడీ లింక్?
ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైన అంశం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ ప్రక్రియలో ఇప్పటికే చాలా పేర్లు తొలగించారనే వివాదాలున్నాయి. ఇప్పటికే 13.4 కోట్లకు పైగా ఓటర్లను జాబితాల నుంచి తొలగించారు. మైనారిటీలు, ముస్లింలు, మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఇక్కడే అసలు వివాదం మొదలవుతోంది. ఓవైపు 13.4 కోట్ల మంది ఓటర్లను తొలగించి.. మరోవైపు సంక్షేమ పథకం పొందాలంటే ఓటర్ ఐడీ నంబర్ తప్పనిసరి చేస్తే? ఎలా అనేది ఇప్పుడు క్వశ్చన్. ఎన్నికల్లో ఓటు వేసే హక్కుకు సంబంధించిన అర్హతలు వేరు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల అర్హతలు వేరు… ఈ రెండింటినీ కలిపి చూడకూడదంటూ కొన్ని పొలిటికల్ పార్టీలు చెబుతున్నాయి.
సుప్రీంకోర్టుకు కేంద్రం హామీ
ఇక మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఆధార్. ఇన్నాళ్లూ ఆధార్‌ను సంక్షేమ పథకాల అమలులో కీలక గుర్తింపు పత్రంగా ఉపయోగించిన కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు దాని విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తడం ఏంటి? అనేది క్వశ్చన్. గతంలో ఆధార్ తప్పనిసరి కాదని సుప్రీంకోర్టుకు కేంద్రం హామీ ఇచ్చిందని, ఆ తర్వాత అనేక సంక్షేమ పథకాల్లో ఆధార్ వినియోగం పెరిగింది. ఇప్పుడు ఆధార్‌ను పక్కనపెట్టి ఓటర్ ఐడీని తప్పనిసరి చేయాలనుకోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నిస్తోంది. ప్రస్తుతం గ్రామీణ గృహ నిర్మాణ సహాయం, పీఎం కిసాన్, సామాజిక భద్రతా పెన్షన్లు వంటి అనేక కేంద్ర ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారుల గుర్తింపు, చెల్లింపుల కోసం ఆధార్‌ను ఉపయోగిస్తున్నారు. అందుకే ఈ కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే ఏయే పథకాలపై ప్రభావం ఉంటుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరికి చేరాలి?
మొత్తానికి ఈ వివాదం కేవలం ఆధార్ వర్సెస్ ఓటర్ ఐడీ మాత్రమే కాదు. ఇది ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరికి చేరాలి? వాటిని పొందడానికి ఎలాంటి గుర్తింపు విధానం ఉండాలి? టెక్నాలజీ వల్ల ఎవరికైనా అన్యాయం జరుగుతోందా? అనే కీలక ప్రశ్నలకు సంబంధించిన అంశం. ప్రభుత్వం యాంగిల్లో చూస్తే లబ్ధిదారుల గుర్తింపులో పారదర్శకత, నకిలీ లబ్ధిదారులను అరికట్టడం వంటి లక్ష్యాలు ఉండవచ్చు. కానీ మరోవైపు టెక్నికల్ సమస్యలు.. అన్ని ప్రాంతాల్లో డిజిటల్ సదుపాయాలు లేకపోవడం వల్ల నిజమైన లబ్ధిదారులే నష్టపోకూడదన్న ఆందోళన కూడా ఉంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు అనేవి ప్రజలకు ప్రభుత్వం అందించే సహాయం. వాటిని పొందడానికి పేదలు టెక్నాలజీ పరీక్షల్లో పాస్ కావాల్సిన పరిస్థితి రాకూడదు. ఒక వ్యక్తి వేలిముద్ర పడలేదని… అతనికి రావాల్సిన పెన్షన్ ఆగిపోవాలా? ఓటర్ల జాబితాలో పేరు లేదని.. అతనికి రావాల్సిన రేషన్ నిలిచిపోవాలా? ఇదే ఇప్పుడు దేశం ముందున్న అసలు ప్రశ్న. ఈ ప్రతిపాదనపై కేంద్రం నుంచి మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అంతవరకు ఈ టాపిక్ పొలిటికల్‌గా రచ్చ లేపడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: ఉద్యోగం ఊడింది.. కానీ రూ. 9 లక్షల ఆఫర్ వచ్చింది! లేఆఫ్స్‌లో ట్రెండ్ సెట్ చేసిన కాన్వా