జన్ సూరజ్ నేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. బీహార్ జనం తీర్పును తప్పుబడుతున్నాడు. భావోద్వేగాలకు లోనై, కుల, మతాల ఉచ్చులో ఇరుక్కుపోయి బీజేపీని గెలిపించారని, ఇప్పుడు అనుభవించండని ఓటర్లను తిడుతున్నాడు. ఇది నాణానికి ఓవైపు మాత్రమే. మరోవైపు.. ఆయన టార్గెట్ అక్కడి సీఎం సమ్రాట్ చౌదరి, ప్రధాని మోడీ.
బీజేపీ నుంచి తొలిసారిగా బీహార్‌లో సీఎం అయిన తొలి లీడర్ సమ్రాట్ చౌదరి. అతను ఈ మధ్య పలు వేదికల మీద చేసిన కామెంట్స్‌ను తెగ వైరల్ చేస్తున్నాడు పీకే. ‘బీహార్‌లో క్రైం జరగొచ్చు.. కానీ అపరాధ్ జరగదు..’అని అన్నాడాయన. అంటే ‘క్రైం ఇక్కడ కామనే. అది అపరాధంగా చూడొద్దు’ అనే అర్థం వచ్చేలా ఆయన కామెంట్స్ ఉన్నాయనేది పీకే ఆక్షేపణ.
ఏడో తరగతి చదివిన లీడర్‌ను సీఎం చేస్తే ఇట్లాగే ఉంటుందని, క్రైమ్‌కు, అపరాధం అనే పదానికి తేడా తెలియని నేత మన సీఎం.. అని ఎద్దేవా చేస్తూ ఆయన పలు టీవీలకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. బీజేపీ కంచుకోటలా ఉన్న బంకీపూర్ నుంచి ప్రశాంత్ కిషోర్ గెలిచి ఆ పార్టీకి ధిక్కార స్వరంగా మారాడు.
సీఎంను టార్గెట్ చేస్తూ ఓటర్ల మనసును మార్చే పనిని పెట్టుకున్నాడు. సీఎం సమ్రాట్ చౌదరి గతంలో అసెంబ్లీలో తంబాకు నోట్లో వేసుకునే దృశ్యాలను కూడా సోషల్ మీడియాలో తిప్పుతున్నారిప్పుడు.దీనికి తోడు ఆయన ఏం మాట్లాడినా అది వివాదమైపోతున్నది. అందుకే ఆ మాటలనే వైరల్ చేస్తూ ‘మనం ఎన్నుకున్న నేత ఇలా ఉన్నాడు మరి?’ అని దెప్పిపొడవడమే కాదు.. ఇందులోకి మోడీని కూడా లాక్కొస్తున్నాడు.
బీహార్‌కు ఇలాంటి సీఎంను ఇవ్వడం వల్ల ఇంకా బలవంతంగా రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేస్తున్నారని విమర్శిస్తున్నాడు. విద్య, ఉపాధి అంశాలను పక్కకు పెట్టి భావోద్వేగానికి గురై ఓట్లేస్తే .. మనం ఎప్పటికీ బాగుపడమనే విధంగా పీకే బీజేపీ టార్గెటెడ్‌గా కామెంట్స్ చేస్తున్నాడు. బీహార్ సీఎం భుజంపై తుపాకీ పెట్టి మోడీని కాల్చే ప్రయత్నం చేస్తున్నాడు పీకే.
ఈ ఒక్క ఉదాహరణను తీసుకుని ఆయన దేశ వ్యాప్త రాజకీయాలకు తన అభిప్రాయాలు వర్తించేలా కామెంట్స్ చేయడంతో పీకే మాటలు చర్చకు తెర తీస్తున్నాయి. బీజేపీ ఎక్కడ గెలిపించినా ఇదే దుస్థితి ఉంటుందని, ఆ పార్టీని కులాలు, మతాలు ఈక్వేషన్లో, భావోద్వేగాలకు లోనై ఓటు వేయడం ద్వారానో గెలుపు తీరాలకు చేర్చుతున్నారని, అదే మన కొంపముంచుతుందని పీకే బాహాటంగా చేస్తున్న కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి.
బీహార్ రాజకీయాలను ఉదాహరణగా తీసుకుని దేశవ్యాప్తంగా బీజేపీని గెలిపించొద్దనే విధంగా పీకే కామెంట్స్ ఉంటున్నాయి. ‘వారెక్కడ గెలిచినా ఇదే తీరుగా పాలన ఉంటుంది. మిడిమిడి జ్ఞానం, అవగాహన లేమి, విద్యలేని నేతలతో ఆ రాష్ట్ర ప్రజలకు మరిన్ని కష్టాలే తప్ప అభివృద్ధి దిశగా ఆ రాష్ట్ర పాలన సాగద’ని పరోక్ష సంకేతాలిస్తున్నాడు బీహార్ వేదికగా.
తరుచూ నేతలను మార్చడం వల్ల రాష్ట్రాల ఆర్థికాభివృద్ధి బాగుంటుందని, నేతల్లో ఓ భయం ఉంటుందని, దక్షిణాది రాష్ట్రాల్లో ఇదే జరుగుతున్నదని కూడా చెప్పుకొస్తున్నాడు పీకే. ‘ప్రజలు మాకే గుడ్డిగా ఓటేస్తారు. మళ్లీ మళ్లీ మేమే వస్తాం..అనే ధీమా నేతల్లో ఉంటే.. మన బతుకులు మారవు.. వారిని ఎప్పుడూ భయం వెంటాడాలె.. జనం ఓడగొడతారు ..అభివృద్ధి చేసి గుర్తింపు పొందాలనే తపనను పుట్టించే విధంగా ఓటర్లు మారాలి’ అనేది అతని అభిప్రాయంగా ఉంది. దీన్నే విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు తన సోషల్ మీడియా టీమ్ ద్వారా.