భారత సైన్యంలో చేరేందుకు యువత ఉర్రూతలూగేవారు. ఆర్మీలో చేరాలని రిక్రూట్‌మెంట్ ర్యాలీలకు ఉరకలెత్తే ఉత్సాహంతో ఉరుకులు పరుగులు పెట్టేవారు. దేశభక్తి హృదయం నిండుగా ఉండగా.. యుక్తవయస్సులో భద్రత కలిగిన బాధ్యతాయుత ఉద్యోగం, మర్యాద పూర్వక వేతనం, సర్వీసులో ఉన్నాఅదే గౌరవం, శత్రువుల చేతిలో మృత్యువాత పడ్డా ఆ చావుకూ దక్కే ఆ అరుదైన గౌరవం.. ఇవన్నీ యువతకు సైన్యం చేరాలనే ఉత్సాహాన్ని బాగా పెంచేవి.
సెలెక్టయిన తరువాత శిక్షణ కఠోరంగా ఉన్నా.. తల్లిదండ్రులు చాలా మంది భయపడి తమ పిల్లలను వెనక్కి తగ్గేలా చేసినా.. వీరోచిత పోరాటానికే మక్కువ చూపింది యువత. రిటైరయిన తరువాత కూడా ఇచ్చే పెన్షన్ ఆ కుటుంబానికి భద్రతనిచ్చేది. కానీ మోడీ ఇవన్నీ మార్చేశారు అగ్నిపథ్ ద్వారా. 2022లో అగ్నిపథ్ అనే పథకాన్ని తీసుకొచ్చి భారత సైన్యంలో చేరడం ఒక కాంట్రాక్టు పద్దతిన పనిచేయడమే అనేలా చేశారనే విమర్శలు ఎదుర్కొన్నారు.
యుక్త వయస్సులో ఉన్నవారినే సైన్యంలోకి తీసుకోవాలనే నిర్ణయం, రక్షణ శాఖకు కేటాయించిన బడ్జెట్‌లో అధికంగా జీతాలకు, పెన్షన్లకే వెచ్చించాల్సి వస్తుందనే ఓ కారణం.. తో అగ్నివీరులుగా సైనికులకు నామకరణం చేసినా.. ఇది యువతలో కొంత నిరాశే మిగిల్చిందనే చెప్పాలి. అప్పటికే కరోనా రావడం, ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలను రెండేళ్లుగా ఎత్తేయడం,దీనికి తోడు అగ్నిపథ్ పథకం తీసుకొచ్చి ఓ నాలుగేండ్లు చేయండి.. సేవానిధి తీసుకొని వెళ్లండి..!అనేలా ఉన్న దీని నిబంధనలపై యువతకు తీవ్ర ఆగ్రహం పెల్లుబికింది.
అందుకే అప్పట్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రైళ్లను తగులబెట్టే హింసాత్మక ఘటనలకూ దారి దీసింది. పోలీసుల కాల్పుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు మరణించడంతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. అప్పుడు జరిగిన సికింద్రాబాద్ హింసాత్మక ఘటనల వెనుక ప్రైవేట్ డిఫెన్స్ కోచింగ్ అకాడమీకి చెందిన కొందరు ఉన్నారని గుర్తించింది పోలీస్ శాఖ. వీరిపై కేసులు పెట్టి జైలుకు కూడా పంపింది. బడ్జెట్‌ను పరిగణలోకి తీసుకుని, భారత యువతకు దక్కాల్సిన హక్కలను కూడా మోడీ కాలరాశారనే తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి.
నాలుగేళ్లు పనిచేసిన తరువాత కేంద్ర సాయుధ బలగాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించినా పెన్షన్ సౌకర్యాన్ని ఎత్తేసింది. శాశ్వత ఉద్యోగం అనే అంశాన్నే తీసేసింది. నాలుగేళ్ల తరువాత తాజాగా మోడీ ఈ విషయంలో కొంత మనసు మార్చుకున్నారు. నాలుగేళ్ల సర్వీసును మరో రెండేళ్లు జోడించారు. అంటే మొత్తం ఆరేళ్లు సర్వీసు చేయొచ్చు. ఆరేళ్ల తరువాత శాశ్వతంగా సైనికుడిగా తీసుకునేలా నిబంధనలను కుదించింది.
గతంలో నాలుగేళ్లు సర్వీసు చేసిన సైనికుల్లో 25 శాతం మాత్రమే శాశ్వత ప్రతిపాదికన సైనికులుగా తీసుకుని, 75% అగ్ని వీరులను ఇంటికి పంపేవారు. ఇప్పుడు సర్వీసును రెండేళ్లు పెంచడం.. వంద శాతంగా అందరికీ శాశ్వత సైనికులుగా తీసుకునే అంశాన్ని సడలించింది. ఇది ఓ రకంగా మోడీ సర్కార్‌పై ఉన్న మచ్చను పోగొట్టుకునే క్రమంలో భాగంగా చూడొచ్చు. కానీ ఆరేళ్లు పనిచేసినా రిటైర్‌మెంట్ తరువాత పెన్షన్ సౌకర్యాన్ని మాత్రం జోడించలేదు. పైగా ఆ తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇచ్చే రిజర్వేషన్లను ఇవ్వడం లేదు.
ఆరేళ్ల సర్వీసు సర్టిఫికెట్‌తో ప్రైవేటుగా పనిచేసుకోవాల్సిందే. పాత అగ్నిపథ్‌తో పోల్చితే ఇది ఊరటనిస్తున్నా.. పెన్షన్ లేకపోవడం, రిజర్వేషన్లు ఎత్తేయడం అనేది సైనికులుగా అన్ని త్యాగాలకు సిద్దపడ్డ వారికి ఇచ్చే సుముచిత గౌరవం కాదనేదే మెజారిటీ అభిప్రాయంగా ఉంది.